18, మే 2016, బుధవారం

అయినను పోయిరావలయు హస్తినకు ......


సూటిగా...సుతిమెత్తగా......భండారు శ్రీనివాసరావు

ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఒక మంచి సాంప్రదాయానికి తెర తీశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను విడివిడిగా ఢిల్లీ పిలిపించుకుని ఆయా రాష్ట్రాలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు. తెలంగాణా కొత్త రాష్ట్రం ఎదుర్కుంటున్న కొన్ని సమస్యలపై కేంద్రం స్పందన గురించి ఆ వెనువెంటనే ప్రధాని మోడీ  ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు.
పొతే, చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన వల్ల వాయిదా పడ్డ ప్రధానితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం మొన్న మంగళవారం హస్తినలో జరిగింది. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా హాజరయిన ప్రధానితో భేటీ సుదీర్ఘంగా సాగింది. చంద్రబాబు నాయుడు తనదయిన పద్ధతిలో పవర్ పాయింటు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. దానితో పాటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్కెల జాబితాతో కూడిన వినతి పత్రం కూడా ప్రధానికి అందచేశారు. సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీతో విడిగా చర్చలు జరిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం గురించి నొక్కి చెప్పారు. ముందు కొద్దిసేపు అనుకున్న ఈ ముఖాముఖి భేటీ దాదాపు ఇరవై నిమిషాలు సాగిందని సమాచారం. అనేక విషయాల్లో తన అంతరంగ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉంటారనడంలో  సందేహం లేదు.
ప్రధానితో తాను  జరిపిన సమావేశం వివరాలను గురించి ఆ తరువాత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలియచేశారు.  సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, ప్రత్యేక హోదా విషయంలో ఆందోళన చెందవద్దని,  ఆ అంశంలో ముడివడివున్న సున్నితత్వం తనకు తెలుసని ప్రధాని  తనతో చెప్పారని చంద్రబాబు తెలియచేసారు. అంతేకాని, కేసీఆర్ విషయంలో జరిగినట్టు  ప్రధాని పనుపున కానీ, ఆయన   ట్విట్టర్ ఖాతా  ద్వారా కానీ ఎటువంటి వివరణ వెలువడినట్టు సమాచారం లేదు.
విలేకరుల సమావేశంలో చంద్రబాబునాయుడు నాయుడు మాట్లాడిన తీరు, ఆయన హావభావాల్లో తొంగిచూసిన రవంత అసహనం, ఆందోళన గమనిస్తే, ప్రత్యే క హోదా విషయంలో ప్రధాని మోడీ నుంచి స్పష్టమైన హామీ లభించిన దాఖలా కానరాలేదు.
ముఖ్యమంత్రి మాటలను బట్టి,  సమావేశం జరిగిన తీరు కొంత అర్ధం చేసుకోవచ్చు. కొన్ని సున్నిత అంశాల విషయంలో  ఆయన బిగబట్టుకుని మాట్లాడుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కానవచ్చాయి.
ఒక ముఖ్యమంత్రిగా తాను ఢిల్లీలో అడుక్కోవాల్సిన పరిస్తితి దాపురించినదని ఆయన అనడం ఆయనలో  కొన్నాళ్ళుగా రగులుతున్న ఆవేదనకు అద్దం పట్టింది. కాకపోతే ఈ పరిస్తితికి కారణం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నెపం ఆ పార్టీపై మోపారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన నేతగా నేటి పరిస్తితి ఆయనకు నిజంగా వేదన  కలిగించే విషయమే.
ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. చంద్రబాబునాయుడు  ఈనాడు అప్పాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీలో  కలుస్తున్న నాయకుల్లో అనేకమంది, గతంలో  ఆయన్ని కలుసుకోవడం కోసం, ఒక్క క్షణం పాటయినా ఆయన దృష్టిలో పడడం కోసం  ఢిల్లీ ఏపీ భవన్  ఆవరణలోని చెట్లకింద నిరీక్షించడం తెలిసిన వారికి ఈసంగతి బాగా అర్ధం అవుతుంది. నాటి స్తితిని నేటితో పోల్చి చూసుకున్నప్పుడు ఆయనలో అసహనం కట్టలు తెంచుకోవాలి. కానీ,  పరిణతి చెందిన రాజకీయ చాతుర్యం బహుశా ఆయన్ని ఇంత నిగ్రహంగా వ్యవహరించేలా చేస్తోందని అనుకోవాలి.

హోదా విషయంలో  అన్ని పార్టీలు స్పందించాలని చంద్రబాబు కోరారు. ఇది ఒక్క బీజేపీ బాధ్యత మాత్రమె కాదని అంటూ,  నాడు విభజన సమయంలో అన్ని పార్టీలు వున్న విషయాన్నీ ఆయన గుర్తు చేసారు.
ఇవన్నీ ఆయన గతంలో అనేక పర్యాయాలు చెప్పిన విషయాలే.
కానీ, ఇలా ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు ఇలా వివరణలు, సంజాయిషీలు ఇస్తూ పోవాలి?
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి వచ్చిన తరువాత ఇంతకంటే తీయని కబురు ఏదో చెబుతారని ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా పట్ల ఆశలు పెట్టుకున్న వాళ్ళు  నిరాశపడ్డారు. అయితే, ఈ  విషయంలో  గత కొంత కాలంగా రాష్ట్ర స్థాయి బీజేపీ, టీడీపీ  నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు  గమనిస్తున్న వారికి మాత్రం  ఇది ముడిపడే విషయం కాదని అర్ధం అవుతూనే వుంది.
ప్రత్యేక హోదాతో పాటు  ప్రత్యేక ప్యాకేజీ కూడా కేంద్రం ఇవ్వాలనే డిమాండు ఆంధ్రప్రదేశ్ నాయకుల నుంచి పెరుగుతోంది. చివరికి ఇది ప్యాకేజీకి పరిమితం అయినా ఆశ్చర్యపోనక్కర లేదు.  ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పకపోయినా ఈ విషయంలో అస్పష్టతతో కూడిన కొంత స్పష్టత ఇచ్చారనుకోవాలి.
అర్ధరాజ్యం కాకపోయినా అయిదూళ్ళయినా  పాండవులకు ఇవ్వాల్సిందని దూతగా హస్తిన వెళ్ళిన  శ్రీకృష్ణుడు కౌరవరాజు దృతరాష్ట్రుడుని కోరతాడు. సుయోధనుడు అందుకు కూడా సమ్మతించకపోవడంతో చివరకు సమరమే శరణ్యమవుతుంది.
అభినవ భారతంలో కూడా ఇదే జరుగుతుందా? బీజేపీ, టీడీపీ ల నడుమ దోస్తీ బీటలు వారుతుందా?  
గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న వారికి ఒక విషయంలో స్పష్టత వుంది. రాజకీయ పార్టీల నడుమ సఖ్యత కానీ, దోస్తీ కానీ, పొత్తు కానీ, దాన్ని ఏ పేరుతొ పిలుచుకున్నా అది తాత్కాలికమే. ఎందుకంటే, ఇటీవలి కాలంలో ఇటువంటి పొత్తులకు సిద్దాంతాలు, సూత్రాలు కాకుండా రాజకీయ అవసరాలు ప్రాతిపదిక అవుతున్నాయి. నిబద్ధత లోపించినప్పుడు స్నేహాలు చిరకాలం నిలబడడం కష్టం.
టీడీపీ, బీజేపీ స్నేహం ఎన్నాళ్ళు సాగుతుంది అనేది ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అది వారి సమస్యాకాదు. కాకపోతే  ప్రత్యేక హోదా అనే విషయంలో వారికి ఆసక్తి వుంది. ప్రత్యేక హోదా సంజీవని కాదని కూడా ప్రజల్లో అధిక సంఖ్యాకులకు అర్ధం అయిపోయింది. అయితే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలు తమని ఈ విషయంలో వంచిస్తున్నాయేమో అనే భావన ప్రబలినప్పుడే అసలు కష్టాలు మొదలవుతాయి.  ఈ కష్టాలు ముందు మెడకు చుట్టుకునేది కూడా ఆ రాజకీయ పార్టీలకే. ఎందుకంటే, ప్రత్యేక హోదా అనేది కొత్త రాష్ట్రానికి యెంత అవసరమో సాకల్యంగా వారికి  వివరించి చెప్పింది అవే కాబట్టి. ఆ అంశం ముదిరి పాకానపడి భావోద్వేగ స్వరూపాన్ని సంతరించుకున్నప్పుడు అసలు కధ మొదలవుతుంది.  అప్పుడు ప్రజలకు నచ్చచెప్పడం పార్టీలకే కాదు, బ్రహ్మకు కూడా తరం కాదు.
పాండవోద్యోగ విజయాల్లో శ్రీకృష్ణుడు చేసిన హితబోధ ఇదే.
‘క్రమక్రమముగా కొలువు కూటము రణకూటమగుచున్నది, పదుగురున్నప్పుడే కురురాజా నా మాటలు ఆలకింపుడు’ అంటూ, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ అయిదు పద్యాల్లో ముందస్తుగానే తెలియ చేస్తాడు సమస్తం ఎరిగిన కృష్ణ పరమాత్మ. 

అందుకే సుతిమెత్తగా చెబుతున్న ఈ సూటి మాట.
ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పటికే జనంలో బాగా పాకిపోయింది. అది సంజీవనా, కాదా!  మంత్రం దండమా కాదా! సర్వరోగ నివారిణా కాదా  అనే మీమాంసతో నిమిత్తం లేని దశకు వారు చేరుకుంటున్నారు. ఈ అగ్గికి ఆద్యం పోసేవాళ్ళు ఎట్లాగు సిద్ధంగా వుంటారు. అలా అని వారిని తప్పుపట్టడం సరికాదు. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి.
ఈ పరిస్థితికి మీరంటే మీరు కారణం అంటూ ఒకరినొకరు దెప్పుకుంటుంటే  ప్రజలు నమ్ముతారని అనుకోవడం వుట్టి భ్రమ. కాకపోతే, ఆయా పార్టీల వీరాభిమానులు తమ పార్టీల వాదనకు అనుగుణంగా చెలరేగిపోతుండవచ్చు. అదంతా ప్రజాభిప్రాయం అనుకుంటే ఎవరిని వారు మోసం చేసుకోవడమే అవుతుంది.
కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ప్రతి పార్టీ విడివిడిగా కోరుతూనే వుంది. కానీ ఒక్క తాటిపై నడవాలని కానీ, ఒక్క మాటపై నిలబడాలని కానీ ఏ ఒక్క పార్టీ కోరుకోవడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో కూడా  సీమాంధ్ర ప్రాంతం రాజకీయ నాయకులు ఇదే తప్పిదం చేశారు. మళ్ళీ అదే పునరావృతం అవుతుంటే పార్టీలతో నిమిత్తం లేనివారికి బాధగా ఉంటోంది.
రాజకీయ లబ్ది అనే కోణం ఒదిలిపెట్టి ఇప్పుడు జరగాల్సింది ఒక్కటే. ప్రజలకు వున్నది వున్నట్టు చెప్పడం. నిజాయితీతో చెప్పే చేదు నిజాలను సయితం స్వీకరించే సాధుగుణం ఇంకా జనంలో సజీవంగానే  వుంది.  కానీ, ప్రతిదీ రాజకీయకోణం నుంచి చూడడం మానేసి కనీసం ఒక్కసారయినా రాజకీయ నాయకులు నిబద్ధతతో ప్రజలముందుకు రావాలి.
పరిష్కార మార్గాలు మూడే మూడు.
ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా తనంత తానుగానే ఆ ప్రకటన చేయడం.
ప్రత్యేక హోదాకు ఏవయినా సహేతుకమైన కారణాలు అడ్డు పడుతుంటే వాటిని కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వయంగా  వివరించి, పరిహారంగా భారీ సాయాన్ని ప్రకటించి, నిధులను వెంటనే విడుదల చేయడం.
ఇవేవీ కుదరవు అనుకుంటే, టీడీపీ, బీజేపీ నాయకులు లేనిపోని  మాటలతో, వాగ్వాదాలతో  పొద్దుపుచ్చే వైఖరికి స్వస్తి చెప్పి రాజకీయ రణక్షేత్రంలో నేరుగా తలపడడం.
నిష్టూరమనిపించినా, టీడీపీ, బీజేపీలు మరో వాస్తవం గుర్తు పెట్టుకోవాలి.
ప్రత్యేక హోదా వల్ల కానీ, ప్రత్యేక ప్యాకేజీ వల్ల కానీ రాజధాని కూడా లేకుండా ఏర్పడ్డ కొత్త రాష్ట్రానికి మంచి మేలే జరుగుతుంది. అంతేకాకుండా, ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగు దేశం పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి  నిధుల కొరత నుంచి మంచి ఉపశమనం చిక్కుతుంది. చేయవలసిన పనులు సకాలంలో చేసి వచ్చే ఎన్నికలనాటికి  పార్టీని సంసిద్ధం చేసే రాజకీయ వెసులుబాటు లభిస్తుంది.  ఈ రీత్యా  ప్రధానమైన రాజకీయ లబ్ది చేకూరేది తెలుగు దేశం పార్టీకే. అల్లాగే, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారనే ఆదరణ ప్రజల్లో దొరికేది భారతీయ జనతా పార్టీకి. కానీ, అటు వైసీపీకి కానీ, మరో వైపు  కాంగ్రెస్ కు కానీ ప్రస్తుతానికి  పెద్దగా  ఒనగూడే రాజకీయ ప్రయోజనం  ఏమీ వుండదు,  ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఒప్పించాం అని గొప్పలు  చెప్పుకోవడానికి తప్ప.
వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయాలను ఒదిలిపెట్టి, ప్రజలను భావోద్వేగాలకు గురిచేయడం వల్ల అసలే  ఇబ్బందుల్లో వున్న కొత్త రాష్ట్రానికి  మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు.
ఈ విషయంలో సీమాంధ్ర పార్టీలు, పొరుగున వున్న తెలంగాణాలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతున్న తరుణంలో అక్కడి పార్టీలు అనుసరించిన ఐక్యతా విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
అంతేకాని, వైసీపీ టీడీపీని, టీడీపీ వైసీపీని, బీజేపీ కాంగ్రెస్ నీ, కాంగ్రెస్ బీజేపీని తప్పులెన్నే తప్పుడు విధానాలనుంచి తక్షణం తప్పుకోవాలి.
ప్రజల ప్రయోజనాలను  ఏ పార్టీ కాపాడుతుందో, అ పార్టీ ప్రయోజనాలను ప్రజలు  కాపాడతారు.
(18-05-2016)
  

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595    

     

32 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక ప్రతిపత్తికి కావాల్సిన అర్హతలలలో ఒక్కటి కూడా లేదని, ఎట్టి పరిస్తితులలో ఇది జరిగే పని కాదని అందరికీ తెలుసు. This is just a political game.

శ్యామలీయం చెప్పారు...

జైగారూ, మీరు ఆం. ప్ర. గురించి ఎందుకు ఇలా పుల్లవిరుపుగా మాట్లాడుతున్నారు? నిత్యమూ మీరు ఇటువంటి మాటలకు అవకాశం వదలు కోరు. వైరభావాలు మంచికి దారితీయవండీ. అన్యాయంగా దగాపడ్డవారిపైన మీరు మరింత కక్షచూపుతున్నారు! ఇది అసహ్యంగా ఉంది.అంధ్రులపైన ద్వేషంతో ఇప్పుడేదో తె. రాష్ట్రం అద్భుతంగా వెలిగి పోతోందన్న భ్రమతో మీరు సంయమనం కోల్పోతున్నారని అనిపిస్తోంది. మీకు ఆంధ్రజనం తిండికి ముఖంవాచి దుర్భరదారిద్ర్యంతో అలమటించి కృశించి నశించి పోతే అప్పుడు అదంతా నిర్జనం ఐపోయాక తెలంగాణావారు వచ్చి ఆక్రమించుకుంటే అద్భుతంగా ఉంటుందన్నట్లు ఏమైనా భావనలు ఉన్నాయా అనిపిస్తోంది. కానివ్వండి. మీ కోరిక ఎందుకు కాదనాలీ? అలాగే భావించండి. అలాంటిదేమీ లేదని మెరమెచ్చులు చెప్పవద్దు దయచేసి.ఇదివరలో వ్రాసాను - కాలం అనేది ఒకటుంది అని. రెండు మూడేళ్ళలో కాలం మొదలూ కాదు అంతమూ కాదు. ఆంధ్రదేశం జనశూన్యం కావాలని మీరెంతకోరినా అలా జరగదు లెండి. ఐనా తె.రాష్ట్రంవారి తరపున మీలాంటి పెద్దలు వీలైనంతగా అడ్డుపుల్లలు వేయటం మానవలసిన పని లేదు - అలాగే భేషుగ్గా వేస్తూనే ఉండండి. స్వభావో దురతిక్రమణీయః అన్నారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Jai Gottimukkala - రాదని అందరికీ తెలుసు. రాజకీయ క్రీడ కాబట్టే - 'అయినను పోయి రావలయు హస్తినకు...సంధి కుదురుతుందని అనుకుని కృష్ణుడు రాయబారానికి వెళ్ళలేదు కదా! ఇదీ అంతే!

Jai Gottimukkala చెప్పారు...

"అర్ధరాజ్యం కాకపోయినా అయిదూళ్ళయినా పాండవులకు ఇవ్వాల్సిందని దూతగా హస్తిన వెళ్ళిన శ్రీకృష్ణుడు కౌరవరాజు దృతరాష్ట్రుడుని కోరతాడు. సుయోధనుడు అందుకు కూడా సమ్మతించకపోవడంతో చివరకు సమరమే శరణ్యమవుతుంది."

మీకు ఎంత అభిమానం ఉన్నా టీడీపీ వారిని శ్రీకృష్ణుడితో మోడీ గారిని దుర్యోధనుడితో పోల్చడం అస్సలు బాలేదు.

"ప్రత్యేక హోదాకు ఏవయినా సహేతుకమైన కారణాలు అడ్డు పడుతుంటే వాటిని కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వయంగా వివరించి"

ప్రత్యెక ప్రతిపత్తి (హోదా కాదు) ఇవ్వడానికి *ఒక్క* సహేతుక కారణం లేదనడం చాలును కదా. అర్హతలు దండిగా ఉన్న బీహార్ లాంటి రాష్ట్రాలకే ఇవ్వలేదనే వాస్తవం మరువకండి.

"చంద్రబాబు నాయుడికి నిధుల కొరత నుంచి మంచి ఉపశమనం చిక్కుతుంది"

6,000 కోట్ల లోటు తీర్చడానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయి. దుబారా ఖర్చులు తగ్గించే ధైర్యం లేకపోతె మనిషికి నెలకు 100 రూపాయలు పన్ను ఎక్కువ వసూలు చేసినా చాలు. 3 లక్షల లోటుతో ఉన్న కేంద్రం ప్రతి ఒక్కరి గొంతెమ్మ కోరికలు తీర్చాలనడం దేశానికి శ్రేయస్కరం కాదు.

"పొరుగున వున్న తెలంగాణాలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతున్న తరుణంలో అక్కడి పార్టీలు అనుసరించిన ఐక్యతా విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి"

పచ్చ పార్టీ అప్పుడూ ఇప్పుడూ తెలంగాణాలో సైంధవ పాత్ర పోషించింది.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

నాకు ఎవరి మీదా ద్వేషం లేదు.

ప్రత్యెక ప్రతిపత్తి మీద నా విశ్లేషణకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని మనవి. ఎవరు నమ్మినా మానినా ఆంధ్రకు ఈ విషయంలో ఒక్క అర్హత ఉన్నా (బీహార్ రాష్ట్రానికున్నట్టు) నేనే ముందు అడిగే వాడిని.

FYI I will publish a detailed analysis on this subject on my blog soon.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

జైగారూ, మీరేమో 'నాకు ఎవరి మీదా ద్వేషం లేదు.' అంటారు. కాని ఆంధ్రవిషయానికి వస్తే విద్వేషపూరితవ్యాఖ్యలను వదలటానికి వచ్చే ఏ అవకాశమూ మీరు వదలు కోరని అనిపించేలా మాట్లాడుతారు.

ఆంధ్రకు ఒక్క అర్హతా లేకపోవటం గురించి ఏం చెప్పాలి? ఇల్లు రెండు ముక్కలు చేసి దాదాపు అంతా ఒకటికే, కాదన్నవాళ్ళని తన్ని మరీ దోచి పెట్టి, రెండవపక్షాన్ని బికారిని చేసి, నీకు సహాయం చేస్తామని వాగ్దానాలను కురిపించి,ఇప్పుడు వాడికి ఏ అర్హతా లేదనటం మీ వంటి విజ్ఞ్లుల దృష్టిలో బాగుందీ అంటే అది కేవలం పక్షపాత దృష్టివలననే అన్నది చిన్నపిల్లలకూ అర్థమౌతుంది.

ముకుమ్మడిగా అంధ్రులు ఆత్మహత్యచేసుకోవాలని మీరు నోటితో అనకపోయినా మీ ధోరణితో అదే చెబుతున్నారు. కాని కాలం అలా జరగనివ్వదు.

ఎన్నడో ఒక చట్టం చేసారట, దాన్ని బట్టి నేడు ఆంధ్రులకు చావటం మిహహా ఏ హక్కూ లేదట. ఏమీ కాలానుగుణంగా సవరించటానికి వీలు కాదా ఆ చట్టాన్ని? అదేమన్నా దైవశాసనమా? ఒకప్పుడు రాజ్యాంగాన్ని మార్చి ఐనా తెలంగాణా ఇవ్వమన్న వాళ్ళకు ఆ చట్టం మార్చటానికి వీలు లేనంత పరపపవిత్రమైన దైవశాసనం ఎందుకైనది?

మీ కోసం ప్రపంచం అంతా మారవలసిందే -వేరే దారే ఉండదు. ఇతరులకు న్యాయం చేయటం కోసం ఇతే పూచికపుల్ల కూడా కదలకూడదు. అంతేనా మీ ధోరణి? ఏమి ధర్మదృష్టి!

అజ్ఞాత చెప్పారు...

It can be seen from the ongoings that Mr. Modi is, at the best, an ordinary politician but not a statesman. He doesn't have it in him. It can be crystally made out from his fiascos visavis Andhra Pradesh, Bihar, Kashmir and Kerala episodes. He isn't a trustworthy person, at all. Unfortunate for Andhra that it seems the Politician had a shameless hidden agenda in playing cruel games with the sentiments of the helpless people. Even more unfortune for the country, having to select between two crooks. Doomed is the nation and it's people, as always.

నీహారిక చెప్పారు...

శ్యామలీయం గారు,

మీ కమెంట్ చూస్తుంటే మొగుడు కొట్టినందుకు కాదు గానీ తోటికోడలు నవ్వినందుకు బాధ పడినట్లున్నది.ప్రత్యేక ప్రతిపత్తి,విభజన రెండూ కూడా సాధ్యం కాదనీ తెలుసు,వాళ్ళు తప్పు చేసారని మనమూ అదే తప్పు చేయడం తప్ప మరో మార్గం లేదా ?

మీరన్నట్లు ఆంధ్రజనం తిండికి ముఖంవాచి దుర్భరదారిద్ర్యంతో అలమటించి కృశించి నశించి పోతే అప్పుడు అదంతా నిర్జనం ఐపోయాక తెలంగాణావారు వచ్చి ఆక్రమించుకుంటే అద్భుతంగా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించండి! ఇలాగయినా కలిసి ఉండవచ్చు కదా ?

ముందూ వెనుకా చూసుకోకుండా సంబురాలు చేసుకుంటుంటే ఎవరు అప్పులపాలవుతారో ఎవరు చెప్పగలరు ?

సహేతుకంగా 6000వేల కోట్ల లోటు తీర్చడానికి అడిగితే ప్రజలు ఒప్పుకోరేమో కానీ సంబురాలు చేసుకుందామనో,ఆయుత చండీ యాగం చేసుకుందామంటే మాత్రం కోట్లు ఇస్తారు.

ఈ ప్రశ్న బాగుంది.

ఒకప్పుడు రాజ్యాంగాన్ని మార్చి ఐనా తెలంగాణా ఇవ్వమన్న వాళ్ళకు ఆ చట్టం మార్చటానికి వీలు లేనంత పరపపవిత్రమైన దైవశాసనం ఎందుకైనది?

నీహారిక చెప్పారు...

Highights of the Post !

ప్రజల ప్రయోజనాలను ఏ పార్టీ కాపాడుతుందో, అ పార్టీ ప్రయోజనాలను ప్రజలు కాపాడతారు.

టీడీపీ వారిని శ్రీకృష్ణుడితో మోడీ గారిని దుర్యోధనుడితో పోల్చడం.

నిబద్ధత లోపించినప్పుడు స్నేహాలు చిరకాలం నిలబడడం కష్టం.

కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ప్రతి పార్టీ విడివిడిగా కోరుతూనే వుంది. కానీ ఒక్క తాటిపై నడవాలని కానీ, ఒక్క మాటపై నిలబడాలని కానీ ఏ ఒక్క పార్టీ కోరుకోవడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో కూడా సీమాంధ్ర ప్రాంతం రాజకీయ నాయకులు ఇదే తప్పిదం చేశారు. మళ్ళీ అదే పునరావృతం అవుతుంటే పార్టీలతో నిమిత్తం లేనివారికి బాధగా ఉంటోంది.

రాజకీయ లబ్ది అనే కోణం ఒదిలిపెట్టి ఇప్పుడు జరగాల్సింది ఒక్కటే. ప్రజలకు వున్నది వున్నట్టు చెప్పడం. నిజాయితీతో చెప్పే చేదు నిజాలను సయితం స్వీకరించే సాధుగుణం ఇంకా జనంలో సజీవంగానే వుంది. కానీ, ప్రతిదీ రాజకీయకోణం నుంచి చూడడం మానేసి కనీసం ఒక్కసారయినా రాజకీయ నాయకులు నిబద్ధతతో ప్రజలముందుకు రావాలి.

Zilebi చెప్పారు...




పోతిని హస్తిన వస్తిని !
ఖాతరు జెయ్లే జిలేబి కాలము గడిచే !
వేతును సమయము రాగన్
మోతుబరి రయితును గాన? మోడీ వెయిటూ !


చీర్స్
జిలేబి

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

"ఆంధ్రవిషయానికి వస్తే విద్వేషపూరితవ్యాఖ్యలను వదలటానికి వచ్చే ఏ అవకాశమూ మీరు వదలు కోరని అనిపించేలా మాట్లాడుతారు"

అర్హతలు లేవనడం ద్వేషం ఎలా అవుతుందండీ?

"ఆంధ్రకు ఒక్క అర్హతా లేకపోవటం గురించి ఏం చెప్పాలి?"

ప్రత్యెక ప్రతిపత్తికి అర్హతలు (నిబంధనలు అనడం కరెక్ట్) ఏమిటో విజ్ఞులు మీరే స్వయంగా తెలుసుకుంటే బాగుండేది. సొంత వాదనల వినిపించే బదులు అమలులో ఉన్న పద్దతులు ఏమిటో కనుక్కోవడం ఉత్తమం కాదంటారా?

"ముకుమ్మడిగా అంధ్రులు ఆత్మహత్యచేసుకోవాలని"

6,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నందుకు ఆంధ్రులు ఆత్మహత్య చేసుకోవాలా సార్! మరయితే కేంద్ర బడ్జెట్ 280,000 కోట్లు కనుక భారతీయులు అందరూ ఏమి చేయాలో తమరే చెప్పండి.

"ఏమీ కాలానుగుణంగా సవరించటానికి వీలు కాదా ఆ చట్టాన్ని? అదేమన్నా దైవశాసనమా?"

తప్పకుండా మార్చుకోవచ్చును. అయితే కేంద్రాన్ని విమర్శించే బదులు ఎటువంటి మార్పు చేయాలో సూచిస్తే మంచిది.

"మీ కోసం ప్రపంచం అంతా మారవలసిందే"

నేనేమీ మార్చమనలేదు. మీరే అర్హతలు లేని వారికి ఇవ్వాలని, ఉన్న వారికి ఇవ్వొద్దని అంటున్నారు.

"ఇతరులకు న్యాయం చేయటం"

ప్రత్యెక ప్రతిపత్తి అర్హతలు కలిగిన అత్యంత వెనుక బడిన బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలకు న్యాయం జరగాలని నేను అంటూనే ఉన్నాను మీరే చూడడం లేదు.

శ్యామలీయం చెప్పారు...

అర్హతలు లేవనడం ద్వేషం ఎలా అవుతుందండీ? కాదు, కాని ఆంధ్రుల అనర్హతని చాటటానికి అవకాశం వదలని తత్త్వం వెనుక విద్వేషం ఉందన్న అనుమానానికి ఆస్కారం ఉంది.

ప్రత్యెక ప్రతిపత్తికి అర్హతలు (నిబంధనలు అనడం కరెక్ట్) .... భవిష్యత్తులో వచ్చే అవసరాలు మార్పును కోరవచ్చు కదా. కాలం చెల్లిన నిబంధనల మీద పట్టుదల దేనికి? అలా నిరాకరణ కొందరికి ఆనందం కాకపోతే?

6,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నందుకు ఆంధ్రులు ఆత్మహత్య చేసుకోవాలా...? ఇంకా ఎక్కువేనేమో లోటు. అది పెరిగేదే కాని తరిగేది కాదే! ముందు వాగ్దానాలను చూపి విడదీసి, ఇప్పుడు పైసాపైసాకీ మోకాలడ్డుతుంటే దానర్థం మీరెలా చచ్చినా మాకు ఫరవాలేదనటం కాదా?

కేంద్రాన్ని విమర్శించే బదులు ఎటువంటి మార్పు చేయాలో సూచిస్తే మంచిది. అవును. ఇప్పటికే పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన వాగ్దానాలను నెఱవేర్చటానికి ఏమి అవసరమో ఆ మార్పులు చేయాల్సిందే. దానికి మళ్ళా వేరుగా చెప్పాలా? విడదీయండహో అని ఆంధ్రులు మొత్తుకున్నారా?వద్దని మొఱలుపెడితే విన్నారా? ఇప్పుడు విన్నపాలు చేసి నమ్మటానికి?

నేనేమీ మార్చమనలేదు. మీరే అర్హతలు లేని వారికి ఇవ్వాలని, ఉన్న వారికి ఇవ్వొద్దని అంటున్నారు. జై గారూ మీరు రాజ్యాంగం మార్చమన్నారా అన్నది ప్రక్కన పెట్టండి - తెలంగాణానాయకులు మాకోసం రాజ్యాంగం మార్చవలసిందే అదే అడ్డు ఐతే అన్నారు. మీ దృష్టిలో అర్హతలేని ఆంధ్రాకు అడుగుతున్నాం -కాని మాది సంపన్నరాష్ట్రం అని డప్పుకొట్టుకుమ్టున్న తెలంగాణావారు - ఆంధ్రాకు ఇవ్వద్దనీ, దానికిస్తే మాకూ ఇవ్వాలనీ అనటం సబబా? అది మోకాలడ్డటం కాదా? అర్హత అంటే ఎప్పుడో అచ్చైన పుస్తకంలోని కొన్ని వాక్యాలు కాదు - నేటి వర్తమాన పరిస్థితికి అనుగుణంగా అలోచించవలసిన సంగతి. ఇంకెవరికైనా కూడా తగిన అర్హత ఉంటే వాళ్ళకి ఇవ్వద్దనే నీచవాక్యాలు ఆంధ్రప్రాంతంవారు అనలేదెప్పుడూ.

ప్రత్యెక ప్రతిపత్తి అర్హతలు....న్యాయం జరగాలని నేను అంటూనే ఉన్నాను. మంచిది సంతోషం. వేరే వాళ్ళకీ అవసరం ఐతే ఇవ్వచ్చును. పాతపుస్తకంలో రూళ్ళ ప్రకారం మాత్రమే అర్హతలు చూడాలని పట్టుబట్టడం అనేది అలాగైతే ఆంధ్రా అన్యాయమైపోతుంది కదా అది మంచిదే అన్న దురుద్దేశంతోనే అని అర్థం అవుతూనే ఉంది. ఇన్నిసార్లు రాజ్యాంగం మార్చింది దేశావసరాలకు ప్రజాప్రయోజనానికీ కాదా? ఇప్పుడు ఆంధ్రాకు న్యాయం చేయటం దేశావసరం కాదా? కానప్పుడు ఉట్టుడియంగా విడదీసి తెలంగాణా ఇవ్వటం దేశావసరమా? తెలంగాణాప్రజలప్రయోజనాలే ప్రజాప్రయోజనాలా? ఆంద్రులు తిన్నా ఉన్నా చచ్చినా ఫరవాలేదు, చట్టాన్ని మార్చవలసిన అవసరం లేదు అని వాదించే వాళ్ళను ఎలా అర్థం చేసుకోవాలి? అయ్యా రెండువైపులా ఉన్నదీ దేశంలో అన్నివైపులా ఉన్నదీ ప్రజలే. తెలంగాణావారు ఎంతగా దేశప్రజలో అంధ్రావారూ అంతగానే దేశప్రజలు. తలుపులు వేసి తన్ని మోసంచేసి ఐనా తెలంగాణా ఇవ్వటంలో లేని చిక్కులు ఆంధ్రాకు బ్రతుకుబాటకు సహాపడటానికి కేంద్రానికి ఎలా వచ్చాయి? ఈ చిక్కులు విడదీసి సాయంచేయటానికి వీల్లేదు అనటంలో తెలంగాణా వారయ్యేది మరొకరయ్యేది అది సంకుచితస్వభావమో విద్వేషమో కాక మరేమిటి?

ఈ చర్చవలన ఏమీ తేలదు. కాబట్టి ముగిద్దాం.

శ్యామలీయం చెప్పారు...

@నీహారిక గారు,
ప్రత్యేక ప్రతిపత్తి,విభజన రెండూ కూడా సాధ్యం కాదనీ తెలుసు,వాళ్ళు తప్పు చేసారని మనమూ అదే తప్పు చేయడం తప్ప మరో మార్గం లేదా ? అంటున్నారు మీరు.

ప్రత్యేక ప్రతిపత్తి సాధ్యం కాదని తెలిసి జాతీయ పార్టీలం అని చెప్పుకొనే పార్టీలూ జాతీయనాయకులమూ దేశోధ్ధారకులమూ అని చెప్పుకొనే ప్రబుధ్ధులూ సాధ్యం కాదని తెలిసిన విభజన చేసారు. వాళ్ళు ఆ తప్పు చేసారు కాబట్టి మనం వాళ్ళు వాగ్దానం చేసిన ప్రత్యేకప్రతిపత్తి అనేది అడగటం అనే తప్పు చేయరాదని అంటారు.

అంటే ఏం చేయాలి? కుమిలి కృశించి నశించాలి!

మోసాలు చేసి మీసాలు మెలివేస్తున్న మహానుభావులారా మీరు తప్పులు చేసారని మాకు అనిపిస్తోంది. కాని గట్టిగా అంటే మీరు బాధపడతారు. పోనీ లెండి, మేం మంచివాళ్ళం, మిమ్మల్ని నిలదీసి ఇబ్బంది పెట్టటం అనే తప్పు మేం చేయం. మీ పుణ్యాన మేం మట్టిగొట్టుకొనిపోతాం - మీరు మరిన్ని తప్పులు చేస్తున్నా మేం నోరెత్తితే ఒట్టు అని చేతులు కట్టుకొని, మూలన నిశ్శబ్దంగా కూర్చుని నీరశించి నశిస్తాం అంతే కాని మీకు ఎలాంటి ఇబ్బందీ కలిగించమండీ అని వినయంగా మనవి చేసుకుందాం అంటారా? మంచిది అలాగే.

Unknown చెప్పారు...

శ్యామలీయం

>>> ఒకప్పుడు రాజ్యాంగాన్ని మార్చి ఐనా తెలంగాణా ఇవ్వమన్న వాళ్ళకు ఆ చట్టం మార్చటానికి వీలు లేనంత పరపపవిత్రమైన దైవశాసనం ఎందుకైనది?

తెలంగాణా ప్రజలు రాజ్యాంగాన్ని మార్చమని చెప్పలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం తమ రాష్ట్రాన్ని పొరుగురాష్ట్రంతో గతంలో కలిపారో ఆ రాజ్యాంగం ప్రకారమే విడదీయమని కోరారు.

>>> మీ కోసం ప్రపంచం అంతా మారవలసిందే

ఇటువంటి నీచపు మాటలు మాట్లాడువారు మరెవరు? "నీకు ఇష్టం వున్నా లేకపోయినా కలిసుండాలి. నాకు అర్హత ఉన్నా లేక పోయినా తేరగా ప్రత్యేక హోదాలు కావాలీ" అనువారు కాదా? లక్షకోట్ల బడ్జెటు వుండి, చర్టర్డ్ ఫ్లైట్లలో వారానికో విదేషీ యాత్రలు చేసే ముఖ్యమంత్రి వుండే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేలా రాజ్యాంగాన్ని సవరించాలంటే ఆ అర్హత రాకుండా మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇంకొక్కటైనా మిగులుతుందా? ఆవేశపడుతూ ఇతరులపై కారుకూతలు ప్రయోగించేముందు కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే సత్యం గోచరిస్తుంది.

శ్యామలీయం చెప్పారు...

కదనకుతూహలులు శ్రీకాంత్ చారి గారి రంఅప్రవేశం ఆశ్చర్యకరం కాదు. తెలంగాణా ప్రజలు రాజ్యాంగాన్ని మార్చమని చెప్పలేదంటున్నారు. ఎంతమాట! ఎన్నిసార్లు రంకెలు వేయలేదూ ఉద్యమకారులమని చెప్పుకొన్న రాజకీయులూ రకరకాల నాయకులూ ఆమాటతో? ఏ రాజ్యాంగం ప్రకారం తమ రాష్ట్రాన్ని పొరుగురాష్ట్రంతో గతంలో కలిపారో అంతున్నారే ఆ కలపటం అప్పటి ఆ హైదరాబాదురాష్ట్రం చేసిన కలయికతీర్మానం మేరకే జరిగింది కాని మరొకలా కాదే? ఆ రాజ్యాంగం ప్రకారమే విడదీయమని కోరారా - ఎవరు? ప్రజలా ఉద్యమకారులమని చెప్పుకున్న వాళ్ళా? ఎవరైతేనేం అడిగారు, రాజ్యాంగం ప్రకారమే విడదీయండీ, ఆ రాజ్యాంగం ఒప్పుకోనిపక్షంలో దాన్ని మాకు అనుకూలంగా సవరించి ఐనా ఇవ్వండీ అని. అప్పుడే మాటలు మార్చితే ఎలా? అప్పట్లో ఉద్యమం వేడిలో ఏదో అన్నాం అంటూ ఈ మధ్యన సన్నాయి నొక్కులు నొక్కినవారు ఎన్నెన్ని కారులఱచినదీ ఎన్నటికీ మరపు రాని సంగతి సుమా.

నాకు అర్హత ఉన్నా లేక పోయినా తేరగా ప్రత్యేక హోదాలు కావాలీ అని ఆంధ్రప్రజానీకంలో నుండి పుట్టలేదండీ మాట. అదిస్తాం ఇదిస్తాం మీకు జరుగుతున్న అన్యాయం సరిజేస్తాం భూలోకస్వర్గం చేస్తాం అని హామీలిచ్చి మోసంచేసారే అదికారప్రతిపక్షపార్టీలు, వాళ్ళు ఇస్తామన్నదే ఆ ప్రత్యేకహోదా. అప్పుడు అడ్డురాని అర్థంలేని అర్హతల అడ్డుపుల్లలు తీరా ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకో మనగానే ఎందుకు ఎలా అడ్దం వస్తున్నాయీ అన్నది ప్రశ్న.

ఆవేశం మాకెందుకండీ? అలాంటిదేమీ లేదే. కారుకూతలు ప్రయోగించినది ఎవరో తెలుస్తూనే ఉన్నది. అసమంజసమైన ఆరోపణలతో నెగ్గుకు రావాలని చూడకండి. కోపం శేషేన పూరయేత్ అన్నట్లు మీరు వచ్చి రంకెలు వేస్తే చర్చ పోయి రచ్చ మిగులుతుంది. ఐనా మీరు వచ్చాక ఇంకా చర్చకోసం చూడటం దండగ. అదటుంచి చర్చ ముగిద్దాం అని ముందటి వ్యాఖ్యలోనే చెప్పాను. ఇంకా చెప్పవలసిందీ, మీతో తగవులు పడవలసిందీ ఏమీ లేదు.

Unknown చెప్పారు...

శ్యామలీయం

ఱంకెలు మీకన్నా ఎవరు ఎక్కువగా వెయ్యగలరు గాని అటువంటి తీర్మానం ప్రతి వుంటే ఇవ్వగలరా, చర్చ జరిగినంత మాత్రాన దాన్ని తీర్మానం అనరు. ఒకవేళ జరిగినా తీర్మానం తప్పనిసరిగా నెగ్గాలని ఏ రాజ్యంగంలో వుందో? ఉత్తినే బీపీ పెంచుకునే బదులు కాస్త బుఱ్ఱ ఉపయోగించి పరిశోధన చేస్తే నిజం తెలుస్తుంది! తీర్మానం నెగ్గితేనే విడిపోవాలంటే మెజారిటీవాడితో మైనారిటీ వాడి తీర్మానం నెగ్గడం అసంభవమని లేశమాత్రం ఙ్ఞానం ఉన్నవాడికి కూదా తెలుస్తుంది, మీకెందుకు తట్టడం లేదో మరి? ఇలాంటి మిడిమిడి ఙ్ఞానంతో మిడిసిపడే విభజన వరకూ తెచ్చుకున్నారు. ఇప్పుడూ అదే అఙ్ఞానంతో ప్రత్యేక హోదా అంటున్నారు. ఇప్పటికైనా కాస్త ఎదిగితే మీకే మంచిది.

నీహారిక చెప్పారు...

శ్రీకాంత్ గారూ,

తెలంగాణా ప్రజలు రాజ్యాంగాన్ని మార్చమని చెప్పలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం తమ రాష్ట్రాన్ని పొరుగురాష్ట్రంతో గతంలో కలిపారో ఆ రాజ్యాంగం ప్రకారమే విడదీయమని కోరారు.

ఆంధ్రా ప్రజలు ఓటింగ్ తో తెలంగాణాని కలుపుకున్నారు.తెలంగాణా ప్రజలు ఓటింగ్ అవసరంలేదు సోనియా విభజిస్తే చాలన్నారు. తెలంగాణా రాజ్యాంగం ప్రకారమే ఏర్పాటయ్యిందా ? 23 నిమిషాలు తలుపులు వేసి మూజువాణి ఓటుతో విభజించమని ఏ రాజ్యాంగం లో వ్రాసి ఉంది? ఆ ప్రతి ఎక్కడ ఉంది ? ఒక్కసారి లింక్ ఇవ్వండి.అదే రాజ్యాంగం ప్రకారం అన్నీ సాధించుకోవచ్చు కదా ?

Unknown చెప్పారు...

పోనీ, తలుపులు వేయకుండా పార్లమెంటు జరపాలని రాజ్యాంగంలో ఎక్కడవుందో పోనీ మీరు చెప్తారా? పార్లమెంటు మెంబర్లు ఆకు రౌడీలకన్నా నికృష్టంగా పెప్పర్ స్ప్రేలతో దాడులు చెయ్యడం ఏ రాజ్యాంగంలో వుంది?

Jai Gottimukkala చెప్పారు...

@నీహారిక:

"ఆంధ్రా ప్రజలు ఓటింగ్ తో తెలంగాణాని కలుపుకున్నారు"

వివరాలు & ఆధారాలు ఉంటే ఇస్తారా ప్లీస్?

"3 నిమిషాలు తలుపులు వేసి మూజువాణి ఓటుతో విభజించమని ఏ రాజ్యాంగం లో వ్రాసి ఉంది?"

రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ మీరు చదివితే మీకే తెలుస్తుంది.

మూజువాణీ వోట్లు ప్రపంచమంతా సర్వ సాధారణం. నిన్నటికి నిన్న మీ రాష్ట్రంలో జగన్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్నే మూజువాణీతో తేల్చారు.

ఏ చర్చకు ఎంత సమయం ఇవ్వాలన్నది BACలో నిర్ణయిస్తారు. రాజ్యసభలో ఘంటలు ఘంటలు మాట్లాడారు కదా చాలదా.

నీహారిక చెప్పారు...

@ Jai,

https://en.m.wikipedia.org/wiki/Andhra_State

In the Hyderabad Assembly, on 3 December 1955, 147 of 174 MLAs expressed their view. 103 (including Marathi and Kannada MLAs) supported the merger, 16 were neutral, and 29 opposed it.[citation needed] Among Telangana MLAs, 59 supported the merger and 25 opposed it. Out of 94 Telangana MLAs in the assembly, 36 were Communists (PDF), 40 were INC, 11 were Socialist party (SP), and 9 were independents.[clarification needed] Voting did not take place on the resolution because Telangana proponents insisted on including the phrase "As per the wishes of people" in the resolution.[12][13]

To convince the leadership of Telangana to join the new state, an agreement was reached between the leaders of both sides. This came to be known as the Gentlemen's agreement. The agreement allowed the formation of the State of Andhra Pradesh in 1956, against the SRC's recommendations of waiting until 1961 to get the approval of 2/3 of Telangana State assembly after the 2 cycles of elections in Telangana State.

నీహారిక చెప్పారు...

శ్రీకాంత్ గారు,

విభజించిన పద్ధతి మీకు కరెక్ట్ అనిపిస్తే నేను వాదించేది ఏమీ లేదు.మనం తప్పు చేసామా లేదా అన్న విషయంపై ఎవరి సమర్ధన వారికుంటుంది.అందరికీ ఒకే పద్ధతి ఉండాలన్నదే నా ఆలోచన.మీరు వెళ్ళిన దారిలోనే మేమూ వెళితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

ఆంధ్రులు విడదీయండహో మొత్తుకున్నారో అలాగా వెధవలరా విడిపోతే మిమ్మల్ని చంపేస్తామని బలవంతపు ఐక్యత చాటారో ఇప్పుడు అనవసరం.

మీరు దీన్ని ఆంద్ర-తెలంగాణా అంశంగా చూస్తున్నారేమో నా దృక్పధం వేరే. నాకు అన్ని రాష్ట్రాలు సమానమే. నాది సాటి భారతీయులను "వేరే వాళ్ళు" అని కొట్టేసే స్వభావం కాదు.

దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో 11 ప్రత్యెక ప్రతిపత్తి రాష్ట్రాలు. మిగిలిన వాటిలో బీహార్ లాంటి వాటికి తగిన అర్హతలు ఉన్నాయి. నా తాపత్రయమంతా వారి గురించే.

తెలంగాణా, ఆంధ్రతో సహా అనేక రాష్ట్రాలకు ప్రత్యెక ప్రతిపత్తి అర్హటలలో ఒక్కటీ లేవు. ఈ మాట నేను బహిరంగంగా ఎన్నో సార్లు ఎన్నో చోట్ల (తెలంగాణా చర్చా ఫోరంలతో సహా) అంటూనే వచ్చాను. మీకు మల్లె నన్నెవరూ తెలంగాణ ద్వేషి అనలేదు ఎందుకో ఏమో?

ఆంద్ర కోసం నిబంధనలను మార్చే క్రమంలో ఇటువంటి అత్యంత బీద రాష్ట్రాల ప్రజలు నష్టపోకుండా చూసుకోవడం ఎంతయినా ముఖ్యం. మీ భాషలో చెప్పాలంటే ఆంద్ర ప్రజల ప్రయోజనాలే ప్రయోజనాలా? బీహార్ వాళ్ళందరూ మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలా?

నేను చెప్పిన లోటు మీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి గారు ఇచ్చినవి. మీకు సొంతంగా కానీ నిపుణుల ప్రచురణల నుండి కానీ ఇంతకంటే నాణ్యమయిన గణాంకాలు ఉంటే చెప్పండి.

మీ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమయిన జీడీపీ వృద్ధి ఉందని, అలాగే ఎన్నెన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని, సింగాపూరు తలదన్నే రాజధాని కడుతున్నామని & ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. వీటిలో కొన్నయినా జరిగితే లోటు తరిగి పోవడం ఖాయం.

లోటును భర్తీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆదాయం పెంచడం ఒక వైపయితే దుబారా తగ్గించడం మరో ఎత్తు.

చట్టసభలలో ఎందరో ఎన్నోసార్లు ఎన్నెన్నో వాగ్దానాలు చేసారు. మహిళా రిజర్వేషన్లు, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ లాంటివి ఎన్నో కార్యరూపం దాల్చలేదు. ఇంకా ఎన్నో చట్టాలు కోర్టులలో కొట్టేయబడ్డాయి. Arbitrary decisions will meet the same fate.

రాష్ట్రాలను పక్కన బెట్టి ఒకసారి దేశం గురించి ఆలోచిద్దాం. లక్షల కోట్ల లోటు ఉన్న కేంద్ర ప్రభుత్వం గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తూ పొతే గతేమిటి? దేశం అధోగతికి చేరితో ఆంధ్రులు మాత్రం బాగుపడగలరా?

చివరిగా మీకు నాదొక విజ్ఞప్తి. మీరు ఆంధ్రులందరికీ ప్రతినిధి కానట్టే నేను తెలంగాణా వారందరి ప్రతి మాటకు జవాబుదారీ కాలేను. ఆయనెవరో సినిమా నటుడంట ప్రత్యెక ప్రతిపత్తి ఇవ్వకపోతే దేశం నుండి విడిపోతాం అని బెదిరించాడు. నేను మిమ్మల్ని ఇందుకు సంజాయిషీ అడగనట్టే మీరూ నన్ను ఇతరుల వాదనలు అతికించకండి.

Jai Gottimukkala చెప్పారు...

@నీహారిక:

మీరు చూపించిన వికీపీడియా వ్యాసం ప్రకారమే తీర్మానం మీద వోటింగ్ జరగలేదు ("Voting did not take place on the resolution"). వోట్లు వేయనప్పుడు సంఖ్యలు ఎలా తెలుస్తాయి చెప్మా?

ఇకపోతే వ్యాసంలో ఈ భాగంలో ఆధారాలు లేవు ("citation required"). మీకు తెలుసో తెలీదో కానీ ఈ వాదన చేసేవారు అందరూ వాడే ఆధారం మదరాసు విశ్వవిద్యాలలయంలో ఒకానొక విద్యార్థి 1966లో రాసిన థీసిస్. ఇటువంటివే శ్రేష్టమయిన ఆధారాలు అనుకుంటే వందలాది థీసిసులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి ఉన్నాయి.

అజ్ఞాత చెప్పారు...

''కాంట్రాక్టర్లకు రంగుల్లేవు.. కులమతాలుండవు.. ప్రాంతీయ బేధాలుండవు. ఎవరు తక్కువ కోట్‌ చేస్తే వారికే కాంట్రాక్టులు దక్కుతాయి. రాష్ట్రాల హద్దులే కాదు, దేశాల హద్దులూ కాంట్రాక్టర్లకు వుండవు.''

- ఈ మాటలన్నదెవరో తెలుసా.? తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు.
ఇది 2016. కాలం మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాంట్రాక్టర్ల మెప్పు కోసం తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఏ స్థాయిలో తపిస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? తెలంగాణ ఉద్యమకాలంలో కాంట్రాక్టర్లు రెండు రకాలు. ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఆంధ్రేతర కాంట్రాక్టర్లు. ఈ ఆంధ్రేతర కాంట్రాక్టర్లలో ఎవరైనా వుండొచ్చు. ఆంధ్రా కాంట్రాక్టర్లు మాత్రమే తెలంగాణను దోపిడీ చేశారు. ఇది హరీష్‌రావు సహా, టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణల సారాంశం.

రోజులెప్పుడూ ఒకేలా వుండవు కదా.! అందుకే, హరీష్‌రావు కూడా కాలానికి తగ్గట్టుగా మారారు. ఔను, హరీష్‌రావు ఇప్పుడు మారిన మనిషి. అలా ఇలా కాదు, కాంట్రాక్టర్లకు రంగులుండవట.. కాంట్రాక్టర్లు స్వచ్ఛమైనవారట. కాంట్రాక్టర్లు కులమతాలకతీతమట. హరీష్‌రావు చెబుతోన్న మాటల్ని వింటోంటే, చెవులకు తుప్పు ఏమన్నా పట్టి వుంటే, అది వదిలిపోవడం ఖాయం.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా, ఏవేవో చెప్పారు. తెలంగాణలో ఉద్యమ సెగ రగిల్చారు. ఉద్యమ సెగ అనడం కన్నా, ఆంధ్రోళ్ళ పట్ల వ్యతిరేకత పెంచారు. ఇప్పుడు కాంట్రాక్టర్లు కావాలి. ఔను, తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అనేక ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్ల అవసరం ఏర్పడింది. అందుకే, ఆ కాంట్రాక్టరు ఆంధ్రోడయినా ఫర్వాలేదు. ఆలోచన మంచిదే. అసలు ఇదే వాస్తవం.

కాంట్రాక్టర్ల పేరుతో దోపిడీకి పాల్పడేవారూ కొందరుంటారు. ఏ కాంట్రాక్టర్‌ అయినాసరే, లాభమే చూసుకుంటాడు. ఆ లాభం కోసం ప్రాజెక్టుల్ని అడ్డదిడ్డంగా కట్టేటోళ్ళు ఎక్కడైనా వుంటారు. ఇది వాస్తవం. కానీ, ఈ వాస్తవానికి 'ఆంధ్రా' అనే బూచిని అడ్డంగా పెట్టారు. వాస్తవాల్ని దాచిపెట్టారు. ఇప్పుడు కొత్తగా వాస్తవాలు చెబుతున్నారు.

ఇప్పుడిదంతా ఎందుకొచ్చిందంటే, తెలంగాణలో ప్రాజెక్టుల కోసం ఆంధ్రా కాంట్రాక్టర్లు, ఆంధ్రోళ్ళ సంస్థలూ ఎక్కువగా పోటీ పడ్తున్నాయి. తద్వారా ప్రభుత్వంపై విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అందుకేనేమో, హరీష్‌రావు ఇలా తనలోని 'మారిన మనిషి'ని బయటపెట్టారు. ప్రాజెక్టులు - అవినీతి.. అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరవుతున్న టీఆర్ఎస్ సర్కార్.. కాంట్రాక్టర్లకున్న ’రంగు‘ని తొలగించి.. క్లీన్ సర్టిఫికెట్ పొందేందుకు పడ్తున్న పాట్లు.. హరీష్ రావు మాటల్లో స్పష్టమవుతోంది

Chaitanya చెప్పారు...

జైగారు,

అంధ్రాకి ప్రత్యేకహోదా అర్హత ఉందా లేదా అనే గొడవ కాదిది నిజానికి. ఆ అర్హతలు నిన్నమొన్న పెట్టినవి కాదు కదా. విభజన బిల్లు అప్పుడు ఇస్తామని అన్నవారికి, మేమైతే ఇంకా ఎక్కువ ఇస్తామని ఎగిరినవారికి ఈ అర్హతల సంగతి తెలీదా. మరి ఇస్తామని ఎలా చెప్పారు, ఎన్నికల్లో ఎలా ఊదరగొట్టారు. ఇప్పుడు అందరూ అడుగుతున్నది అదే. ఇవ్వలేమని తెలిసీ ఇస్తామని చెప్పారంటే తర్వాత మోసం చేయొచ్చనే ఆలోచనే కదా. దానినే నిలదీస్తున్నారు. ఇది ఆంధ్రాకి ప్రత్యేక హోదా అర్హత ఉందా లేదా అని కాదు, బీజేపీ, కాంగ్రెస్‍లకి ఉన్న ఆంధ్రులని సులభంగా మోసం చేయొచ్చనే భావంపట్ల ఆగ్రహం.

ఇస్తామని చెప్పింది సాక్షాత్తు ఘనతవహించిన అప్పతి భారత ప్రధానమంత్రిగారు, రెండు జాతీయపార్టీలు పోటీలుపడి పక్క వాయిద్యాలు వాయించాయి ఇస్తామంటూ. ఇప్పటి ప్రధాన మంత్రిగారు ఎన్నికల్లో ఊదరగొట్టారు. ఇస్తామన్న మాట తప్పారేమిటని ఇప్పుడు నిలదీస్తున్నాం. అలా అడగటం అన్యాయమనే మీ వాదన బొత్తిగా మిస్‍ప్లేస్డ్. సాధ్యాసాధ్యాలు చూసుకోవలసింది వాగ్ధానం చేసినవారు గానీ, పొందినవారు కాదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన అలవికాని ఎన్నికల వాగ్ధానాలు మీద నిలదీయటం లేదా. మనకి తెలీదా అవి అలవికానివని, పూర్తిగా సాధ్యంకావని? తెలిసినవారిది, తెలిసీ ఎందుకు మాటిచ్చారని నిలదీత. తెలీనివారిది, నమ్మి మోసపోయామనే ఆగ్రహం. ఇద్దరిదీ న్యాయమైన ఆగ్రహమే. ఆంధ్రాకి ప్రత్యేకహోదా రాకపోయినా నాకు తెలిసి కొంపలు మునిగిపోయేదేమి లేదు. మెల్లగా లోటు తీరిపోతుంది. కానీ చెప్పి మాటతప్పి మళ్ళీ ఓట్లకి వచ్చే పార్టీలని నిలదీయటం ఆంధ్రుల న్యాయమైన హక్కు.

Jai Gottimukkala చెప్పారు...

@Chaitanya:

బాగున్నారా బహుదిన దర్శనభాగ్యం!

అందరూ తెలిసే అబద్దాలు చెప్పారు. మనవాళ్ళు కూడా గుడ్డిగా నమ్మే బదులు కాస్త కూడా చేయలేదు. నేను ఇదే మాట ఆరోజునే అన్నాను: నువ్వు తెలంగాణా వాడివి నీకెందుకు అని బ్లాగ్మిత్రులు అప్పుడూ అన్నారు.

రాజకీయ నాయకులు ఆంధ్రులనే కాదు అవకాశం దొరికితే అందరినీ మోసం చేస్తారు. బీహార్ రాష్ట్రానికి ఇస్తానన్న భారీ పాకేజీలో ఒక్క దమ్మిడీ రాలేదు.

Eternal vigilance is the price of democracy. I prefer taking every promise with a bucket (not pinch) of salt & check the facts myself. This is why I did not celebrate (rightly as it turned out) the night of December 9.

అజ్ఞాత చెప్పారు...

@శ్యామలీయం
I always wonder about your meddling with the pre-programmed robots, which CAN only deliver/repeat (utter as in children's toys) which is there by deFAULT. Why I wonder is - your questioning them, even though you know about the answers you are going to get, in beforehand. Hhhh..............

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాత గారూ,
Several of these pre-programmed robots may been variously loaded with bad programs. Some could debugged and patched up to behave well, some may need serious reprogramming, some may, as you said, could be beyond both approaches. But, as such, all of them propagating bad-information to pollute the surroundings.

అజ్ఞాత చెప్పారు...

అందరూ తెలిసే అబద్దాలు చెప్పారు!
అబద్ధాలు చెప్పటానికి అందరూ తెలంగాణా వాళ్ళా?

Chaitanya చెప్పారు...

@ Jai Gottimukkala,

"రాజకీయ నాయకులు ఆంధ్రులనే కాదు అవకాశం దొరికితే అందరినీ మోసం చేస్తారు." - అవును. అందుకే ఒకచోట పార్టీ సంకనాకిపోతే మిగతాచోట/మరోసారి ఒళ్ళు దగ్గరపెట్టుకుంటారు.

"Eternal vigilance is the price of democracy. I prefer taking every promise with a bucket (not pinch) of salt & check the facts myself." - ఇండియాలాంటి దేశంలో ఎక్కువమంది ప్రజలకి అంత విజిలెంట్‍గా ఉండటం సాధ్యం కాదు, వారు నమ్ముతారు. వారి కళ్ళు తెరిపించటం కష్టంగానీ, రాజకీయులని నిలదీయటం సులువు. ప్రజలు గుడ్డిగా నమ్ముతారు కానీ ఆ తర్వాత మన పీక పట్టుకుంటారనే భయం రాజకీయ పార్టీలకి కలిగితే మంచిదే.