26, మార్చి 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (127) – భండారు శ్రీనివాసరావు

 సోవియట్ యూనియన్ లో ఏమీ జరగదు అన్న ధీమా కాస్తా ఏదో జరుగుతోంది అనే సందేహంగా మారి, కాదు, జరగకూడనిది ఏదో జరిగింది అనే నిశ్చయానికి రావడానికి మొదటి అడుగు పడింది 1990, మొదట్లోనో,  చివర్లోనో.

గొప్ప గొప్ప రష్యన్ పుస్తకాలను  వివిధ భాషల్లోకి అనువదించే రాదుగ ప్రచురణాలయాన్ని మూసివేయడంతో తెలుగు విభాగం బాధ్యులు అయిన ఆర్వీయార్  హైదరాబాదుకు, ప్రగతి ప్రచురణాలయం నిడమర్తి ఉమామహేశ్వర రావు గారు మైసూరుకు తరలిపోయారు. ఇలాంటి మూసివేత  పరిణామాలు అప్పటికి కలలో కూడా ఊహించలేనివి.

తరువాత వేటు రేడియో  మాస్కో విదేశీ విభాగాల మీద పడింది. రేడియో మాస్కో నివాస భవనంలో మా పక్కనే వుండే ఫిలిప్పీన్స్ సహోద్యోగి, ఒకరోజు ఉన్నట్టుండి  ఇల్లు ఖాళీ చేసి కుటుంబంతో సహా చెప్పాపెట్టకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఇలా ఎంతమందికి ఉద్వాసన  పలికారో ఎవరికీ తెలియదు.

 

రేడియో మాస్కోలో సుమారు ఎనభయ్ కి పైగా ప్రపంచ భాషల్లో ప్రసారాలు జరిగేవి. అందులో పద్నాలుగు భారతీయ భాషలు. ఒకరోజు ఒడియా భాషలో ప్రసారాలు నిలిపి వేయాలని హఠాత్తుగా  నిర్ణయం తీసుకుని ప్రకటించారు. ఆ భాషలో ప్రసారాలకు బాధ్యుడు అయిన అరుణ్ మొహంతి మాస్కోలోనే చదువుకుని, మాస్కో రేడియోలో ఒరిస్సా భాషలో వార్తలు చదువుతూ అలాగే, అక్కడే  సెటిల్ అయ్యాడు. అంతకు ముందు ఏడాదే అతడు తన రాష్ట్రానికి వెళ్లి పెళ్లి చేసుకుని తిరిగి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు నమిత మా ఆవిడకి మంచి స్నేహితురాలు అయింది. పెళ్లి కబురు తెలియగానే రేడియో మాస్కో వాళ్ళు సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ బదులు  అతడికి రెండు పడక గదుల అపార్ట్ మెంటు కేటాయించారు.  ఇంతలోనే ఈ పరిణామం.

అయితే అరుణ్ కి బెంగాలీ వచ్చు. రష్యన్ చదువుకున్నాడు కాబట్టి కొన్నాళ్ళు కొనసాగాడు. ఈ లోగా కన్నడ విభాగం మూసేసామని ప్రకటించారు. కన్నడ, రామకృష్ణ గారు, ఆయన భార్య, సరోజ, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారి  కుమార్తె నందిత వెంటనే మైసూరు వెళ్ళిపోయారు.

తరువాత దెబ్బ గుజరాతీ  భాష ఇన్ చార్జ్ వ్యాస్ పై పడింది. తరువాత అస్సామీ, పంజాబీ,  మళయాళం, తమిళ్,   ఇలా నెల రోజులు తిరిగే సరికి భారతీయ విభాగంలో సగానికి పైగా ఖాళీ. పిలవడం, విషయం చెప్పడం, ఇండియాలో ఎక్కడికి పోవాలో తెలుసుకోవడం, అక్కడికి ఏరో ఫ్లోట్ విమానం టిక్కెట్లు ఇవ్వడం చకచకా జరిగిపోతోంది. ఎవరి టైం రాగానే వాళ్ళు మూటా ముల్లె సదురుకుని స్వదేశం వెళ్ళిపోవడం. చిత్రం ఏమిటంటే దక్షిణ భారత దేశానికి సంబంధించి చిట్టచివర మూసివేసింది తెలుగు విభాగం.

అయిదేళ్ళపాటు మాస్కోలో మా ఆవిడ చేసిన అన్న వితరణ మా వీడ్కోలు సమయంలో కొట్టవచ్చినట్టు కనబడింది.

అదెలాగంటే :

అక్టోబర్ విప్లవం యాభయ్యవ వార్షికోత్సవానికి గుర్తుగా 1772 అడుగుల ఎత్తయిన  ఆస్తాంకినో టవర్ ను మాస్కో రేడియో, టెలివిజన్ లకోసం  మాస్కోలో నిర్మించారు. దీని నిర్మాణం 1963  లో మొదలయి 1967   లో పూర్తయింది. అప్పట్లో ఎత్తయిన నిర్మాణాల్లో మొదట చెప్పుకునే అమెరికన్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఎత్తులో ఇది 43 అడుగులు పెద్దది. తొమ్మిదేళ్ళ తరువాత కెనడాలో సీఎన్ టవర్ నిర్మించేంతవరకు ఈ రికార్డ్ ఆస్తాంకినో ఖాతాలోనే వుండిపోయింది. ఆ తరువాత ఎత్తయిన నిర్మాణాలు అనేక దేశాల్లో మొదలయి ఆస్తాంకినో రికార్డ్ మరుగున పడిపోయింది. ప్రచండమయిన పెనుగాలు వీచే పరిస్థితుల్లో ఈ టవర్ పై భాగం కొన్ని మీటర్లు అటూ ఇటూ వొరిగిపోతూ మళ్ళీ సర్దుకునే విధంగా దీని నిర్మాణాన్ని డిజైన్ చేశారు.  పొడవాటి తాటిచెట్లు విపరీతమయిన గాలి తాకిడికి అటూ ఇటూ వూగిపోతూ వుండడం చూసిన వారికి దీనిలోని ప్రత్యేకత సులభంగా అర్ధమవుతుంది. పై నుంచి చూస్తే, కింద పరచుకున్న మబ్బుల చాటున వున్న  ఎత్తైన భవనాలు కనబడేవి కాదు.  ఈ టవర్ ను కొన్ని విభాగాలుగా చేసి మధ్య మధ్యలో  రివాల్వింగ్ రెస్టారెంట్లు మొదలయినవి ఏర్పాటు చేశారు. మా కుటుంబం భారత దేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో హిందుస్తానీ సమాజ్ వారు అంత ఎత్తున వీడ్కోలు విందు ఏర్పాటు చేయడం మరపురాని మరో అనుభూతి. 

ఈ రెస్టారెంట్లలో టేబుల్ ముందుగా బుక్ చేసుకోకపోతే ప్రవేశం దుర్లభం. అక్కడి ధరలు సాధారణమయినవే కాని అంత ఎత్తులో విందు చేయడం అన్నది ఒక మహత్తర అనుభూతి కాబట్టి  వాటికి పర్యాటకుల  తాకిడి ఎక్కువగానే వుంటుంది. కాకపోతే మాస్కో రేడియోలో పనిచేసే  విదేశీయులు తమ ఆఫీసు ద్వారా బుకింగ్ చేసుకునే సౌలభ్యం వుంది.

‘ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. అందరూ సమానమే కాకపోతే  వారిలో కొంతమంది ఎక్కువ సమానం’ అని  ఆనిమల్ ఫాం రచయిత జార్జ్ ఆర్వెల్,   సోవియట్ల సమానత్వం గురించి చేసిన వ్యాఖ్యలో కొంత నిజం లేకపోలేదు. డాలర్లు చెల్లించే విదేశీయులకోసం  కోసం మాస్కోలో ప్రత్యేక హోటళ్ళు వున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని హోటళ్లకు తగ్గట్టుగా అవి చాలా డాబుసరిగా వుంటాయి. అందులో పనిచేసేవారు ఇంగ్లీష్ తెలిసిన రష్యన్లు. సాధారణ రష్యన్ పౌరులు వాటిల్లో అడుగు పెట్టే వీలు లేదు. విదేశీ అతిధులను  తీసుకువచ్చే టాక్సీ డ్రైవర్లు కూడా హోటల్ గుమ్మం దగ్గరే ఆగిపోవాలి. అల్లాగే సోవియట్ యూనియన్ సందర్శనకు వచ్చే ఇతర దేశాల కమ్యూనిస్ట్ నాయకులు షాపింగ్ చేయడం కోసం ప్రత్యేక దుకాణాలు వున్నాయి.  ప్రపంచంలో దొరికే అన్నిరకాల వస్తువులు అక్కడ అమ్ముతారని చెప్పుకునే వారు. పైగా వాటిని విదేశీ కరెన్సీ లో కాకుండా స్తానిక కరెన్సీలో కొనుగోలు చేసుకునే సౌలభ్యం వుంది. అయితే,  వాటిల్లో  ప్రవేశం అంత సులభం కాదు. ప్రత్యేకించి రష్యన్లకి.   కొందరికే కొన్ని కాకుండా అందరికీ అన్నీ అనే సిద్ధాంతంతో మొదలయిన సామ్యవాదం చివరికి కాలక్రమంలో భ్రష్టు పట్టడానికి ఇలాటి అవకరాలన్నీ దోహదం చేసాయని అక్కడ చాలాకాలంగా వుంటున్న వారు చెప్పుకోగా విన్నాను.

బెజవాడ నుంచి వచ్చిన ఒక ప్రముఖ కమ్యూనిస్ట్  (సీపీఎం)  నాయకుడు ఒకసారి మా  ఇంటికి భోజనానికి వచ్చారు. మాటల సందర్భంలో ఈ విషయం చెప్పారు. కానీ ఆయన పాత తరం కమ్యూనిస్ట్ నాయకుడు. అలాంటి  షాపుల్లో  పాశ్చాత్య  దేశాల్లో మాత్రమే  దొరికే చాలా ఖరీదైన వస్తువులు నామమాత్రపు ధరకు కొనుక్కోగలిగే సదుపాయాన్ని ఆయన ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. ‘మేము  ఈ దేశానికి సోవియట్ పార్టీ ఆహ్వానం మేరకు వచ్చింది  షాపింగ్ చేయడం కోసం కాదు’ అన్నారాయన. అంత గొప్ప వ్యక్తి పేరు గుర్తు రానందుకు చింతిస్తున్నాను. బహుశా వారి పేరు   లావు బాల గంగాధర రావు  గారని లీలగా గుర్తు.

 

ఆస్తాంకినో టవర్ విందుకు వెళ్ళేటప్పుడు లెనిన్ స్కీ ప్రాస్పెక్టస్ మీదుగా వెళ్ళాము. మాస్కో రేడియోకి   టాక్సీలో వెళ్ళాలి అంటే ఈ రోడ్డు మీదుగానే వెళ్ళాలి.

మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములువిద్యుత్ తో నడిచే బస్సులు  ఇదే రోడ్డుపై తిరుగుతుంటాయి. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే ఆ వీధికి సోవియట్ వ్యవస్తకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. ఆ వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండేవాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే,  అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.

ఒకసారి ఆ మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియాఅంటారు.) దానివెంట ఒక బస్సుదాని వెనక అంబులెన్స్వెనుకనే మరో పోలీసు వాహనం,   ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది అని చెప్పారు. పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలన్నా స్కూలు వాళ్ళు ముందు పోలీసులకు తెలియచేయ్యాల్సి వుంటుంది. అల్లా వుంటుంది అక్కడ పిల్లల పట్ల తీసుకుండే శ్రద్ధ.

మా కుటుంబం శాశ్వతంగా వదిలివెడుతున్నది ఇలాంటి వ్యవస్థ వున్న దేశాన్ని.

కింది ఫోటో:

మాస్కోలో సోవియట్ రేడియో, టెలివిజన్ టవర్ ఆస్తాంకినో



 

 

(ఇంకావుంది)    

కామెంట్‌లు లేవు: