రచనోద్ఘాతం
‘శ్రీనివాసరావ్!
నీ గురించి ఏదో అనుకున్నాకానీ,
నువ్వొక బిగ్ జీరోవి’
ఆంధ్రజ్యోతి
వారపత్రిక ఎడిటర్,
ప్రముఖ రచయిత,
ఇల్లాలి ముచ్చట్లు సృష్టికర్త పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు ఏమాత్రం మొహమాటం
లేకుండా నేరుగా నాతోనే అన్నమాట ఇది.
నార్లగారి
సంపాదకత్వంలో, నండూరి
వారి సారధ్యంలో నడుస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను సబ్ ఎడిటర్ గా
పనిచేస్తున్న రోజులవి. అంటే దాదాపు యాభయ్ అయిదేళ్ళ నాటి ముచ్చట.
పురాణం
గారు అలా అనగానే, నాకు
కాళ్ళకింది భూమి కదిలినట్టయింది. నిస్సత్తువ ఆవరించింది.
కానీ
ఆయన వెంటనే మరో మాట అన్నారు.
‘నువ్వు
జీరోవే! అయితే నువ్వు కుడి పక్కన వుంటే ఒకటి, రెండు,మూడు వంటి చిన్న అంకెల విలువ కూడా పెద్దగా పెరుగుతుంది. అలాంటివాడివి నువ్వు’
తటాలున
అన్న మాటను వెనక్కి తీసుకోలేక, నన్ను
సముదాయించడానికి అలా అని ఉంటారని నాకనిపించింది. ఏ ఉద్దేశ్యంతో అన్నప్పటికీ, పురాణం గారి మాట నాకు ఆస్కార్ తో
సమానం. అందుకే డెబ్బయ్ తొమ్మిదో ఏట రాస్తున్న నా ఈ జీవన కధనానికి ఈ శీర్షిక
ఎంచుకున్నాను.
ఆ
రోజుల్లో ఆయన ఏదో సినిమాకి కధో, మాటలో
రాస్తున్నారు. ఆ సినిమా తాలూకు వాళ్ళు బెజవాడ బీసెంటురోడ్డులోని మోడరన్ కేప్ లో ఒక
గది ఏర్పాటు చేశారు ఈ పనికోసం. సాయం రమ్మంటే సాయంత్రాలు ఆఫీసు పని కాగానే ఆయన
దగ్గరకు వెళ్ళేవాడిని. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ పురాణం గారు ఏదో చెప్పేవారు. ఆ చెప్పిన దాన్ని
కాగితంపై పెట్టడం నా పని, నన్నయ
భట్టారకుని వద్ద నారాయణ భట్టులా. నాకా షార్ట్ హ్యాండ్ తెలియదు. పురాణంగారి ఆలోచనల
ఉరవడి వరద గోదారిలా వుంటుంది. అంచేత తప్పనిసరిగా నా రాతలో తప్పులు దొర్లేవి.
సుదీర్ఘ కాలం ఎడిటర్ గా పనిచేసిన పురాణం గారికి నేను తప్పులతో సహా
దొరికిపోయేవాడిని. సహజంగానే కోపం వస్తుంది. అలాగే వచ్చేది. ఇదిగో ఇలాంటి ఒక
సందర్భంలో ఆయన అన్నమాట ఇది.
పురాణంగారి
మాట చలవో ఏమో కానీ, ఇన్నేళ్ళ నా జీవితంలో ఎందరెందరో నాకు పక్కన బాసటగా నిలబడి, నేను
జీరోగానే మిగిలిపోకుండా నన్ను పెద్దవాడిని చేశారు. నాకు లేని విలువని నాకు
కట్టబెట్టారు. వారందరినీ ఒక మారు స్మరించుకోవడం కూడా ఈ రచన లక్ష్యం.
నేనో
రచయితను కాను. నేనో సంపాదకుడిని కాను. పెద్ద అధికారినీ కాను. ఆ మాటకు వస్తే పెద్ద
జీతగాడినీ కాను. స్వయంకృషితో ఎదిగిన వాడిని కాదు. నిజం చెప్పాలంటే గాలివాటం బాపతు.
ఇక నిజజీవితానికి
వస్తే నాకు పాసు మార్కులు కూడా పడవు. రెండుసార్లు తప్పి, ముక్కుతూ మూల్గుతూ మూడోసారి బీకాం
డిగ్రీ తెచ్చుకున్నవాడిని. కొడుకుగా, భర్తగా, తండ్రిగా నేనో బిగ్ ఫెయిల్యూర్. మరి ఏముంది నా గురించి
రాసుకోవడానికి. ఒకవేళ రాసినా ఏముంటుంది ఎవరైనా చదవడానికి. అయితే ఇందుకు నాకు తోచిన కారణం ఒకటి, నా అనుభవానికి వచ్చిన
ఉదంతం రూపంలో చెబుతాను. ఏ జీవితమైనా అనుభవాల సమాహారమే కదా!
యాభయ్ ఏళ్ళ క్రితం రేడియోలో
వార్తలు చదివే రెగ్యులర్ న్యూస్ రీడర్లను ఎంపిక చేసేందుకు రాత
పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించాము. లిఖిత పరీక్షలో
నెగ్గినవారికి కొన్ని నమూనా వార్తలు ఇచ్చి స్టూడియోలోనే రికార్డ్ చేయించడం
జరిగింది. అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చిన నిర్ణేతల బృందానికి నేతృత్వం వహించిన నాటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ప్రసిద్ధ భాషావేత్త, భద్రిరాజు
కృష్ణమూర్తి గారు, ఇంటర్వ్యూకు వచ్చినవాళ్ళల్లో ఓ అమ్మాయి చదివిన వార్తల
రికార్డింగ్ ని పదికాలాలపాటు భద్రపరచమని సూచించారు. అంత బాగా చదివిందా అని మేము
ఆశ్చర్యపోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. వార్తలు ఎలా చదవకూడదో అన్నదానిని
బోధపరచడానికి ముందు ముందు అది
పనికొస్తుందన్నది ఆయన మాటల తాత్పర్యం.
అలాగే
ఒక మనిషి ఎలా జీవించకూడదో తెలుసుకోవాలంటే, అప్పుడప్పుడు నా వంటివారి జీవన చిత్రాలను కూడా పరిశీలించడం అవసరం.
అందుకోసమే ఈ రచనోద్ఘాతం.
తోకటపా:
శారీరకంగా,
మానసికంగా పటుత్వం తగ్గుతున్న దశలో మొదలు పెడుతున్న ప్రయత్నం ఇది. కొన్ని విషయాలు గుర్తు
చేయడానికి ఇన్నేళ్ళు ఈ జీరో కుడిపక్కన ఓ పెద్ద అంకెలా నిలబడ్డ మా ఆవిడ నిర్మల తోడు
ఇప్పుడు లేకపోవడం పెద్ద కొరత. అలాగే
ఒకప్పటి సంగతులను స్పురణకు తేవడంలో సహకరించిన నా మేనల్లుళ్ళు
తుర్లపాటి సాంబశివరావు,
కౌటూరి దుర్గాప్రసాద్,
కొలిపాక రాజేంద్ర ప్రసాద్ లు కూడా ఇప్పుడు లేరు. అలాగే కొందరు బాల్య స్నేహితులను
కూడా పోగొట్టుకున్నాను. ఏతావాతా చెప్పేది ఏమిటంటే, అన్నీ గుర్తు తెచ్చుకుని,
నాకుగా నేను తలకెత్తుకున్న ఈ బాధ్యతను
పూర్తిచేయాలనేది నా సంకల్పం. అయితే, గుర్తు చేసుకునే క్రమంలో కొన్ని విరామాలు, గుర్తుకువచ్చినవి
వెంటవెంటనే రాసే ప్రయత్నంలో కొన్ని
కప్పగంతులు, పాత ఫోటోల వేటలో కొంత కాలయాపనలు,
తప్పనిసరి.
నాకున్నది ఒక్కటే
రోగం. మతిమరపు. మెదడు మొత్తం ఖాళీ కాకముందే ఇది పూర్తిచేసి తీరాలి.
(ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే)
11-11-2024
(కార్తీక
సోమవారం)