15, జులై 2012, ఆదివారం

‘ఈగ’ ఖరీదు‘ఈగ’ ఖరీదు
‘ఈగ’ ఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది  వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి.హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబసభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన,  సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ ‘కొత్త సినిమా ప్రేక్షక వర్గంలో’ చేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సక్రుత్తు గా జరిగే విషయం.
నిన్న శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా  పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ‘ఈగ’ సినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ‘ఈగ’ వీక్షణానంతరం ‘సాయి’ వాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్  మెసేజి. ‘ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంత’ అంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను,  ఆ కార్డుకు  ‘యాడాన్’  కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ ‘యేమయిందంటూ’ తన తరహాలో గుడ్లురిమి చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరిచేతిలో చావకుండా ‘ఇప్పుడేంచేయాల’న్న ప్రశ్నను మాముందుంచి తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ‘ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు,   ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేద’న్న ‘ఈగ’ సినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నది’ ఆ ఎలర్టు సారాంశం.
ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగ’ సినిమా బడ్జెట్ పదికోట్లనుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న  తరుణంలో ‘రాచ పీనుగ తోడు లేకుండా  కదలదు’ అన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావుకబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం ఎమర్జెన్సీ యమర్జెంటుగా ప్రకటించేసుకున్నాం.   తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ,  సెల్ ఫోన్లతో మరికొందరూ,  లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండి’ అనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా  పాటించే పనిలో పడ్డాం.  ఆ కంగారులో ‘యాడాన్’ కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం.  దరిమిలా,  ‘మూడు వర్కింగు  డేస్ నుంచి  పదిహేను దినాలలోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామ’ని – మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు.
‘అమ్మయ్య’ అని అనుకుంటున్న  సంతోషం కాస్తా కాసేపటిలోనే  ఆవిరావిరయిపోయింది.
అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ  లేదు, జేబులో  కార్డూ లేదు’ అనే పాత  రోజులకన్న మాట.
ఇంతకీ, ‘ఈగ’ సంగతేమిటంటారా!  ‘ప్రధమ కబళే మక్షికాపాతః’ అన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ‘ఈగ’ ను కమ్మేసింది.
ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. ‘సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’  సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే  రైట్ అనుకోవాలి. అయితే-
విలన్ని  ఓసారి ‘ఈగ’  చంపేసినట్టుగా చూపించిన తరువాత కధానాయిక  కాల్చిన బాణసంచాలో ‘పని పూర్తయింది’ అనే సందేశం కనిపిస్తుంది. అక్కడితో సినిమా ఆపేసివుంటే బాగుండేదని నాకనిపించింది. అట్టే సినిమాలు చూడని నా అభిప్రాయం కరెక్టని నేనూ అనుకోవడం లేదు. బహుశా బడ్జెట్ ముప్పయి కోట్లని అంటున్నారు కదా. దానికోసం సినిమా నిడివి పెంచారేమోనని మాత్రం అనుకుంటున్నాను. (15-07-2012)

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

oh so sorry for lose of ur card sir...