9, అక్టోబర్ 2012, మంగళవారం

మిసిమి వ్యాసాల ఇన్నయ్య పుస్తకం


మిసిమి వ్యాసాల ఇన్నయ్య పుస్తకం
కొందరు జంతువుల్ని ప్రేమిస్తారు. మరికొందరు మొక్కల్ని ప్రేమిస్తారు. నాకు తెలిసి పుస్తకాల్ని ప్రేమించే వ్యక్తి ఒకరు వున్నారు. పుస్తకాలను అందరూ చదువుతారు. మంచి పుస్తకాలను కొందరే ఎంపిక చేసుకుని చదువుతారు. పుస్తక ప్రేమికుడయిన ఈ వ్యక్తి తను పుస్తకాన్ని ‘కొని’ చదవడమే కాదు పుస్తకాల్ని ప్రేమించే గుణం వున్న మరికొందరికి ఆ పుస్తకాల్ని కొని, పోస్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ పంపి చదివిస్తారు. ఏదయినా పుస్తకం బాగా నచ్చితే వందల సంఖ్యలో వాటిని కొని బంధుమిత్రుల ప్రత్యేక వేడుకలకు ‘కానుక’గా పంపుతారు. అరుదయిన ఈ వ్యక్తిత్వం కలిగిన ఈ వ్యక్తి పేరు దేవినేని మధుసూదనరావు. వీరిలో పేర్కొన దాగిన  విశిష్ట లక్షణాలు మరికొన్నివున్నాయి. వాటిని మరో సందర్భంలో ప్రస్తావించుకుంటాను.


వీరిని తలచుకునే సందర్భం ఈ రోజు తటస్థ పడింది. హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో నరిసెట్టి ఇన్నయ్య రాసిన మిసిమి వ్యాసాల సంకలన గ్రంధాన్ని హెచ్.ఎం.టీ.వీ.  సీ.యీ.వో., కే. రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. ఒక చక్కటి ఆశయంతో, అంకితభావంతో రెండు దశాబ్దాల క్రితం ‘మిసిమి’ పత్రికను ప్రారంభించినప్పటినుంచి ఇన్నయ్య తనదయిన శైలిలో ఈ వ్యాసాలను రాస్తూ వచ్చారు. ఎన్నుకున్న అంశాల పరిధి అతి విస్తృతం. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రచయితల రచనలతో పాటు, వారి వ్యక్తిత్వాలను పరిచయంచేసే సరికొత్త ప్రక్రియను నెత్తికెత్తుకోవడం ఒక్క మిసిమి వంటి పత్రికకే సాధ్యం.
ఇన్నయ్య కేవలం  రచయిత మాత్రమే అయితే ఈ రచనల తరహా మరోరకంగా సాగివుండేది. ఆయన గొప్ప  మానవతావాది. పైగా  కరుడుగట్టిన హేతువాది. తను నమ్మిన సిద్ధాంతాలను తాను మొండిగా నమ్మడమే కాదు ఇతరులను కూడా నమ్మించాలని శక్తివంచన లేకుండా శ్రమిస్తుండడం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణం. ఈ స్వభావం ఆయనకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. దానితో పాటు అభిమానులను అదే సంఖ్యలో విమర్శకులను సంపాదించిపెట్టింది.
ఇన్నయ్య దేవుడిని నమ్మరు. నమ్మని వాళ్లు చాలామంది వుంటారు. కానీ ఇన్నయ్య అంతటితో దేవుడిని వదలరు. వెంటబడి మరీ దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు. అది అంత అవసరమా అని అడిగే మిత్రులం కొంతమందిమి ఆ దేవుడి దయవల్ల ఇప్పటివరకూ ఆయనతో స్నేహాన్ని కొనసాగించగలుగుతున్నాము. (‘నీవు దేముడితో మాట్లాడితే ప్రార్ధన అంటారు. దేవుడు నీతో మాట్లాడాడంటే పిచ్చి అంటారు’ అనే థామస్ సాజ్  ధర్మసూక్ష్మాన్ని ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నారు.)
జీవన ప్రమాణాలకు శాస్త్రీయ విజ్ఞానం తోడ్పడాలని ఆయన కోరుకుంటారు. మానవీయ విలువలను మూఢ నమ్మకాలతో అణగదొక్కరాదు అన్నది ఆయన సిద్ధాంతం.
ఇక పుస్తకం విషయానికి వస్తే – ఇది ఆషామాషీగా చదివిపక్కన పడేసే పుస్తకం కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులయిన అనేకమంది రచయితల జీవన రేఖలను ఆయన ఇందులో స్పృశించారు. అలాగే, అనామకులని  అనలేం కాని,సాధారణ  జనాలకు అంతగా పరిచయంలేని రచయితల గురించి, వారి రచనలు గురించీ ఇన్నయ్య రాసిన విమర్శనాత్మక వ్యాసాలూ ఇందులో వున్నాయి.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన పదిమంది మేధావులను ఎడ్వర్డ్ షిల్జ్ అనే సోషియాలజిస్ట్ ఎంపికచేసి రాసిన వ్యాసాలను ఆయన మరణానంతరం ప్రచురించారు. రేమండ్ ఆరన్, సిడ్నీ హుక్, రాబర్ట్ మేనార్క్ హచిన్స్, లె పోల్ద్ లబెజ్, హరాల్డ్ లా స్కీ, కార్ల్ మన్ హమ్, ఆర్నాల్దో డాంటెమొమిగ్లయానో, జాన్ యు నెఫ్, లియోజీ లార్డ్ ల వ్యక్తిత్వ విశేషాలను ఇన్నయ్య తేటతెలుగులో తెలియచేసారు. షిల్జ్ మహాశయులవారు ఉదహరించిన ఆ పదిమంది మేధా వులలో మన దేశానికి చెందిన నిరాద్ సి. చౌదరి వుండడం విశేషం.
అందరికీ తెలియని విషయాలు కూడా  కొన్ని ఇందులో వున్నాయి. ఉదాహరణకు సుభాష్ చంద్ర బోస్ బెర్లిన్ లో వున్నప్పుడు ‘సినార్ మజహే’ అనే గుప్తనామంతో చలామణి అయ్యేవారట. ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది ఎం ఎన్ రాయ్ అసలు పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య అనీ, ఆయన భార్య ఎవిలిన్ ట్రెంట్ ఆయనతో విడిపోవడానికి ముందు - ఇండియాలో ఒక్కమారుకూడా అడుగుపెట్టకుండానే అనేక సంవత్సరాలపాటు భారత స్వాతంత్ర్య విప్లవ పోరాటానికి దోహదం చేశారనీ ఇన్నయ్య రాశారు.
చక్కటి రచనలు అతి చక్కగా అచ్చు వేసిన ఖ్యాతి ప్రచురణకర్తలది. కాకపొతే, అక్కడక్కడా ముద్రారాక్షసాలు పంటికింద రాయిలా పుస్తక పఠనానికి అడ్డుతగులుతున్నాయి. (పేజీ 33 – ఒకయాన –ఒకాయన) ఇలాగే మరికొన్ని. కాకపొతే ఇంతటి బృహత్తర ప్రయత్నం ముందు అవి ఎన్నదగ్గవి కాదు. - భండారు శ్రీనివాసరావు
(09-10-2012)

కామెంట్‌లు లేవు: