2, సెప్టెంబర్ 2019, సోమవారం

ఆ రాత్రి ఏం జరిగింది?


ఆగస్టు 17 రాత్రి పదిగంటలు. మామూలుగా నిద్రపోవడానికి ముందు ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాటలు వినడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు కార్డ్సు ఆడాలని అడగలేదు. అలెక్సా ఆన్ చేశాను. ఎప్పుడూ ఘంటసాల పాత పాటలు వచ్చేవి. ఆ రోజు విచిత్రంగా ఘంటసాల భగవద్గీత మొదలయింది. మనసు ఏదో కీడు శంకించింది. తలనొప్పిగావుంది అమృతాంజనం కావాలంది. అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం. తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళు, కాదు కాదు ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. చూడలేక అంబులెన్స్ పిలిపించాను. బాత్ రూం కు పోతానంటే అడుగులు తడబడుతుంటే నేనే తీసుకువెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. 48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే. 
ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావుకబురు చల్లగా చెప్పారు. 
నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!
Top of Form

4 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

అదృష్టవంతురాలు..
అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం !

Krishna Palakollu చెప్పారు...

🙏

శ్యామలీయం చెప్పారు...

"ఆ రోజు విచిత్రంగా ఘంటసాల భగవద్గీత మొదలయింది. మనసు ఏదో కీడు శంకించింది"

భండారు వారూ, మీకు కలిగిన కష్టం తీర్చలేనిది. మీకు కలిగిన నష్టం పూడ్చలేనిది. కాలప్రవాహం అనే వరదలో కొంతకాలం మీరు ఆనందంగా కలిసి ప్రయాణం చేసారు. అది చాలా సంతోషించ వలసిన విషయం. ఆ మధురస్మృతులతో శేషజీవితాన్ని సంతోషమయం చేసుకోవలసింది. తప్పదు మరి.

ఘంటసాల భగవద్గీతను కేవలం అశౌచసమయాల్లోనే అవధరించటం అన్నది తప్పు అలోచన. అది ఎలా వచ్చిందో తెలుగువారికి మరొక మూఢనమ్మకం ఐపోయింది. చాలా విచారించవలసిన విషయం. విజ్ఞ్లులు మీరూ అలా అలోచించటం చదివి విస్తుపోయాను.

భగవద్గీతను కీడును సూచించేదిగా అనుకోవటం దారుణం అండీ.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

భగవద్గీత గురించి శ్యామలరావు గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తాను.