12, అక్టోబర్ 2012, శుక్రవారం

ఒరులేయవి యొనరించిన


ఒరులేయవి యొనరించిన  
1997 లో 28  ఏళ్ళ ఓ యువకుడిని సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ప్రేమించి పెళ్ళాడినప్పుడు ఆ కుటుంబం సంగతి యేమో కాని దేశం యావత్తు నివ్వెరపోయింది. అంతకు 52 ఏళ్ళ క్రితమే  1942 లో జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని తండ్రి  అభీష్టానికి వ్యతిరేకంగా  పార్శీ కుటుంబానికి చెందిన   ఫిరోజ్  గాంధీని (వాస్తవానికి జాతిపిత మహాత్మా గాంధీకి ఈ ఫిరోజ్ గాంధీకి ఎలాటి బంధుత్వం లేదు) పరిణయం ఆడిన దగ్గరనుంచి ఇలాటి వివాహాలకు ఆ కుటుంబం బాగా అలవాటు పడిపోయిందనే చెప్పాలి. తదనంతర కాలంలో రాజీవ్ గాంధీ ఇటలీ వనిత సోనియాను, అతడి తమ్ముడు సంజయ్ గాంధీ,  మేనకా (మనేకా) గాంధీని పెళ్ళిచేసుకుని తమ తలిదండ్రుల సంప్రదాయాన్ని కొనసాగిస్తే, సోనియా గారాలపట్టి ప్రియాంక గాంధీ రాబర్ట్ వాద్రా ను పెళ్ళాడి  మూడో తరంలో కూడా ప్రేమ వివాహాల వొరవడిని మరింత  ముందుకు తీసుకువెళ్ళింది. ఆమె తమ్ముడు రాహుల్ గాంధీ మాత్రం ప్రేమ వివాహం మాట సరే  అసలు పెళ్ళిమాటే తలపెట్టడంలేదు.


రాబర్ట్ వాద్రా

ఇక ప్రస్తుతానికి వస్తే, రాబర్ట్ వొధేరా అనాలో రాబర్ట్ వాద్రా అని పలకాలో ప్రియాంకాతో పెళ్లినాటికి  ఎవరికీ  అంతుపట్టని ఆ  వ్యక్తి ఈనాడు మీడియా దృష్టిని  ప్రముఖంగా ఆకర్షిస్తున్నాడు.  నిజానికి అతడీనాడు అంత అనామకుడేమీ కాదు. దేశ రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి, యూపీయే అధినాయకురాలు అయిన సోనియా గాంధీకి స్వయానా ఇంటల్లుడు కావడం, భావిభారత ప్రధాన మంత్రిగా చూడాలని  కాంగ్రెస్ పార్టీ  శ్రేణులన్నీ కోరుకుంటున్న  రాహుల్ గాంధీ అనుంగు సోదరి ప్రియాంక గాంధీని మనువాడడం కూడా అతడికింత ప్రచారం రావడానికి  కారణాలు కావచ్చు.  అయితే,  హమేషా మీడియా దృష్టి పడే కుటుంబానికి చెందినవాడే కాని మీడియా దృష్టిపెట్టాల్సినంత మనిషి కాదు రాబర్ట్ వాద్రా.  అయినా కానీ,  ఈనాడు  అందరి దృష్టీ అతడిపైనే వుంది. దీనికి కారకుడు ఎవరయ్యా అంటే,  ఇంకా  పేరు పెట్టని ఓ రాజకీయ పార్టీని కొత్తగా పెట్టిన కేజ్రీవాల్. అవినీతి వ్యతిరేక ఉద్యమనేత  అన్నా హజారే బృందంలో వుంటూ, ఇటీవలే  రాజకీయ అరంగేట్రం చేసిన కేజ్రీవాల్  ఆ  వెనువెంటనే ప్రయోగించిన తన తొలి ఆరోపణాస్త్రాన్ని  నేరుగా  రాబర్ట్ వాద్రా  మీదికే సంధించడంవల్లనే  ఇప్పుడు  వాద్రా  పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.
1969 లో జన్మించిన రాబర్ట్ వాద్రా పెద్ద  శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చినవాడేమీ కాదు. తండ్రి రాజేంద్ర వాద్రా ఒక సాధారణ వ్యాపారి. కొయ్యతో, ఇత్తడితో చేసిన బొమ్మలను, వస్తువులను విక్రయించే వ్యాపారం. తల్లి మౌరీన్ స్కాటిష్ జాతీయురాలు. ప్రియాంకాతో పెళ్ళయిన తరువాత రాబర్ట్ కు తండ్రితో పొసగలేదు. ఒక దశలో తండ్రికీ తనకూ సంబంధం లేదని పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడు.
ఇక ఈ వివాదంలో చిక్కుకున్న మరో వ్యక్తి  కుశ్ పాల్ సింగ్. తన  మామగారినుంచి దక్కిన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం తన శక్తియుక్తులన్నీ ఉపయోగించాడు. మామ రఘువేంద్ర సింగ్ స్తాపించిన డీ.ఎల్.ఎఫ్. సంస్థ నస్తాల వూబిలో కూరుకుపోయివున్న ఒక  దశలో కుశ్ పాల్ సింగ్ అందులో  తన వాటాలను అమ్ముకోవాలని కూడా అనుకున్నారు. కానీ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్  గాంధీతో యాదృచ్చికంగా జరిగిన పరిచయం  కుశ్ పాల్ సింగ్ జీవితాన్ని సమూలంగా మార్చివేసింది. సింగ్ వ్యాపారాన్ని ఆకాశం అంచులకు తాకించింది. ఫలితంగా ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో ఆయన పేరు చేరింది. రాజకీయ ప్రాపకం వుంటే ఏదయినా సాధ్యం అని  కుశ్ పాల్ సింగ్ నిరూపించాడు. అత్యంత సంపన్నుడయిన సింగ్,  అత్యంత రాజకీయ ప్రాపకం వున్న రాబర్ట్ నడుమ వ్యాపార సంబంధాలు బలపడడంలో ఆశ్చర్యం లేదు. వారిరువురి  మధ్యా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో  సాగిన ఆర్ధిక లావాదేవీలనే  కేజ్రీవాల్ బయటపెట్టి సంచలనం సృష్టించారు. 
      
ఇంతకీ కేజ్రీవాల్, రాబర్ట్  వాద్రాపై ఎక్కుబెట్టిన బాణంలో పదునెంత? అది కలిగించే ప్రభావం యెంత? అనే విషయంపై మీడియాలో ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. వాద్రా సోనియా కుటుంబానికి చెందిన వ్యక్తి కాక పోతే కేజ్రీవాల్ చేసిన  ఆరోపణలకు ఇంతటి  ప్రచారం లభించి వుండేది కాదని భావించేవారు కూడా లేకపోలేదు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో డి.ఎల్.ఎఫ్  అనే ఓ  బడా  సంస్థకు  లాభం లేదా మేలు జరిగేలా సోనియా అల్లుడిగా రాబర్ట్ వాద్రా పలుకుబడి ఉపయోగపడిందని, దానికి ప్రతిఫలంగా వాద్రాకు డి.ఎల్.ఎఫ్. కొన్ని కోట్లు విలువచేసే  ఆస్తులను కట్టబెట్టిందని  కేజ్రీవాల్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో వున్న డి.ఎల్.ఎఫ్. సంస్థ, అరవై ఐదుకోట్ల రూపాయల  వడ్డీలేని, పూచీకత్తు అవసరం లేని రుణాన్ని  రాబర్ట్ వాద్రాకు ఇచ్చిందన్నది కేజ్రీవాల్ సంధించిన మొదటి అస్త్రం. వ్యాపార లావాదేవీల్లో  డబ్బు సర్దుబాట్లు చేసుకోవడం నేరం కాకపోవచ్చు. కానీ, ఇంతపెద్ద మొత్తాలు చేతులు మారుతున్నప్పుడు ఆ విషయం ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా జరగడానికి అవకాశం వుండదు. అయినా ఆ శాఖ మిన్నకుండా వున్నదంటే కచ్చితంగా రాబర్ట్ వాద్రా సోనియా కుటుంబంలో సభ్యుడు కావడమే కారణమని కేజ్రీవాల్ అభిప్రాయపడుతున్నారు.
ఆయన అంతటితో ఆగలేదు. మరికొన్ని ఆధారాలతో కూడిన కొత్త ఆరోపణలు చేశారు. నేను నీకీ పని చేసిపెడతాను. ప్రతిఫలంగా నువ్వు నాకు ఇది చేసిపెట్టు అనే పద్ధతిలో (ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని క్విడ్ ప్రోకొ  అని సంక్షిప్తంగా పేర్కొంటున్నారు) డీ.ఎల్.ఎఫ్.,  వాద్రాల  నడుమ అనేక రకాల  లావాదేవీలు సాగాయని కేజ్రీవాల్ వాదన.
అవినీతిని నిర్మూలించే  విషయంలో స్వపర భేదాలు లేకుండా సొంత పార్టీవారిని సైతం జైలు వూచలు లెక్కబెట్టిస్తున్నామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలకు ఈ వివాదం కొరుకుడు పడడం లేదు. సాక్షాత్తు పార్టీ అధినేత్రి అల్లుడిపై గురిపెట్టిన ఈ కొత్త సంకటం నుంచి యెలా బయటపడాలన్నది వారికి సవాలుగా మారింది. అయితే నూటపాతికేళ్ల ఘన చరిత్ర వున్న పార్టీ కాబట్టి తొందరగానే తేరుకుని ఎదురు దాడి మొదలు పెట్టింది. తమ అధినాయకురాలిపై  ఈగ వాలితేనే  సహించలేని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు ఒక్కుమ్మడిగా లేచి,  రాబర్ట్ వాద్రాపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. ఆధారరహిత ఆరోపణలుగా కొట్టివేస్తూ కేజ్రీవాల్ వెనుక బీజేపీ ప్రచ్ఛన్న హస్తం వుందని ప్రత్యారోపణ చేస్తున్నాయి. ఈ ఎదురుదాడి బృందంలోని  కాంగ్రెస్ అధికార ప్రతినిధులతో కర్నాటక గవర్నర్ గా వుంటున్న   హెచ్.కె. భరద్వాజ్ సైతం   స్వరం కలపడం విచిత్రంగా వుంది.
కేజ్రీవాల్ ఆరోపణలపై కేంద్ర మంత్రి చిదంబరం స్పందన మరింత విడ్డూరంగా వుంది.
ప్రైవేటు లావాదేవీలపై కేంద్రం దర్యాప్తు చేయబోదని ఆయన చెబుతున్నారు. తనదాకా వస్తే కాని నొప్పి తెలియదన్నట్టు,  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ విషయంలో క్విడ్ ప్రోకో  అంటూ విచారణ జరుపుతున్న సంగతిని మర్చిపోయి చిదంబరం మాట్లాడుతుండడం విశేషం. జగన్ కేసు విషయంలో ఒకరకంగాను, వాద్రా కేసులో మరో రకంగాను వ్యవహరించడాన్ని జనం గమనించరని అనుకుంటే పొరపాటు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చక్కని అవకాశం. రాజకీయ ప్రత్యర్ధులను తొక్కిపట్టివుంచడానికి,  ఎగర్తించేవారిని మెడలు వంచి  కాడి కిందికి తేవడానికి కేంద్రంలోని యూ.పీ.ఐ. ప్రభుత్వం    సీ.బీ.ఐ. ని ఒక పనిముట్టుగా  వాడుకుంటోదన్న అపవాదును తిప్పికొట్టడానికి ఇది ఒక మహత్తర అవకాశం. ఎంతవారలయినా చట్టం ముందు సమానులే అని వల్లిస్తున్న చిలక పలుకుల్లో ఎలాటి డొల్లతనం లేదని నిరూపించుకోవడానికి ఇదే మంచి తరుణం.  భవిష్యత్తులో, ఏ ఒక్కరూ, రాజకీయ అధికారాన్నికాని, అధికార కేంద్రంతో తమకున్న  సంబంధాలను కానీ అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని, ప్రజల సంపదను నిర్లజ్జగా కొల్లగొట్టే  సాహసం చేయకుండా వుండాలంటే రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలను రాగద్వేషాలకు అతీతంగా విచారించి నిగ్గుతేల్చడం కాంగ్రెస్ పార్టీకి ఒక చారిత్రిక అవసరం. 
నన్నయ మహాభారతంలో ఒక పద్యం వుంది.
‘ఒరులేయవి యొనరించిన  
నరవరయప్రియము తన మనంబునకగుదా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమధర్మపధములకెల్లన్’ -    
‘ఎవరు ఏమి చేస్తే నీకు అప్రియం అనిపిస్తుందో అదే పని నీవు ఇతరుల విషయంలో చేయకు’ అన్నది దాని తాత్పర్యం.
దీన్ని కొద్దిగా మార్చితే ప్రస్తుత రాజకీయ నాయకులకు అన్వయిస్తుంది. చట్టాన్ని అమలుచేయడంలో సమ్యక్ దృష్టి వుండాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని తేలిగ్గా చెప్పడం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాల్సిన బాధ్యత కూడా పాలకులపై వుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.(12-10-2012)

8 కామెంట్‌లు:

Dileep.M చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dileep.M చెప్పారు...

Not mentioned about PIL??

అజ్ఞాత చెప్పారు...

మీరు చెప్పిన పద్యం చేతకాని వాళ్ళకి అన్వయించేదండి! :)

Rao S Lakkaraju చెప్పారు...

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని తేలిగ్గా చెప్పడం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోయేలా చూడాల్సిన బాధ్యత కూడా పాలకులపై వుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
----------------
చక్కగా గట్టిగా మంచి మాట చెప్పారు.

అజ్ఞాత చెప్పారు...

చిదంబరం నిర్లజ్జ బుకాయింపు, మన్మోహన్ సింగ్ RTI మీద చూపిన అసహన సణుగుడుచూస్తే ఎంతగా కాంగ్రెస్ దిగజారిపోయిందో తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తుల పై ఆరోపణలకు కాంగ్రెస్ మినిస్టర్ ఎదవలు ఎందుకు మొరగడం అన్నది చిదంబరుడికే తెలియాలి. జగన్ ప్రైవేటే, సత్యం రాజు, హర్షద్ మెహతాలు ప్రైవేటే.

జగన్ ఈ విషయాన్ని లేవనెత్తి కాంగ్రెస్ మెడలు వంచి బెయిల్‌తో బయటికి వస్తాడేమో.

Murthy K v v s చెప్పారు...

ఏ రాజకీయ పార్టీ అధికారంలో వుంటే వాళ్ళు , వాళ్ళ బంధువులు ప్రజా ధనాన్ని దోచుకోవడం మన దేశం లో ఓ సాంప్రదాయంగా మారి పోయింది...పత్రికలు ఇతర పార్టీలు తమ strategy లో భాగంగా కొన్నాళ్ళు అలా గోల చేస్తాయి.ఆ తరవార అందరూ మర్చిపోతారు.వంద రూపాయలు లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యొగిని ప్రజలు కొట్టి నిలదీయడానికి వెనుకాడరు.కాని కోట్లాది రూపాయిల్ని కొల్లగొట్టే బడా politicins జోలికి ఏ ప్రజలూ వెళ్ళరు.ఆ చైతన్యం పెరిగినపుడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్ధం ఉన్నట్టు లెక్క.

Kalluri Bhaskaram చెప్పారు...

శ్రీనివాసరావు గారు, మీ బ్లాగ్ చూస్తున్నాను. తాజా విషయాలు చర్చిస్తున్నారు. 'ఒరులేవి...' వ్యాసానికి సంబంధించి చిన్న సూచన. ఆ పద్యం తిక్కనదని నా అనుమానం. ఒకసారి పరిశీలించగలరు.
కల్లూరి భాస్కరం

Kalluri Bhaskaram చెప్పారు...

శ్రీనివాసరావు గారు, మీ బ్లాగ్ చూస్తున్నాను. తాజా విషయాలు చర్చిస్తున్నారు. 'ఒరులేవి...' వ్యాసానికి సంబంధించి చిన్న సూచన. ఆ పద్యం తిక్కనదని నా అనుమానం. ఒకసారి పరిశీలించగలరు.
కల్లూరి భాస్కరం