19, ఏప్రిల్ 2017, బుధవారం

ఆనాటి చంద్రబాబు


https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEjU6fc0zI5gJ9sIQSGi_oV7t68kgisz-A9K7eGKZo-Uj7x8Pdd1z505tB3gg5HK8tXWf3H4lP7dvJPUbq1UfuOmNrG2qeN2a8g_4aA_yXitpf43Of7Lw11pVaGVkAmvAzHsN5T08fjrSkrR1c_clRl1Vnmik4NHCwx-p9nF=s0-d-e1-ft


( ఏప్రిల్ 20 చంద్రబాబు జన్మదినం)
(Published in AP Edition of ANDHRAJYOTHY daily today, Wednesday, 19-04-2017)
సుమారు 40 సంవత్సరాల క్రితం, స్థానికులకు ఏమాత్రం పరిచయం లేని ఓ యువకుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించాడు. గడప గడప తొక్కాడు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించాడు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించాడు. ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.
రచ్చబండ్లమీద ఇళ్ళ అరుగుల మీద  సేద తీరాడు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల  వద్దే అడ్డంకులు ఎదురయినా  మడమ తిప్పలేదు.ఓ జత దుస్తులు, కాలికి చెప్పులుతోడుగా కొందరు యువకులు. ఇంతకు  మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా  కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగాడు.రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని ఎన్నికల్లో గెలిచాడు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టాడు.
ఆయన ఎవ్వరో కాదు, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబునాయుడు.
నేను రేడియో విలేకరిని కనుక, అందులోను పనిచేసేది హైదరాబాదులో కనుక అప్పటి మీడియా వాతావరణంలో రాజకీయ నాయకులతో మరీ దూరం, దగ్గర కానీ సత్సంబంధాలు ఉండేవి.  మంచి సంబంధాలు అని ఎందుకు అంటున్నాను అంటే ఏవిషయం పైన అయినా, రాజకీయ నాయకులు తమ  మనసులోని మాటల్ని ఎలాంటి భేషజాలు, సంకోచాలు లేకుండా పంచుకోవడానికి వీలున్న విలేకరిని కదా!  ఊహాగానాలకు, సంచలనాలకు రేడియో వార్తల్లో తావుండదు. అదీ వాళ్లకు  నాతొ వున్న భరోసా! ఈ ఒక్క కారణంతో కాబోలు చంద్రబాబునాయుడు మాత్రమే కాదు1975 నుంచి  2005 వరకు అనేకమంది ముఖ్యమంత్రులతో పరిచయాలు ఓ పరిమితి మించి బాగానే ఉండేవి. ఆ చనువుతో నేను కొన్నిసార్లు చంద్రబాబును  కోరిన కోరికలు,  ముఖ్యమంత్రి సిబ్బందిని ఇబ్బందుల్లో పడేసేవి. ఒకాయన నేరుగానే తన మనసులోని మాటను నా మొహం మీదే చెప్పేశారు కూడా.      
ముఖ్యమంత్రితో వ్యవహరించాల్సిన పద్దతి ఇది కాదు, శ్రీనివాసరావు గారు..అన్నాడా అధికారి మనసులోని అసహనాన్ని సాధ్యమైనంత మృదువైన మాటల్లో వ్యక్తపరుస్తూ.
చంద్రబాబునాయుడు సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయన దగ్గర పనిచేసే ఈ ఐ.ఏ.ఎస్. అధికారి చాలా చాలా సౌమ్యుడు. పేషీలో పనిచేసే అధికారులను బట్టి ముఖ్యమంత్రి పనితీరు అంచనాలు  ఆధారపడివుంటాయంటారు. ఆ రోజుల్లో సమర్దుడయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో ఆయన పేషీ అధికారుల పాత్రకూడా వుంది.
ఆ అధికారితో నాకు చాలా సన్నిహిత పరిచయం. ఐ.ఏ.ఎస్. అనే డాంబికత్వం ఏకోశానా కానవచ్చెది కాదు. అయినా ఆయన సహనాన్ని పరీక్షించేలా నేను కొన్ని సార్లు ప్రవర్తించేవాడిని. అందుకే ఆయన అలా నిష్టూరంగా మాట్లాడారు. అయినా, అది నాకు కొత్తేమీ కాదన్నట్టు మరోమారు ముఖ్యమంత్రి అపాయింట్ మెంటు కోరేవాడిని. అపాయింట్ మెంటు అంటే ఆయన్ని కలుసుకోవడం కాదు. సీఎం ని కలవడానికి ఆరోజుల్లో పెద్దగా  ప్రయాసపడాల్సిన  అగత్యం విలేకరులుకు ఉండేదికాదు. కాకపొతే, వేరే తెలిసినవారి కార్యక్రమాలకు సీఎం ను తీసుకుపోవాలనే నా అభ్యర్ధనలను మన్నించడానికి అధికారులు  చాలా ఇబ్బంది పడేవారు.
ఇది మరీ అన్యాయం. ఆయన ముఖ్యమంత్రి. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఇలా పెళ్ళిళ్ళకూ, వేడుకలకూ పిలుస్తూ పొతే ఏం బాగుంటుంది. మీ ఇంట్లో పెళ్లి అంటే అర్ధం వుంది, ఇలా మీకు తెలిసిన వాళ్ళ పెళ్లిళ్లకు కూడా ముఖ్యమంత్రి రావాలంటే ఎలా!అనేది సౌమ్యుడయిన ఆ అధికారి వాదన.
ఎమోనండీ! అది నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా పిలిచే వాళ్ళు ఆయన వీరాభిమానులు. పెళ్ళికి వస్తే మహాదానందపడిపోయేవాళ్ళు. వున్న వూళ్ళో హైదరాబాదులోనే పెళ్లి. ఒక్కసారి వీలు చేసుకుని వస్తే సరిపోతుంది. అందుకే నేను అడగగానే ఆయన ఒప్పుకుని వస్తామని మాట ఇచ్చారు. ఇక మీ ఇష్టం
తరవాత కధ చెప్పాల్సిన పనిలేదు. ఏ పెళ్ళికి ముఖ్యమంత్రిని పిలిచినా ఆయన వీలు చేసుకుని ఏదో ఒక సమయంలో వచ్చి వధూవరులను ఆశీర్వదించి, పూల బొకే ఇచ్చి వెళ్ళేవాళ్ళు.  కొన్ని చోట్ల భద్రతాపరమయిన ఇబ్బందులు అడ్డు వచ్చేవి. ముఖ్యమంత్రి వెళ్ళే చోట కనీసం రెండు లిఫ్టులు వుండాలి. రెండు ద్వారాలు వుండాలి. సెక్యూరిటీ వాళ్ళు ఇలాంటివి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకున్న తరువాతనే క్లియరెన్సు ఇచ్చేవాళ్ళు. కానీ, నా విషయంలో వాళ్ళు అనేకసార్లు రాజీ పడాల్సిన పరిస్తితి ఎదురయ్యేది.  పెళ్ళిళ్ళకే  కాదు, చిన్న చిన్న స్కూళ్ళ వార్షికోత్సవాలు, ఆటలపోటీలు ఇలా దేనికీ పిలిచినా చంద్రబాబునాయుడు మారుమాట లేకుండా వచ్చిపోయేవారు. ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇది కాదని పేషీ అధికారి కినుక వహించడం వెనుక కధ ఇదే.
ఆరోజుల్లో ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్త పోగు ఆయన కంట పడింది.  వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి  లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.  
నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తిఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని జనంలో కలిగిస్తే, కింద పనిచేసే  ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా?’ అనేది సిబ్బంది వాదన.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా చాలాకాలం పనిచేసారు. ఆఫీసులో ఆయన్ని కలవడానికి ఎవరు వచ్చినా, ఎందరు వచ్చినా కాదనకుండా అందర్నీ కలిసి మాట్లాడే వారు. వారు చెప్పింది సావధానంగా  వినేవారు. కలవడానికి వెళ్ళిన వాళ్ళు ఆయన  గదిలో ప్రవేశించగానే కుర్చీ దగ్గర నిలబడి మాట్లాడే వారు. వచ్చిన వారిని  కూర్చోమని తాను  నిలబడే  మర్యాద చేసేవారు. అంత పెద్ద అధికారి నిలబడి వున్నప్పుడు, తాము కూర్చోవడం బాగుండదేమో అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ముక్తసరిగా వచ్చిన పని క్లుప్తంగా చెప్పుకుని  బయటపడేవాళ్ళు.  దొరికిందే తడవుగా కుర్చీల్లో సెటిలయిపోయే బాతాఖానీరాయుళ్ళను ఆ అధికారి అలా కట్టడి చేసేవారన్న మాట.
కాలికి బలపం కట్టుకుని చంద్రబాబు చేసే నిరంతర పర్యటనల్లో కూడా ఇదే  ఉద్దేశ్యం వుందేమో అనిపిస్తుంది. అలా అలుపెరుగకుండా తిరిగే మనిషిని ఓ పట్టాన పట్టుకోవడం కష్టం. పట్టుకున్నా ఆయన సమయాన్ని వృధాచేయడం అంతకన్నా కష్టం. అలా సీరియస్  గా పనిచేసుకుపోయే చంద్రబాబు నవ్వుకు దూరం అయ్యారా అని అప్పట్లో విలేకరులకు అనిపించేది. ఉమ్మడి రాష్ట్రానికి  ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో తెలియదు.  కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
అరుదుగానే కావచ్చు కానీ చంద్రబాబు నవ్వుతారు.
అందుకు సందేహం అక్కరలేదు. కాకపొతే నవ్వించాలి.
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగానే  వున్న  జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరే పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈ లోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల  సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, ‘సీఎం బయలుదేరి రావచ్చాఅని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేసారు. విలేకరులు పలుచగా వుండడాన్ని ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను, నేను కల్పించుకుంటూ. అవేమిటో చెప్పమని అడిగారు  చంద్రబాబు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడే అవకాశం వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్  వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి  వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
ఇప్పుడాయన అమరావతి వెళ్లి పోయారు. నేను హైదరాబాదులో విశ్రాంత జర్నలిష్టుగా  వుండిపోయాను.
ఒకప్పుడు రోజూ కలిసిన మనిషిని ఈరోజు కలిసే అవకాశం లేదు. నాకా కోరికా లేదు, ఒకవేళ వున్నా ఆయనకీ అంతటి తీరిక ఉండకపోవచ్చు. గతంలో చంద్రబాబు పుట్టిన రోజంటే నేనే అనేకమందిని వెంట తీసుకువెళ్ళి కలిపించేవాడిని. ఇప్పుడా వీలుసాలు లేదు. అందుకే ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈ విధంగా తెలుపుకుంటున్నాను. (EOM)  


(ANDHRAJYOTHY - 19-04-2017)

https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEjU6fc0zI5gJ9sIQSGi_oV7t68kgisz-A9K7eGKZo-Uj7x8Pdd1z505tB3gg5HK8tXWf3H4lP7dvJPUbq1UfuOmNrG2qeN2a8g_4aA_yXitpf43Of7Lw11pVaGVkAmvAzHsN5T08fjrSkrR1c_clRl1Vnmik4NHCwx-p9nF=s0-d-e1-ft

కామెంట్‌లు లేవు: