20, మార్చి 2023, సోమవారం

రంగమార్తాండ – భండారు శ్రీనివాసరావు

 ఎప్పుడో యాభయ్  ఏళ్ళకు పూర్వం బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు సినిమా ప్రీ వ్యూ (PREVIEW) లకు వెళ్ళే వాడిని. జ్యోతి వార పత్రిక ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మగారు వీటిని ఫ్రీ వ్యూ (FREE VIEW) లు అని చమత్కరించేవారు.

మొన్న ఫేస్ బుక్ మితృలు, రచయిత, చిత్రకారులు అయిన లక్ష్మీ భూపాల్ గారు రంగ మార్తాండ ప్రీ వ్యూ కి ఆహ్వానించారు. సినిమాలు చూసే అలవాటు చిన్నప్పుడు అందరిలాగే నాకూ వుండేది. క్రమంగా ఉద్యోగం, సాయంకాలక్షేపాలతో సమయం కుదించుకు పోయి, సినిమాలు చూడడం తగ్గిపోయింది. అయినా మిత్రులను కలవడానికి మంచి అవకాశం అని వెళ్లాను. వెళ్లక పొతే ఒక మంచి సినిమా చూసే అవకాశం తప్పిపోయేది కూడా.

ప్రసాద్  ప్రీవ్యూ ధియేటర్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది,  సినిమా రంగ మార్తాండ,  దర్శకుడు కృష్ణ వంశీ అని. కృష్ణ వంశీ గారి కొన్ని చిత్రాలు గతంలో నేను థియేటర్లలో చూశాను. చందమామ సినిమా చూసిన తర్వాత అమ్మయ్య వీరి పేరు కనబడితే ఇక ఆ సినిమా నిశ్చింతగా చూడవచ్చు అనే భరోసా కలిగింది. రంగ మార్తాండ సినిమాలో చాలా నచ్చిన అంశాలు, కొద్దిగా కొన్ని నచ్చని సీన్లు వున్నాయి. (ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి  బ్రహ్మానందం తరచుగా అనే మాటలు లాంటివి).   కళ్ళనీళ్ళు ఆపుకోలేరు అని ఈ సినిమా నాకంటే ముందు చూసిన వాళ్ళు కొందరు రాసేసారు. దాంతో కృష్ణ వంశీ గారి ట్రేడ్ మార్క్ అయిన సునిశిత హాస్యం కనిపించదేమో అని సందేహం కలిగింది.

బ్రహ్మానందం వున్నారు కదా పర్వాలేదు అని సర్ది చెప్పుకున్నాను. కానీ కృష్ణ వంశీ గారు ఆయన్ని, ఆహార్యంతో సహా  పూర్తిగా  విభిన్నంగా చూపారు. ఆయన ఏడుస్తూ జనాలను ఏడిపిస్తూ నవ్వించిన తీరు అమోఘం. రంగ మార్తాండ రాఘవరావుగా ప్రకాష్ రాజ్  తన డైలాగులతో దున్నేసారు. వాటికి యువ ప్రేక్షకులు కనెక్ట్ అయితే మాత్రం, ఈ సినిమాకు పట్టపగ్గాలు వుండవు. నాటకాలు అంటే ఏమిటి అనే యువత జీవిస్తున్న ప్రస్తుత సమాజంలో నాటకాలని ప్రధాన వస్తువుగా తీసుకుని ధైర్యంగా  తీసిన సినిమా ఇది. వెంటనే శంకరాభరణం గుర్తుకు వచ్చింది. ఆనాటి యువతీ యువకులు అప్పుడే రిలీజ్ అయిన ఆకలి రాజ్యం సినిమాని మించి, సంగీత ప్రధానంగా వచ్చిన శంకరాభరణం సినిమాని నెత్తిన పెట్టుకున్నారు. రంగమార్తాండ కూడా అదే కోవలోకి చేరుతుందని సినిమా చూసిన తర్వాత అనిపించింది. సినిమాలో మరికొన్ని పాత్రల్లో నటించిన నటీనటులు వాళ్ళ కోసమే ఆ  పాత్రలు సృష్టించారా అన్నట్టు వాటిల్లో సహజంగా ఒదిగి పోయారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. ముఖ్య తారాగణంతో పాటు వారూ ప్రశంసలకు అర్హులే. ఇక రమ్యకృష్ణ గారు.

తొంభయ్యవ దశకంలో నేను  మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసిన అయిదేళ్లు ఒక పాటని తప్పకుండా వేసేవాడిని. విశ్వనాధ్ గారి సూత్రధారులు సినిమాలో జోలా జేజోలా అని రమ్య కృష్ణ పాత్రధారి చేత పాడించిన పాట అది.

అందరూ తమ నటనతో చెరిగిపారేస్తే, రమ్యకృష్ణ నటించకుండా చిత్రాన్ని పై మెట్టులో నిలబెట్టారు. పాత్రలో జీవించారు అనే ప్రశంస కూడా చిన్నదే అవుతుంది. అసలు డైలాగులే తక్కువ. అవన్నీ ప్రకాష్ రాజ్ కోటాలోకి వెళ్లిపోయాయి. ఒక తల్లిగా అవధులు దాటని పాత్ర పోషిస్తూ, ఉన్నట్టుండి భార్య పాత్రలో ఒక సందర్భంలో ఆమె ప్రదర్శించిన  హావభావాలను చూసిన తర్వాత ఆమెకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అనిపించింది. భర్తను కూతురే దొంగ అన్నప్పుడు నాన్నను దొంగ అంటావా అంటూ రౌద్రంగా చూసిన చూపుకు ఆ కూతురు పాత్రధారి మాడి మసై పోతుందేమో అన్న భావన కలిగింది. ఏదో పల్లెటూరులో రచ్చ బండ మీద చెట్టు నీడలో కళ్ళు మూసుకుని కన్ను మూసిన తీరు క్లియో పాట్రాని గుర్తు చేసింది. నుదుట కుంకుమ మెరుస్తూ వుంటే తల కింద చేయి పెట్టుకుని ఓ అందాల దేవత ప్రశాంతంగా  నిద్రిస్తున్నదా అనిపించింది.

రంగమార్తాండ చిత్రానికి పూర్తి మార్కులు వేయాల్సి వస్తే, కృష్ణ వంశీ తర్వాత ఆ అర్హత వున్నది  రమ్యకృష్ణకే.

ఈ చిత్రాన్ని టిక్కెట్టు కొనుక్కుని థియేటర్ లో చూడాలి అనుకుంటే మాత్రం ఆమె అద్భుతమైన నటన కోసమే చూడాలి.

ఈ సినిమా చూడడానికి దోహద పడ్డవారు ఎంతోమంది

వున్నా ముందు థాంక్స్ చెప్పుకోవాల్సింది. లక్ష్మీ భూపాల గారికి.(పై ఫోటోలో ఎడమనుంచి కుడికి: లక్ష్మి భూపాల, నేను, కృష్ణ వంశీ, శివ రాచర్ల)(19-03-2023)

                 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బాగా వ్రాశారు. ఒక అర్థవంతమైన సినిమా లాగా ఉంది. నటసామ్రాట్ అనే మరాఠీ చిత్రం స్ఫూర్తిగా తీశారు అని అన్నారు. బ్రహ్మానందం గొప్ప నటుడు. అపహాస్య పాత్రలు వేసి విసిగిపోయారు. ఇలాంటి చిత్రాలలో వారి మంచి నటన చూడవచ్చు.