23, మార్చి 2016, బుధవారం

లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్

(తమ పార్టీ లోక్ సత్తా ఇక ఎన్నికల్లో పోటీ చేయదని జయప్రకాష్ నారాయణ్ ప్రకటన చదివిన తరవాత)

ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టుగా రాజకీయం మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు' వంటి కాస్తంత ఉదాత్తమైన పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా సంఘాల పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ, కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే ఆరోపణలకు నడుమ వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా కానవస్తోంది.
నిజమైన ప్రజాసంఘాలకీ, రాజకీయ నేపధ్యం కలిగిన ప్రజా సంఘాలకీ హస్తిమశకాంతరం తేడా వుంది. కొన్నేళ్ళ క్రితం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల కొద్దిసేపు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం మానేశాయి. దాంతో ఎవరి హడావిడిలో వాళ్ళు పోవడం వల్ల వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ తన పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.
ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిర్ణయం, లోక్ సత్తాకు అంటుకున్న ఈ 'మకిలి' ని తొలగించగలిగితే మంచిదే!3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Jai Gottimukkala చెప్పారు...

శుభం పీడా పోయింది. సొంత డబ్బా కొట్టుకోవడం, మిడిమిడి జ్ఞానం, అహంభావం, ఎలైటిస్ట్ దృక్పధం లాంటి అవగుణ భూయిష్టమయిన ఈ పార్టీని ప్రజలు ఎప్పుడూ నమ్మలేదు. ఇప్పటికయినా వీరి భజన మీడియా ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది.

NSK చెప్పారు...

midimidi gnanama...... ????