26, జూన్ 2012, మంగళవారం

అనగనగా ఓ మేక కధ


అనగనగా ఓ మేక కధ

అనగనగా ఓ వూరు. ఆ వూర్లో ఓ రైతు. ఆ రైతు దగ్గరో గుర్రం. దానికి తోడు ఓ మేక.
ఆ గుర్రానికి వున్నట్టుండి జబ్బు చేసింది. యజమాని పశువుల వైద్యుడికి కబురు చేసాడు.
అతడొచ్చి గుర్రానికి పరీక్షలు చేసాడు. జబ్బు బాగా ముదిరిందని నిర్ధారించుకున్న వైద్యుడు రైతుతో చెప్పాడు.
‘నేను మళ్ళీ రేపు వస్తాను. వరసగా మూడు రోజులు మందిస్తాను.  మూడు రోజుల్లో నేనిచ్చిన మందు పనిచేసిందా సరి లేకపోతే ఇక అది బతకడం కష్టం’ అని తేల్చి చెప్పాడు.
పక్కనే వున్న మేక ఆ సంభాషణ విన్నది. పోయి గుర్రంతో చెప్పింది.        
“నువ్వు ఎలాగో అలా ఓపిక తెచ్చుకుని మామూలుగా వుండాలి సుమా!  ఇలాగే వున్నావంటే ఇక నువ్వు ఎందుకూ పనికి రావని తీర్మానించుకుని ప్రాణాలతో వుండగానే గొయ్యి తీసి నిలువునా పాతేస్తారు. నీ ఇష్టం.”
రెండో రోజు వైద్యుడు మందిచ్చి వెళ్ళిన తరువాత కూడా గుర్రం కదలలేదు. మేక మళ్ళీ వచ్చి హిత బోధ చేసింది.
“చూడు మిత్రమా! ఎంతో కొంత ఓపిక చేసుకో. వైద్యుడు వచ్చేవేళకు కాస్త లేచి తిరుగు. లేదంటే మందు  పని చేయడం లేదనుకుని నిన్ను పాతి పెడతారు. నా మాట విను” అంది.   
వైద్యుడు మూడో రోజు కూడా వచ్చాడు. యధాప్రకారం ఇవ్వాల్సిన మందు ఆఖరి మోతాదు కూడా ఇచ్చాడు. ఇచ్చి రైతుతో చెప్పాడు.
“నేను చేయాల్సిన ప్రయత్నం చేసాను. రేపు ఉదయం మరో సారి వస్తాను. అప్పుడు కూడా ఈ పరిస్తితే వుంటే ఇక చేయగలిగింది ఏమీ వుండదు, గుర్రాన్ని గొయ్యి తీసి పూడ్చి పెట్టడం మినహా. ఎందుకంటే ఈ గుర్రానికి వచ్చింది  ఆషామాషీ రోగం కాదు. అంటు  వ్యాధి. అది ఇతరులకు సోకకుండా వుండాలంటే ఇంతకంటే మార్గం లేదు.”
వైద్యుడిని సాగనంపడానికి రైతు వెళ్ళగానే మేక వచ్చి మళ్ళీ గుర్రంతో పోరు పెట్టింది.
“ నా మాట విను మిత్రమా! నువ్వు ఇక ఎందుకూ  పనికిరావని  వీళ్ళకు అర్దమయింది. ఏదో  ఇన్నాళ్ళబట్టి ఒకరికొకరం కష్టాలు, సుఖాల్లో తోడు నీడగా ఓ చోట వుంటున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఏదో విధంగా ఓపిక చేసుకో. నెమ్మదిగా లేచి నిలబడు. అలాగే. అలాగే. నెమ్మదిగా ఒక్కొక్క కాలు కూడదీసుకుని నిలబడు. అమ్మయ్య నా మాట ఇన్నాల్టికి నీకు అర్ధం అయినట్టుంది. ఎలాగో అలా లేచి నిలబడ్డావు. అలాగే శక్తి కూడదీసుకుని లగెత్తి పారిపో. ఇక్కడ వున్నావంటే నీకు చావు తప్పదు. ముందు అది గుర్తు పెట్టుకో.”             
“నాకు తెలుసు. పరుగు పందెంలో నిన్ను మించిన వాడు లేడు. మొదలు పెట్టిన పరుగు ఆపకు. అలాగే పరిగెట్టు.” అని సంతోషంతో ఉత్తేజపరచసాగింది.
గుర్రం లేచి ఇంటి పెరడులో పరిగెత్తుతుండగానే రైతు తిరిగివచ్చాడు. ఆ దృశ్యం చూడగానే అతడికి మహాదానందం అనిపించింది. మృత్యు ముఖంలో ప్రవేశించిన గుర్రం లేచి పరుగులు తీస్తూ వుండడం గమనించిన  సంతోషంలో భార్యను కేకేసి చెప్పాడు.
“మందు పనిచేసింది. గుర్రం తేరుకుంది. ఈ ఆనందాన్ని ఇరుగూ పొరుగుతో కలసి పంచుకుందాం. ఈ రాత్రే విందు భోజనానికి ఏర్పాట్లు చేయి. మేకను కోసి అందరికీ వండి పెట్టు.”
ఇది విన్న మేక ప్రాణాలు పైనే పోయాయి. (26-06-2012)
        

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Hahahhaha...

Wow.. excellent.

Alapati Ramesh Babu చెప్పారు...

కథ బాగున్నది. ఓ హెన్రీ శైలి గుర్తుకు తెచ్చింది.భలే ట్విస్ట్.

అజ్ఞాత చెప్పారు...

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే!

అజ్ఞాత చెప్పారు...

మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదే కామోసు. ఇంతకీ మీ ఉద్దేశంలో గుర్రం ఎవరు, మేక ఎవరు?

www.apuroopam.blogspot.com చెప్పారు...

కథ భలేగా ఉంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత,Alapati Ramesh Babu,Kastephale,Puranapandaphani,Pantula gopala krishna rao - ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

idi sagatu manishiki prateeka. manamu edi chesina,adi manaku nashtam gaanu gurrallanti pettubadidaarulaku labham gaanu parinamistadi. be it inflation, stagnation or deflation. nice story line.