కొత్త కుటుంబం
‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు
ప్రారంభమయ్యాయి. ఆ పనికి పూనుకుంది కూడా ఎవరో కాదు నా కన్నతల్లే కావడం విధి
విచిత్రం’
‘కధలెలా రాయాలి’ అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం
చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ
ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను
యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’
అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని
భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని
అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా
పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది.
ఆరుద్ర గారిలా కాకపోయినా నేను చెప్పబోయే ఈ కధ ముగింపు
బాగానే ఉంటుందనుకుంటున్నాను.
నా చిన్నతనంలో మా ఇంటికి ఓ కొత్త అతిధి ఒకరు వచ్చారు. వచ్చారు అనడం కంటే
తీసుకు వచ్చారు అంటే బాగుంటుందేమో. ఆ రోజుల్లో మాది ఓ చిన్న బస్తీ. బజారు పనిమీద
వెళ్ళినప్పుడు కనబడిన ఈ అతిధి మా నాన్నను
ఇట్టే ఆకర్షించాడు. రోజూ ఒకసారయినా పనిపెట్టుకుని బజారుకు వెళ్లి అతగాడిని చూసివస్తుండేవాడు. అలాటిది ఒకరోజు ఏమయితే
అయిందని అతడిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు.
ఆ రోజుల్లో
మాది ఓ చిన్న బస్తీ. బజారు పనిమీద వెళ్ళినప్పుడు కనబడిన ఈ అతిధి మా నాన్నను ఇట్టే ఆకర్షించాడు. రోజూ
ఒకసారయినా పనిపెట్టుకుని బజారుకు వెళ్లి అతగాడిని చూసివస్తుండేవాడు. అలాటిది ఒకరోజు ఏమయితే
అయిందని అతడిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు. అంతే! అతడి రాకతో, ఆ రోజునుంచి మా ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది.
అతిధి అంటే ఒకటి రెండు రోజులుండి పోయేవాడు.
అదేమి చిత్రమో కాని, వచ్చిన వాడు వచ్చినట్టే టంకంలా మా ఇంటికి అతుక్కుపోయాడు.ఇంట్లో అడుగు
పెట్టిన కొత్త అతిధి, కొత్తా పాతా తేడాలేకుండా
ఇంటిల్లిపాదినీ ఇట్టే
ఆకట్టుకున్నాడు. కధ అంతటితో ఆగలేదు. ఇరుగింటి వాళ్ళు,పొరుగింటివాళ్ళు చిన్నా పెద్దా అంతా కట్టగట్టుకుని అతడి ముచ్చట్లు వినడానికి మా ఇంటి మీదికి ఎగబడేవారు. మొదట్లో ఉదయం ఓ గంటా సాయంత్రం ఓ రెండు గంటలు కాబోలు అందరితో
కలుపుగోలుగా మసలుకునేవాడు. ఆ తరువాత మాత్రం ముంగిలా ముసుగేసుకుని తొంగునేవాడు. ఎవరితో
మాట్లాడేవాడు కాదు. కొన్ని సార్లు అతడి మాటలు అర్ధం అయ్యేవి. మరికొన్నిసార్లు
అర్ధం అయినట్టు వుండేవి. ఇంకొన్ని సార్లు అతడు ఏం మాట్లాడుతున్నాడో, యే భాషలో
మాట్లాడుతున్నాడో తెలిసేది కాదు. అర్ధం కాకపోయినా అతడి మాట తీరు అందరికీ నచ్చేది. ఇది అది అని లేకుండా చరిత్ర, లెక్కలు, పురాణాలు ఏది కదిల్చినా వాటిల్లో
అతడికున్న పరిజ్ఞానం మాత్రం అమోఘం. సినిమా
కబుర్లు మొదలు పెట్టాడంటే చాలు ఇక వాటికి అంతూపొంతూ
వుండేది కాదు.
నాకయితే అతడు మంచి స్నేహితుడిగా మారిపోయాడు.మొదట్లో
మాదిరిగా ఉదయం, సాయంత్రం అన్న పద్ధతికి స్వస్తి చెప్పి పొద్దస్తమానం కబుర్లతో కాలక్షేపం చేసేవాడు.అలా
అస్తమానం అతడితో గడుపుతూ అతడు చెప్పే
కబుర్లు వింటూ వుండడం మా అమ్మానాన్నకు పోను పోను నచ్చేది కాదు. ఎందుకంటే అతడు
చిన్న పిల్లల కధలు మాత్రమే కాదు ఒక్కోసారి రాత్రి పొద్దుపోయిన తరువాత వీలుచూసుకుని
కొన్ని పెద్ద పెద్ద ముచ్చట్లు కూడా చెప్పేవాడు. ముందు ఛీ పాడు
అనుకునే దాన్ని. కానీ రానురాను అతడు
చెప్పే ఆ మాటల్లో నాకు తెలియకుండానే ఆసక్తి
పెరగడం మొదలయింది. ఇదంతా మా అమ్మనాన్నకు
రుచించేది కాదు. ‘అస్తమానం అతడితో ఏమిటా కబుర్లు. బుద్దిలేకపోతే సరి’ అని మా అమ్మ
కసురుకునేది కూడా.
చూస్తుండగానే యాభయ్ ఏళ్ళు గడిచిపోయాయి. అతిధిగా ఇంట్లో కాలుమోపిన
అతడు రోజులు గడుస్తున్నకొద్దీ అభ్యాగతి గా మారిపోయి ఇప్పుడు అదే ఇంట్లో ఓ మూలన పడివున్నాడు.
ఇప్పటికీ కబుర్లకు కొదవ లేదు. వినేవాళ్ళకే కొరత. విశేషం ఏమిటంటే మొదట్లో విసుక్కున్న మా
అమ్మ ఇప్పుడు అతడి రంధిలో పడిపోయింది. అతడు చెప్పే అత్తాకోడళ్ళ కధలంటే
చెవికోసుకునేవరకు వెళ్ళిపోయింది. మా నాన్నా అంతే. అతడిని చూస్తే చిరాకుపడే వాడల్లా
ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పేపరు చదవడం కూడా మానేసి అతడు చెప్పే రాజకీయాలు వింటూ కూర్చుంటున్నాడు.
ఇంతకీ పేరు చెప్పడం మరచిపోయినట్టున్నాను కదూ. అందరికీ
తెలిసిన పేరే. అతడి అసలు పేరు టీవీ.
జాతకనామం దూరదర్శన్. కాలం
గడుస్తున్నకొద్దీ అర్జునుడి మాదిరిగానే
రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూటకో ఛానల్ పుట్టుకొస్తున్న ఈ
రోజుల్లో ఇప్పుడు రోజుకో పేరు. కొద్దికాలం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అతడి
భార్య పేరు కంప్యూటర్. ముగ్గురు పిల్లలు. పెద్దాడి పేరు ఇంటర్నెట్. రెండో సంతానం
సెల్ ఫోన్. కొత్తగా ఓ మనవడు వచ్చాడు వాళ్ల కుటుంబంలోకి. అతడికి ముద్దుగా ఐ పాడ్
అని నామకరణం చేశారు.
మా పాత కుటుంబంలో ప్రవేశించిన ఈ కొత్త కుటుంబం
తామరతంపరగా పెరిగిపోతూనే వుంటుందేమో.
(26-07-2012)