ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్జీవోల సమ్మె జరుగుతున్న రోజులు.
ఖమ్మంలో
ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టరు గారెకి చాలా దూరంలో
వేరే జిల్లాకు బదిలీ అయింది. బదిలీ ఆపుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ
ఉండగానే ఈ సమ్మె వచ్చి పడింది. ఖమ్మంలో ఉంటున్న మా బావగారు నాకు ఫోన్ చేసి
చెప్పారు,
ఆ  డాక్టరు గారు బాగా తెలిసిన వాడు, ఎవరయినా తెలిసిన వాళ్ళు వుంటే సాయం
చేయమని.
 వైద్య శాఖ మంత్రి గారు బాగా పరిచయం వున్న మనిషే.
వెళ్లి కలుస్తే ఆయన ముందు సమ్మె అయిపోనీ చూద్దాం అన్నారు. కాస్త ఆగి  మళ్ళీ ఆయనే అన్నారు, ‘నేను చెబుతాను కానీ ఆ సూర్యనారాయణ
వున్నాడే,  ఓ మొండి ఘటం, ఓ పట్టాన ఎవడి మాటా వినడు’. 
ఆ
సూర్యనారాయణ గారు సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి. 
ఆ రోజుల్లో వైద్య శాఖ కార్యదర్శిగా వున్నారు. ఆయనని వేరే శాఖ నుంచి బదిలీ
చేసి ఎక్కువ కాలం కూడా కాలేదు. ఎవరి మాట లెక్కపెట్టని  అధికారి అని పేరు. ముక్కుసూటి మనిషి. తోటి  ఐ.ఏ.ఎస్. అధికారులు కూడా ఆయనకు ఒక మాట
చెప్పడానికి సంకోచించేవారు. ఇక మామూలు అధికారులు అయితే ‘వామ్మో! సూర్యనారాయణ గారా!
ఆయన ఎవరి మాటా వినే రకం కాదు’ అని ముందే 
తప్పుకునేవారు. 
ఇక
ఏమైతే అదే అయిందని నేనే సచివాలయానికి వెళ్లాను ఆయన్ని కలుద్దామని. సచివాలయం మొత్తం
బోసిపోయి వుంది. ఎక్కడా చడీ చప్పుడు లేదు. ఉన్నతాధికారులు మాత్రం ఆఫీసులకు
వస్తున్నారు. సూర్యనారాయణ గారి  చాంబర్స్
కు వెళ్లాను. చీటీలు ఇచ్చే అటెండర్లు లేరు. లోపల అధికారి వున్నారో లేరో చెప్పే
పియ్యేలూ  లేరు. నీరవ నిశ్శబ్దంగా వుంది.
నేనే తలుపు తట్టి  ‘మే ఐ క మిన్ సర్’
అన్నాను మెల్లగా. ‘యస్’ అని వినిపించింది లోపల నుంచి గంభీరంగా. తలుపు తోసుకుని
వెళ్లాను. 
తెల్లటి
దుస్తుల్లో నల్లటి మనిషి ఒకరు కుర్చీలో కనిపించారు. 
“ఎవరు
మీరు? ఏం కావాలి”
అన్నారాయన మరింత గంభీరంగా.
రేడియో
కరస్పాండెంట్ ని అని చెప్పగానే ఆయన, నేను వచ్చింది సమ్మె సమాచారం కోసం అని అనుకుని
అలాటి విషయాలు మీరు సీ ఎస్ ఆఫీసులో అడగాలి, నన్ను కాదు’ అన్నారు కరకుగా. 
అప్పుడు  నేను వచ్చిన పని చెప్పాను. బదిలీ విషయంలో మీకు
రికమెండ్ చేయడానికి పెద్ద పెద్దవాళ్లు కూడా జంకుతున్నారు. అంచేత నేనే మిమ్మల్ని
అడుగుదామని వచ్చాను’ అని చెప్పాను మాటల్ని కూడగట్టుకుంటూ.
‘ఎవరా
డాక్టరు ఎక్కడ పనిచేస్తారు’ అని
అడిగితే  చెప్పాను వివరాలు. అవి రాసి
ఉంచుకున్న చీటీ ఆయనగారి చేతికి అందించాను.
ఒకసారి
చదువుకుని ఆయన కుర్చీలో నుంచి లేచారు బయటకు వెళ్ళడానికి. ఇక ఇది  అయ్యే పని కాదనుకుని నేనూ ఆయన వెంట బయటకు
వచ్చాను.
చిత్రంగా
ఆయన పెయ్యే టేబుల్ దగ్గర ఆగిపోయి  టెలిఫోన్
డైరెక్టరీ చేతిలోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా డి.ఎం.అండ్ హెచ్.ఓ. కి ఫోన్
చేశారు.
ఆయన
లైన్లోకి రాగానే మా డాక్టరు గారి  వివరాలు
చెప్పి, రిలీవ్ చేయవద్దని  అని నోటిమాటగా
ఉత్తర్వులు ఇచ్చారు. ‘సార్! ఆర్డర్ టైప్ చేయడానికి స్టాఫ్ ఎవరూ లేరు’ అని అవతల
నుంచి అన్నట్టు వుంది.
‘నా
దగ్గర ఏమైనా వున్నారా!  నేనే డైరెక్టరీ
వెతికి మీకు ఫోన్ చేశాను.. అర్ధం అయిందా’ అన్నారు సూర్యనారాయణ గారు తనదైన
శైలిలో.  
అటు
డి.ఎం.అండ్ హెచ్.ఓ. గారెతో పాటు ఇటు నాకూ అర్ధం అయింది, ఆయన వ్యవహార శైలి.
సూర్యనారాయణ
గారెని చూడడం అదే నాకు మొదటి సారి. ఇలాంటి అధికారులు కూడా వుంటారా అని అనుకుంటూ
బయటపడ్డాను.
నాకు
తెలిసి ఆ డాక్టరు గారెని తర్వాత ఎవరూ కదల్చలేదు. ఖమ్మంలోనే రిటైర్ అయ్యారు. 
ఇప్పుడు   ఆ అధికారీ లేరు, ఆ డాక్టరు గారూ లేరు, నా
జ్ఞాపకాల్లో తప్పించి. (17-12-2020)                             
 
 
1 కామెంట్:
ఆర్.టి.సి. వైస్- ఛెయిర్మన్ గా కూడా కొంతకాలం పని చేసిన ఐ.ఏ.యస్. అధికారి కె.వి.యెస్. సూర్యనారాయణ గారా ? వారికి మంచి పేరే ఉండేది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి