20, ఆగస్టు 2012, సోమవారం

హనుమంతుడి టి.ఏ. బిల్లు


హనుమంతుడి టి.ఏ. బిల్లు
లంకలో  రామ రావణ యుద్ధం ముగిసింది. లంకేశ్వరుడి మరణం తరువాత రాముడు పుష్పక విమానంపై  అయోధ్యకు తిరిగివచ్చి ఘనంగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ కోలాహలంలో పాత టియ్యే బిల్లులు సకాలంలో క్లెయిం చేసుకోకపోతే ఆ తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని అయోధ్యలో అనుభవశాలి ఒకరు సలహా చెప్పడంతో  ఆంజనేయుడు ఎందుకయినా మంచిదని ముందుగానే తన బిల్లును సబ్మిట్ చేసాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు సంజీవని మూలికను తేవడానికి వెళ్ళివచ్చినప్పటి ప్రయాణ భత్యం బిల్లు అది.
టియ్యే బిల్లు సెక్షన్లో పనిచేసే డీలింగ్ అసిస్టెంట్ తన బుద్ధి పోనిచ్చుకోకుండా అలవాటు ప్రకారం మూడు కొర్రీలు వేశాడు.
హనుమంతుడు ఈ టూరుకు ముందుగా అప్పటి రాజయిన భరతుడి  లిఖితపూర్వక అనుమతి తీసుకోలేదన్నది మొదటి అభ్యంతరం కాగా, అంజనీ సుతుడికి తన ఉద్యోగ హోదా రీత్యా విమానంలో (గాలిలో) ప్రయాణించే అర్హత లేదన్నది రెండోది. ముందస్తు అనుమతి తీసుకోకుండా గాలిలో యెగిరి వెళ్లి సంజీవని తీసుకువచ్చాడు. అందువల్ల అతడు సబ్మిట్ చేసిన బిల్లు నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యం కాదు. పోతే, అతడ్ని, సంజీవని మూలికను మాత్రమే తీసుకురమ్మని పంపారు. కానీ మొత్తం సంజీవని పర్వతాన్నే అంజనేయుడు తీసుకువచ్చాడు. పై అధికారుల ముందస్తు అనుమతి లేకుండా సొంత నిర్ణయం ప్రకారం తెచ్చిన అదనపు బాగేజ్ అలవెన్సును మంజూరు చేయడానికి రూల్స్ ఒప్పుకోవని  రాసేసి  డీలింగు అసిస్టెంటు ఫైలును  మూసేశాడు.
“రామనామం తప్ప వేరేదీ రుచించని వాయునందనుడికి ఈ డీలింగ్ అసిస్టెంట్ వ్యవహారం సుతరామూ  రుచించలేదు. ముడతపడిన మూతిని మరింత ముడుచుకుని గబా గబా  వెళ్లి రామచంద్రులవారికే విషయం వివరించాడు. సాక్షాత్తు రాముడికే నమ్మిన బంటు అయిన తన విషయంలోనే ఇలా జరిగితే రామ పాలనను నమ్ముకున్న షరా  మామూలు జనం మాటేమిటని రాజును  నిలదీశాడు.
రాముడికి హనుమంతుడంటే ఎంతో ఇది. కానీ నియమనిబంధనలంటే కూడా ఇంకెంతో ఇది. ‘రూల్స్ ఒప్పుకోకపోతే రాజు మాత్రం ఏం చేస్తాడు? ఏం చెయ్యలేన’ని రాంబంటు మొహం మీదే చెప్పేసాడు.
పక్కనవున్న లక్ష్మణుల వారికి రాముడి వైఖరి చూసి వొళ్ళు మండింది. ఆరోజు పవన సుతుడు అమాంతంగా యెగిరి వెళ్లి సంజీవని తీసుకురాకపోతే తానీపాటికి స్వర్గంలో సభ తీరుస్తుండేవాడినన్న వాస్తవం గుర్తుకు తెచ్చుకుని మరింత మండి  పడ్డాడు.
ఆ కృతజ్ఞతతో లక్ష్మణుడు నేరుగా డీలింగ్ అసిస్టెంటుతోనే డీల్ చేసాడు.  ఏదోవిధంగా పని సానుకూలం అయ్యేట్టు చూడమని కోరాడు. బిల్లు శాంక్షన్ చేస్తే బిల్లు మొత్తంలో పది శాతం ఆమ్యామ్యా కూడా ఇస్తానని ప్రలోభపెట్టాడు.

అడుగుతోంది సాక్షాత్తూ రాజుగారి అనుంగు తమ్ముడు. పని చేయమంటోంది కూడా పుణ్యానికి  కాదు. ముట్టాల్సింది కూడా ముడుతున్నప్పుడు పనిచేయకపోవడానికి కారణం ఏముంటుంది కనుక.
డీలింగ్ అసిస్టెంటు మళ్ళీ ఫైల్  బయటకు తీసి  ఇలా తిరగరాసి పైకి పంపాడు.
‘కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఈ కేసును తిరిగి మరోమారు పరిశీలించడం జరిగింది.
‘హనుమంతులవారు ఈ టూరుపై  వెళ్ళిన సమయంలో భరతులవారు రాములవారి రాజ ప్రతినిధిగా రాజ్యం చేస్తున్నారు. అప్పటికి ఆయన పూర్తిస్తాయిలో రాజుగారి హోదాలో లేరు. రాములవారి ఆదేశం మేరకే ఆనాడు ఆంజనేయులవారు  ఈ అధికారిక పర్యటన మీద వెళ్లారు. శ్రీవారు స్వయంగా ఆదేశించారు కాబట్టి, అది కూడా అత్యంత జరూరుగా జరగాల్సిన రాచకార్యం కాబట్టి, ఈ పర్యటనకు మామూలుగా వుండే నిబంధనలు వర్తించవు. కాబట్టి ఈ బిల్లును యధాతధంగా ఆమోదించడమైనది. అలాగే ఆయన క్లెయిం చేసిన  ఎయిర్ ట్రావెల్ ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడానికి ముందస్తు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భావించడం జరిగింది.
‘పోతే, అదనపు బాగేజీకి సంబంధించి చెల్లింపు విషయంలో గతంలో లేవనెత్తిన అభ్యంతరాన్ని సయితం పునః సమీక్షించడం జరిగింది. హనుమాండ్లు గ్రూప్ ‘డి’ కేటగిరీ ఉద్యోగి కనుకన్నూ, మూలికలను గుర్తించగలిగే సామర్ధ్యం వుండడానికి అవకాశం లేదు కనుకన్నూ, పొరబాటున తప్పుడు మూలికను తీసుకువచ్చిన పక్షంలో మరికొన్నిసార్లు అక్కడికి వెళ్లి రావాల్సిన పని పడే అవకాశం వుందికనుకన్నూ, అలాటి ప్రయాణాల వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం పడే  అవకాశాలు లేకపోనూ లేవు కనుకన్నూ – ఈ అన్ని విషయాలను, ఖజానా భారాన్ని  సాకల్యంగా, సవివరంగా  పరిశీలించి, ‘ప్రజాప్రయోజనాల’ దృష్ట్యా ఈ బిల్లును పాసు చేయాలని సిఫారసు చేయడం జరిగింది.”
అంతే!  ఫైలు ఆఘమేఘాల మీద కదిలింది. అనేక విభాగాలు చుట్టబెట్టింది. బిల్లు ఆమోదానికి అందరూ ‘ఎస్’ అన్నవాళ్ళే. ‘నో’ అన్న వాళ్లు ఒక్కరూ లేరు. అందుకే ఒక్క రోజులోనే టియ్యే డబ్బులు హనుమంతుడి ఖాతాలో   పడ్డాయి.

(గమనిక: ‘నెట్’ సంచారం చేస్తున్న ఓ ఇంగ్లీష్  ఆర్టికిల్ ‘ఏల్చూరి’ వారి  కంటబడింది. ఆయన పంపగా నా వద్దకు చేరింది. చదివి వూరుకోకుండా దాన్ని తెలుగులో గిల్లి చూసాను. అదే ఇది – భండారు శ్రీనివాసరావు - 20-08-2012)

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది.లా ఉంది,not approved, not(e) approved, e తరవాత చేర్చి కధ నడిపించినట్లు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@kastephale - thanks

Nandiraju చెప్పారు...

ఈ కథ వింటుంటే "రాముని పాలన" జరిగిన ఆ రోజుల్లో కూడా ముందు అంతా 'వై' అని ప్రశ్నించినవారు లేకుండా మొత్తమంతా 'ఎస్' గా జరిగిపోయిందని అర్ధమవుతున్నది. అది మళ్ళీ - వై.ఎస్ - గా పునరావృతమై "దేవునిపాలనగా" ముగిసిందనిపిస్తోంది..

శ్యామలీయం చెప్పారు...

నా చిన్నప్పుడు, ౬౦వ దశకం మొదట్లో, ఒక చెప్పుల కంపెనీవారు మహావిష్ణువు కాలెండరు ఒకటి ముద్రించారు. విశేషం యేమిటంటె అందులో విష్ణుమూర్తిగారు హవాయి స్లిప్పర్స్ తొడుక్కుని ముసిముసి నవ్వులు చిందిస్తూ దర్శనం ఇస్తారు. అప్పట్లో జనం ముక్కున వేలేసుకున్నట్లు విన్నట్లు గుర్తు.

దేవుళ్ళకూ వాళ్ళభక్తాగ్రగణ్యులకూ మన ఆధునిక పోకడలు అన్నీ అంటించి మరీ ప్రెజెంట్ చేయగల సత్తా మనకు నిక్షేపంగా ఉందని ఒప్పేసుకోవాలి ఆ దేవుళ్ళయినా.

నన్నయగారు అర్జునుని వేంగీ సామ్రాజ్యానికి తీసుకుని వచ్చారు - అంటే రాజమహేంద్రవరానికి. విప్రనారాయణుని కథను సారంగుతమ్మయగారు తమిళనాడు నుండి కటక్ పట్టుకెళ్ళి నడిపించారు. ఓఢ్రులు పురాణవాంగ్మయంలో యెక్కడా లేని రాధను సృష్టించి కృష్ణునికి అంటకట్టెశారు - దాంతో రాధాకృష్ణుడైపోయాడాయన.గోనబుధ్ధారెడ్డిగారు రాముడి చుట్టు బోలెడూ కథలల్లాడు.

మనశక్తి కొద్దీ మనం కూడా.
బాగుంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం- మన పురాణాలను ఆక్షేపించే విధంగా కధలల్లడం కొత్తేమీకాదు. అసలు పౌరాణిక గాధలకు తమ చిత్తం వచ్చిన రీతిలో అనేక ప్రక్షిప్తాలను పొందుపరచిన కవులనేకమంది మనకు కనిపిస్తారు. ఇక్కడ రాముడు, హనుమంతుడు అనే పాత్రలు కేవలం అలంకారం. పైసలు వెదజల్లితే నియమ నిబంధనలు యెలా మారిపోతాయన్నది చెప్పడమే ఇక్కడ ప్రధానం. అంతే కాని ఆ పురాణ పురుషులను తేలిక చేసి చూపడం కాదు అని గమనించ మనవి.