25, జులై 2018, బుధవారం

దేవుడిని నమ్మేవారితో నమ్మనివారికి పేచీలు ఎందుకు? – భండారు శ్రీనివాసరావు


నిజానికి ఈ పేచీలు కొత్త విషయం ఏం కాదు, చార్వాకుడి కాలం నుంచి చూస్తున్న తతంగమే.
దేవుడ్ని నమ్మని ఈ చార్వాకుడు బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత ఇలా అనేక పేర్లు వున్నాయి ఈ శాఖకు.
లోకాయతఅంటే ప్రజల తత్వశాస్త్రం అనీ, ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు. లోకాయతకు మిగతా తత్వ శాస్త్రాల  లాగా ఒక మూల పురుషుడు లేడు. సామాన్య ప్రజల్లో కొన్ని అనుమానాలు వుంటాయి. ఉదాహరణకు భగవంతుడికి పెట్టే ప్రసాదం ఆయన ఎప్పుడన్నా తిన్నాడా? ఇలాంటి తర్కాలను లేవదీసి, ఈ లోకాయతులు ఆనాటి ఆధ్యాత్మిక వాదుల తిరస్కరణకు గురయ్యారు. నమ్మకానికీ,అపనమ్మకానికీ ఇది అనాదిగా జరుగుతున్న సంఘర్షణే ఇది. ఈ లోకాయతులు దేవుడ్ని నమ్మరు. ఆత్మను, పునర్జన్మలను విశ్వసించరు. ఒక రకంగా అది వారి నమ్మకం. 
ఈనాటి చర్చల్లో ఒక కులానికి సంబంధించిన అనవసర ప్రస్తావనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వస్తోంది. లోకాయత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన చార్వాకుడు ఒక బ్రాహ్మణుడు. మరో చిత్రం ఏమిటంటే చార్వాక వధకు పూనుకున్నవారు కూడా బ్రాహ్మణులే.
మహాభారతంలోని శాంతిపర్వంలో ఈ చార్వాక వధ గురించిన ప్రస్తావన వుంది.
కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలాదిమంది బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యుధిష్టురుని ఆశీర్వదించడానికి జమవుతారు. వారితో కలిసివచ్చిన చార్వాకుడు ధర్మజుడితో వాగ్వాదానికి దిగుతాడు. యుద్హంలో అనేకమంది బంధు మిత్రుల మరణానికి నువ్వే కారకుడివి. ఇంత చేసి నీవు సాధించింది ఏమిటి? నువ్వు బతికి ఉండడానికి వీల్లేదుఅంటూ గద్దిస్తున్న చార్వాకుడిని చూసి ధర్మరాజు ఖిన్నుడై బలవంతంగా తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ తరుణంలో తెప్పరిల్లిన మిగిలిన బ్రాహ్మణులు, చార్వాకుడు తమ ప్రతినిధి కాదని ధర్మరాజుకు నచ్చచెప్పి, ఆ కోపంలో చార్వాకుడిపై మూకుమ్మడిగా దాడిచేసి అతడిని వధిస్తారు. చార్వాకుడు యుధిష్ఠిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే.
అలా చార్వాకుడి నుంచి ఈ నాటి దాకా పురాణాలను అధిక్షేపించిన అనేకమంది మనకు చరిత్ర పుటల్లో కనిపిస్తారు. అయినా వాటిపట్ల ప్రజల మనస్సుల్లో ఉన్న భక్తి శ్రద్ధలు ఏమీ చెరిగిపోలేదు. 
ఒక్క మనదేశంలోనే కాదు, అనేక దేశాల్లో ఇలా దేవుడ్ని నమ్మిన వారికీ, నమ్మని వారికీ ఇలాటి సంఘర్షణలు జరుగుతూ వస్తూనే వున్నాయి. దేవుడనేది ఒక నమ్మకం. అలా నమ్మేవారి నమ్మకాన్ని శంకించాల్సిన పనిలేదు. దేవుడ్ని నమ్మకపోవడం కూడా ఒక నమ్మకమే. ఎవరి నమ్మకం వారిది. నమ్మకం మూఢనమ్మకంగా మారనంతవరకు వచ్చిన నష్టం ఏమీ లేదు.
ఒక సినిమా నటుడ్ని గురించి ఒకింత నిరసనగా మాట్లాడితేనే తట్టుకోలేని అభిమానుల నడుమ జీవిస్తున్నాం. మరి కోట్లాదిమంది అనునిత్యం దేవుడిగా పూజించే పురాణ పురుషులను గురించి ఎగతాళిగా మాట్లాడితే ......
రాముడు దేవుడు కాదని మీ నమ్మకమైతే దాన్ని నమ్మేవారితో పంచుకోండి. దేవుడిని నమ్మేవారితో మీకు పేచీలు ఎందుకు
(ఇటీవల  హెచ్ ఎం టీవీ ఈ అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో నాకు సమయం లభించినప్పుడు చెప్పిన కొన్ని విషయాలు)

4 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


భలేవారండి

పేచీ పడాలంటే ఆపోజిట్ వారితోనే కదా వీలవుతుంది !

జిలేబి

Chiru Dreams చెప్పారు...

ఆ పూజలు, ఈపూజలు, ప్రార్ధనలు చెయ్యకపోతే దేవుడికి కోపం ఒస్తుందీ, బంగారం, వెండీ ఇత్యాదులు ఇస్తేనే దోషనివారణ అవుంతుందీ.. ఇలాంటివాటితోనే పేచీ మరి.

Chiru Dreams చెప్పారు...

దొంగలు చేస్తే... దోపిడి

వీళ్ళు చేస్తే.. నమ్మకం

తేడా ఏం లేదు. జస్ట్ పేరు మారిందంతే

సూర్య చెప్పారు...

అవునూ, దేవుడికి కోపం రాదని చెప్పిన మతం ఏదైనా ఉందా. లేనప్పుడుమరి అన్ని మతాలనూ సమానంగా ద్వేషించాలిగా?అక్కడ కూడా ఎక్కువతక్కువలెందుకు?