16, మార్చి 2016, బుధవారం

నైతిక పరాజయమా! సాంకేతిక విజయమా!

సూటిగా.........సుతిమెత్తగా...........భండారు శ్రీనివాసరావు

(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 17-03-2016, THURSDAY)
  
“ధర్మము ధర్మమటంచు వితండ వితర్కములాడదీవు, ఆ ధర్మము నేనెరుంగుదు.....” అంటాడు శ్రీరామాంజనేయ యుద్ధం నాటకంలో   శ్రీరామచంద్రుడు, తనకు ధర్మం గురించి చెప్పబోయిన  ఆంజనేయుడితో. యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు ధర్మాధర్మ విచక్షణకు తావుండదన్న ధర్మ సూక్ష్మం ఇందులో దాగుంది.
అంధ్రప్రదేశ్ శాసనసభలో పాలక ప్రతిపక్షాల నడుమ సాగుతున్న ‘నీదా నాదా పైచేయి’ క్రీడలో అడుగడుగునా ఇది ప్రతిఫలిస్తోంది.  ముందు ప్రభుత్వంపై, ఆపై అసెంబ్లీ స్పీకర్ పై వైఎస్ఆర్ సీపీ, ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిగిన తీరు తెన్నులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. 


సరే! సభలో బలాబలాలను బట్టి ఈ తీర్మానాలు ఎటుతిరిగీ  నెగ్గవన్న సంగతి ముందే తెలుసు కనుక ఫలితంపై  ఎవ్వరికీ ఆసక్తి లేదు. పెట్టింది అవిశ్వాసమైనప్పటికీ,  కట్టు తప్పి గోడదూకిన తన సభ్యులపై అనర్హత వేటు వేయించడానికే ఇదంతా అన్న తన మనసులోని ఆలోచనను ప్రతిపక్షం  దాచుకోలేదు. అయితే,  చర్చదాకా వచ్చినప్పుడు ఆ అంశంపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడమే ప్రధానాస్త్రంగా ప్రయోగించాలని తలపెట్టడం ఆ పార్టీ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. పార్టీ మారిన సభ్యులపై అనర్హత వేటు వేయించాలని చేసిన ప్రయత్నం యావత్తు, తీర్మానంపై జరిగిన ఓటింగు సమయంలో డివిజన్ కు పట్టుపట్టకపోవడంతో నిరర్ధకమైంది. దాన్ని తనకు అనువుగా వాడుకుని పాలక పక్షం మూజువాణీ ఓటుతో తీర్మానాన్ని వీగిపోయేట్టు చేసి, వ్యూహాత్మకంగా పావులు కదపడంలో తనదే పైచేయి అని నిరూపించుకుంది.
పొతే చర్చ సందర్భంగా ఉభయ పక్షాల నడుమ సాగిన వాగ్యుద్ధంలో నైతిక విలువలు పూర్తిగా పక్కకు తప్పుకుని, సభామర్యాదలు సంపూర్తిగా  మంట కలిశాయి. ఈ విషయంలో పాలకపక్షం కొంత  సంయమనంతో వ్యవహరిస్తే బాగుండేదన్న అభిప్రాయం వీక్షకులకు కలిగింది. కాకపొతే, ముందే చెప్పినట్టు, కదనరంగంలో  ధర్మాధర్మాల ప్రసక్తికి  తావుండదు. అక్కడ  విజయమే ప్రధానం.  
ఈసారి ప్రతిపక్షనేత జగన్మోహన రెడ్డి పూర్తిగా సంసిద్ధమై వచ్చి తన వాదనను బలంగా వినిపించ గలిగిన పరిణతిని ప్రదర్శించారు. అయితే, ఈ పరిణతి,  ప్రసంగ సందర్భంగా వాడిన  పదజాలం కారణంగా పలచ పడిపోయింది.  ముఖ్యమంత్రిని, సభానాయకుడిని  ఏకవచనంలో సంబోధించడం సభామర్యాద కాదు, ఈ పద్దతిని ఆయన  సరిదిద్దుకుంటే బాగుండునన్న భావం టీవీ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నవారిలో  కలిగింది. అయితే, అదేసమయంలో, కొందరు పాలకపక్ష సభ్యులు, ఆయనపై  ఎదురుదాడికి దిగిన క్రమంలో దొర్లిన అసభ్య పదాలు విన్న తరువాత, సభా మర్యాదలను  గాలిలో కలపడంలో తామూ తక్కువ తినలేదని నిరూపించుకోవడంలో  కృతకృత్యులయ్యారు. మరి, ఇక్కడా విజయమే ప్రధానం కదా!
ఇక ప్రతిపక్ష  వైఎస్ఆర్ సీపీ సహజంగానే తనకు దొరికిన సమయాన్ని ప్రభుత్వంపై తాను ఇన్నాళ్ళుగా చేస్తూ వస్తున్న ఆరోపణలను పునశ్చరణ చేయడానికే ఉపయోగించుకుంది. వీటిలో నవ్యత్వం లేకపోయినా  అవే  ఆరోపణలను  అసెంబ్లీ వేదికగా చేసి రికార్డులకెక్కేలా చేయాలనే ఆ పార్టీ ధ్యేయం కొంతవరకు నెరవేరింది. పదేపదే చేస్తున్న ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలత పెట్టి వుంటాయి. ఆరోపణలకు ఆధారాలు చూపించాలనీ, వాటిని  సభాముఖంగా నిరూపించిన తరువాతనే  ముందుకు పోవాలని ఆయన  ప్రతిపక్ష నేతకు సవాలు విసిరారు. చంద్రబాబు విసిరిన ఈ సవాలుతో కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీల నడుమ సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి తెర పడబోతున్నదేమో అనే చిరు ఆశ కలిగిన మాట నిజం.
అయితే అన్ని ఆరోపణలకు ఆధారాలు ఉండవచ్చు, వుండకపోవచ్చు. కానీ, వాటిని అసెంబ్లీలో నిరూపించగలగడం అసాధ్యమైన వ్యవహారం. అందుకే తెగుతుందనుకున్న ఈ వ్యవహారం, ప్రతిపక్షం సీబీఐ దర్యాప్తుకోసం పట్టుబట్టడంతో  ముడి విడలేదు సరికదా మరింత బిగుసుకుంది.    
చర్చ సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిని సమర్ధవంతంగా సభ దృష్టికి తీసుకు రావడానికి ప్రతిపక్షానికి ఇదొక సదవకాశం. అలాగే వాటి గురించిన సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వానికి కూడా అసెంబ్లీని మించిన వేదిక మరోటి వుండదు. అయినా కానీ ఉభయపక్షాలు ఈ విషయంలో వైఫల్యం చెందాయనే చెప్పాలి. ఎందుకంటే ఇంత జరిగిన తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది.                     
ఈ అవిశ్వాస తీర్మానాలు ఒక విషయాన్ని స్పష్టం చేసాయి. వై ఎస్ ఆర్ సీపీ నాయకత్వం ఈసారి విషయాలను సాకల్యంగా అధ్యయనం చేసి సభకు వచ్చిన మాట వాస్తవమే అయినా అనుభవలేమి ఆ పార్టీకి అడ్డుగోడగా నిలిచింది. అనుభవం పుష్కలంగా వున్న టీడీపీ నాయకత్వం నిబంధనలను అడ్డుపెట్టుకుని, సాంకేతిక కారణాలను సాకుగా చూపి మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంలో ఇది మరింత తేటతెల్లం అయింది. తీర్మానం చర్చకు తీసుకోవడానికి పద్నాలుగు రోజుల వ్యవధి ఇవ్వాలనే నిబంధనను అప్పటికప్పుడే మూజువాణీ ఓటు ద్వారా సస్పెండు చేసి, ప్రతిపక్షానికి కాలూ నోరూ కూడదీసుకునే వ్యవధానం ఇవ్వకుండా ప్రభుత్వ పక్షం చర్చను చేపట్టిన తీరు ఇందుకు ఉదాహరణ.   నిజానికి ఈ అవిశ్వాస తీర్మానాలను లెక్క చేయాల్సిన పరిస్తితి పాలక పక్షం టీడీపీకి  లేదు. సంఖ్యాబలం పుష్కలంగా వున్నప్పుడు వాటిని ఖాతరు చేయాల్సిన అవసరమూ లేదు, అగత్యమూ లేదు. అయినా ఈ రెండు పార్టీలకి ఎందుకింత పట్టుదల అంటే ఒకటే కారణం. వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఆ ఎనిమిది మందిపై అనర్హత వేటు పడేలా చూడడం వైసీపీ ప్రధాన ధ్యేయం అయితే,  ఆ వేటు  పడకుండా వారిని కాపాడుకోవడం టీడీపీ లక్ష్యం. ఈ విషయంలో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అనర్హత వేటు పడకుండా చూడగలిగితే తమ పార్టీలోకి మరిన్ని వలసలు పెరిగే అవకాశం వుంటుందన్న ఆశ కూడా ఇందుకు దోహదం చేసి వుండవచ్చు.
అవిశ్వాస తీర్మానం మళ్ళీ ఆరు మాసాల దాకా పెట్టేందుకు వీలులేదు. ఒకరకంగా వై ఎస్ ఆర్ సీపీకి ఇదొక  ఇబ్బందే.  అయినా సరే, రాజ్యాంగపరంగా  తనకున్న ఈ వెసులుబాటును ఆ పార్టీ ఇప్పుడే వాడేసుకుంది. కారణం, రాజకీయ అనివార్యత. కట్టు దప్పిన తన ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు పడేలా చూడకపోతే, పార్టీలో పడ్డ గండి మరింత పెద్దది అయ్యే ప్రమాదం పొంచి వుంది. దానికి అడ్డుకట్ట వేయడానికే ఇంత ప్రయాస, ఇంతటి లాయలాస.
ప్రజలు, ప్రజాసమస్యలు అనేవి రాజకీయులకు ఊతపదాలు. ఉపన్యాసాలవరకే అవి పరిమితం. వారికి, వారి పార్టీలకి రాజకీయ ప్రయోజనాలే ప్రధానం.
అయితే, ఈ మొత్తం వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ చివరిలో తనను గురించి చెప్పుకున్నసంగతులు  ఆయన జీవితంలో ఇంతవరకు నలుగురికీ తెలియని విషయాలను ఆవిష్కరించాయి. గత కాలంలో, అంటే ఆయన చిన్నతనంలోని దుర్భర పరిస్తితులు ఈనాటి తరానికి తెలియని విషయాలు. నడిచి వచ్చిన దారిలో అడ్డుపడిన ముళ్ళ కంపలు ఆయనకు  ఇప్పటికీ గుర్తున్నాయి. కలతపెట్టే సంగతులే అవి. అయితే,  చర్చ సందర్భంగా తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు మనస్తాపం కలిగించేవి కావచ్చు కానీ, ప్రజాజీవితంలో కొనసాగుతున్నప్పుడు అవి  గుర్తుంచుకోవాల్సిన విషయాలే.
   
ఉపశృతి: ప్రభుత్వంపై ప్రతిపక్షం అవిశ్వాసం అంటారు.  ఎందుకో ఇది వినడానికే విడ్డూరంగా వుంటుంది. ప్రతిపక్షానికి పాలకపక్షంపై అవిశ్వాసం, అపనమ్మకం వుండక ప్రేమ ఎందుకు వుంటుంది. ఈ రెండూ ఒకదానిని మరొకటి విశ్వసించవు. విశ్వాసంలోకి తీసుకోవు.
నిజానికి, ప్రభుత్వంపై, పాలకులపై  విశ్వాసం వుండాల్సింది వారిని ఓటేసి అధికారం అప్పగించిన ప్రజలకు. ఆ విశ్వాసానికి తూట్లు పడకుండా జాగ్రత్త పడడం ప్రభుత్వాధినేతల ప్రధమ కర్తవ్యమ్. ప్రతిపక్షంపై కాదు, ఈ విషయంపై పాలకులు నిరంతరం  ఓ కన్నేసి ఉంచాలి.(16-03-2016)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595       

           

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

కులపిచ్చి+ ఆధిపత్య పోరు+దరిద్రగొట్టు రాజకీయాలు= ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం.