15, మార్చి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (116) – భండారు శ్రీనివాసరావు

 

మాస్కోలో శంకరాభరణం

మాస్కోలో మా  ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. కానీ టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలల ముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే, వాళ్లే తెప్పించి పెడతారు. అలా  ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.
రాజ్ కపూర్ నిర్మించిన మహత్తర దృశ్య కావ్యం మేరా నామ్ జోకర్ సినిమా పతాక సన్నివేశాలు  రష్యన్ సర్కస్ డేరాల్లోనే చిత్రీకరించారు. సర్కస్ లకు విశేష ప్రజాదరణ వున్న ఒకానొక కాలంలో రష్యన్ సర్కస్ అంటే జనాలు విరగబడి చూసేవారు.


రష్యన్ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయిన రష్యన్ సర్కస్, కేధరిన్ ది గ్రేట్,  కాలం నుంచే వుంది. ఇంగ్లీష్ భాష తెలియని రష్యాలో,  రష్యన్ సర్కస్ ఆవిర్భావానికి  ఒక ఇంగ్లీష్ పౌరుడే కొంత మేరకు దోహద పడడం ఒక విశేషం. చార్లెస్ హగెస్ అనే ఆంగ్లేయుడు,  కేధరిన్ ది గ్రేట్ క్వీన్  రాణి గారి సమక్షంలో ఒక చక్కని ప్రదర్సన ఇచ్చాడట. దాంతో ముచ్చట పడిపోయిన రాణి గారు,  అతగాడికోసం రెండు సర్కస్ డేరాలు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారట. రాణి తలచుకుంటే డేరాలకు కొదవేముంది. అతడికోసం సెంట్ పీటర్స్ బర్గ్,  కమ్యూనిస్టుల ఏలుబడిలో 'లెనిన్ గ్రాడ్' గా పేరుమార్చుకుని,   తదనంతర కాలంలో తిరిగి సెంట్ పీటర్స్ బర్గ్ అన్న పాత పేరుకు మారిన నగరంలో,  సర్కస్ డేరాలు నిర్మించి పెట్టారు. కొన్నేళ్ళ తరవాత ఆ ఇంగ్లీష్ దొరవారు ఇంగ్లాండ్ కు వెళ్ళిపోయాడు. కానీ అతడి బృందంలోని సభ్యులు మాత్రం రష్యన్ల ఆదరాభిమానాలకు కట్టుబడిపోయి ఆ దేశంలోనే వుండిపోయారు. అలా చిగురించిన రష్యన్ సర్కస్ వటవృక్షం మాదిరిగా విస్తరించి, సోవియట్ల కాలంలో ఖండాంతరఖ్యాతిని సముపార్జించుకుంది. తొంభయ్యవ దశకం దాకా ఒక వెలుగు వెలిగింది.


గ్రేట్ మాస్కో స్టేట్ సర్కస్ ని 1971  లో మాస్కోలోని వేర్నాద్ స్కీ ప్రాస్పెక్ట్ లో ప్రారంభించారు. 3400 మంది వసతిగా కూర్చుని తిలకించగల విశాలమయిన ఎయిర్ కండిషన్ డేరాను నిర్మించారు. దీని ఎత్తు 36 మీటర్లు. ఇందులో అయిదు ఎరీనాలు వున్నాయి. సర్కస్ జరిగే ప్రధాన వేదికకు 18 మీటర్లు దిగువన వీటిని ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి,  ఈ ఎరీనాలు ఒక దాని వెంట మరొకటి పైకి వస్తాయి. అందువల్ల అట్టే వ్యవధానం లేకుండా,  రంగ స్తలాల రూపురేఖలు వాటంతట అవే మారిపోతుంటాయి. మన వైపు సురభి కంపెని నాటక ప్రదర్శనల మాదిరిగా.

రష్యన్ సర్కస్ చూడకుండానే ఇండియాకు తిరిగివచ్చేస్తామేమో అన్న బెంగ ఆవిధంగా తీరిపోయింది. సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టికెట్లు కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా,  అది మన శంకరాభరణం సినిమా.  హాల్లో జనం పలచగానే వున్నా తెలుగు సినిమాకు ఆ మాత్రం జనం రావడం ఆశ్చర్యం అనిపించింది. రష్యన్ డబ్బింగ్ కాబట్టి రష్యన్లు కూడా కనిపించారు ప్రేక్షకుల్లో. సినిమా మొదలుకావడానికి ఇంకా వ్యవధానం వుంది. ఈ సినిమా గురించిన పాత జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.

ఆ సినిమా చూసింది సరిగ్గా నలభయ్  అయిదేళ్ళ  కిందట, హైదరాబాదులో.

మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లిఅశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరంసుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లోహనుమాన్ వ్యాయామశాలకు దగ్గర్లోకందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీఆ హాల్లో కర్టెన్లుకుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయనిఅంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడుసినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు)

సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతంపాటలుహీరోయిన్ కి మాటలే లేవుఏవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. ( బీకాంలో నా క్లాస్ మేట్ జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడుకధానాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే) ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది,  తీరు చూస్తుంటే రెండోవారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.

ఆశ్చర్యంగా రెండోవారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.

కొన్నిరోజులు పోయాకవిలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. ప్రీ వ్యూ (PRE VIEW) కాదు,  ఫ్రీ వ్యూ (FREE VIEW).

నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటుకాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చునికన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్ లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయన గారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.

ఆయనే తెలుగు సినిమాని మరో మలుపు తిప్పిన కాశీనాధుని విశ్వనాధ్!

కట్ చేస్తే.....

మళ్ళీ 2017లో...

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకుసన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకా రోజు ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ గారు మాత్రమే. వరస సన్మాన పరంపరలతోటీవీ ఇంటర్యూలతో తీరికలేని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.

శంకరాభరణం గురించి కూడా చెప్పారు.

ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్నిసార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ‘ఏమోసారూఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మధన్యం అవడం అంటే ఇదే కాబోలు”

ఈ సినిమాలో మా రేడియో సహోద్యోగి ఒక పాత్ర వేశారు.
ఏవిటో ఈయన పాటా అర్ధం కాదుమాటా అర్ధం కాదు” అంటూ శంకరాభరణం సినిమాలో వీధిఅరుగు మీద సంగీతం పాఠాలు చెబుతూ శంకరశాస్త్రి గారిని ఎద్దేవా చేస్తూ,  తనదయిన బాణీలో తెలుగు ప్రేక్షకులను ఆహ్లాదపరచిన పొట్టి (సంగీతం) మేష్టరు గుర్తున్నాడా. గుర్తుంచుకోని ప్రేక్షకుడంటూ వుండరు. అతడే శ్రీ గోపాల్. పొతేపేరులో వున్న ఈ శ్రీ అనేది ఆయన పేరుకు ముందు గౌరవ వాచకం కాదుఅసలు పేరులో భాగమే.

శ్రీ గోపాల్ తో నాకు పరిచయం వుంది. ఆయన ఎక్కడ వుంటే అక్కడ ఉత్సాహం వెల్లివిరిసేది. మాటల పోగు. పరిచయం అయిన వారందరూ ఆయనకు  స్నేహితులే. చొరవతో నలుగురిలో దూసుకుపోయే తత్వం. మాటల్లో హాస్యం చిప్పిల్లేది.

నా పేరు బుడుగుఅసలు పేరు చాలా పొడుగు’ అని  ముళ్ళపూడి వారన్నట్టు శ్రీగోపాల్ అసలు పేరు కొంపెల్ల శ్రీ గోపాలకృష్ణమూర్తి. చేసే ఉద్యోగం ఒకటే అయినా ఆయన బహురూపి. రచయితకార్టూనిస్టుఫ్రీలాన్స్ జర్నలిస్టు. రంగస్థలచలన చిత్ర నటుడు. ఇన్ని కోణాలు ఉన్న మనిషి కాబట్టే ఆ శరీరం త్వరగా అలసినట్టుంది. విశ్రాంతి కోరుకుంది. అందుకేయాభయ్ ఏళ్ళు కూడా నిండకుండానే నలభయ్ ఎనిమిదో ఏటనే ఆయనకు నిండు నూరేళ్ళు నిండాయి.           

కడప ఆకాశవాణిలో పనిచేస్తూ అనారోగ్యంతో 1986 మే 18న హైదరాబాద్ లో శ్రీ గోపాల్ తుది శ్వాస విడిచారు.

జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శంకరాభరణం చిత్రంలో సంగీతం మాష్టారు దాసుగా శ్రీ గోపాల్ పాత్రపోషణ ప్రేక్షకులకు చిరకాలం గుర్తువుంటుంది. ఆయన ఆ సినిమాలో ఆండాళ్ అనే పాపకు సంగీతం నేర్పుతూసంగీతంలో వేగం పెరిగిందనిబ్రోచేవారెవరు రా అంటూ ఆ  పాటను విరిచివిరిచి పాడుతుండగాశంకర శాస్త్రిగారు వచ్చి, ‘సంగీతాన్ని ఖూనీ చెయ్యొద్దు దాసూ’ అని హెచ్చరిస్తారు.

మాస్కో థియేటర్ లో శంకరాభరణం సినిమా చూస్తూ ఈ సంభాషణలు అన్నీ రష్యన్ భాషలో వింటుంటే భలే అనిపించింది.

 పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో వుంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) పాత్ర నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమాలో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల,  సోమయాజులు గారు, ఆ సినిమాలో నటించిన తదితరులు అందరూ  అచ్చు రష్యన్ లో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.


 
మాస్కోలో ధియేటర్ లో శంకరాభరణం సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను. ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.

 

కింది ఫోటో:

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత కె. విశ్వనాధ్ గారితో నేను

రష్యన్ సర్కస్ చూడడానికి వెళ్లేవారికి ఇలా కొండచిలువలతో ఆడుకునే అవకాశం కల్పిస్తారు. 35 ఏళ్ళ క్రితం  అలా నేను.









(ఇంకావుంది)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

రష్యన్ శంకరాభరణం ప్రింట్ దొరికితే బాగుండు .
ఏడిద నాగేశ్వరరావు గారు ఈ విషయం ఏ ఇంటర్వ్యూ లో చెప్పలేదు .
:Kasi