9, మే 2017, మంగళవారం

ఆయన రేడియో ప్రయోక్తా! రచయితా!


రెండూను అంటున్నారు ఎమెస్కో వారు. అనడమే కాదు, డి. వెంకట్రామయ్య రాసిన రెండు పుస్తకాలను ఒకేసారి ప్రచురించారు. ఇది ఎప్పుడో జరగాల్సిన పని అనేది రొటీన్ కామెంటు. ఇప్పటికయినా చేసారు, ఆయన అభిమానులకి అదే సంతోషం.'ఆయన వార్తలు చదువుతుంటే వార్తలు చదువుతున్నట్టు అనిపించేది కాదు. చక్కగా చెబుతున్నట్టు వుండేది. నిజంగా రేడియో వార్తలు చదవడం అంటే  ఏమిటో వెంకట్రామయ్య వార్తలు వింటే తెలుస్తుంది' అనేవారు ప్రసిద్ధ జర్నలిస్ట్ జీ.కృష్ణ గారు. ఆయన అన్నారంటే అది ఆస్కార్ అవార్డ్ తో సమానం. ఎందుకంటే కృష్ణ గారు అల్లాటప్పాగా  రాయరు, మాట్లాడరు.వెంకట్రామయ్యకి ఇలాటి నమ్మకాలు లేవుకాని, శాపవశాన గంధర్వుడు మానవ జన్మ ఎత్తినట్టు, ఆయన రేడియోలో చేరి ఉద్యోగం చెయ్యడం  ఆకాశవాణికి ఉపయోగం అయ్యింది కానీ,  ఆ ఉద్యోగం చేయడం వల్ల ఆయన నష్టపోయారు. ఇంకా చెప్పాలంటే వెంకట్రామయ్య అనే సృజనాత్మక వ్యక్తి  రేడియో న్యూస్ రీడర్ గా సుదీర్ఘకాలం పనిచేయడంవల్ల ఆంధ్రదేశం చక్కని రచయితను కోల్పోయింది. ఇది నా నమ్మకం.
ఒక రచన చేసినా, ఒక వార్త  తర్జూమా చేసినా, లేక  రేడియోలో  చదివినా, ఏం చేసినా సరే మనసుపెట్టి చేసేవారు. అందుకే ఆ రచనలో,  ఆ వార్తలో, దానిని చదవడంలో  జీవం తొణికిసలాడేది. ఆయనతో పాటు దశాబ్దాలపాటు పనిచేసిన రేడియో ఉద్యోగిగా ఈ విషయం బల్ల గుద్ది చెప్పగలను.
రాయని రచయిత, లేదా రాసి మానేసిన రచయిత అని పేరుపడ్డ  వెంకట్రామయ్య చేత మళ్ళీ రాయించాలన్నది నా చిరకాల వాంఛ.  దాన్ని మన్నించి కొన్ని రాశారు కానీ ఇంకా ఇంకా రాయాలనే కోరిక మాత్రం తీరలేదు. అలాఅని, నా ఆశా చావలేదు. చూద్దాం!  ఆయన రాయకపోతారా! నేను చదవక పోతానా?
కానీ, కార్మికుల కార్యక్రమం 'రాంబాబు'  అంత తేలిగ్గా వినే రకం కాదు. అదేకదా! బాధ.
మొత్తానికి ఈ గోడు ఎమెస్కో వారి చెవిన పడినట్టుంది. అందుకే ఆయనవి రెండు పుస్తకాలు ఏకకాలలో అందంగా అచ్చొత్తించి అభిమానుల కోరిక తీర్చారు. నిన్ననే నాకూ, జ్వాలాకు ఆయన  ఈ పుస్తకాలు అందచేశారు. ఈ ఏడాదిలో నాకందిన గొప్ప కానుక.
(ప్రచురణ: ఎమెస్కో PRICE: Rs.175 each)
తోకటపా: రేడియో అనుభవాల గురించి రాసిన మూడువందల పేజీల్లో, పది పేజీలతో కూడిన ఒక అధ్యాయాన్నే నాకోసం, నా పేరుమీద కేటాయించిన వెంకట్రామయ్య గారికి స్నేహపూర్వక కృతజ్ఞతలు – భండారు శ్రీనివాసరావు