6, జులై 2012, శుక్రవారం

మరో ఆకాశ ‘వాణి’ మూగబోయింది


మరో ఆకాశ ‘వాణి’ మూగబోయింది
‘ఆకాశవాణి విజయవాడ కేంద్రం – ప్రాంతీయ వార్తలు చదువుతున్నది – కొప్పుల సుబ్బారావు’
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రతిరోజూ ఉదయం ఆరూ నలభయ్ అయిదు కల్లా ఠంచనుగా వినిపిస్తూ వస్తున్న స్వరం నిన్న గురువారం రాత్రి  శాశ్వితంగా మూగబోయింది.
విజయవాడ కేంద్రంలో న్యూస్ రీడర్ ఉద్యోగంలో చేరకముందు కూడా సుబ్బారావు న్యూస్ రీడరే. చేరిన తరువాత న్యూస్ రీడరే. ఉద్యోగ విరమణ అనంతరం కూడా న్యూస్ రీడరే. తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివినప్పుడూ అదే నిబద్ధత. ఉద్యోగం శాశ్వితమై, చకచకా మెట్లెక్కి పై మెట్టు చేరుకున్న తరువాత కూడా వార్తలు చదవడం అంటేనే అతడికి ఇష్టం. అరవైయేళ్ళు నిండి ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా వార్తలు చదవడానికే అతడిష్టపడ్డాడు. బహుశా, గుండె జబ్బు రాకుండా వుంటే, అతడలా వార్తలు చదువుతూనే వుండేవాడేమో.
తలలో నాలుక అంటే సుబ్బారావే అని అతడి సహోద్యోగులు చెబుతుంటారు. సాధారణంగా ఉద్యోగంలో హోదాలు పెరుగుతున్నకొద్దీ, అంతకు ముందు చేసిన ఉద్యోగం పట్ల చిన్న చూపు కలిగివుండడం కద్దు. కానీ, కొప్పుల సుబ్బారావు తరహానే వేరు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆయన అడ్డా ఆకాశవాణే! వార్తా విభాగంలో పనిలేకపోతే, మరో విభాగంలో ప్రత్యక్షం. అక్కడి వారికి, అడగకుండానే, డబ్బింగులో సాయపడడం అతడి నైజం. డబ్బింగు ప్రస్తావన వచ్చింది కాబట్టి సుబ్బారావు గురించి మరో కోణాన్ని గుర్తు చేసుకోవాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించిన అనేక కార్యక్రమాలకు జాతీయ స్తాయిలో పురస్కారాలు లభించాయి. వాటిల్లో చాలా వాటికి డబ్బింగు బాధ్యత నిర్వహించింది సుబ్బారావే అన్న సంగతి చాలామందికి తెలియదు. ఎందుకంటే అతడు పేరు కోసం ఎప్పుడూ చూసుకోలేదు. పని మీదనే దృష్టి.
కొప్పుల సుబ్బారావుతో కలసి విజయవాడ ఆకాశ వాణి కేంద్రంలో న్యూస్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్వీవీ కృష్ణారావు గారు సుబ్బారావుతో తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.
‘విజయవాడలో దాదాపు పదకొండేళ్లపాటు కలసి పనిచేశాము. సుబ్బారావుకు ఆఫీసే సర్వస్వం. స్టుడియో లో అడుగుపెట్టేముందు బయటనే చెప్పులు వొదిలేసి వెళ్ళేవాడు. ఒక్కరోజు కూడా ఈ నియమాన్ని దాటలేదు. వార్తలు చదివే గదే అతడికి గుడి. వృత్తిపట్ల అంతటి నిబద్ధతత వున్న ప్రభుత్వ ఉద్యోగిని నేను చూడలేదు. అలాగే, తనకు సాయం చేసిన వారిని ఎన్నడూ మరచిపోయేవాడు కాదు. అతడు ఆకాశవాణిలో ప్రవేశించడానికి అప్పటి డైరెక్టర్ బాలాంత్రపు రజనీకాంత రావు గారు మాట సాయం చేశారన్నది అతగాడి నమ్మకం. అందుకు కృతజ్ఞతగా తన కుమార్తెకు ‘రజని’ అని పేరు పెట్టుకున్నాడు.’
సుబ్బారావు మరణవార్త విని ఈ ఉదయం  ఫోనులో కృష్ణారావు గారు చెప్పిన మాటలివి.
అతను పనిచేసేది విజయవాడలో. నేనేమో  హైదరాబాదు రేడియోలో. ఉదయం, మధ్యాహ్నం వార్తలకోసం ఫోను చేసేవాడు. అడిగినప్పుడల్లా ఏదో ఒక వార్త లేదనకుండా చెప్పేవాడిని. అంతే! దాన్ని యధాతధంగా రాసుకుని ముక్కునపట్టి ఒప్పచెప్పినట్టు వెంటనే వార్తల్లో చదివేసేవాడు.  
హైదరాబాదు ఎప్పుడు వచ్చినా వెంటనే నాకు ఫోను చేసేవాడు. ఏమాత్రం వీలున్నా వచ్చి కలిసి వెళ్ళేవాడు. గత పాతికేళ్ళుగా మా నడుమ ఈ సంబంధం కొనసాగుతూ వచ్చింది.
అదేమిటో మొన్నీ మధ్య హైదరాబాదు వచ్చాడట. ఫోను చేయలేదు. వచ్చి కలవ లేదు.
ఎందుకంటే అతడు హైదరాబాదు రాలేదు. తీసుకువచ్చారు.
నన్ను కలవలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చేర్చారు.
ఇక కలవడు కూడా. ఎందుకంటే కలవలేనంత దూరతీరాలకు తరలిపోయాడు.
అతడు రాలేడు.  నేనే వెళ్ళాలి.
(కలసి ఎప్పుడూ పని చేయకపోయినా, మనసు కలిపి స్నేహం చేసిన  కొప్పుల సుబ్బారావుకు ఆత్మశాంతి కలగాలని మనసారా కోరుకుంటూ – భండారు శ్రీనివాసరావు)
(06-07-2012)  

13 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఈ వారమంతా వరుసగా చేదు వార్తలేనండి.

Unknown చెప్పారు...

రేడియో విన్న ఎవ్వరూ ఆయన పేరునీ ఆ కంఠాన్నీ మరచిపోలేరు.
ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ...

అజ్ఞాత చెప్పారు...

ఆకాశవాణి దూరదర్శన్లకు ఐకాన్‌లాంటివారంతా ఒక్కక్కరుగా మాయమైపోతున్నారు!! ప్రగాఢ సానుభూతి తెలియచేయడం తప్ప ఏమి చేయగలం?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@kastephale,చిన్నిఆశ,అజ్ఞాత- అందరికీ ఆకాశవాణి కుటుంబం తరపున ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

Rao S Lakkaraju చెప్పారు...

హైదరాబాదు ఎప్పుడు వచ్చినా వెంటనే నాకు ఫోను చేసేవాడు. ఏమాత్రం వీలున్నా వచ్చి కలిసి వెళ్ళేవాడు.
గత పాతికేళ్ళుగా మా నడుమ ఈ సంబంధం కొనసాగుతూ వచ్చింది.

అదేమిటో మొన్నీ మధ్య హైదరాబాదు వచ్చాడట. ఫోను చేయలేదు. వచ్చి కలవ లేదు.
ఎందుకంటే అతడు హైదరాబాదు రాలేదు. తీసుకువచ్చారు.
నన్ను కలవలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చేర్చారు.
ఇక కలవడు కూడా. ఎందుకంటే కలవలేనంత దూరతీరాలకు తరలిపోయాడు.
అతడు రాలేడు. నేనే వెళ్ళాలి.
---------------------
చక్కటి ముగింపు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rao S Lakkaraju - అనుబంధం అలా రాయించింది. అంతే. ధన్యవాదాలు రావు గారు. -భండారు శ్రీనివాసరావు

సుధామ చెప్పారు...

కదిలించేదిగావుంది.కొప్పులకు శ్రద్ధాంజలి.

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

అరెరె.....ఎంతటి విషాద వార్త..... పోయినోళ్ళందరూ మంచోళ్ళనీ, మంచోళ్ళే ఈ లోకం నుండి శలవు తొందరగా పుచ్చుకుంటారనీ ఒక సత్యం......స్వర సుధాకరులైన వారికి ఎంతో బాధతో శ్రద్ధాంజలి ఘటిస్తూ

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఏళ్ళ తరబడి అలవాటైన స్వరం. ఇక వినలేం అనుకుంటే..బాధగా ఉంది. వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్దిస్తూ..
:((

nandiraju rk చెప్పారు...

మీకు ఇన్ని చదివి, వాటిని తెనుగీకరించే సమయం ఎక్కడుందండీ బాబూ..

Dr.Y.Bala Murali Krishna చెప్పారు...

I deeply regret the demise of our friend Koppula Subbarao.I still remember the devotion and professionalism with which he used to read news in the AIR-Vijayawada. The modern generation of readers should learn a lot from him. I used to compulsorily monitor the news bulletins of Subbarao and of Prayaga Ramakrishna who made a distinction in rendering the news in their inimitable style. when I was working in Vijayawada with UNI,I used to regularly meet him at the station. May his sol rest in peace.
Dr.Y.Bala Murali Krishna-Hyd.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Balamurali Krishna - Thanks balu. Where are you. I hope your mobile number is same 885319500 ? - Bhandaru Srinivas Rao b(9849130595)

srini చెప్పారు...

first time i am reading your blog articles, very nice and informative. Sad to miss Sri Koppula in body but his voice is in our hearts till we die. Like Sri Ramana Maharshi Says, we have to become spectators for many incidents, practically we can not do much or more than that.