ముక్కు మాట్లాడుతుందా? ఏమో! గుర్రం ఎగరావచ్చు.
జలుబు
వెలగని బలుబు అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ.
జలుబుకు, మాడిపోయిన బలుబుకి సంబంధం ఏమిటి
అనుకునేవాడిని చిన్నప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు. ప్రాస కోసం రాశారేమో అనే
అనుమానం కూడా రాకపోనూలేదు.
ఇప్పుడు
అర్ధం అవుతోంది గత నాలుగు రోజులుగా నన్ను పట్టుకుని పీడిస్తున్న రొంప, తుమ్ములు, దగ్గులు చూస్తుంటే.
ఈ నెల
రెండో తేదీన నేనూ,
జ్వాలా కలిసి కేవీపీ గారి కార్యక్రమానికి వెళ్ళాము. వచ్చేటప్పుడు నన్ను ఇంట్లో
దింపి వెళ్ళాడు. చెడిపోయిన లిఫ్ట్ కారణంగా మూడు అంతస్తులు ముక్కుతూ మూల్గుతూ
ఎక్కాను. బహుశా అప్పుడే ముక్కుకు నామీద కోపం వచ్చి వుంటుంది. మర్నాడు తెల్లవారగానే
తుమ్ములు మొదలయ్యాయి. అదేమిటో జర్దా కిళ్ళీ వేసుకున్నవాడి పక్కన కూర్చొంటే ఆ ఘాటు
సంగతేమో కానీ ఏదో సువాసన మనల్ని అలరిస్తుంది. అలాగే ఈ తుమ్ములు తుమ్మేవాడికి
తుమ్మినప్పుడల్లా ఒక రకమైన రిలీఫ్. అదే పక్కన వున్నవాడికి భరించలేని అసహ్యం. గుడ్డిలో
మెల్ల ఏమిటంటే నా తుమ్ములు పక్కవారిని ఇబ్బంది పెట్టే సమస్యలేదు. లిఫ్ట్ లేదు కనుక
అతిధి, అభ్యాగతులు అనుకోకుండా వచ్చే వీలులేదు. అంచేత నా తుమ్ములు
నేనే తుమ్ముకుంటూ ఆ రాత్రి గడిపేశాను. తోడు లేని వాడికి తుమ్ములు కూడా ఒక తోడే.
మర్నాడు
మూడో తారీకు. మా రెండో కోడలు పుట్టింటి బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ వుంటే, తను ఊళ్ళో లేదు, కనీసం నేనన్నా వెడితే బాగుంటుంది
అని వెళ్లి వచ్చాను.
వచ్చేసరికి
కొంత పొద్దుపోయింది. తుమ్ములకు తోడు రొంప, దగ్గులు మొదలయ్యాయి. తుమ్ముతూ చీదడం, చీదుతూ తుమ్మడం, దగ్గడం రాగం తానం పల్లవి సరిపోయాయి. అదృష్టం కొద్దీ
జ్వరం లేదు. పక్కవాళ్లు నేను ఏదో పాత నాగయ్య సినిమా చూస్తున్నానని అనుకుని
వుంటారు.
అలా
మూడు రోజులు, కాలు గడప బయట పెట్టకుండా, మెట్లు దిగకుండా ఇంటి పట్టునే కాలక్షేపం.
మందు
వేసుకుంటే ఏడు రోజుల్లో,
వేసుకోకపోతే వారం రోజుల్లో తగ్గేది జలుబు అని ఒక పాత నానుడి వుంది. చూద్దాం మరో
మూడు రోజులు. బయటకువెళ్లి వెలగబెట్టే రాచకార్యాలు ఏమున్నాయి కనుక?
ఇకపోతే
ఇక్కడ మా ఆవిడ జ్ఞాపకం ఒఅక్తి. దగ్గులు, పిండారీల కధలో ఈ పిడకల వేట
ఏమిటంటారా! తప్పదు.
ఒక
తరానికి చెందిన భార్యాభర్తల నడుమ, ఒక వయసు
వచ్చిన తర్వాత మాటలు తక్కువ అనే అపకీర్తి
సమాజంలో వుంది. ఇందులో నిజమెంతో తెలవదు.
కొన్నేళ్ళ
క్రితం ఓ పెళ్ళికి ఖమ్మం వెళ్ళి వచ్చాం. గాలి మార్పో, నీటి మార్పో తెలియదు. తనకు ఒకటే రొంప. ‘ అది నాకు
తెలియదు. ఇంటి విషయాలు, ఇల్లాలి
సంగతులు పట్టించుకోకపోవడమే కదా మన స్పెషాలిటి.
ఆ రాత్రి
ఓ రాత్రివేళ చూస్తే తను పక్కనలేదు. లేచి చూస్తే పూజగదిలో ఓ దుప్పటి కప్పుకుని
పడుకుని వుంది.
పొద్దున్నే
నేను ఓ ఛానల్ కు వెళ్ళాలి. పక్కన పడుకుంటే జలుబు అంటుకుంటుందేమో అని ఆలోచించి ఈ
పని చేసి వుంటుంది.
మనసుతో
మాట్లాడ్డం అంటే ఇదేనేమో!
ఇంతకీ
ముక్కుతో మాట్లాడం గురించి చెప్పలేదు కదా!
నాకు
వచ్చే ఫోన్లు అతితక్కువ. అయినా కొన్ని రాంగ్ కాల్స్ వస్తుంటాయి. వాటిల్లో చాలా
వరకు హెచ్.పి. గ్యాస్ కస్టమర్స్. ఇదేదో
కొత్త సమస్య కాదు, చాలా
కాలంగా నడుస్తున్న కధే!
నా
మానాన నేను పాత పాటలు వింటూ, పాత
సినిమాలు చూస్తూ ఏదో ఉబుసుపోక రాతలు రాసుకుంటూ వుంటే ఫోన్ మోగుతుంది. హెచ్ పీ
గ్యాసా అంటుంది అవతల గొంతు. మొదట్లో తెలియక అమాయకంగా అవునండీ మాది హెచ్ పీ గ్యాసే
అంటాను. మా సిలిండర్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది ఆ గొంతు. గొంతులో పచ్చి
వెలక్కాయ పడి, అప్పుడు
వెలుగుతుంది లైటు. అబ్బే ఇది గ్యాస్ ఏజెన్సీ కాదండీ పర్సనల్ నెంబరు అని పెట్టేస్తే,
మళ్ళీ ఫోన్
మోగుతుంది. మళ్ళీ అదే గొంతు. ‘అలా పెట్టేస్తారేమిటి, గూగుల్ సెర్చ్ లో ఇదే నెంబరు వుంది.
కాదంటారేమిటి’ అని డబాయిస్తుంది. ఇలా రోజుకు ఒకసారి కాదు, అనేక సార్లు. కొన్నేళ్లుగా ఇదే తంతు.
గొంతు మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి చికాకు వచ్చి ఫోన్ చేసిన వాళ్ళ మీద చీకాకు
పడతాను. తర్వాత జాలి కూడా పడతాను. గ్యాస్ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు.
రాంగ్ నెంబర్ కావచ్చు. అవసరంలో వుండి ఫోన్ చేస్తున్నారు. పోనీలే అనుకుంటే
పోను కదా! నాకొచ్చిన ఇబ్బంది ఏముంది. రాంగ్ నెంబర్ అని మర్యాదగా చెబితే వచ్చిన
నష్టం ఏముంది. ఇలా కాసేపు పశ్చాత్తాపపర్వం నడుస్తుంది. ఇంతలోనే మరో ఫోన్.
‘హెచ్ పీ గ్యాసా!’ నాలోని బుద్దుడు మాయమైపోతాడు. మళ్ళీ సీను రిపీట్.
ఒక రోజు
అలా అప్పటికి మూడో ఫోను. ఇక వేరే దారి లేక కౌన్సెలింగ్ మొదలు పెట్టాను.
‘చూడండి.
నేను మీలాగే హెచ్ పీ గ్యాస్ కన్స్యూమర్ ని. ఏజెన్సీ నడపడం లేదు. ఈ మధ్య గ్యాస్
బుకింగ్ విధానం సులభతరం చేశారు. 96660 23456 నెంబరుకు ఫోన్ చేయండి. ఒకటి
నొక్కితే...’
నా మాట
పూర్తికాకమునుపే అవతల గొంతు నా గొంతుకు అడ్డం పడింది.
‘ఇవన్నీ
మాకూ తెలుసు. ఇలా చేయాలి అంటే ముందు మా ఫోన్, కన్స్యూమర్ నెంబరు రిజిస్టర్
చేసుకోవాలి. ఈ కనెక్షన్ మా పేరుతొ లేదు. గూగుల్ సెర్చ్ లో నెంబరు చూసి చేసేది
ఇందుకే’
నాకు
కళ్ళు తెరిపిళ్ళు పడాలి. కానీ పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఆ జవాబుతో. కోపంతో కట్
చేశాను.
నాలోని
తథాగతుడు మేలుకుని హితవు చెప్పడంతో మళ్ళీ కంప్యూటర్ లో తల దూర్చాను.
ఈసారి
ఎక్కువ వ్యవధానం లేకుండానే ఫోన్ మోగింది. ‘హెచ్ పీ గ్యాసా!’
నేనూ ఈ
సారి రూటు మార్చి నిదానంగా చెప్పాను. కాదండీ అన్నాను వినయంగా. ఒక విషయం చెప్పండి
అని అడిగాను మరింత వినమ్రంగా. ఈ నెంబరు గూగుల్ సెర్చ్ లో దొరికింది అంటున్నారు.
ఏమీ అనుకోకపోతే ఆ స్క్రీన్ షాట్ నా ఈ నెంబరుకు పంపిస్తారా శ్రమ అనుకోకుండా’
ఇంత
మన్ననగా కోరేసరికి అతడు సరే అన్నాడు. సరేతో సరిపుచ్చకుండా పంపాడు.
అది
చూసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఒక్క అంకె తేడా లేకుండా అది, పాతికేళ్ళుగా నా పేరు మీద బిల్లులు
కడుతూ నేను వాడుతున్న నా పర్సనల్ నెంబరే!
ఇప్పుడు
జలుబు శకం నడుస్తోంది కదా! ఏది మాట్లాడినా ముక్కుతోనే. గ్యాస్ వాళ్లకు కూడా ముక్కుతోనే
జవాబు.
(06-09-2025)