3, అక్టోబర్ 2021, ఆదివారం

అందరం అత్తలమే! – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha Daily today, SUNDAY)

అదేవిటో దురదృష్టం. కోడళ్ళకు సరే. సినిమావాళ్ళకు కూడా అత్త అంటే పడదు. అత్త అంటే సూర్యాకాంతం లాంటి గడుసు మనిషని అనుకునేలా సినిమాలు తీసారు. తీస్తున్నారు. అత్తలందరికీ అసలు పేరు ఒకటి వుంటుంది కాని, గయ్యాళితనానికి మారుపేరనే పాడుపేరొకటి వారి సొంతం. సొంతానికి సాధించింది ఏవీ లేకపోయినా పొద్దస్తమానం కోడళ్లను సాధిస్తారనే ట్యాగ్ లైన్ మరోటి. కోడలు యెంత గుణవంతురాలయినా, నడుం దించకుండా అడవా చాకిరీ యెంత చేస్తున్నా, 'అదేం రోగమో మా కోడలు పిల్లకు నడుం ఒంగి చావదు, చచ్చినట్టు ప్రతిపనీ నేనొక్కత్తినే చేసుకు చావాలి' అనే టీవీ సీరియళ్ల అత్తళ్ళకు కొదవ వుండదు. ఇంతకీ ఈ అత్తల పురాణం ఎందుకంటే? -
సాధించే గుణం, వంకలు పెట్టే గుణం, 'అన్ని పనులు నేనే చేస్తున్నాను, వేరేవారికి పనులు చేతకాదు' అనే అత్తల సహజ స్వభావం సమాజంలో అందరిలోను ఎంతో కొంతవున్నదని చెప్పడానికే.
ఏదయినా ఆఫీసరును కదిపి చూడండి. అక్షరం పొల్లుపోకుండా ఇదే సోది చెబుతాడు.
'తను తప్ప పనిచేసేవారు ఎవ్వరూ లేరనీ, అందరి పనులు తానే నెత్తికెత్తుకుని చేస్తుండబట్టే ఆఫీసు ఈ మాత్రం నడుస్తోంద'నీ అంటాడు. ఆయన కింద పనిచేసేవాడిని అడిగితే, తన కింద వాళ్లని గురించి ఆయన కూడా ఇదేవిధమైన అమూల్యాభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అంటే ఏమిటన్న మాట, అత్తలకీ వీళ్ళకీ ఏమీ తేడా లేదన్న మాట.
'ఎవ్వరూ పనిచేయడం లేదు అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని అనుక్షణం మధన పడిపోయేవాళ్లు అడుగడుక్కీ కనిపిస్తుంటారు. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. వంకలు పెట్టే వంకర గుణం నాకూ వుంది.
కొన్నేళ్ళ క్రితం రైల్లో పోతుంటే బోధివృక్షం కింద బుద్ధుడికి జ్ఞానబోధ అయినట్టు నాకూ జీవిత సత్యం బోధపడింది. వెచ్చటి వేసవికాలంలో చల్లటి ఏసీ కోచ్ లో అంతా ముసుగుతన్ని పడుకున్న సమయంలో, సమస్త లోకం నిద్రలో జోగుతున్న ఆ సమయంలో పట్టాలపై రైలు అలుపులేకుండా పరుగులుతీస్తోంది. ఏదయినా స్టేషన్ వచ్చినప్పుడల్లా, రైలు దడదడా పట్టాలు మారుతున్న ధ్వని వినబడుతూ వుంది. ఆ అర్ధరాత్రి వేళ పట్టాలు మార్చే మనిషి కాస్త ఏమరు పాటుగా వున్నా, కాసింత రెప్పవాల్చినా రెప్పపాటు కాలంలో ఆ రైల్లోని ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తధ్యం.
అంటే ఏమిటి, రైల్లో ఇంతమంది జనం హాయిగా ఆదమరచి కంటినిండా నిద్రపోగలుతున్నారు అంటే ఇంతమందికోసం ఎవరో ఒకరు ఆ నిశిరాత్రివేళ నిద్రలేకుండా పనిచేస్తున్నారనే అర్ధం. 'అది అతని డ్యూటీ. చేయక ఏం చేస్తాడు' అంటే అతడి పని అతడు పనిచేస్తున్నాడు అనేకదా! కాబట్టి 'మనం ఒక్కళ్ళమే పనిచేస్తున్నాం, మిగిలిన వాళ్లు అందరూ పని దొంగలు' అని రొమ్ము విరుచుకోవడంలో అర్ధం లేదు.
అలాగే మరో ఉదాహరణ. చలికాలం. నిద్రలేచి కూడా, మంచం మీద నుంచి లేవడానికి బద్దకించి ముసుగు తన్నిపడుకున్నవేళ, మన ఇంటి ముందు ఎవరో పాల ప్యాకెట్లు వుంచి వెడతారు. 'అవి అంత పొద్దున్నే యెలా వచ్చాయి' అని ఒక్క క్షణం కూడా ఆలోచించం. 'ఇంటింటికీ ఇలా పొద్దున్నే వేస్తున్నాడు అంటే అతడు యెంత పొద్దున్న లేచి వుంటాడు అనే ప్రశ్న నేనయితే ఎప్పుడూ వేసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నాలోనూ కనిపించని 'అత్త' వుంది. అదే నాచేత 'అది అతడి డ్యూటీ' అనే మాట చెప్పిస్తుంది.
ఇది నాలాంటి వాళ్ళ థియరీ. మరి అతడు తన డ్యూటీ చేస్తున్నప్పుడు 'ఎవ్వరూ పనిచేయడం లేదు' అని నేనిచ్చే స్టేట్ మెంట్లకి అర్ధం ఏమిటి?
పొద్దున్నే వేడివేడి కాఫీ తాగుతూ, పత్రికల్లో వచ్చే తాజా వార్తలు చదివే భోగం మనకు పట్టింది అంటే ఎవరో పిల్లాడు తెల్లవారుఝామున్నే నిద్రలేచి, ఏజెంట్లు ఇచ్చిన పత్రికలు సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికీ తిరిగి వేయబట్టే కదా! అలాగే తెల్లారకముందే అన్నన్ని వార్తలు మోసుకుని పత్రికలు మన ఇళ్లకు వస్తున్నాయి అంటే పత్రికాఫీసుల్లో ఎంతమందో మనకోసం నిద్రకాచి పనిచేయబట్టే కదా! ఇలాగే, మన చుట్టూ వున్న పని మనుషులు, చెత్త తీసుకుపోయేవాళ్ళు, వీధులు వూడ్చేవాళ్ళు, ఒకళ్లా ఇద్దరా అనేకమంది ఒళ్ళు దాచుకోకుండా, పనికి బద్ధకించకుండా ఎవరి పనులు వాళ్లు చేస్తూ వుండడం వల్లే, హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుని, 'ఎవ్వరూ పనిచేసేవాళ్ళే లేరు, నేనొక్కడ్ని తప్ప. అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని సన్నాయి నొక్కులు నొక్కగలుగుతున్నాము.
ఒక్కటి నిజం. ఎవ్వరూ పనిచేయకుండా మనకు రోజు గడవడం లేదు. ఒక్కళ్ళూ పనిచేయడం లేదని వంకలు పెట్టకుండా కూడా రోజు గడవడం లేదు. అందుకే అన్నది, అందరిలోనూ ఎంతో కొంత 'అత్తల గుణం' వుందని.
తోకటపా:
యాభయ్ ఏళ్ళక్రితం ప్రతి సర్కారు కొలువుకు ఎంప్లాయ్ మెంట్ ఆఫీసు నుంచి నెంబరు తెమ్మనే వాళ్ళు. (ఇప్పుడూ ఆ పద్దతి ఉందేమో తెలవదు). హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆ ఆఫీసు వుంది. అక్కడ పనిచేసే సిబ్బంది ఉద్యోగాలకోసం వచ్చేవారిని చులకనగా చూస్తారని ప్రతీతి.
అక్కడికి వెళ్ళిన మా బంధువు ఒకరిపట్ల కూడా ఇలాగే చిన్నచూపు చూసారని చెప్పడంతో నేను పై అధికారులకు చెప్పాను. కారణం తెలియదు కానీ ఆ అధికారి, మా వాడికి ఆ ఆఫీసులోనే తాత్కాలిక పద్దతిలో చిన్న ఉద్యోగం ఇప్పించారు.
కొన్ని నెలలు గడిచాయో లేదో, మా చుట్టం వైఖరిలో మార్పు మొదలయింది. అవసరార్థం ఆఫీసుకు వచ్చిన నిరుద్యోగులను చిన్నబుచ్చి కసురుకోవడం చూసి ఆశ్చర్యపోయాను.
గతంలో అతడూ ఇలాగే ఇతరుల తూష్ణీంభావాలకు గురైన వాడే. అదేమిటో చిత్రం, కుర్చీలో కూర్చోగానే మారిపోయాడు, అత్తపాత్రలో ఒదిగిపోయిన కోడలు పిల్లలా.NOTE: Cartoon Courtesy Andhra Prabha Cartoonist Shri MAHAV

కామెంట్‌లు లేవు: