2, మార్చి 2012, శుక్రవారం

పీత కష్టాలు పీతవి


పీత కష్టాలు పీతవి
ముని శాపగ్రస్తుడయిన కుబేరుడు భూలోకంలో మానవరూపంలో ముఖేష్ అంబానీగా అవతరించి తండ్రి ధీరూభాయ్ అంబానీ  స్తాపించిన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి, అపర కుబేరుడిగా పేరు గాంచి, ఆ క్రమంలో  పోగేసుకున్న అపార ధనరాశులతో ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచించి,  ఏదో ఒకటి చేయకపోతే బాగుండదనిపించి, భార్యాబిడ్డలతో చర్చించి, కోట్లకు  కోట్లు వెచ్చించి  ముంబై లో  ఏకంగా ఇరవై ఏడు అంతస్తుల రమ్యహర్మ్యాన్ని నిర్మించుకుని సుఖంగా జీవిస్తున్న తరుణంలో – ఆ వైనాన్ని ఓ గిట్టని పత్రిక వైనవైనాలుగా  వర్ణించి రాసి జనం మీదకు వొదిలింది. ఆ కధాక్రమంబెట్టిదనిన - -
ముఖేష్ అంబానీ తన నివాస భవనంలో పదిహేనో అంతస్తులో వున్న పడకగదిలో నిద్రిస్తాడు. నిద్ర లేచిన తరువాత పదిహేడో అంతస్తుకువెళ్లి అక్కడ వున్న  జిమ్ లో వ్యాయామం చేసి అక్కడే నిర్మించుకున్న అందమైన  అధునాతన నీటి  కొలనులో ఈత కొడతాడు.  పందొమ్మిదో అంతస్తులో బ్రేక్ ఫాస్ట్ ముగించి పద్నాలుగో అంతస్తులో దుస్తులు ధరించి ఇరవై ఒకటో అంతస్తుకు వెడతాడు. అక్కడవున్న బ్రీఫ్ కేసు, అవసరమయిన ఫైళ్ళు తీసుకుని పదహారో  అంతస్తులో వెయిట్ చేస్తున్న భార్యకు టాటా చెప్పి పదమూడో అంతస్తుకు వెళ్లి  స్కూలుకు వెళ్ళడానికి తయారవుతున్న పిల్లలను పలకరిస్తాడు. ఆ తరువాత మూడో అంతస్తులో పార్కుచేసివున్న రెండున్నర కోట్ల రూపాయలు ఖరీదుచేసే మెర్సిడెస్ కారెక్కి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వెడతాడు.
ఇంతవరకూ కధ బాగానే వుంది. కానీ విధి విచిత్రమైనది కదా. ప్రతిరోజూ ఒకేరకంగా వుండదు. కదా!. అందుకే ఓ రోజు అది అడ్డంగా  అడ్డం తిరిగింది. ఆ సంగతే ఆ పత్రిక రాసింది. ఆ కధనం ప్రకారం ఓ రోజు యధావిధిగా అన్ని అంతస్తుల్లో తన దినసరి దిన చర్యలను ముగించుకుని కారెక్కడానికి  మూడో అంతస్తుకు చేరుకున్న ముఖేష్ కు కారు తాళాలు మరిచివచ్చిన సంగతి లేటుగా గుర్తుకు వచ్చింది.
వాటిని ఎక్కడ మరచిపోయినట్టు?
పదిహేనో అంతస్తులోనా ? లేక పదిహేడులోనా!  పదా! పద్నాలుగా! ఇరవై ఒకటో అంతస్తులోనా లేక పదహారులోనా! లేదా పదమూడో అంతస్తులో పిల్లలను పలకరించి  వస్తున్నప్పుడా? ఎక్కడ మరచిపోయినట్టు. ఆలోచిస్తూ  తల గోక్కుంటే తండ్రి వారసత్వంగా వచ్చిన బట్ట తల తగిలింది కాని  తాళాలు గురించిన లైటు మాత్రం వెలగలేదు.
కానీ అంబానీనా! మజాకా!
అపర కుబేరుడి కారు తాళాల కోసం  ముమ్మరంగా గాలింపు మొదలయింది. అన్ని అంతస్తుల్లోవున్న  సిబ్బంది చేతుల్లో వున్న  ఫోన్లు మోగాయి. నౌకర్లు, చాకర్లు, బట్లర్లు, సెక్రెటరీలు, జిమ్ ట్రైనర్లు,  వంటవాళ్ళు, వార్పువాళ్ళు, క్లీనర్లు, డ్రైవర్లు, లిఫ్ట్ అటెండెంట్లు ఒకరా ఇద్దరా లెక్కకు మిక్కిలిగావున్న పనివాళ్ళ ఫోన్లన్నీ ఒకేసారి మోగాయి. కానీ ఏం లాభం? తాళం చేతుల జాడ లేదు.
కాలమే ధనంగా  భావించి అనుక్షణం సంపాదనలో మునిగితేలే అంబానీ క్షణం ఆలశ్యం చేయకుండా, ఆ రోజుకు సరిపెట్టుకుని  ఓ కోటి మాత్రమే కిమ్మతు చేసే మరో  చిన్న కారులో డ్రైవర్ను వెంటపెట్టుకుని తన పనిపై తాను  వెళ్ళిపోయాడు. 
అంతటితో ముగిస్తే కధ ఏముంది?
అంబానీ సిబ్బంది అందరూ కళ్ళల్లో కాగడాలు పెట్టుకుని  కారు తాళాల అన్వేషణ ఆ తరువాత కూడా కొనసాగించారు. ఆ క్రమంలో మరో ఆసక్తికరమయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బట్టలు ఉతకడానికి కొత్తగా పనిలో కుదిరిన ఓ పనిమనిషి కారు తాళాలున్న అంబానీ గారి ప్యాంటును  తాళాలతో సహా  ఉతికి ఝాడించి పదహారో అంతస్తులో ఆరేసింది. అలా ఆరేసిన ఆ ప్యాంటు, అక్కడ వీస్తున్న చల్లని  హోరు గాలికి ఎగిరిచక్కా పోయింది. ఆ విధంగా, ప్యాంటు  సమేతంగా కోటిన్నర రూపాయల కారు తాళాలు కూడా గాలిలో కలిసిపోయాయి.
కధ అంతటితో ఆగిందా. ఆగితే కధ ఎందుకవుతుంది.



ఆ రోజు రాత్రి పదహారో అంతస్తులో పడుకుని, అత్తగారిని విషం పెట్టి చంపాలని చూసే కోడలు పిల్ల ప్రయత్నాలను   టీవీ సీరియల్  నాలుగువందల నలభయ్యో ఎపిసోడ్ చూసి, పీడ కలలతో  నిద్రపట్టక కలత నిద్రలో  దొర్లుతున్న అంబానీ అర్ధాంగికి పైన ఏదో శబ్దం వినిపించి లేచి చూసింది. క్లోజుడ్ సర్క్యూట్ టీవీ తెరపై  భవనం పై భాగంలో హెలిపాడ్ పై  దిగుతున్న  హెలికాప్టర్ కన్పించింది. ఇంత  రాత్రప్పుడు మొగుడు హెలికాప్టర్ లో ఎక్కడ చక్కర్లు కొట్టి వస్తున్నట్టన్న అనుమానం ఆవిడ మనసులో  మొక్కై మొలిచి మరుక్షణంలోనే  మానుగా విస్తరించింది. ఆ మధ్య   ఏదో ఫంక్షన్ లో అప్పుడే పైకొస్తున్న  ఓ  సినీ హీరోయిన్ తన మొగుడి  వంక వంకర చూపులు చూస్తున్నప్పుడే జాగ్రత్త పడివుండాల్సింది. అయినా ఇన్నేళ్ళొచ్చి,  ఇంట్లో ఎదిగిన పిల్లల్ని పెట్టుకుని ఇలా చెడు  తిరుగుళ్ళు తిరగడానికి ఈ మగవాళ్ళకు మనసెలా వస్తుందో అని ఏడుస్తూ ముక్కు చీదుకుంటూ పైఅంతస్తులో వున్న అత్తగారి దగ్గరకు వెళ్లి మరోసారి భోరుమంది. అర్ధరాత్రి ఈ కాకి గోలేమిటని అత్త కోకిలా బెన్  విసుక్కుంటూ నసుక్కుంటూ  అప్పటికప్పుడే  కొడుకుని పిలిచి అక్కడికక్కడే పంచాయితీ పెట్టింది. చవితినాడు నోముకోకుండా విదేశాల్లో విహారయాత్రలు చేసి వచ్చిన  పాపానికి తనమీద పడ్డ నీలాపనింద  ఇదానుకుని ఎంతో ఇదయిపోయిన ముఖేష్ అంబానీ  మరోసారి బట్ట తలను తడుముకుంటే అసలు విషయం గుర్తుకువచ్చింది. ఆ రోజు కారు తాళాలు పోయిన సంగతి మెర్సిడెస్ కంపెనీ వారికి తెలియచేస్తే వారు తమ హోదాకు తగ్గట్టుగా ఆ రాత్రికి రాత్రే హెలికాప్టర్ ద్వారా కారు తాళాలను ఇంటికి బట్వాడా చేశారు. ఆ అర్ధరాత్రి  ఆ అమ్మడు చూసి అపార్ధం చేసుకున్న హెలికాప్టర్ అదేనట.
అందుకే అంటారు –  పీత కష్టాలు పీతవని. (02-03-2012)

4 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

పాపం కదండీ :-))

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సుజాత - మీరు రెండో సారి 'పాపం' అంటున్నారు. నాకెందుకో భయంగావుంది.- భండారు శ్రీనివాసరావు

రాధేశ్యామ్ రుద్రావఝల చెప్పారు...

చాలా బాగుందండీ..! మనం మనకున్న నాలుగురూముల్లోనే వెతుక్కోవడానికి కష్టపడతాం. ’పాపం’అంబానీ వారు పదునాలుగంతస్తుల్లో వెతుక్కోడానికి(సారీ..!వెతికించడానికి) ఎంత కష్టపడ్డారో..!
అయినా కృష్ణుడి నోటిలో ౧౪ భువనాలూ కనిపించినట్టు, వీరికి కూడా సీసీ టీవీలోనో మరోదాంట్లోనో ౧౪ అంతస్తులూ కనిపించెయ్యాలే..!! పోన్లెండి.. పనికి లేటయిపోకుండా ఏదోఒకలా సర్దుకొని కోటిరూపాయల చిన్నకారులో వెళ్ళిపొయారు. సంతోషం..!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@రాధేశ్యాం -ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు