7, ఏప్రిల్ 2011, గురువారం

సర్వము తానె అయినవాడెవ్వడు? – భండారు శ్రీనివాసరావు


సర్వము తానె అయినవాడెవ్వడు? – భండారు శ్రీనివాసరావు"స్వామి క్షేమం గురించి ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామికి ఎలాటి ఆపదా రాదు. ఒకవేళ అలాటి ఆపదలు సంభవిస్తే స్వామే స్వయంగా వాటినుంచి చెక్కుచెదరకుండా బయటపడగలరు. అందుచేత ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. విచారించాల్సిన అవసరం లేదు. స్వామే అన్నీ సాధించుకుంటూ వస్తాడు. అన్నింటినీ నెగ్గుకుంటూ వస్తాడు. అయినప్పటికీ, పాంచభౌతికమయిన శరీరానికి కొన్ని అవస్తలు తప్పవు. ఆహారం,పరిసరాలు దేహంలో ఎన్నో మార్పులు తెస్తాయి.భౌతికమయిన దేహంలో ఎన్నో జరగవచ్చు. అయితే, ఇవన్నీ తాత్కాలికం. శాశ్వితం కాదు. అంచేత స్వామి మీరంతా ధైర్యంగా వుండాలని కోరుకుంటాడు.

"ఇంతకీ నా మెడిసిన్ ఏమిటి? భక్తులు నాకోసం మనస్పూర్తిగా చేసే ప్రార్ధనలే నా మెడిసిన్. నాకోసం, అది మద్రాస్ కావచ్చు, హైదరాబాదో, ముంబయ్యో, బెంగుళూరో ఏ నగరమయినా కావచ్చు – అక్కడి భక్తులందరూ నా కోసం ప్రార్ధనలు చేశారు. భజనలు చేశారు. నామస్మరణలు చేశారు. తపస్సులు చేశారు. యజ్ఞాలు చేశారు. వారు చేసిన ప్రార్ధనల ఫలితంగానే నేనీనాడు మీ ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడుతున్నాను.

"ఈ శరీరం ఇలా బాధ పడాలని నేను కోరుకోలేదు. అలాగని ఇలా బాగుపడాలని కూడా అనుకోలేదు. మీరు మీ ప్రార్ధనల ద్వారా దీన్ని సాధించారు. ఇలా జరగాలని ఆశించిందీ మీరే. కోరుకున్నదీ మీరే. ఈ దేహం నాది కాదు. మీదే. దీన్ని  మీరే కాపాడుకోవాలి. అది మీ బాధ్యత.

"నేను దేహాన్ని కాదు. నేను దేహిని మాత్రమే. దేహం పాంచభౌతికం. దేహి నిరామయుడు.

"ఈ దేహాన్ని రక్షించడం కోసం డాక్టర్లు ఎన్నో చేశారు. ఎంతో కష్టపడ్డారు. వారు తమ విద్యుక్తధర్మాన్ని చక్కగా నిర్వర్తించారు.  అయితే, నేను మాత్రం ఈ దేహాన్ని గురించి ఎంతమాత్రం ఆలోచించలేదు. దేహం పట్ల మమకారం పెంచుకోకూడదన్న మంచి భావనను నేను నిరూపించదలిచాను. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా నేను పదేపదే ఇదే చెబుతూ వస్తున్నాను. దేహం పట్ల అభిమానాన్ని తగ్గించుకోండి. క్రమంగా మీ దేహాభిమానాన్ని తగ్గించుకోండి. ఆత్మాభిమానాన్ని పెంచుకోండి. మీ దేహం మీది కాదు. ఆత్మకు మీరు ప్రతిరూపం. ఈ శరీరం పుడుతుంది. పెరుగుతుంది. ఏదో ఒకనాడు కాలగర్భం లో కలసిపోతుంది. బాధలు, క్లేశాలు అన్నీ దేహానికే. ఆత్మకు కాదు.

"నాకున్న దైవ శక్తిని  నా దేహాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నడూ వాడుకోలేదు. అలా చేయాలనుకుంటే నాకు క్షణం పట్టదు. నా దైహిక బాధలను నేను లిప్త కాలంలో మాయం చేసుకోగలను. నన్ను నేను స్వస్తత పరచుకోవాలన్న స్వార్ధం నాకు లేదు. అలాటి స్వార్ధ భావన నాకు లేశమాత్రంగా కూడా లేదు. ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరు హాయిగా సంతోషంగా వుండాలి. ఇదొక్కటే నాకున్న స్వార్ధపూరితమయిన ఆశ. ఆలోచన.

"ఒక్కటి గుర్తుంచు కోండి. ఈ దేహం పాంచ భౌతికం. కాస్త అటూ ఇటూగా పంచ భూతాల్లో కలసిపోయేదే. కాని దేహంలో వున్న ఆత్మకు చావు పుటకలు లేవు. ఆత్మకు ఎలాటి భవబంధాలు వుండవు. నిజం చెప్పాలంటే, ఆత్మే పరమాత్మ."

(2003 సంవత్సరం జులై 13 వ తేదీన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయి బాబా చేసిన అనుగ్రహ భాషణం నుంచి ప్రొఫెసర్ జి.వెంకటరామన్ భద్రపరచిన కొన్ని భాగాలు, ఈ నాటి పరిస్తితులకు తగినట్టుగా వున్నాయన్న వుద్దేశ్యంతో బ్లాగులో పెట్టడం జరుగుతోంది. అప్పటికి స్వామి తన విరిగిన కాలుకు పెద్ద శస్త్ర చికిత్స చేయించుకోవడం జరిగింది. – భండారు శ్రీనివాసరావు)