వేగంగా సంభవించే మార్పులు కొన్నయితే, చాపకింది నీరులా నెమ్మదిగా చోటుచేసుకునే మార్పులు మరికొన్ని. అలాంటి ఒక గొప్ప మార్పుని అయిదేళ్ళ కాలంలో నేను సోవియట్ యూనియన్ లో చూడగలిగాను. నేను ఇంతకు ముందే చెప్పినట్టు రష్యన్ల జీవితాలు దశాబ్దాల తరబడి ఎలాంటి మార్పులు లేకుండా నల్లేరు మీద బండిలా సాగిపోయేవి. రీనక్ వంటి నయా మార్కెట్లు రంగప్రవేశం చేసినా కూడా వారి జీవనంలో చెప్పుకోదగ్గ గొప్ప కుదుపులేవీ సంభవించలేదు. ఇంట్లో ఆఫీసులో కూడా ఎలాంటి మార్పు లేదు. గోర్భచేవ్ ఉపన్యాసాలు కూడా అదే తీరు. ఆఫ్ఘని స్తాన్ నుంచి రష్యన్ సైనిక దళాల ఉపసంహరణ, గ్లాస్ నోస్త్, పెరిస్త్రోయికా సిద్దాంతాల ప్రాధాన్యత వంటి అంశాలపై ఆయన ప్రసంగాలు గంటలు గంటల పాటు సాగిపోయేవి. రాజకీయ నాయకులకు లంగ్ పవర్ ఎంత ముఖ్యమన్నది తెలిసివచ్చింది. వార్తలు అరగంట అయితే ఒక్కోసారి పూర్తి సమయం అంతా గోర్భచేవ్ ప్రసంగాలను అనువదించి చదవడంతోనే సరిపోయేది. వేరే వార్త అంటూ వుండేది కాదు. ఇది కాక రష్యన్ టీవీ మెయిన్ ఛానల్ లో, ఆలిండియా రేడియో రాత్రి తొమ్మిది గంటల వార్తల మాదిరిగా నొవొస్తి అనే నేషనల్ బులెటిన్ ప్రసారం అయ్యేది. ఇక దాంట్లో అయితే ప్రెసిడెంట్ గోర్భచేవ్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం మరో ముచ్చటి లేకుండా అర్ధరాత్రి వరకు కొనసాగేది.
ఇక్కడ ఒక విషయం
చెప్పాలి.
ఖేదమైనా, మోదమైనా సాపేక్షమే!
ఎనభయ్యవ దశకం పూర్వార్థంలో,
ఆకాశవాణి, దూరదర్శన్ లు మాత్రమే రాజ్యమేలుతున్న రోజుల్లో, వాటిని ఇందిరా వాణి అనీ, రాజీవ్ దర్శన్ అనీ గిట్టని వాళ్ళు ముద్దుగా పిలిచేవారు. వాటి మీద, అవి ప్రసారం చేసే కార్యక్రమాలమీద ఏలినవారి పెత్తనం, సర్కారువారి
ముద్ర అంతగా వుండేవని చెప్పడం అందులోని శ్లేష. ఆ తరవాత రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో
వెళ్ళినప్పుడు, అక్కడి దేశాధినేత అనండీ , పార్టీ నేత అనండీ, మిహాయిల్ గోర్భచేవ్, రష్యన్ టీవీ తెరపై గంటలు గంటలు కనబడే తీరు చూసిన తరవాత కానీ ఈ విమర్శలు అర్ధం పర్దం లేనివన్న సంగతి అర్ధం కాలేదు. మేము అలా అనుకుంటూ సంతోషంగా ఆ కార్యక్రమాలు చూస్తూ
రోజులు గడుపుతున్న రోజుల్లో ఒక ఆరబ్ దేశం నుంచి నాకు తెలిసిన ఒక తెలుగు మిత్రుడు ఏదో పని మీద మాస్కో వచ్చి, మా ఇంట్లో రష్యన్ టీవీ ప్రోగ్రాములు చూసి ఎంతగానో మురిసి ముక్కచెక్కలవ్వడం చూసి, మాకు మతి పోయింది. కదిలిస్తే అతగాడు చెప్పిన కధ, అర్జున విషాద యోగాన్ని తలపించింది. ఆ దేశంలో
టీవీ తెరపై, ఉదయం నుంచీ రాత్రి పడుకునే వరకూ బోధలు ప్రవచిస్తూ , సూక్తులు వల్లిస్తూ ఒకే ఒక్క పెద్దమనిషి అస్తమానం దర్శనం ఇస్తాడట. ఆ ప్రోగ్రాములు చూసీ చూసీ వచ్చిన ఆ పెద్దమనిషికి, రష్యన్ టీవీ కార్యక్రమాలు చల్లని వేళలో
ప్రియురాలి వెచ్చని కౌగిలిలా ఎంతో ఉల్లాసాన్ని కలిగించాయి. అందుకే అన్నారు మనుషుల బాధలు, ఇబ్బందులు అన్నీ సాపేక్షం
(రిలెటివ్). ఇతరులతో పోల్చి
చూసుకుంటే సగం బాధ తగ్గిపోతుందంటారు .
మానవ మనస్తత్వం తీరే
అంత. మన ఇంట్లో కరెంటు పోతే, కరెంటు
కంప్లైంట్ చేయడానికి ముందు, పక్క వాటాలో
కరెంటు వుందో లేదో చూడాలనిపిస్తుంది. పొరుగు వారింట్లో కూడా కరెంటు పోతే ‘అదో
తుత్తి’.
మనిషి కష్టాలు, ఇబ్బందులు చూసే ‘సాపేక్ష సిద్ధాంతం’ కనుక్కున్నారేమో.
సోవియట్ యూనియన్ లో
మొదటి మార్పు నాకు మొట్టమొదట కనబడింది మెక్ డొనాల్డ్ రూపంలో.
1990 వ సంవత్సరం ప్రారంభంలో కాబోలు, మాస్కోలో మొట్టమొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్
మొదలయింది. అప్పుడు చూడాలి తమాషా. మాస్కో నగరంలో వున్న పిల్లలు, యువతీ యువకులు అందరికీ అదొక అడ్డాగా మారిపోయింది.
అంటే హైదరాబాదులో ఒకప్పుడు ఇరానీ కఫేలు చాలామందికి రోజూ పరస్పరం కలుసుకునే
ప్రదేశాలుగా వుండేవి. అక్కడ కూర్చుని సమోసాలు, టై బిస్కెట్లు తింటూ వేడి వేడి చాయ్ తాగుతూ, దక్కన్ క్రానికల్ పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ
కుర్రకారు భలేగా కాలక్షేపం చేసేవారు. అయితే మాస్కో మెక్ డొనాల్డ్
విషయంలో కాసింత తేడా వుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే సావకాశం వుండేది
కాదు. ఎప్పుడు చూసినా కిలోమీటర్ల పొడుగునా క్యూలు దర్శనమిచ్చేవి. మా పిల్లలు
అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే పట్టేది.
ఆ రెస్టారెంట్ కు కొద్ది దూరంలోనే లెనిన్ సమాధి వున్న రాతి పలకలు పరచిన మైదానం వుండేది. ఈ మెక్ డొనాల్డ్ వచ్చిన తరువాత అక్కడ
క్యూలు పలచపడ్డాయని హాస్యోక్తిగా చెప్పుకునే వారు.
‘ఇనుప తెర’ దేశంగా పేరు
పొందిన సోవియట్ రష్యాలో గోర్భచెవ్ సంస్కరణల పుణ్యమా అని తలుపులు బార్లా తెరవడంతో,
మెక్ డొనాల్డ్ వంటి పాశ్చాత్య రెస్టారెంట్లకు అక్కడ కాలుమోపే అవకాశం దొరికింది.
మాస్కో మెట్రో సింబల్, ఇంగ్లీష్ అక్షరం ‘M’ ని
పోలివుంటుంది. సరిగ్గా దానిలాగే వుండే మెక్ డొనాల్డ్ సింబల్ కూడా మాస్కో
యువతరాన్ని అమితంగా ఆకర్షించింది.
మెక్ డొనాల్డ్
రెస్టారెంట్లలో బాగా అమ్ముడుపోయే ‘బిగ్ మాక్’ ని, మాస్కో
రెస్టారెంట్ లో ‘బల్షోయీ మాక్’ అనేవారు. రష్యన్లో ‘బల్షోయీ’ అంటే ‘పెద్ద’ అని అర్ధం. అప్పట్లో బిగ్ మాక్ ధర రెండు రష్యన్ రూబుళ్లు. అంటే అమెరికా కరెన్సీలో
చెప్పాలంటే మూడు డాలర్ల ముప్పయ్ ఎనిమిది సెంట్లు. సగటు రష్యన్ పౌరుడి నెల
జీతంలో వందోవంతు. కాకపొతే, డాలరుకు బ్లాక్ మార్కెట్లో పాతిక ముప్పయి రూబుళ్ళు దొరికేవి.
అంటే ఒక డాలరుకు పదిహేను బల్షోయి మాక్ లు వచ్చేవి అన్నమాట.
ఈ కరెన్సీ బ్లాక్
మార్కెట్ అనేది కూడా ఆర్ధిక సంస్కరణల పుణ్యమే.
నెమ్మదిగా మొదలయిన ఈ మార్పులు మంచివా, చెడ్డవా అనే సోయి ఎవరిలో కనబడేది కాదు.
మార్పు అంటే తెలియని
జనాలకు ఏదో ఒక మార్పు కావాలి అంతే!
కింది ఫోటోలు:
నాటి సోవియట్ అధినేత
మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్
మాస్కోలో లెనిన్ మసోలియంకు
కూతవేటు దూరంలో వెలిసిన మొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్. బయట మంచులో క్యూ లైన్లలో వేచివున్న జనం.
(ఇంకావుంది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి