ఆరేళ్ల
కిందటి ఆగస్టు జ్ఞాపకాలు
నిన్నటి
ఎపిసోడ్ పై వచ్చిన అనేక స్పందనలు చూసిన తర్వాత, మరోటి మొదలుపెట్టడానికి చాలా సందేహించాల్సి
వచ్చింది. మా ఆవిడ పట్ల, నా
పట్ల వ్యక్తపరచిన అశేష అభిమానానికి ‘కృతజ్ఞతలు’ అనే నాలుగక్షరాల మాట చాలా చిన్నది.
అంచేత, అందరికీ పేరుపేరునా వందనశతాలు. పూర్తిగా
వ్యక్తిగతమైన అంశాలు ఇంకా రాసి స్నేహితులను బాధ పెట్టాలా, లేదా అలా రాస్తూ నా మనసులోని బాధను కొంతమేరకు
తగ్గించుకోవాలా అనే మీమాంస ఎదురయింది.
నా
జీవితాన్ని గురించే కాకుండా, నా
చుట్టూ అల్లుకున్న ప్రపంచాన్ని, పరిస్థితులను, వ్యక్తులను, ఆహార వ్యవహారాలను, ఆచారాలను కొత్త తరానికి పరిచయం చేయాలి అనే ఉద్దేశ్యంతో
ఇది మొదలుపెట్టాను. మరి నా జీవనయానంలో
నాకూడా విశేషదూరం నడిచిన సహచర బాటసారి నా భార్య ప్రస్తావన, ప్రసక్తి లేకుండా నా కధ అసంపూర్ణం. అంచేత కొంత భాగంలో
ఆమెకూ భాగం వుంటుంది. పైగా ఇది నా ఆత్మ కధ
లాంటిది. బయటివారి విషయం సంగతి కాకుండా
ముందు ముందు మా కుటుంబంలో భావితరం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అంచేత
వీటినన్నిటినీ అక్షరబద్ధం చేయాల్సిన అవసరం
వుంది. ఒకే విషయాన్ని సాగదీయడం అవసరమా అనే అభిప్రాయంతో ఎవరైనా వుంటే దయచేసి ఈ విషయాన్ని గమనంలో వుంచుకోవాలని మనవి.
ప్రతి
నెలా మొదటి వారంలో అలా నడుచుకుంటూ వెళ్లి, ఇంటికి కూతవేటు దూరంలో వున్న రత్నదీప్
సూపర్ మార్కెట్లో నెల వారీ సరుకులు కొని, హోం డెలివరీ చేయమని చెప్పి, మళ్ళీ నడుచుకుంటూ తిరిగి రావడం కొన్నేళ్లుగా మా
ఇద్దరికీ ఓ అలవాటుగా మారింది. అలాగే, ఒక
ఏడాది ఆగస్టు మొదటివారంలో షరామామూలుగా ఈ
నెలవారీ నడక మొదలు పెట్టాం. ఎప్పుడూ లేనిది మా ఆవిడ, ఆ రోజు ఓ సంచీ చేతబట్టుకుని వచ్చింది.
తిరిగి
వస్తుంటే ‘ఇదిగో ఈ పక్క సందులోనే మన అరుణ ఇల్లు ఒకసారి చూసిపోదాం’ అంది. అరుణ అంటే
మా వలలి. మూడు నెలల నుంచి వంటకు రావడం లేదు. అరుణ వాళ్ళు వుండేది వాళ్ళ ఫ్లాటు మూడో అంతస్తులో. మెట్లెక్కి వెళ్ళాలి. ఫోన్ చేసి
కిందికి పిలవరాదా అన్నాను.
“లేదు,
పొద్దునే ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్లమ్మ గారి ఊరికి పోతోందిట. ఉత్తమనిషి కూడా
కాదు, మెట్లు దిగి
ఏమి వస్తుంది. మీరిక్కడే వుండండి, నేను
కలిసి వస్తాను’
అన్నది స్థిరంగా. ఇక నేనూ ఆవిడతో పాటు మెట్లెక్కి వెళ్లక తప్పలేదు.
పైన
ఒకటే గది. మమ్మల్ని చూడగానే అరుణ భారంగా
లేవలేక లేచింది. వెలిగిపోతున్న మొహంతో మమ్మల్ని చూస్తూ మంచం మీద కూర్చోమంది.
మా
ఆవిడ తాను తెచ్చిన సంచీలో నుంచి కుంకుమ
భరిణ, చీరె,
జాకెట్ పీస్ తీసి బొట్టుపెట్టి ఇచ్చింది. తీసుకువచ్చిన మిఠాయిలు, పూలు అందించింది.
‘పండంటి
బిడ్డను కనడమే కాదు,
రాగానే నాకు తీసుకువచ్చి చూపించాలి సుమా’ అని అరుణ దగ్గర మాట తీసుకుంది.
అరుణ
మాట నిలబెట్టుకుంటూ మూడు నెలల తర్వాత పసిబిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది.
కానీ ఆ బిడ్డను చూడడానికి తను లేదు.
అరుణ
ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె బతికి వుంది కేవలం పదిరోజులే.
అమ్మపెట్టిన
చీర
ఇది
మరో చీర కధ.
“అమ్మని
చూడానికి వచ్చాను. అమ్మ పెట్టిన చీర కట్టుకుని”
లక్ష్మిగారు
అంటున్నది ఏమిటో ముందు అర్ధం కాలేదు.
లక్ష్మి,
కీర్తన్ లది
ప్రేమ పెళ్లి. పెళ్లి చేసుకుని వచ్చి మా పక్క అపార్ట్ మెంటులో కాపురం పెట్టారు.
ప్రేమ పెళ్లి కదా! పెద్దవాళ్లు సర్దుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ నేపధ్యంలో మా
ఆవిడే ఆమెకు అమ్మగా మారింది. కాదు లక్ష్మి మా ఆవిడను అమ్మగా చేసుకుంది. ఎప్పుడూ
అమ్మా అని పిలిచేది. ఆ బంధం మరింత బలపడుతూ వచ్చింది. లక్ష్మి కడుపుతో వున్నప్పుడు
మా ఆవిడే నలుగుర్ని పిలిచి సీమంతం చేసింది. భార్యా భర్తా తమ పనులపై బయటకు
వెళ్ళినప్పుడు, వారి పిల్లల్ని తన పిల్లలుగా పెంచింది. అలా మా ఆవిడ ఓ అమ్మని తన
కుమార్తెగా చేసుకుంది. తర్వాత వాళ్ళు ఇల్లు మారి వెళ్ళిపోయారు.
లక్ష్మి
మంచి విద్యాధికురాలు. ఓ లెక్చరర్ కావాల్సిన అన్ని
అర్హతలు వున్నాయి. కానీ అవకాశాలు దొరక్క మా ఇంటి దగ్గరలో ఓ చిన్న ఎలిమెంటరీ
స్కూల్లో టీచర్ గా చేరింది. అలా కష్టపడుతూ, అనుభవం పెంచుకుంటూ ఇప్పుడు ఓ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా
పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలు. మా కంటి ముందు పుట్టిన వాళ్ళు ఇప్పుడు నా భుజాల వరకు
ఎదిగారు. తల్లి టీచర్. అంచేతనే వాళ్లు కూడా చదువులో ఫస్టు.
ఆ రోజు
స్కూలుకు హోలీ సెలవు. అందుకని కీర్తన్ భార్య, పిల్లల్ని తీసుకుని మా ఇంటికి
వచ్చాడు.
మా
ఆవిడ బతికి వున్నప్పుడు లక్ష్మిని ఏదో
పండక్కు పిలిచి చీరె పెట్టిందట. అది కట్టుకుని వచ్చింది. నెలల పిల్ల నా మనుమరాలికి, ఎండాకాలం కదా,
సైజులు వెతికి వెతికి మరీ చిన్న
చిన్న కాటన్ ఫ్రాకులు పట్టుకు వచ్చింది.
అప్పుడు వయసులో పెద్ద అయిన మా ఆవిడ,
ఆవిడకు అమ్మ. ఇప్పుడు నెలల పిల్ల నా
మనుమరాలిని అమ్మ అంటూ ఆవిడే
పిలుస్తోంది. అమ్మే మళ్ళీ ఈ రూపంలో పుట్టిందని తెగ సంతోషపడింది. అనుబంధాలకు
అర్ధాలు ఒక పట్టాన అర్ధం కావు.
నిన్న
మా రెండో అన్నగారు భండారు రామచంద్రరావు గారు మా ఇంట్లో తద్దినాలు గురించి
చెప్పింది అక్షర సత్యం. అయితే ఓ చిన్న విషయం రాయలేదు. తద్దినాల రోజు ఆయన
పొద్దున్నే లేచి కూరగాయల మార్కెట్టుకు వెళ్లి ఆ రోజుకు అవసరమైన కూరగాయలు అన్నీ
వివరంగా కొని మా ఇంట్లో పెట్టి మళ్ళీ తద్దినం టైముకు వచ్చేవారు. దత్తు పోయిన
మనిషికి నిజానికి ఈ భారం అవసరం లేదు. కానీ ఆయనకి పెట్టిన పేరే రామచంద్రుడు.
శ్రీరామ నవమి నాడు ప్రతి ఇంటా మారుమోగే పేరు. మా కుటుంబంలో అనునిత్యం తలచుకునే
పేరు.
తిధి, తద్దినం, వార్షికం ఏ పేరుతొ పిలిచినా అది రెండూ
రెండున్నర గంటల కార్యక్రమం. అయినా ఇంటి ఇల్లాలు మాత్రం శతావధానం చేయాల్సిందే.
‘ఆవు
నెయ్యి, నల్ల నువ్వులు చెప్పాను,
తెచ్చి ఇక్కడ పెట్టండి. భోక్తలు భోజనాలు చేసే చోట తడిగుడ్డతో తుడవండి, ఓ నిమ్మకాయంత అన్నం తెచ్చి
విస్తట్లో ఆ మూల వుంచండి,
చిల్లర డబ్బులు అక్కడ పెట్టండి,
ఆధరువులు అన్నీ వరసగా తెచ్చి వడ్డించండి. జాగ్రత్తగా కనుక్కుని మారు వడ్డన చేయండి’
వశిష్టుల
వారు విరామం లేకుండా ఏదో ఒకటి ఇలా
అడుగుతూనే వుంటారు. తడిపొడి మడిచీర కట్టుకున్న ఇంటి ఇల్లాలు మరో ముచ్చట
లేకుండా వాటిని చప్పున తెచ్చి అందిస్తుండాలి. పేరుకు ఆ రోజున ఓ వంటమ్మగారు వచ్చి
వంటలు చేసినా, ఈ అందింపు,
వడ్డింపుల బాధ్యత మాత్రం ఇల్లాలిదే.
తద్దినానికి కర్తగా కూర్చొన్న భర్త మాత్రం
సవ్యం. అపసవ్యం అంటూ పురోహితుల వారు చెప్పినప్పుడల్లా భుజం మీది జంధ్యాన్ని అటూఇటూ మారుస్తూ ఉంటాడు.
మా
అమ్మానాన్నల ఆబ్డీకాల సమయంలో కొన్ని దశాబ్దాలుగా మా ఇళ్ళల్లో జరుగుతూ వచ్చిన తంతు
ఇదే. ఎన్నో ఏళ్ళుగా మా వదినెలు, మా
ఆవిడా చేస్తూ వచ్చింది ఇదే.
అలాంటి
ఇంట్లో మా ఆవిడ తద్దినం పెట్టాల్సిన పరిస్థితి. మా వాడు సంతోష్ బుద్దిగా కూర్చుని
కన్నతల్లికి పిండాలు పెట్టి,
నువ్వులు,
నీళ్ళతో తర్పణాలు వదులుతూ వుంటే, మా కోడలు
నిషా ఈ కర్తవ్యాలను అన్నింటినీ
నిష్టగా పూర్తిచేసింది. డ్రెస్సులకు
అలవాటు పడిన యువతరం కోడలు అయినా, అలవాటులేని
చీరకట్టుతో పడిన ఇబ్బందినీ,
కష్టాన్ని కళ్ళారా చూసినప్పుడు కానీ,
ఇన్నేళ్ళుగా మా ఆవిడ ఇంతగా
కష్టపడిందా అనే ఎరుక నాకు కలగక పోవడం ఆశ్చర్యం.
నిజానికి
ఇందులో విడ్డూరం ఏముంది! ఆడవాళ్ళ కష్టాలు
మగవాళ్లు తెలుసుకోగలిగితేనే
ఆశ్చర్యపడాలి.
అందరూ
వచ్చారు. వచ్చిన వారందరూ తలచుకున్నారు అందరి మధ్య లేని మనిషి గురించి, ఆమె మంచితనం గురించి.
కింది
ఫోటో:
ఇంకెవరు? ఈవిడే మా ఆవిడ నిర్మల
(ఇంకా వుంది)