12, ఫిబ్రవరి 2011, శనివారం

వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు

వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


“నా ప్రియతములందరికీ నాదో విజ్ఞప్తి : “మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నాను. కానీ, అంతమాత్రాన నేనో గుడ్డివాడినని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయకండి.”

“మీకు బాగా ఆత్మీయులయిన వాళ్ళు మీతో ఎప్పుడూ ఏదో వాదులాట పెట్టుకుంటూనే వుంటారు. మీరంటే గిట్టకో, లేదా మీమీద అసూయతోనో వాళ్ళు అలాచేస్తున్నారనుకుంటే మీ పొరబాటే అవుతుంది. మీ దృష్టిలో సదా వుండాలనుకునే వాళ్ళు కనుకనే అలా చేస్తుంటారు.”

“తెల్లవారవస్తోంది. ఇక మేలుకోండి. రాత్రంతా కన్న కలలను నిజం చేసుకోవడానికి నిద్ర లేవండి. ఈరోజు రాత్రి మళ్ళీ మరికొన్ని అద్భుతమయిన కలలు కనేందుకు వీలుగా చిరునవ్వుతో కొత్త రోజును ప్రారంభించండి.

“మనుషుల నడుమ పొరపచ్చాలు రావడానికి కారణం పెద్దదేమీకాదు. ఇతరులు చెప్పేది అర్ధం చేసుకోవడం కోసం వాళ్ల మాటలు ఎప్పుడూ వినం. కేవలం సమాధానం చెప్పడానికి మాత్రమే మనం ఇతరులు చెప్పేది వింటుంటాం.”

“అంతరాత్మకు కూడా కొన్ని బలహీనతలుంటాయి. ఇతరులు తప్పుచేసినప్పుడు తీర్పుచెప్పడానికో, లేదా దండించ దానికో అది మనల్ని పురికొల్పుతుంది. అదే తప్పు మనం చేసినప్పుడు మాత్రం అది కిమ్మనకుండా వుండిపోతుంది. అలా వున్నా పరవాలేదు, మనం చేసిన దాన్ని సమర్ధించుకునేలా మనమీద వొత్తిడి పెంచుతుంది.”

“జీవితమంటే ఏమిటి? ఎదగడం లేదా ఏళ్ళు పెరగడం. వయసు మీద పడడం అంటే జీవితానికి ఏళ్ళు కలుపుకుంటూ పోవడం. ఎదగడం అంటే వయసుకు జీవితాన్ని కలుపుకుంటూ పోవడం.”

“ఎప్పుడూ ఎవరిమీదా కోపం తెచ్చుకోకపోవడం, కస్సుబుస్సులాడక పోవడం ఇవేవీ ఇతరులతో మంచి సంబంధాలకు కొలమానాలు కావు. కాకపొతే, ఆ విధమయిన భావోద్రేకాలను ఎంత త్వరగా అదుపులోకి తెచ్చుకుని మామూలు మనుషులు కాగలరన్న దానిపై సాటివారితో మీ సత్సంబంధాలు ఆధారపడివుంటాయి.”

“తప్పో, పొరబాటో చేసినప్పుడు ‘సారీ’ చెప్పడం బాగుంటుంది. అయితే, నమ్మకాన్ని దెబ్బతీసే పని చేసినప్పుడు ‘సారీ’ చెబితే సరిపోదు. కాబట్టి, పొరబాట్లు చేస్తే చెయ్యండి కానీ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయవద్దు.”

“లక్ష లక్ష్యాలు పెట్టుకోండి. అది మానవ సహజం. కానీ, లక్ష్య సాధకుడు ఒకే లక్ష్యాన్ని లక్ష పద్ధతుల్లో సాధించాలని చూస్తాడు. అతడే సాధించగలుగుతాడు కూడా.”

“ఇతరులు మీకోసం చేస్తున్నదాన్నిబట్టి మీ జీవితాన్ని అంచనా వేసుకోవడం వల్ల మిగిలేది ఆశాభంగమే. కానీ ఇతరులకోసం మీరు చేస్తున్న దాన్ని కూడా కలుపుకుని లెక్కవేసుకుంటే దానివల్ల మీ మనసుకు మరికొంత హాయి కలుగుతుంది. మీ జీవితానికి పరమార్ధం కూడా లభిస్తుంది.”

“అందం కోసం వెంపర్లాడకండి. కొన్నాళ్లకది ఎట్లాగూ కనుమరుగవుతుంది. డబ్బు మీద యావ పెంచుకోకండి. ఎందుకంటె అది ఎంతమాత్రం శాశ్వతం కాదు. అందుకని ఒక మంచి హృదయం కోసం వెతుక్కోండి. అదే మిమ్మల్ని అహరహం కోరుకుంటుంది. మీ కోసం తపిస్తుంది. కడకంటా మీతో వుండిపోయే ‘తోడు’ ఆ ఒక్కటే.”

“కొవ్వొత్తుల వెలుగులో భోజనాలు, సముద్రపు వొడ్డున షికార్లు ఇవేవీ నిజమయిన ప్రేమకు నిదర్శనాలు కావు. పరస్పర గౌరవం, రాజీ పడే తత్వం, కష్ట సుఖాలలో తోడుగా వుండగలమనే నమ్మకం, ఒకరిపై మరొకరికి అంకిత భావం ఇవే అసలు సిసలు ప్రేమకు పునాదులు.”

“ఆనందంగా , సంతోషంగా, హాయిగా వున్నామని చెప్పుకుంటున్నారంటే అంతా సజావుగా వున్నట్టు లెక్క కాదు. అలాటివారు జీవితంలో మరో కోణాన్ని చూడడానికి ఇష్టపడడం లేదనికూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఏ జీవితమూ సంపూర్ణంగా పరిపూర్ణం కాదు.”

“మాట్లాడకుండా ఎలా వుండాలో తెలియనివాడికి ఎలా మాట్లాడాలో కూడా తెలియదనుకోవాలి”