20, ఏప్రిల్ 2016, బుధవారం

మా అన్నయ్య చేసింది రైటే!



మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు  గారంటే నాకెంత గౌరవం వుందో అంతకు మించి రెట్టించిన  కోపం కూడా వుంది.  గౌరవం ఎందుకంటే ఆయన్ని  మించి  గౌరవించతగిన గొప్పవ్యక్తి  ఈ సమస్త భూప్రపంచంలో  నాకు మరొకరు ఎవ్వరూ లేరు. ఇక కోపం ఎందుకంటే, ఆయన బతికి వున్నప్పుడు ‘చెన్నా టు అన్నా’ అనే పుస్తకం రాస్తుంటానని ఎప్పుడూ చెబుతుండేవాడు. మొదటిసారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పీఆర్వో ఆయనే. ఆ రోజుల్లో పీఆర్వో, అన్నా,  సీపీఆర్వో అన్నా,  ప్రెస్ సెక్రెటరీ అన్నా సమస్తం ఆయనే. తరువాత  అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఆ తదుపరి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నేతృత్వం వహించిన నందమూరి తారక రామారావు, ఇలా ఏకంగా వరుసగాఅయిదుగురు ముఖ్యమంత్రులకు పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన అనుభవం ఆయనది. అందుకే ఆ పుస్తకం పేరు అలా పెట్టాడు.  కానీ రాయకుండానే దాటిపోయాడు.  అదీ నాకు కోపం.  ఆయన ధారణ శక్తి అపూర్వం. ఒక విషయం విన్నాడంటే ఎన్నేళ్ళు అయినా మరచిపోడు. తారీఖులతో సహా గుర్తు. ఇక విషయం వివరించడంలో,  మా అన్నయ్య అనికాదుకానీ  ఆయనకు ఆయనే సాటి.  ఇంగ్లీష్, తెలుగు భాషలు కొట్టిన పిండి. రాసినా, మాట్లాడినా అదో అద్భుతమైన శైలి. అన్నింటికీ  మించి వెలకట్టలేని నిబద్ధత. అలాటివాడు  అలాటి పుస్తకం రాశాడు అంటే గొప్పగా వుండి తీరుతుందనే నమ్మకం అందరిదీ. ఒక విషయం,  తమ్ముడిని  కాకపొయుంటే ఇంకా గొప్పగా పొగిడేవాడిని.


ఎందుకో ఏమిటో కారణం తెలవదు. గొప్ప ఆధ్యాత్మిక గ్రంధాలు ఎన్నో ఒంటి చేత్తో రాశాడు కానీ రాజకీయాల జోలికి వెళ్ళలేదు.  కాగితాల బొత్తి తొడమీద పెట్టుకుని వందల, వేల పేజీలు   రాస్తూపోయాడు. పైగా రాసినవన్నీ  రిఫరెన్సు కు పనికి వచ్చే గ్రంధాలు. కంప్యూటరు లేదు, ఇంటర్ నెట్ లేదు. టైప్ చేసేవాళ్ళు లేరు. ప్రూఫులు దిద్దేవాళ్ళు లేరు, ఎందుకంటే రాసిన విషయాలు అటువంటివి, పేర్కొన్న శ్లోకాలు అటువంటివి. తభావతు రాకూడదు, స్ఖాలిత్యాలు  వుండకూడదు. ఒంటిచేత్తో అన్నదందుకే.  నరసింహస్వామి తత్వం గురించి అవగాహన చేసుకుని రాయడానికి దేశంలో ఎక్కడెక్కడో వున్న నరసింహ క్షేత్రాలు  సందర్శించాడు. కోల్కతా, చెన్నై వంటి నగరాలలోని  గ్రంధాలయాల చుట్టూ తిరిగి రాసుకున్న నోట్స్ తో అద్భుత గ్రంధాలు వెలువరించాడు. ఏ ఒక్క పుస్తకాన్నీ అమ్ముకోలేదు. అటువంటి వాటిపట్ల మక్కువ వున్నవారికి ఉచితంగా కానుకగా ఇచ్చేవాడు. ఆ క్రమంలో ఒకరకమైన ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయాడు.  బహుశా మానసికంగా ఒక స్థాయికి చేరిన తరువాత ఆయనకు ఈ విషయాలు అన్నీ పనికిమాలినవిగా అనిపించాయేమో తెలవదు.
ఇప్పుడు ఇన్నాళ్ళకు అనిపిస్తోంది ఆయన చేసిన పని సబబేనని. ఏవుంది ఈ రాజకీయాల్లో. రాసింది ఒకళ్ళు మెచ్చుతారా, ఒకళ్ళు నచ్చుతారా! అందరూ గిరిగీసుకుని కూర్చున్నారు. ఒకరు మెచ్చింది మరొకరు నచ్చరు. తమ మనసులో వున్నదే రాయాలంటే ఇక రాయడం ఎందుకు? అసలు  ఇంత అసహనం ఎందుకు? ఈ స్థాయిలో రాజకీయ నాయకుల పట్ల సినీ హీరోల మాదిరిగా అభిమాన దురభిమాన ప్రదర్శనలు ఎందుకు? ఒక్క ముక్క కూడా వ్యతిరేకత ధ్వనించినా సహించలేని పరిస్తితి. చరిత్ర తెలియాలంటే జరిగింది జరిగినట్టు చెప్పేవాళ్ళు వుండాలి. వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు వుండాలి. అప్పుడే చరిత్ర, చరిత్రగా రికార్డు  అవుతుంది. కానీ ఈ ముక్కలు ఎవరి చెవికీ ఎక్కడం లేదు.  

ఇవన్నీ చూస్తున్న తరువాత మళ్ళీ  మళ్ళీ అనిపిస్తోంది ఆయన రాజకీయం రాయకపోవడం రైటే అని.  (20-04-2016)      

3 కామెంట్‌లు:

మనోహర్ చెనికల చెప్పారు...

aa adhyatmika pustakaalu kudirite internet lo share cheyyagalaru. naalaamti autsaahikulaku chaalaa panikostaayi.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@మనోహర్ చెనికల - తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మీ ఈ మెయిల్ ఇవ్వండి. నాది - bhandarusr@gmail.com

Surya Mahavrata చెప్పారు...

రాజకీయాలగురించి రాస్తే కొందరికి నచ్చదని ఆధ్యాత్మికతవైపు మళ్ళడం కన్న ఇటువంటి చికాకులు సవాళ్ళనుకుని నైరాశ్యం ఆవరించకుండా స్థితప్రజ్ఞత సాధించడంకోసం ఆధ్యాత్మిక ఆలంబన తీసుకుంటే ఇరుప్రవృత్తుల్లోనూ ప్రయోజనం కలుగుతుంది, పాఠకులకి కూడా మీ రచనలు మిస్సయ్యే ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం.