అక్టోబర్ - 31,1987.
ఢిల్లీ
నుంచి సోవియట్ ఎయిర్ లైనర్ 'ఎరోఫ్లోట్'
లో కుటుంబంతో
కలసి మాస్కో బయలుదేరాను. విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత ఎయిర్ హోస్టెస్ లు ప్రయాణీకులు అందరికీ ఓడ్కా సర్వ్ చేయడం
ప్రారంభించారు. విమానంలో చాలామంది రష్యన్ లే వున్నారు. చీరె కట్టుకుని పైన హాఫ్
స్వెట్టర్ వేసుకుని వచ్చింది మా ఆవిడ ఒక్కతే.
అయినా ఎవరూ వింతగా చూడడం కానీ ముసిముసి నవ్వులు నవ్వుకోవడం కానీ నాకు కనపడలేదు.
విమానంలో వాళ్ళు పెట్టిన భోజనం చూడగానే మాస్కోలో మావంటి శాకాహారులకు ఎదురు కాబోతున్న
ప్రధాన సమస్య ఏమిటో అర్ధం అయింది.
కొన్ని
మాసాలుగా ఎదురుచూసిన క్షణం దగ్గర పడుతుంటే విమానం విండో నుంచి కిందకు చూసే
ప్రయత్నం చేసాము. కళ్ళు చికిలించుకుని చూసినా దట్టంగా అలుముకున్న పొగమంచులో ఏమీ కనబడలేదు.
మరికొద్దిసేపటిలోనే మా విమానం మాస్కో పొలిమేరల్లోని 'షెర్మేతోవా' అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
విద్యుత్ దీపాల కాంతిలో ధగధగలాడుతూ, పలుదేశాల ప్రయాణీకులతో ఎయిర్ పోర్ట్ కళకళలాడుతోంది. మాస్కోలో వెజిటేరియన్లకు
ఏమీ దొరకవు ఉప్పూ , పాలూ
తప్ప, అన్న హెచ్చరికలతో బయలుదేరిన మేము,
లగేజి కలెక్ట్ చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము. హైదరాబాద్ నుంచి
సూటుకేసులనిండా పట్టుకొచ్చిన వంట సంభారాలతో కస్టమ్స్ అధికారులనుంచి ఎలాంటి ఇబ్బంది
ఎదురుకాలేదు. కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ
డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీష్ లో ఏమంటారో ఆ క్షణాన
గుర్తురాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో
వాడుకుంటామనీ ఎన్నోవిదాలుగా చెప్పిచూసాను. ఇంగ్లీష్ భాష ఇసుమంతకూడా అర్ధం కాని ఆ
అధికారులముందు నా ప్రయత్నం వృధా ప్రయాస అయింది. పైపెచ్చు ఘాటయిన ఇంగువ వాసన వారి
అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి
ప్రమాదకరమూ, మాదక
పదార్ధమూ కాదని రుజువు చేసుకున్న తరవాతనే అక్కడనుంచి బయట పడగలిగాము.
బయటపడ్దామని
అన్నానే కానీ బయటపడడం అంత సులభమయిన విషయం కాదని మాకు వెనువెంటనే తెలిసివచ్చింది.
మమ్మల్ని
రిసీవ్ చేసుకోవడానికి మాస్కో రేడియో తరపున 'సెర్గీ' అనే ఉద్యోగి ఎయిర్ పోర్ట్ కి
వచ్చాడు. అతడి చేతిలో మా పేర్లు ఇంగ్లీష్ లో రాసివున్న ప్లకార్డు చూసి ఒకరినొకరం
గుర్తు పట్టాము. హైదరాబాద్ చిక్కడపల్లిలో కొన్న స్వెట్టర్ లతో ప్రస్తుతానికి పని
లాగిద్దామని దిగబడిన మమ్మల్ని చూసేసరికి అంత చలిలోనూ అతడికి చెమటలు పట్టినట్టున్నాయి.
రష్యన్లో అతడు చెబుతున్నదేదో మాకు అర్ధం కావడం లేదన్న విషయాన్ని అతడే అర్ధం
చేసుకుని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి తెచ్చిన వాహనాన్ని ఎయిర్ పోర్ట్ లాంజ్
ఎగ్జిట్ గేటు వరకు తీసుకునివచ్చాడు. అతడే మా లగేజి కారులో ఎక్కించి, కారు డోరు తెరిచే వుంచి, ఒకే అంగలో వెళ్లి కారెక్కమని సైగలతో చూపించాడు.
మేమంతా ఒక్క ఉదుటున వెళ్లి కారెక్కాము. అప్పుడు అర్ధమయింది మాకు, మా గురించి అతడు పడిన ఆదుర్దా. ఎగ్జిట్ గేటు
నుంచి కారెక్కడానికి మాకు పది సెకన్లు కూడా పట్టివుండదు. కానీ ఆ కాసేపటిలోనే చేతి
వేళ్ళన్నీ చలితో కొంకర్లు తిరిగిపోయాయి. మాస్కో చలి పులి విసిరే పంజా దెబ్బ మాకు
మొదటిరోజునే అనుభవంలోకి వచ్చింది. అదృష్టవశాత్తూ కారులో హీటరు ఉండడంవల్ల
బిగుసుకుపోయిన అవయవాలన్నీ మళ్ళీ స్వాధీనంలోకి వచ్చాయి. కారులో వెడుతున్నప్పుడు
పీవీ గారు చేసిన హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది.
ఢిల్లీలో
వీసా పనులన్నీ పూర్తయిన తరువాత అప్పుడు
కేంద్రమంత్రిగా అత్యంత ఉన్నత స్థానంలో వున్న పీవీ నరసింహారావు గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం.
కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ
గారిని కలవడానికి వీలుంటుందా' అని
వచ్చ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు
బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ
గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన
విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. 'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది
వచ్చేది' అన్నారు
ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.
'మాస్కో
ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో
ఎలావుంటావు' అని
అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా
చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.
మా లెక్క
ప్రకారం అది పగటి వేళ అయివుండాలి. కానీ, వీధి దీపాలన్నీ దివిటీలమాదిరిగా వెలుగుతున్నాయి . వాహనాలను హెడ్ లైట్
లు వేసుకుని నడుపుతున్నారు . అదేపనిగా మంచు కురుస్తూ ఉండడంవల్ల, పగలో రాత్రో
తెలియని అయోమయావస్తలో ఉండగానే మా కారు పలు అంతస్తుల భవనం ఒకదానిముందు ఆగింది.
ఎయిర్ పోర్ట్ అనుభవం ఇంకా గుర్తు ఉండడంతో ఈసారి అందరం ఎక్కువ
ఇబ్బంది పడకుండానే లోపలకు ప్రవేశించాము. మమ్మల్నీ, మా సామానునీ తొమ్మిదో అంతస్తులో
వున్న ఒక అపార్ట్ మెంట్ కు చేర్చి, సెలవు తీసుకున్నాడు సెర్గీ. లోపలకు వెళ్లి చూస్తే కళ్ళు తిరిగేలావుంది.
రెండు పడక గదులు, ఒక
డ్రాయింగు రూము, పెద్ద
పెద్ద షాండిలియర్లు, వంటగది, సామాను
గది, మంచాలు,
పరుపులు, దిండ్లు, దుప్పట్లు, టీవీ, నాలుగు బర్నర్ల స్టవ్, పైప్ గ్యాస్,
బాత్ టబ్,
షవర్ ఒకటేమిటి
సమస్తం అమర్చి పెట్టి వున్నాయి. ఒక క్షణం ఇది ఇల్లా లేక హోటలా అన్న అనుమానం
కలిగింది. ఆ పూటకి వంట జోలికి పోకుండా ఇండియా నుంచి తెచ్చుకున్న తినుబండారాలతోనే
సరిపెట్టుకున్నాము.
సోఫాల్లో
సర్దుకు కూర్చుని టీవీ ఆన్ చేస్తే సోవియట్ కమ్యూనిస్ట్ అధినాయకుడు మిహాయిల్
గోర్బచేవ్ అనర్ఘలంగా ప్రసంగిస్తూ కానవచ్చారు. భాష అర్ధం కాకపోయినా వింటూనే
నిద్రలోకి జారిపోయాము.
మరునాడు తెల్లవారుతూనే రేడియో మాస్కో తెలుగు
విభాగంలో పనిచేసే లిదా స్పిర్నోవా అనే ఆవిడ మా ఫ్లాట్ కు వచ్చి తనని తాను
పరిచయం చేసుకుంది. 'శ్రీనివాసరావు
గారూ! మీ ఆగమనం కోసం ఎన్నో మాసాలుగా ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నాము' అంటూ ఆ రష్యన్ మహిళ - జగదేకవీరుడు
సినిమాలో సరోజాదేవి మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే, అది చూసి నేనూ మా ఆవిడా
అవాక్కయ్యాము. దేశం కాని దేశంలో తెలుగు మాట్లాడే విదేశీ వనిత ఒకరు వున్నారని
తెలుసుకుని యెంతో సంతోషపడ్డాము. మాస్కో వాతావరణానికి సరిపడే ఉన్ని దుస్తులు, కాలిజోళ్ళు మా అందరికి కొనిపెట్టమని
ఆఫీసు వాళ్లు డబ్బులిచ్చి మరీ ఆమెను పంపారన్న సంగతి తెలుసుకుని మరింత సంబరపడ్డాము.
లిదా తీసుకెళ్ళి కొనిపెట్టిన ఉన్ని దుస్తులు వేసుకున్న తరవాత మా రూపు రేఖా
విలాసాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అవి ధరించి ఉన్ని టోపీలు పెట్టుకుంటే ఆడెవరో, మగెవరో ఒక పట్టాన గుర్తు పట్టడం
కష్టం. అక్కడి ఆహార్యం విచిత్రంగా వుంటుంది. ఆడా మగా ఎవరయినా ముందు ఉన్నితో చేసిన 'ఇన్నర్లు' వేసుకోవాలి. వాటిపై పాంటూ షర్టూ కోటూ
వేసుకుని 'ఫర్' తో చేసిన లాంగ్ కోటు ధరించాలి.
మామూలు బూట్లు పనికిరావు. 'ఫర్' బూట్లు, 'ఫర్' సాక్స్ లేకపోతే ఇంతేసంగతులు.
అయితే
ఈ దసరా వేషం ఇంటినుంచి ఆఫీసుకు చేరేవరకే. అక్కడికి వెళ్ళిన తరవాత ఈ చలి
దుస్తులన్నీ అక్కడి ప్రత్యేక కౌంటర్లలో ఒప్పగించి, పాంటూ షర్టుతో ఎంచక్కా తిరగగలిగేలా
ఎయిర్ కండిషన్ ఏర్పాట్లు చేశారు. ఇక రేడియో మాస్కో విభాగంలో నా సహచరులు, ముందు చెప్పిన లిదాతో పాటు, విక్టర్, గీర్మన్ పనిచేసేవారు. ఈ ముగ్గురికీ
తెలుగు వచ్చు. మరో ఇద్దరు, నటాషా, సెర్గీలకు రష్యన్ తప్ప మరొకటి
తెలియదు. వాళ్ళతో నా సంభాషణ సైగలతోనే సాగేది. సజావుగా పని చేసుకోవడానికి మా మధ్య
భాష ఎంతమాత్రం అవరోధం కాలేదు. వీళ్ళల్లో నటాషా మరీ చిన్న పిల్ల. యిరవై నిండకుండానే
ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో మొగుడితో కాపురం చేస్తోంది. యివన్నీ రష్యన్లకు చాలా
మామూలు. మా ఆవిడ శిలా విగ్రహం మాస్కో పురవీధుల్లో వేయించాలని సరదాగా జోక్
చేస్తుండేది. ఎందుకంటే, పెళ్ళయి
పదహారేళ్లయినా ఇంకా అదే మొగుడితో కాపురం చేస్తున్నందుకట.
కింది
ఫోటోలు
పట్టపగలు
మంచుదుప్పటిలో మాస్కో నగరం
ఇండియన్ స్కూల్ ప్రోగ్రాం లో మా పెద్ద పిల్లవాడు సందీప్ భండారు
(ఇంకా
వుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి