28, మార్చి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (129) – భండారు శ్రీనివాసరావు

 1987 లో మేము మాస్కో వెళ్ళింది నాలుగు సూటు కేసులతో. అవీ కోటీ మాల్.  అంతకు ముందు, బెజవాడలో, హైదరాబాదులో వున్నప్పుడు  పెద్దగా  ఇళ్ళు మారింది లేదు కానీ, ఎప్పుడు మారినా రిక్షాల్లోకి సరిపోయే సామాను మాత్రమే వుండేది. అలాంటిది ఇప్పుడు మాస్కో నుంచి  తీసుకువెళ్లాల్సిన సామాను చూస్తే మాకే కళ్ళు తిరిగాయి. అయిదేళ్లుగా కనబడ్డది కనబడ్డట్టు కొన్నాము కదా! అంచేత వాటిని మన దేశానికి తరలించాలి అంటే ఒక లిఫ్ట్ వ్యాన్ కావాల్సి వచ్చింది. మంచి టేకు కర్రతో చేసిన  లిఫ్ట్ వ్యాన్ సైజు ఒక రైల్వే బోగీ అంత వుంటుంది. దాన్ని  భారీ ట్రక్కులో మన ఇంటికి తెస్తారు. సామాను మొత్తం చక్కగా ప్యాక్ చేసి, పొట్టు బస్తాలో పొట్టు కూరినట్టు అందులోకి ఎక్కిస్తారు. తర్వాత దాన్ని రోడ్డు మార్గంలో, దేశంలో ఎక్కడో ఉన్న  ఓడరేవుకు చేర్చి అక్కడ నుంచి నౌకలో మద్రాసు (చెన్నై) చేరుస్తారు. ఇదంతా మూడు నాలుగు నెలలు పడుతుంది.

కొన్న ప్యాకెట్లు విప్పి చూస్తే మూడు వంతులు పనికి రానివి, అసలు అవేమిటో ఒక పట్టాన అర్ధం కానివి వున్నాయి. దుష్టాంగం ఖండించి శిష్టాంగాన్ని కాపాడినట్టు, పనికి రాదు అనుకున్న సామాను అంతా మరో మాట లేకుండా డస్ట్ బిన్ దగ్గర వదిలేసాము.

మా దగ్గర ఉన్న సోఫాలు, మంచాలు, పరుపులు, డ్రాయింగ్ రూమ్ ఫర్నిచర్, ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, డీప్  ఫ్రిడ్గ్జ్  (ఐస్ క్రీం షాపుల్లో వుండే పెద్ద ఫ్రీజరు), వాషింగ్ మిషన్, చాలా బరువు వుండే  చెకొస్లోవేకియా గ్లాస్ కట్లరీ, సోవియట్ సూవెనీర్లు, బట్టలు, కోట్లు, బూట్లు, ఎన్ని వేసినా, పుష్పక విమానం మాదిరిగా  అందులో కొంత  జాగా మిగిలి పోతోంది. అది ఫుల్ ప్యాక్ అయితే కానీ కుదరదు, ఏవో ఒక సామాను తీసుకురండి అని ట్రక్ వాళ్ళ గోల. లేని సామాను ఎక్కడినుంచి తేము?

దాంతో మా ఆవిడా నేను, పిల్లలం తలా ఒక టాక్సీ వేసుకుని వెళ్లి నానా చెత్త సామాను కొనుక్కువస్తే, అవి లిఫ్ట్ వ్యాన్ లో వేస్తే,  అప్పుడు బయలుదేరింది జగన్నాధరధం ముప్పయ్యారు టైర్ల ట్రక్కు మీద పొందికగా కూర్చుని. అంటే ఎటు అనుకున్నారు. మధ్యలో మరో పెద్ద పాము వుంది. దాని నోట్లో పడకుండా వుంటే పరమపద సోపానం చేరుతుంది. అదేమిటంటే, మాస్కో కష్టమ్స్. ఆ ఆఫీసు ఎక్కడో  మారుమూల వుంది. అక్కడ విదేశాలకు వెళ్ళే లిఫ్ట్ వ్యాన్లను  క్షుణ్ణంగా తరలిస్తారు. నేను, పిల్లలు  ఒక టాక్సీ తీసుకుని దాని  వెంబడే  వెళ్ళాము. అక్కడ ఎంత టైము పడుతుందో ఏమిటో అనుకుంటే వాళ్ళు అడిగింది ఒకే ఒక ప్రశ్న. ఈ లగేజీలో పాలు, పెరుగు వున్నాయా అని. నియత్ (లేవు) అనగానే, ఏమాత్రం  చెక్ చేయకుండా క్షణం ఆలస్యం చేయకుండా, కోపెక్కు (పైసా)  లంచం అడగకుండా ఆమోదముద్ర వేసి పంపేశారు. విదేశీయులు తిండి పదార్ధాలు పట్టుకుపోతే, తమ పౌరులకు ఇబ్బందని ఈ నిఘా పెట్టారని తర్వాత ఎవరో చెప్పారు.

ఒక్క లిఫ్ట్ వ్యాను నింపడానికే  మేము ఇంత హైరానాపడితే, కొందరు రెండు, మూడు లిఫ్ట్ వ్యానులు ఆర్డర్ పెట్టారు. మాస్కో నుంచి రష్యా కొనలో వున్న ఓడ రేవుకి, అక్కడ నుంచి సముద్ర మార్గంలో చెన్నైకి చేరవేయడానికి  ఒక్కో లిఫ్ట్  వ్యాన్ కి వసూలు చేసేది నామమాత్రం రవాణా చార్జి.  పైగా ప్యాకింగు బాధ్యత కూడా వాళ్ళదే. ఈ లెక్కన మాస్కో సగం ఖాళీ అయి వుంటుందని అనిపించింది. మా ఇల్లు ఖాళీ అయినా, చెత్తంతా వదలడంతో తెరిపిగా అనిపించింది. సామాను వెళ్ళిపోయింది సరే! మేము వెళ్ళే దాకా ఎలా. సమాధానం వాళ్ళే చెప్పారు. మేము వచ్చినప్పుడు ఎలా అన్నీ అమర్చి పెట్టారో అలాగే మళ్ళీ సెట్టింగు వేసి ఒప్పచెప్పారు. మళ్ళీ కృష్ణ దేవరాయల ఆస్థానం మొదలు. ఇప్పుడు ఆఫీసుకు పోయే పని కూడా లేదు. లిఫ్ట్ వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి షాపింగ్ పని కూడా లేదు. వచ్చిన వాళ్లకు వండిపెట్టే  మా ఆవిడ పని మాత్రం షరా మామూలే.

కాస్త విశ్రాంతి దొరికింది కాబట్టి,  ముందు భాగంలో ప్రస్తావించి వదిలేసిన రమేశ్ చంద్ర గారి ముచ్చట చెప్పుకుందాం. అది చెప్పాలి అంటే కొంత నాందీ ప్రస్తావన వుండాలి కదా!

రష్యా కమ్యూనిష్టుల ఏలుబడిలోకి వచ్చిన తరవాత ఏడు దశాబ్దాల పై చిలుకు కాలం, ఆ దేశంలో మతమన్నది కనబడలేదు, మతమన్న మాట వినబడలేదు. అయితే, “మతం మత్తు మందు” అని నమ్మిన కమ్యూనిస్టు పాలకులు కూడా ఆ దేశంలో, ఏ చర్చినీ , మసీదునీ కూలగొట్టక పోవడం విచిత్రం.

సరికదా,  పైపెచ్చు వాటికి  ఏటేటా సున్నాలు, రంగులూ కొట్టి ముస్తాబుచేసి తాళాలువేసి వుంచేవారు. విదేశాలనుంచి వచ్చే గౌరవ ప్రభుత్వ అతిధులకి వాటిని ఎంతో గౌరవంగా చూపించేవారు కూడా. రేడియో మాస్కోలో పనిచేసే విదేశీయులకు కూడా సెలవు రోజుల్లో విహార యాత్రల పేరుతొ చర్చీలు, మసీదులను సందర్శించే వీలుకలిపించేవారు. నేను కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఓసారి మాస్కోలోనూ, మాస్కో పొలిమేరల్లోను  ఉన్న పురాతన  ప్రార్ధనాలయాలను చూడడం జరిగింది. అయితే వాటిల్లో ఎక్కడా మతపరమైన కార్యకలాపాలు జరగడం లేదు. ముందే చెప్పినట్టు వాటిని ప్రతిఏటా ఎంతో ఖర్చుచేసి, మ్యూజియంలో మాదిరిగా  పదిలంగా ఉంచుతున్నారు.   

మేము మాస్కోలో వున్న రోజుల్లో ఓ వింత విషయం మా చెవిన పడింది.

మాస్కోలోని లెనిన్ స్కీప్రాస్పెక్త్ (లెనిన్ పేరు పెట్టిన ప్రధాన రహదారి) నిర్మాణ సమయంలోనో, లేదా ఆ రోడ్డును వెడల్పుచేసే సమయంలోనో, పాతకాలం నాటి ఒక చర్చి అడ్డం వచ్చిందట. దాన్ని కూలగొట్టడం లేదా కొన్ని లక్షల రూబుళ్ళు ఖర్చుచేసి  ఆ చర్చి భవనాన్ని పక్కకు జరపడం అనే రెండు ప్రత్యామ్నాయాలు అధికారుల ముందు నిలిచాయి. మతం పొడగిట్టని కమ్యూనిస్ట్ పాలకులకు, ఆ చర్చిని వున్నపలాన పడగొట్టడం చిటికెలో పని.

 అయినా వారు ఆ పని చేయకుండా చర్చి భవనం చుట్టూ కందకం మాదిరిగా తవ్వి, భూగర్భంలో దానికింద చక్రాలతో అమర్చిన  ఉక్కు పలకను ఉంచి, అంగుళం అంగుళం చొప్పున నెమ్మది నెమ్మదిగా ఆ మొత్తం చర్చి భవనాన్ని  ఏమాత్రం దెబ్బతినకుండా, వున్నదాన్ని వున్నట్టుగా దూరంగా జరిపి రోడ్డుపని పూర్తిచేశారని చెప్పుకునేవారు. ఇది నిజమైతే వింతల్లో వింత.

మేము మాస్కోలో వున్నప్పుడు భారత రాయబార కార్యాలయంలో పనిచేయడానికి రమేష్ చంద్ర అనే యువ అధికారి వచ్చారు. హైదరాబాదు వాసి. సీనియర్ జర్నలిస్ట్  వీజేఎం దివాకర్ పూర్వాశ్రమంలో కాలేజ్ లెక్చరరుగా పనిచేసే రోజుల్లో ఈ రమేష్ చంద్ర ఆయన విద్యార్ధి. ఐ.ఎఫ్.ఎస్.కు  సెలక్ట్ కాగానే ఈ తెలుగు యువకుడిని మొట్టమొదట మాస్కోలో పోస్ట్ చేసారు. ఎవరు చెప్పారో, ఎవరిద్వారా తెలుసుకున్నారో తెలియదు కానీ, మాస్కోలో దిగిన వెంటనే మా ఇంటికి ఫోన్ చేసారు. అప్పటికి ఆయన బ్రహ్మచారి. అంచేత వీలున్నప్పుడల్లా మా ఇంటికి భోజనానికి వచ్చేవారు. గొప్ప సాయి భక్తుడు. ఆయనకు ఎలాట్ చేసిన ఫ్లాట్ లో  ఓ గురువారం సాయంత్రం సాయి భజన పెట్టి మమ్మల్ని అందర్నీ పిలిచారు. ఆ తర్వాత  తెలుగువాళ్ళ౦దరి  ఇళ్ళలో ప్రతి శనివారం సాయంత్రం సాయి భజన ఒక  కార్యక్రమంగా మారిపోయింది. మాస్కో యూనివర్సిటీలో డాక్టరీ చదువుకోవడానికి వచ్చిన రవి అనే హైదరాబాదు విద్యార్ధి కూడా సత్యసాయి భక్తుడు కావడంతో అతడి ప్రోద్బలంతో మరికొంతమంది విద్యార్ధులు కూడా ఈ భజన బృందంలో చేరారు. రవి తల్లిగారు విశాలాక్షి హైదరాబాదు టెలిఫోన్స్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో పనిచేసేవారు. మేము మాస్కోరావడానికి ముందు నుంచీ ఆ కుటుంబంతో పరిచయం వుండేది. బదరీనాద్ కాబోలు యాత్రకు వెడుతూ దారి మధ్యలో కొండ చరియలు విరిగి పడడంతో విశాలాక్షి దంపతులు దుర్మరణం చెందారు.

మధ్యలో రమేశ్ చంద్ర హైదరాబాదు వెళ్లి, పెద్దలు నిర్ణయించిన సంబంధం చేసుకుని భార్య కాత్యాయని గారిని తీసుకుని మాస్కో వచ్చారు. ఆవిడ గారు కూడా సాయి భక్తురాలే. రష్యాలో కాత్యా అనే పేరు గల ఆడపిల్లలు అనేకమంది తారసపడతారు. కాత్యాయని గారు మాస్కో వచ్చాక కాత్యా అయిపోయారు.

మా రష్యన్ స్నేహితుడు పిలిపెంకో, అయన భార్య కూడా రమేష్ చంద్ర, రవి బృందం నిర్వహించే ఈ సాయి భజనల్లో పాల్గొనేవారు. చక్కటి స్వరంతో వారు భజన గీతాలు ఆలపిస్తుంటే రష్యన్ జంట కూడా గొంతు కలిపేవారు. అంత భారీ మనిషి బాసిపెట్లు వేసుకుని, చేతులతో చప్పట్లు చరుస్తూ,   ‘సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం’ అని పిలిపెంకో వచ్చీరాని తెలుగులో పాడుతుంటే వినడానికి, చూడడానికి  చాలా విచిత్రంగా వుండేది. అన్నింటికంటే విచిత్రం కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న మాస్కో నగరంలో ఇలా వారానికి ఒకచోట సాయి భజనలు జరగడం.

ఆ భజనల మహత్యం, స్వయం ప్రతిభ  రెండూ కలిసి  రమేశ్ చంద్ర ఉద్యోగపర్వంలో అంచెలంచెలుగా ఎదిగి, నిరుడు నవంబరులో విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శిగా రిటైర్ అయ్యారు.  

కింది ఫోటో:

భారత విదేశాంగ శాఖలో ఉన్నతస్థానంలో రిటైర్ అయిన శ్రీ రమేశ్ చంద్ర




 

 

(ఇంకా వుంది)

3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

మీరు గుర్తు పెట్టుకున్నారు
వారింకా మిమ్మల్ని గుర్తుపెట్టుకుని వున్నారాండీ ?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

నాకున్న మరో అదృష్టం ఏమిటంటే, నా మతిమరపు జబ్బు వాళ్లకి లేదు, ఏదో విధంగా నా నెంబరు కనుక్కుని వాళ్ళు చేస్తారు తప్పిస్తే నా అంతట నేనుగా ఎప్పుడూ మాట్లాడ లేదు. ఈ పోస్టు పెట్టి గంటలు గడవక ముందే బెంగుళూరు నుంచి రమేష్ చంద్ర ఫోన్ చేశారు. హైదరాబాదులో ఉన్న వాళ్ళ అన్నయ్య ఆకెళ్ళ గారు ఏకంగా వెతుక్కుంటూ మా ఇంటికే వచ్చారు.

అజ్ఞాత చెప్పారు...

పూస గుచ్చినట్టు మీ జీవితానుభవాలను వ్రాస్తున్నారు. మతిమరపు ఉంది అని మీరు చెప్పడం సరికాదు.