4, మార్చి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (102) – భండారు శ్రీనివాసరావు

 

ఆకాశంలో కొన్ని వేల అడుగుల ఎత్తున, పగలో రాత్రో సరిగా అర్ధం కాని సమయంలో, గంటకు కొన్నివందల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్న రష్యన్ ఎయిర్ లైన్స్ ఏరో ఫ్లోట్ విమానంలో, నా భార్యాపిల్లలు, మిగిలిన ప్రయాణీకులు నిద్రావస్థలో వున్నప్పుడు సీటుకు జారగిలపడి ఆలోచిస్తూ గతంలోకి జారిపోయాను.
అద్భుతంగా సాగిన నా రేడియో జీవితంలో మాయని మచ్చలాంటి సంఘటన 1987 లో జరిగింది.
శ్రీ కె.ఎస్. వ్యాస్ అత్యంత ప్రతిభావంతుడైన ఐ.పి.ఎస్. అధికారి. నేను బెజవాడ వెళ్లినప్పుడల్లా మా అక్కయ్య అడిగేది, ‘ఒరేయ్ నీకు చాలామంది తెలుసు కదా! ఎలాగైనా వ్యాస్ గారి ఫోటో ఒకటి తెచ్చి పెట్టరా. ప్రతిరోజూ నిద్రలేవగానే ఆ ఫొటోకు దణ్ణం పెట్టుకుంటాను’ అని బ్రతిమిలాడేది.
వ్యాస్ (కోట శ్రీనివాస్ వ్యాస్) బెజవాడలో పోలీసు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి, బెజవాడకు ఇంటి పేరుగా మారిన రౌడీ అనే పదం చరిత్ర పుటల్లో చేరిపోయింది. రాత్రివేళ అల్లరిచిల్లరగా తిరుగుతూ అడ్డు తగిలిన వారిపై, గుండు సూదులతో గ్యాస్ నింపిన సోడా సీసాలను గాలిలోకి ఎగురవేసి, ఒకదానితో ఒకటి కొట్టుకుని పేలిపోయేలా చేసి, బాంబు పేలుళ్ల వంటి ఆ భయంకరమైన చప్పుళ్ళతో బీభత్సం సృష్టించే రౌడీ మూకలు అడ్రసు లేకుండా పోయాయి. పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ అర్ధరాత్రి వరకు గాలి తిరుగుళ్ళకు అలవాటుపడిన కాలేజి విద్యార్ధులు రాత్రి తొమ్మిది లోపలే ఇళ్లకు చేరేవాళ్ళు. అప్పటివరకు వాళ్ళని ఎలా అదుపు చేయాలో తెలియక తలలు పట్టుకున్న తలితండ్రులకు వ్యాస్ గారు దేవుడిలా కనపడడంలో ఆశ్చర్యం లేదు. (అయితే, రౌడీల అణచివేత పేరుతొ తమ కార్యకర్తలను వ్యాస్ వేధిస్తున్నారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసేవాళ్ళు)
సమర్ధుడు, నిజాయితీపరుడు అయిన పోలీసు అధికారి వ్యాస్ ని ఆ నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హైదరాబాదుకు రప్పించి, రాజధాని నగరంలో అస్తవ్యస్తంగా వున్న ట్రాఫిక్ ని చక్కదిద్దే బాధ్యత అప్పగించారు.
ముఖ్యమంత్రి ఏరికోరి నియమించిన అధికారి, నేను వ్యక్తిగతంగా ఎంతగానో అభిమానించే అధికారి అయిన వ్యాస్ గారితో ఒకే ఒక్క విషయంలో వచ్చిన పేచీ, అనేక విపరీత పరిణామాలకు దారి తీస్తుందని అప్పట్లో ఏమాత్రం ఊహించలేకపోయాను.
ఉద్యోగం రేడియో కరస్పాండెంట్ కావడం వల్ల చాలామంది సీనియర్ పోలీసు అధికారులతో నాకు చెప్పుకోదగిన మంచి పరిచయాలే వుండేవి. అలాగే వ్యాస్ గారితో కూడా. ఇక వ్యాస్ గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.
ఆయన నివాసం రవీంద్ర భారతి ఎదురుగా వున్న ఒక మాన్యుమెంట్ మాదిరి ఎత్తైన భవనం. సెక్యూరిటి త్రెట్ కారణంగా బాగా రద్దీగా వుండే కూడలిలో ఆయనకు ఆ భవనం కేటాయించారని అనుకునేవారు. కూతవేటు దూరంలో (పాత) పోలీసు కంట్రోల్ రూమ్ లో ఆఫీసు. ఈ రెంటి నడుమ నేను పనిచేసే రేడియో స్టేషన్.
వ్యాస్ గారికి ప్రచార యావ లేదు. కానీ ట్రాఫిక్ సమస్యలను చక్కదిద్దడానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికపై ఆయన తీసుకున్న చర్యలు విశేష ప్రచారాన్ని కట్టబెట్టాయి. వన్ వే ట్రాఫిక్ నిబంధనలను అనేక ప్రధాన రహదారులకు విస్తరించడం, హెల్మెట్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం వగైరా అన్నమాట. దానితో వ్యాస్ గారి పేరు ప్రతిరోజూ పత్రికల్లో వచ్చేది. హెల్మెట్ నిబంధన అమలుచేసిన తీరు వివాదాంశంగా మారింది. హెల్మెట్ ధరించని వారిని పోలీసులు కాపు కాసి పట్టుకునేవారు. పోలీసు కంట్రోల్ రూమ్ కూడలి వద్ద మోటారు సైకిళ్ళపై సిబ్బంది సిద్ధంగా వుండేవారు, హెల్మెట్ లేకుండా తప్పించుకుని పోయేవారిని వెంటాడి పట్టుకోవడం కోసం. ఇక్కడే విలేకరులకు, పోలీసులకు నడుమ తరచుగా వాగ్వాదాలు జరిగేవి. వార్తల సేకరణ కోసం విమానాశ్రయం, సచివాలయం, ఆసుపత్రులు ఇలా అనేక చోట్లకు అనుదినం పోవాల్సిన అవసరం విలేకరులది. ప్రతి చోటికి హెల్మెట్ వెంటబెట్టుకుని వెళ్ళడం కుదరదు. పైగా యాభయ్ ఏళ్ల క్రితం రోడ్ల పరిస్థితి ఇంత మెరుగ్గా లేదు. ఎక్కడ చూసినా గుంటలు, గోతులు. వేగంగా పోవాలన్నా పోలేని విధంగా వుండేవి రోడ్లు. అక్కడక్కడా స్పీడ్ బ్రేకర్లు వున్నా అవి వున్న చోట పసుపు రంగుతో గీతలు గీయాలనేది రూలు. ప్రశ్నిస్తే అది మా పని కాదు, వేరే శాఖ వాళ్లది అని జవాబు.
ఇలా ప్రతిరోజూ విలేకరులకు, పోలీసులకు ఘర్షణలు.
నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో, మరో చోటికో. అసలా నౌకరీయే తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని జీతం పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం మొదలయింది.
నాకు బీపీ వుందని డాక్టర్లు నిర్ధారించి దాదాపు నలభయ్ ఏళ్ళు గడిచాయి. ఈ మాయదారి రోగం రావడానికి అప్పట్లో నాకు కనబడ్డ కారణం ఆటోరిక్షా డ్రైవర్లు.
ఆఫీసుకు పోవాలంటే ఆటోనే శరణ్యం. సందు మొగదల్లో ఆటోలు ఆపుకుని అందులో శేషతల్పశాయి మాదిరిగా డ్రైవర్లు విశ్రాంతి తీసుకుంటూ వుండేవారు. వాళ్ళల్లో వొకడ్ని నిద్రలేపి, రేడియో స్టేషన్ కు పోవాలి వస్తావా అని అడిగేవాడిని మర్యాదగా. ‘రాను’ అనే సమాధానం వచ్చేది దురుసుగా.
ఇక సంభాషణ నా చేయి దాటిపోయేది.
‘ఏం ఎగస్ట్రా ఇవ్వాలా?’
‘ఆ మాట వేరే చెప్పాలా’ కాసింత ఎటకారం.
ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. ఆ ఆటోని వొదిలేసి మరోటి పట్టుకుంటే మళ్ళీ అదే జవాబు ‘రాను’
మరో ఆటోవాలా సమాధానం మరో రకంగా వుండేది.
‘సికింద్రాబాదుకయితే సరే’
దానికి నేనూ సరే. ఎందుకంటే ఈ మధ్యలో ఏదో ఒక క్రాస్ రోడ్డు రాకపోదా. ఎవరో ఒక ట్రాఫిక్ పోలీసు కనబడక పోడా! అదీ నా ఆలోచన.
అనుకున్నట్టే పోలీసు తగిలేవాడు. నేను పలానా అని చెప్పగానే అతడు ఆటోవాడికి నాలుగు తగిలించేవాడు. లేదా ఓ క్లాసు పీకేవాడు. అంతే. నేను ఎంచక్కా అదే ఆటోలో ఆఫీసుకుకి చేరిపోయేవాడిని. ఉద్యోగ మహత్యం.
కానీ ఇది ఒక రోజు మాట కాదు కదా. ప్రతి రోజూ ఇదే తంతాయే!
భార్యాపిల్లల్ని తీసుకుని సినిమాకు బయలుదేరిన వాడిని, ఆటోవాళ్ళ పుణ్యమా అని చివరకు ఆటో వాడితో సహా పోలీసు స్టేషన్ కు చేరేవాడిని. అక్కడ దృశ్యం షరా మామూలే.
ఇదంతా చూసి మా వాళ్లు చిరాకు పడి నాతో బయటకు రావడమే మానుకున్నారు. ఆటో వాళ్ళు నాకు భయపడి మా ఇంటి సందు చివర ఆటోలు ఆపుకోవడం మానుకున్నారు.
ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం, ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో ఇబ్బందులను స్కూటరు వాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. నా ఈ మొదటి స్కూటరు కొనడం వెనుక కూడా చాలా కధ నడిచింది.
ఆ రోజుల్లో వెస్పా స్కూటర్లకి మంచి గిరాకి. ధరలో కొంత డబ్బు ముందు చెల్లిస్తే తరువాత ఎప్పుడో రెండు మూడేళ్లు వెయిట్ పీరియడ్ తర్వాత స్కూటర్ రిలీజ్ చేసేవాళ్ళు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి ప్రతి నెలా ఇన్ని స్కూటర్లు అని విచక్షణ కోటా వుండేది. నేను నాకు తెలిసిన వాళ్లకి చాలామందికి రవాణా శాఖ మంత్రి జే. చొక్కారావు గారికి చెప్పి సిఫారసు లెటర్లు ఇప్పించిన సందర్భాలు వున్నాయి. వీటికి బ్యాంకు అప్పులు ఇచ్చేవి. కొత్త స్కూటరు ఖరీదు ఏడెనిమిది వేల కంటే తక్కువే. బాంకు ఋణం ఇచ్చినా, రెండు, మూడు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సిరావడం వల్ల, అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా, తీసుకోవడానికి ఓ పట్టాన ధైర్యం చాలేది కాదు. బ్యాంకు వాళ్ళ ఈ షరతు నాకు కుదిరేది కాదు. ఆరేడు వందల జీతగాడి దగ్గర అంత మొత్తం ఎందుకు వుంటుంది? ఈ కారణం చేత నేను గవర్నమెంటు కోటాలో చాలా తక్కువ ధరలో స్కూటరు కొనుక్కోగల అవకాశం వుండి కూడా ఆ పని చేయలేకపోయాను.
అంచేత అలా విధిలేక ఆటో వాళ్ళతో నిత్య పోరాటం చేస్తూ రోజులు గడుపుతున్న కాలంలో..
కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను, హైదరాబాదు వచ్చి అప్పటికి నగరంలో వున్న ఏకైక స్టార్ హోటల్ బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని భాస్కరులు (పత్రికా రచయితలు) ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవధానం, వెసులుబాటు దొరికింది. ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి, కావాల్సిన వారికి లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం.
రెండు రోజుల తరువాత కోటీలోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను. బాంకు అధికారి స్కూటరు లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే, ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు.
ఆ రోజుల్లోనే, గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని, దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. మా వైభోగం ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు.
చిత్రం ఏమిటంటే, 1987లో మాస్కో వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు జరిగిన ‘హెల్మెట్ ధరించని జర్నలిస్ట్ అరెస్ట్’ అనే సంచలన ఉదంతానికి కారణమైన ‘నేను’, ఆ రోజు వెడుతున్నది ఈ గిర్నార్ స్కూటర్ మీదనే.
ఆటో వాళ్ళ బాధ పడలేక బ్యాంకు లోను తీసుకుని స్కూటర్ కొనుక్కుంటే, మూడో వాయిదా కూడా కట్టక మునుపే పోలీసులు పట్టుకునే వారు. హెల్మెట్ లేదంటారు. ఈ గతుకుల రోడ్లమీద హెల్మెట్ ఎందుకని నా ప్రశ్న. నేనే కాదు అనేకమంది పత్రికా విలేకరులతో పోలీసుల వాగ్వాదాలు నిత్యకృత్యంగా మారాయి. అలాగే ఈ విధానానికి వ్యతిరీకంగా ప్రతి రోజూ వార్తలు, కార్టూన్లు. ఈ పరిణామాలు ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారాయి.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి, ఆ నాటి మంత్రి అయిన అమరనాధ రెడ్డి గారి మృతి కారణంగా ఆ రోజు అసెంబ్లీ అనుకోకుండా వాయిదా పడింది.
స్కూటర్ తీస్తుంటే, ఆంధ్రభూమి విలేకరి సూర్య ప్రకాష్ కలిసి, నన్ను కాస్త విజయనగర్ కాలనీలో దింపుతావా అని రిక్వెస్ట్ చేశాడు. మధ్యాన్నం వార్తలకు చాలా సమయం వుంది. సరే పద అని స్కూటర్ మీద ఎక్కించుకున్నాను. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వెడుతుంటే హుమాయూన్ నగర్ కూడలి వద్ద ఒక ట్రాఫిక్ పోలీసు స్కూటర్ ఆపి పక్కన పెట్టమన్నాడు. షరా మామూలు వాదనల తర్వాత పద
పోలీసు స్టేషన్ కు పోదాం అన్నాను.
నడిరోడ్డు కంటే పోలీసు స్టేషన్ చాలా అనువు. ఫోన్ వుంటుంది. పై అధికారులతో మాట్లాడడానికి వీలుంటుంది.
పోలీసులు అనాల్సిన మాట నా నోట వచ్చేసరికి వాళ్లకూ పట్టుదల పెరిగింది. స్టేషన్ కు తీసుకువెళ్ళారు.
నానా రభస. సూర్య ప్రకాష్ ఇంటికి వెళ్లి విషయం అందరికీ చెప్పాడు. దాంతో జర్నలిస్టులందరూ సంఘీభావం ప్రకటించి మూకుమ్మడిగా పోలీసు స్టేషన్ కు వచ్చారు.
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఆయన అప్పుడు మద్రాసులో వున్నారు. మర్నాడు జర్నలిస్టులు అసెంబ్లీని బహిష్కరించారు. ప్రభుత్వం దిగివచ్చింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. నన్ను పట్టుకున్న పోలీసు ఇనస్పెక్టర్ ని వేరే చోటుకి బదిలీ చేశారు.
ఇదంతా నాపై తీవ్ర ప్రభావం చూపింది. ఈలోగా మాస్కో ఎసైన్మెంట్ వచ్చింది. దాంతోపాటే బీపీ కూడా వచ్చింది. మాస్కో వెడదామా వద్దా అనే సంశయానికి ఈ ఉదంతం తెర దించింది. అనేక మలుపులు తిరిగి ఈ కధ సుఖాంతం అయింది కానీ ఆనాటి నుంచి మళ్ళీ గిర్నార్ స్కూటర్ ఎక్కలేదు.
(మరో విచిత్రమైన విషయం ఏమిటంటే కె.ఎస్. వ్యాస్ ని పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ కాల్చి చంపిన వార్త ముందుగా తెలుసుకున్నవారిలో నేనున్నాను. నేను మాస్కో నుంచి తిరిగివచ్చిన తర్వాత , 1993 జనవరి 27 వ తేదీన నాటి హోం మంత్రి ఏమ్వీ మైసూరారెడ్డి విలేకరులను ఆ రాత్రి విందుకు ఆహ్వానించారు. అదే రోజు సాయంత్రం
లాల్ బహదూర్ స్టేడియంలో జాగింగ్ కు వెళ్ళిన కె ఎస్ వ్యాస్ ని నలుగురు నక్సల్స్ దగ్గర నుంచి కాల్చి చంపారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. ఇటువంటి వార్తలు ప్రజలకి వెంటనే తెలిసే అవకాశం లేదు. హోం మంత్రికి సెట్లో ఎవరో ఈ సంగతి చెప్పారు. వార్త వింటూనే చేష్టలుడిగిన హోం మంత్రి, విందు కేన్సిల్ చేసుకుని వెంటనే వెళ్ళిపోయారు.
నా రేడియో సహచరుడు షుజాత్ ఆలీ సూఫీ అందించిన సమాచారంతో అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి ప్రసారం అయిన తొమ్మిది గంటల ఇంగ్లీష్ వార్తల్లో ఈ హత్యోదంతం ప్రధాన వార్తగా రావడంతో ప్రజలందరికి, గ్రే హౌండ్స్ సృష్టికర్త, డి.ఐ.జి. శ్రీ కె ఎస్ వ్యాస్ ఇకలేరనే సంగతి తెలిసింది)
ఈ ఆలోచనలతో తెల్లారిందో, రాత్రి పొద్దుపోయిందో తెలియదు కానీ మంచు వర్షంలో తడుస్తూ, విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతున్న మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయం షెర్మెతోవా ఎయిర్ పోర్ట్, ఏరో ఫ్లోట్ విమానం విండో నుంచి కానవచ్చింది.
కింది ఫోటోలు :
నేను అభిమానించే పోలీసు అధికారి, కీర్తిశేషులు శ్రీ కె.ఎస్. వ్యాస్ ( మరింత మంచి ఫోటో కోసం నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు )
హెల్మెట్ లేని కారణంగా నన్ను అరెస్టు చేసి ఉంచిన హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ ముందు సీనియర్ జర్నలిస్టుల ధర్నా
(ఇంకావుంది)
All reactions:
1
Like
Comment
Send
Share
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook
Facebook

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

It's sad journalists think they are above all the rules and that they are special! Yes, when they are on duty and need some special permissions may be but why should they expect all these exceptions? How did all the journalists think the same and were in that Dharna? Pity!