5, ఏప్రిల్ 2024, శుక్రవారం

శాంతి స్వరూప్ ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

 “ఏంటి శాంతీ ఏమిటి కబుర్లు”

నా మాటలు విని నాతొ ఫోన్లో మాట్లాడుతున్న అవతల వ్యక్తి ఎవరో ఆడపిల్ల అనుకునే వారు నా పక్కన వున్నవాళ్ళు. పలానా అని చెప్పగానే, నిజమా మీకు శాంతి స్వరూప్ అంత బాగా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగేవారు అతడో  సెలెబ్రిటి అన్నట్టుగా. ఇలాంటి రెండు మూడు అనుభవాల తర్వాత కానీ, శాంతి స్వరూప్ స్పెషల్ స్టేటస్  నాకు అవగతం కాలేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అలా జనంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి నలభయ్ ఏళ్ళ క్రితం మొదలైన దూరదర్సన్ తెలుగు వార్తా ప్రసారాల్లో తొలి తెలుగు బులెటిన్ చదివిన న్యూస్ రీడర్ కావడం ఒక కారణం అయితే,  ఆయన వార్తలు చదివే తీరులోని విలక్షణత్వం మరో కారణం. మీదు మిక్కిలి ఆయన ధారణ శక్తి అమోఘం. పది నిమిషాల వార్తలని కాగితాలు చూడకుండా ఏకధాటిగా  చదివేసేవాడు, టెలి ప్రాంప్టర్లు లేని ఆ కాలం లోనే. దూరదర్సన్ అనగానే శాంతి స్వరూప్ అని గుర్తు చేసుకునే మంచి పేరు సంపాదించుకొన్నాడు.

నా కంటే ఆరేళ్లు చిన్న. మొన్న గుండెపోటు అన్నారు. ఆసుపత్రిలో చేర్చారు అన్నారు. ఈ ఉదయం లేడు, దాటిపోయాడు  అన్నారు.

ఏమిటో ఈ జీవితాలు.

ఓం శాంతి!


(సదా మందహాసి శాంతి స్వరూప్)



5-4-2024

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

స్క్రీన్ మీద నిండుగా కనిపిస్తూ అవసరం కన్నా నెమ్మదిగా చదువుతూ విసుగు పుట్టేలా వార్తలు చదివే వాడు. అయితే ఉచ్చారణ దోషాలు ఉండేవి కావు. RIP.

అజ్ఞాత చెప్పారు...

ఆయన ఆత్మకు శాంతికలుగుగాక

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

తెలుగు తేజం శాంతి స్వరూప్ గారి ఆత్మకు శాంతి కలుగు గాక 🙏.

శాంతి స్వరూప్ గారి శైలి వగైరా గురించి ఈ వ్యాసంలో చదవచ్చు.

https://www.thehindu.com/entertainment/whether-breaking-news-or-a-feature-story-shanti-swaroops-distinctive-voice-and-impeccable-diction-set-him-apart-as-a-legendary-figure-in-the-broadcasting-world/article68031996.ece/amp/

Zilebi చెప్పారు...

-
నివాళులు

శాంతి స్వరూపుని ఆత్మకు
శాంతి కలుగుగాక! వార్త లంతయు మధురం
బెంతయొ చదివెడు తీరు! ప్ర
శాంతంబగు మోము వారి సౌభగమాయెన్!