27, ఏప్రిల్ 2017, గురువారం

మారింది రోజులా! మనుషులా!!


తన రంగంలో క్రమంగా నిలదొక్కుకుని, జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడు విలేకరి.
“జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూసారు. లేని రోజులకు, ఉన్న రోజులకు తేడా ఏమైనా కనిపిస్తోందా’ అని.
“హస్తిమశకాంతరం’ జవాబు వచ్చింది వెంటనే.
“లేని రోజుల్లో లేనిడబ్బు ఒక్కటే సమస్య. ఇప్పుడో డబ్బు తప్ప అన్నీ సమస్యలే”
“అదెలా?”
“ఆ రోజుల్లో డబ్బు లేకపోయినా మనుషుల నడుమ ఆప్యాయతలు, అనురాగాలు ఉండేవి. స్నేహితుల సంగతి చెప్పక్కర లేదు. ఎవరు ఎవరి మీద పడి  తింటున్నాడో ఎవరికీ పట్టేది కాదు. ఇప్పుడలా కాదు. అన్నిటికీ లెక్కే. అవసరానికి ఎవరినైనా ఏదైనా అడిగితే ఆ అవసరం వెనుక ఏదైనా మర్మం ఉందా అనే శోధింపు ఎక్కువైంది. ఇతరుల గురించి కాదు, నేను చెప్పేది. నేనైనా అంతే! ఈ తేడా ఎలా వచ్చిందో ఏమిటో మరి!”
“.........”
“రేపెలా గడుస్తుంది అనే అ రోజుల్లో రేపటి గురించిన బెంగ ఎవ్వరికీ  వుండేది కాదు. ఏపూటకాపూట హాయిగా గడిచిపోయేది. వున్నవాళ్ళు, లేనివాళ్ళు వున్నదా౦తోనే గడుపుకునేవాళ్ళు. లేదనే లోటు వుండేది కాని, లేదన్న మనాది ఉండేది కాదు”       
“......”
“మరో విషయం చెప్పనా! కష్టాలు తెప్పించే కన్నీళ్లు కళ్ళల్లో తిరిగేవేమో కాని, మొహంలో చిరునవ్వులు మాత్రం చెరిగేవి కావు. తరాలకు సరిఅడే ఆస్తులు పోగుపడ్డాయి కానీ, ఆ నాటి సంతృప్తి కలికానికి కూడా మిగల్లేదు”

విలేకరి దగ్గర అడగడానికి ప్రశ్నలు లేవు, నోట మాటలూ  లేవు. 


(COURTESY: IMAGE OWNER)

26, ఏప్రిల్ 2017, బుధవారం

మరుగున పడిన ‘మణిరత్నం’


కస్తూరి రామచంద్ర మూర్తి. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు. జర్నలిష్టు మిత్రుడు దివాకర్  కు స్వయానా మేనల్లుడు. కాకపొతే వయస్సులో కాస్త పెద్దవాడు. పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సు రెండో బ్యాచ్ . గోల్డ్ మెడలిష్ట్. అక్కడ కట్ చేస్తే...
ఏడిద నాగేశ్వరరావు (మా రేడియో సహచర ఉద్యోగి, నాటక ప్రియుడు ఏడిద గోపాల రావుకు స్వయానా అన్నగారు) విశ్వనాద్ దర్శకత్వంలో  శంకరాభరణం సినిమా మొదలు పెట్టారు. బాలు మహేంద్ర సినిమాటోగ్రాఫర్. మొదటి షెడ్యూలు అయిందో లేదో తెలవదు, బాలూ మహేంద్రకి మొదటిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చేసేది విశ్వనాద్ గారి సినిమా. వదిలిపెట్టాలంటే కష్టమే. చివరికి విశ్వనాద్ గారే కల్పించుకుని, డైరెక్షన్ చేసే ఛాన్సు అరుదుగా వస్తుంది కాబట్టి బాలూ మహేంద్రకి ఆ అవకాశం వాడుకోమని చెప్పి పంపేశారు. అంతవరకూ శంకరాభరణం సినిమాకి ఆపరేటివ్  కెమెరామన్  గా పనిచేస్తున్న కస్తూరి రామచంద్ర మూర్తికి మొత్తం బాధ్యత అప్పగించారు. సినిమా టైటిల్స్  లో మాత్రం బాలూ మహేంద్ర పేరునే వుంచేసారు. కాకపోతే విశ్వనాద్ తరువాత సినిమా శుభోదయం అనుకుంటా, దానికి సినిమాటోగ్రాఫర్  గా కస్తూరి రామచంద్ర మూర్తినే పెట్టుకున్నారు. ఆ రెండూ ఘన విజయం సాధించాయి కానీ కస్తూరి వారికి రావల్సినంత పేరు రాకపోగా అవకాశాలు కూడా రాలేదు.
సినిమాలు తీసేటప్పుడు కెమెరామన్ల జేబులో ఒక చిన్న పరికరం వుంటుంది. (ఏదో మీటర్ అంటారు) దాన్ని నటుడి మొహం మీద పెట్టి లైటింగుని సరిచేస్తారు (ట). అయితే మన కస్తూరి రామచంద్ర మూర్తి మాత్రం మొహం మీద అరచేయి అడ్డుగా పెట్టి లైటింగు సరిచేస్తారట, పూర్వకాలంలో వైద్యులు నాడిపట్టుకు చూసి రోగనిర్ధారణ చేసినట్టు.  తన రంగంలో అంతటి ఘనుడామూర్తిగారు.  
సినిమా రంగంలో ప్రతిభ వుంటే సరిపోదు, అదృష్టం కూడా వుండాలి అంటారు.

అందుకు కస్తూరివారు ఒక మంచి ఉదాహరణ.        

అవార్డుకే అవార్డు వచ్చింది


మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారికి సినిమాల గోల పట్టదు. అలాంటిది ఆయన స్వయంగా ఒక సినిమాకి ముందుగా టిక్కెట్లు బుక్ చేయించాడు. చిక్కడపల్లి, అశోక్ నగర్ లలో ఉంటున్న కుటుంబాల వాళ్ళం మేమందరం, సుమారు ఓ పాతిక మందిమి పోలో మంటూ రిక్షాలు కట్టించుకుని సుల్తాన్ బజార్ దాపుల్లో, హనుమాన్  వ్యాయామ శాలకు దగ్గర్లో, కందస్వామి లేన్ లో ఉన్న రాయల్ టాకీసుకి  వెళ్ళాము. (ఈ హాలు లహౌటీ అనే పెద్ద వ్యాపారస్తుడిదనీ, ఆ హాల్లో కర్టెన్లు, కుర్చీలు అన్నీ పింక్ రంగులో ఉంటాయని, అంచేత దాన్ని పింక్ థియేటర్ అనేవాళ్ళనీ నా జర్నలిష్టు మిత్రుడు, సినిమాల విషయాల్లో ఉద్దండుడూ అయిన వీజేఎం దివాకర్ చెప్పాడు)    సినిమా మొదలయింది. హాలు హాలంతా నిశ్శబ్దంగా సినిమా చూస్తున్నారు. అంతా సంగీతం, పాటలు, హీరోయిన్ కి మాటలే లేవు, యేవో పొడిపొడిగా అక్కడక్కడా రెండు మూడు ముక్కలు తప్ప. (జంధ్యాల మాటలు రాశాడు. కధానాయకుడు, నాయకి నడుమ మాటలే వుండవు. సినిమాలో ఎక్కువ డైలాగులు వున్నది అల్లు రామలింగయ్య పాత్రకే)  ఇంటర్వెల్ లో ఎవరో అంటున్నారు, ‘మొదట్లోనే రావడం మంచిదయింది, తీరు చూస్తుంటే రెండో వారం పోస్టరు కూడా పడేట్టు లేదు’ తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
ఆశ్చర్యంగా రెండో వారం నుంచే మంచి టాకంటుకుంది. జనం క్యూల్లో నిలబడి టిక్కెట్లు కొనుక్కుని చూడ్డం మొదలెట్టారు.
కొన్ని రోజులు పోయాక, విలేకరులకోసం రామకృష్ణా స్టూడియోలోని మినీ థియేటర్లో ఆ సినిమా ప్రీవ్యూ వేశారు. నేనూ వెళ్లాను. హాలు సగం వరకు కుర్చీలు వేశారు. మొదటి వరసలో ఒకాయన కాకీ ప్యాంటు, కాకీ షర్టు టక్ చేసుకుని దీక్షగా సినిమా చూస్తున్నారు. నేను ఆల్రెడీ చూసిన సినిమాయే కనుక ఆయన్నే గమనిస్తూ పోయాను. ఒక విగ్రహంలా కూర్చుని, కన్ను ఆర్పకుండా చూస్తూ సినిమాలో లీనమైపోయారు. ఇంటర్వెల్  లో మళ్ళీ ఈ లోకంలో పడడానికి ఆయనగారికి కొంత వ్యవధి పట్టింది. అంతా లేచివెళ్ళి ఆయన్ని అభినందిస్తున్నారు. నేనూ వెళ్లి నమస్కరించాను.
ఇవ్వాళ మళ్ళీ వెళ్లి ఆ దాదా సాహెబ్ ఫాల్కే  అవార్డు గ్రహీతను అభినందించాలని అనిపించింది. కానీ తర్వాత తట్టింది.

ఆయన్ని అభినందించాలా! ఆ అవార్డుని అభినందించాలా!      

ఫస్ట్ డే..ఫస్ట్ షో.....


“అన్ని సినిమాలు ఇలానే చూస్తుంటారా మీరు?”
“అబ్బే అలా ఎలా చూస్తానండి. నా అభిమాన హీరో ఉంటేనే మొట్ట మొదటి ఆటకు వెడతాను”
“అంటే మీ ఫేవరెట్ హీరో లేకపోతె ఆ సినిమా చూడరా!”
“నాకునచ్చిన హీరోయిన్ వుంటే హీరో గురించి పట్టించుకోను. అలాగే, మంచి దర్శకుడు వుంటే హీరో, హీరోయిన్లు నచ్చకపోయినా చూస్తాను. ఒక్కోసారి కధ నచ్చితే ఈ ఫేవరెట్ల సంగతి పక్కన పెట్టి ఆ సినిమాకి వెడతాను”

“నాకర్ధం అయింది ఏమిటంటే, ఏతావాతా మీరు విడుదల అయిన అన్ని సినిమాలు నాగా పెట్టకుండా ఫస్ట్ డే...ఫస్ట్ షో చూసేస్తారని. అదీ టిక్కెట్టు కొనుక్కుని. మీరు నిజంగా కళల్ని పోషించే రాయలవారి టైపండి మహా ప్రభో!” 

25, ఏప్రిల్ 2017, మంగళవారం

రిజర్వ్ బ్యాంక్ గవర్నరుకు అప్పిచ్చిన ఆసామీ


ఆర్బీఐ  గవర్నరుగా పనిచేసిన వ్యక్తికి అప్పివ్వడం మామూలు వ్యవహారమా!  
ఆర్వీవీ నేను రేడియోలో చాలాకాలం కలిసి పనిచేసాము. ఆయనిప్పుడు బహుముఖ వ్యాపకాలు పెట్టుకుని నెగ్గుకు వస్తున్నారు. వాటిల్లో ఒకటి భారత్ టుడే టీవీ  డైరెక్టర్.   ఆయన చెప్పిన కధ కాని కధ ఇది.
ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు గారి పేరు వినని వారుండరు. రిజర్వ్  బ్యాంక్ గవర్నరుగా    చాలాకాలం పనిచేసారు.  కానీ ఆయన్ని కొత్తవాళ్ళు ముఖతః చప్పున గుర్తు పట్టడం కష్టం. చేతిలో ఓ మామూలు సంచి పట్టుకుని రోడ్లమీద సాదా సీదాగా నడుచుకుంటూ వెడుతుంటారు. ఆ మధ్య జ్వాలా వాళ్ళ ఇంటికి సతీ సమేతంగా కలిసివచ్చినప్పుడు చూశాను, చాలా రోజుల తర్వాత.  ఊర్మిళా సుబ్బారావు  కూడా ఐఏఎస్సే. బెజవాడలో పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. అంచేతే కాబోలు  ఆ ఊళ్ళో పేద ప్రజలు ఊర్మిళా నగర్ కట్టుకున్నారు. సుబ్బారావు గారి గురించి చెప్పేదే లేదు. ఆలిండియా ఐఏఎస్ టాపర్. కొన్ని దశాబ్దాల తరువాత కానీ  మరో తెలుగు తేజం ముత్యాల రాజు  ఐఏఎస్ టాపరుగా నిలిచేంతవరకు సుబ్బారావు గారి రికార్డు పదిలంగానే  వుంది. ఆ రోజుల్లో కాంపిటీషన్ సక్సెస్ ఆయన ఫోటోను కవర్ పేజీగా వేస్తె విచిత్రంగా చెప్పుకున్నారు.
సరే! విషయానికి వస్తాను. సుబ్బారావు గారు, భారత్ టుడే ఛానల్ చీఫ్ ఎడిటర్ జి. వల్లీశ్వర్ బాల్య స్నేహితులు. చిన్ననాటి స్నేహం కాబట్టి ఆయన్ని చూడడానికి సుబ్బారావు గారు అప్పుడప్పుడూ ఆ టీవీ ఆఫీసుకు వెడుతుంటారు.  ఆ అలవాటు చొప్పునే మొన్నీ మధ్య భారత్  టుడే కార్యాలయానికి వెళ్ళారు. ఆ సమయంలో స్టాఫ్ మీటింగులో వున్న వల్లీశ్వర్ ఆయన్ని కాసేపు కృష్ణారావు గారి గదిలో కూర్చోబెట్టి వెళ్ళారు. వారిద్దరూ మాట్లాడుతుండగానే పని పూర్తి చేసుకుని వల్లీశ్వర్ తిరిగి వచ్చారు. సుబ్బారావు గారు వల్లీశ్వర్ ని మొహమాట పడుతూ అడుగుతుండడం  ఆర్వీవీ కంటపడింది. విచారిస్తే విషయం తెలిసింది. సుబ్బారావు గారికి అర్జంటుగా ఇరవై వేలు అవసరమయ్యాయి. ఎన్ని ఏటీఎం లు తిరిగినా ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిచ్చాయి. బ్యాంకులకు కూడా సెలవు.
వల్లీశ్వర్ దగ్గర కూడా అంత డబ్బులేదు. కృష్ణారావు గారి వైపు చూశాడు. ఆయనకి విషయం అర్ధం అయింది. మూడు రోజుల క్రితం బ్యాంకు నుంచి డ్రా చేసిన పైకం వుంది. అది సుబ్బారావు గారి అక్కరకు పనికి వచ్చింది. మరునాడో, ఆ మర్నాడో సుబ్బారావు గారు ఆ బాకీ చెల్లువేశారు. అది అప్రస్తుతం.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆయన దేశం మొత్తానికి కరెన్సీ సరఫరా చేసే ఆర్బీఐ కి అత్యున్నత అధికారిగా పనిచేసారు.  పెద్ద నోట్ల రద్దు వ్యవహారం గురించి పార్లమెంటులో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దువ్వూరి సుబ్బారావు గారు రాసిన  ఆంగ్ల గ్రంధం లోని కొన్ని పేరాలను ఉటంకించారు. ఈ ఉదంతం చాలు ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణారావు గారి దగ్గర డబ్బు తీసుకుంటున్నప్పుడు సుబ్బారావు గారు ఓ కోరిక కోరారు, అన్నీ అయిదువందల నోట్లు కాకుండా కొన్ని వంద నోట్లు కావాలని. ఆర్వీవీ ఆయనకు కొన్ని వంద నోట్లు కూడా ఇచ్చారు. వాటిల్లో కొన్నింటి మీద ఆర్బీఐ గవర్నర్  గా సుబ్బారావు గారు సంతకం చేసిన నోట్లు కూడా వున్నాయి.
ఉపశ్రుతి:
మీరు ఎవరు? మీ సంతకం పోల్చి చెప్పడానికి ఈ బ్యాంకులో మీకు తెలిసిన ఖాతాదారులెవరయినా వున్నారా?”
కౌంటర్ లోని వ్యక్తీ అడిగిన ప్రశ్నకు భూతలింగం అనే పెద్ద మనిషికి ఏం జవాబు చెప్పాలో ఒక క్షణం తోచలేదు. కాసేపట్లో తేరుకుని మీ దగ్గర రూపాయి నోటు ఉందా?’ అని కౌంటర్ లో ఉద్యోగిని అడిగాడు. నివ్వెరపోవడం ఇప్పుడు అతని వంతయింది, ‘తెలిసిన వాళ్ళు వున్నారా అంటే రూపాయి నోటు అడుగుతాడేమిటి చెప్మాఅని.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే-
ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తరువాత చెన్నై నగరానికి వచ్చి స్థిరపడ్డారు భూతలింగం అనే ఆ పెద్దమనిషి. ఆ వూరికి వచ్చిన కొత్తల్లో డ్రాఫ్ట్ మార్చుకోవడానికి బ్యాంకుకి వెడితే జరిగిన కధ అది.
భూతలింగం గారు ఉద్యోగ విరమణ చేయడానికి పూర్వం చేసిన ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి. రిజర్వ్ బ్యాంకు ముద్రించే ప్రతి రూపాయి నోటు మీదా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం వుంటుంది.
అయన  సంతకంతో వున్న  రూపాయి నోట్లు చెలామణీలో వున్నాయి కాని, ఆయన సంతకాన్ని పోల్చి చెప్పడానికి ఆ భూతలింగం గారికి వేరేవారి సాయం కావాల్సివచ్చింది.

ఆయన డ్రాఫ్ట్ మార్చుకున్నారా లేదా ఇక్కడ అప్రస్తుతం. అంత పెద్ద ఉద్యోగం చేసిన భూతలింగం గారు, సాధారణ వ్యక్తిగా కౌంటర్ క్యూలో నిలబడి వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడం అన్నది ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సిన విషయం.   

కింది ఫోటో పరీక్షగా చూస్తే వంద రూపాయల నోటు మీద దువ్వూరి సుబ్బారావు గారి సంతకం హిందీ, ఇంగ్లీష్  భాషల్లో కనిపిస్తుంది. 


23, ఏప్రిల్ 2017, ఆదివారం

తలెత్తుకుని జీవిద్దాం!


చక్కటి మాట చెప్పాడు నిర్మల్ అక్కరాజు.
నాకు ప్రతి గురువారం ఉదయం స్నేహ టీవీలో ఉభయం. అంటే ఆనాటి వార్తల మీద విశ్లేషణ. ఇది ప్రతి రోజూ ఉదయం తంతే కనుక మా ఆవిడ నాకు ‘వారాలబ్బాయి’ అనే నిక్  నేమ్ పెట్టింది.
ఒకరోజు ప్రోగ్రాం అయిపోయి తిరిగొస్తున్నప్పుడు అతనన్న మాట ఇది.
‘తలెత్తుకుని జీవిద్దాం’.


(PHOTO COURTESY: IMAGE OWNER)


ఈ మాట అంటూ అతడు చూపించిన వైపు దృష్టి సారించాను. రోడ్డు మీద కనబడ్డ వారందరి చేతుల్లో సెల్ ఫోన్లు వున్నాయి. వారిలో రాత్రంతా ప్రయాణం చేసి బస్సులు దిగిన వాళ్ళున్నారు. వాళ్ళను ఇళ్ళకు చేరవేసే ఆటో డ్రైవర్లు వున్నారు. రోడ్లు ఊడ్చే పనివారు వున్నారు. దాదాపు అందరూ తలదించుకుని మొబైల్ ఫోన్లలోకి చూస్తున్నారు.  
నిజమే! వీరందరూ ‘తలెత్తుకుని’ ఎప్పుడు జీవిస్తారు?

నిర్మల్ అక్కరాజు నాకు కొత్తగా పరిచయం అయిన టీవీ యాంఖర్. నిజానికి ఆయన ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. కానీ ఇంత పొద్దున్నే లేచి వచ్చి చేసే  ఈ యాంఖర్ కొలువు ఆయన ఇష్టపడి నెత్తికెత్తుకున్నది. అసలాయన అసలు ఇష్టం రేడియో. ఆదివారం సెలవయినా పనికట్టుకుని ఒకప్పుడు నేను పనిచేసిన రేడియోకి వెళ్లి వార్తలు చదువుతాడు. ఇష్టమయిన పనిచేసేటప్పుడు కష్టం అనిపించదు అంటాడు రేడియో మీద చిన్నప్పటి నుంచి అవ్యాజమైన అనురాగం గుండెలనిండా నింపుకున్న ఈ పెద్దమనిషి.           

22, ఏప్రిల్ 2017, శనివారం

ఇరవై నాలుగేళ్ళుగా సాగుతున్న యజ్ఞం
ఫోటోలో కుర్చీలో కూర్చున్నది ఎవరన్నది తెలంగాణాలో,  ఆమాటకి వస్తే హోల్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరయినా చెప్పేస్తారు, కే.వీ.రమణ అనో, రమణాచారి అనో. జగమెరిగిన మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి ఆయన. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారు.
అది సరే ఆయన ఎవరన్నది అందరికీ తెలుసు. మరి అక్కడ ఆ కుర్చీలో కూర్చుని టిక్కెట్లు అమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఆ సంగతి ఏమిటి?
ఈ ఐఏఎస్ రమణ గారికి నాటకాలు అంటే ప్రాణం. ఆ నాటక రంగాన్ని కాపాడుకోవడం ఎలా అన్నది ఆయన్ని అహరహం వేధించే సమస్య. ఐఏస్ కనుక పరిష్కారం కూడా ఆయనే కనుక్కున్నారు. టిక్కెట్టు పెట్టి నాటకం వెయ్యాలి. జనం టిక్కెట్లు కొనుక్కుని ఆ నాటకం చూడాలి. నాటకాలు వేసే వాళ్ళు ఉన్నారు. ఊరికే వేస్తె చూసేవాళ్ళూ వున్నారు. కానీ టిక్కెట్లు కొనుక్కుని చూసేవాళ్ళు వున్నారా? మిలియన్ డాలర్ల ప్రశ్న.
కానీ ఈ రమణ ప్రశ్నలు చూసి బెదిరిపోయే రకం కాదు. అంచేతే ఒక యజ్ఞం మొదలు పెట్టారు. ప్రతినెలా ఒక నాటకం వరసగా రెండు రోజులపాటు వేస్తారు. పది రూపాయలు టిక్కెట్టు. ఒకే ఒక టిక్కెట్టు అమ్ముడుపోయినా సరే, నాటకం ఆడేస్తారు. హాలు ఖర్చే దాదాపు పాతిక వేలు. అయినా సరే నాటకం వేసి తీరాల్సిందే. ఇదే ఇరవై నాలుగేళ్ళుగా ఆయన సాగిస్తున్న మహా యజ్ఞం.
అంటే ఈ యాగానికి తొందరలోనే రజతోత్సవం అన్నమాట! నిజానికి యెంత గొప్పమాట.
జ్వాలా నరసింహారావుతో కలిసి నిన్న హైదారాబాదు, త్యాగరాయ గానసభకు  వెళ్ళినప్పుడు కనిపించిన దృశ్యాలు ఇవి.
అంతేనా అంటే ఇంతే కాదు. ఇంకో కొసమెరుపు వుంది.
నేను రమణాచారి గారితో మాట్లాడుతుండగానే ఒకాయన అక్కడికి వచ్చాడు. మా సంభాషణ విన్నాడు. ఆయన పేరు తలుపుల వెంకటేశ్వరరావు వూరు పెద్ద కళ్ళేపల్లి.
‘అయ్యా రమణగారూ, ఈ యాగంలో నెలలో ఒకరోజు ఖర్చు నాది, కాదనకండి’

ఇలాంటి కళా పోషకులు ఉన్నంత వరకు కళకు మరణం లేదు.            

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

'ప్రగతి' పండుగ


(PUBLISHED IN ANDHRAPRABHA TELANGANA EDITION ON 21-04-17,FRIDAY)

కేసీఆర్ ఆలోచనా విధానమే విభిన్నం. పరిపాలనలో కావచ్చు, పార్టీ నడిపే తీరులో కావచ్చు ఆయనది ఒక అరుదయిన విలక్షణ శైలి. దీనికి తాజా ఉదాహరణ కొంపల్లి టీ.ఆర్ ఎస్ ప్లీనరీ సభాస్థలికి ప్రగతి ప్రాంగణంగా నామకరణం చేయడం. సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే ఈ రకమైన వార్షిక సదస్సుల ప్రాంగణాలకు వ్యక్తుల పేర్లు పెడుతుండడం ఆనవాయితీ.  
 అందుకు భిన్నంగా ఈ సారి ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణం అని పేరు పెట్టడం విశేషం. అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల ఇరవై ఏడవ తేదీన వరంగల్లులో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి ప్రగతి నివేదన సభగా పేరు పెట్టారు నూతన తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, ఆ కొత్త రాష్ట్రానికి నూతన ప్రభుత్వ సారధిగా టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనాపగ్గాలు చేపట్టి మరో రెండుమాసాల్లో మూడేళ్ళు పూర్తికావస్తున్న తరుణంలో హైదరాబాదు నగర శివార్లలోని కొంపల్లి ప్లీనరీలో జరిగే చర్చలు,  పార్టీ నాయకత్వనికీ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేస్తూనే మరోపక్క చక్కని ఆత్మపరిశీలనకు అవకాశం కల్పిస్తాయని ఆశించవచ్చు. ఈ ప్రతినిధుల సభలోనే కేసీఆర్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రకటించడం లాంఛనంగా జరిగే మరో ప్రక్రియ.
ఉద్యమ పార్టీల పుట్టుక, ఎదుగుదల ఎన్నో ప్రతికూల పరిస్తితుల నడుమ సాగుతాయి. ఇందుకు టీఆర్ ఎస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. పదహారేళ్ళ క్రితం నాటి సంగతులను సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్ట కట్టిందీ అవగతమవుతుంది.
తెలంగాణా ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదు. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం గతంలో కూడా పలుమార్లు ఉద్యమాలు జరిగాయి. అయితే ప్రతిసారీ అవి హింసాత్మకంగా మారాయి. సాధించింది ఏమీ లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగే పరిస్తితుల్లో కేసీఆర్ రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు మినహాయిస్తే పుష్కర కాలం పైచిలుకు సాగిన తెలంగాణా సాధన పోరాటంలో ఎక్కడా అపశృతులు దొర్లిన దాఖలాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ముందు చెప్పినట్టు, వినూత్నంగా ఆలోచించే  కేసీఆర్ తత్వం, తెలంగాణా ఉద్యమ స్పూర్తి ఏ దశలోనూ దెబ్బతినకుండా కాపాడింది. ఉద్యమజ్యోతి వెలుగులు మసిబారకుండా చూసింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఉద్యమ తీవ్రత తగ్గుముఖం పట్టకుండా చేయగలిగాయి. ఇందుకు కేసీఆర్ అనుసరించిన వ్యూహాల్లో పార్టీ ప్లీనరీలు ఒక భాగం. ఉద్యమ తీవ్రతలో హెచ్చుతగ్గులు వుండవచ్చేమో కానీ, త్రికరణశుద్ధిగా సాగించే ఉద్యమాలు, ఆందోళనలు వైఫల్యం చెందే ప్రశ్నే ఉండదని కేసీఆర్ నమ్మకం. ఈ పరిణామ క్రమంలో టీఆర్ ఎస్ పార్టీ ఎదుర్కున్న ఆర్ధిక ఇబ్బందులు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. తీసుకున్న ప్రతి నిర్ణయం అవహేళనలకు గురయింది. వేసిన ప్రతి అడుగు అపనిందల పాలయింది. అయినా కేసీఆర్ ప్రతి మలుపును గెలుపు దిశగా మళ్ళించుకుని, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను అందిస్తూ పోయారు. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు. దశలు దశలుగా, రూపాలు మార్చుకుంటూ  సాగించిన ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి పట్టిన సమయం కూడా దశాబ్ద కాలం పైమాటే. మరి అన్నేళ్ళు ఒక ఉద్యమ పార్టీ ఊపిరి పీల్చుకోవాలంటే మాటలు కాదు. సాధ్యమూ కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన సత్తా ఉండబట్టే కేసీఆర్ తెలంగాణా ప్రజల దృష్టిలో ఒక గొప్ప నాయకుడు కాగలిగారు. మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.
సరే ఇదొక ఎత్తు అనుకుంటే, అధికారం సిద్ధించిన తరువాత ఎదురయ్యే పరిణామాలను సమర్ధవంతంగా  నిభాయించుకోవడం మరో ఎత్తు. పార్టీని చీల్చయినా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసే శక్తులు పక్కనే పొంచివుంటాయి. ఏమరుపాటుగా వుంటే చాలు ఏమి చేయడానికయినా సిద్ధం అన్నట్టు వ్యవహరించే శక్తులను ఆదిలోనే కట్టడి చేసిన విధానం కేసీఆర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి  తెచ్చింది. ఆయన ఒక ఉద్యమ నేత మాత్రమే కాదు, చాణక్య నీతిని సయితం వంటబట్టించుకున్న వ్యూహకర్త అని ప్రపంచానికి వెల్లడయింది.
తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే పుష్కర కాలంగా తన మెదడులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చే పనికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణా చీకటి కూపం అవుతుందని వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించిన వారు చేసిన ఎద్దేవాలను గుర్తు పెట్టుకుని, పట్టుదలగా పనిచేసి అనేక సంవత్సరాలుగా జనాలు అలవాటుపడిన కరెంటు కోతల ఇబ్బందులను మంత్రం దండంతో మాయం చేసినట్టు మాయం చేశారు. రాష్ట్రం విడిపోగానే హైదరాబాదులోనూ, ఇతరత్రా తెలంగాణాలోనూ స్థిరపడ్డ ప్రాంతీయేతరులు తమ భవితవ్యంపై పెంచుకున్న భయాoదోళనలను అనతికాలంలోనే మటుమాయం చేశారు. భగీరధ, కాకతీయ వంటి పధకాలను అమలుచేస్తూ బంగారు తెలంగాణా దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.
అయినా చేయాల్సినది అంతా చేయలేదేమో అనే నిరాశాపూరిత వ్యాఖ్యలు అప్పుడప్పుడూ వినబడుతూనే వున్నాయి. విపక్షాలు విమర్సించక ఏమి చేస్తాయి అని సరిపెట్టుకోవచ్చు, సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఆ నిరసనలు వెలువడుతున్నది విపక్షాల గొంతుకలో నుంచా, ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారా అనేది జాగ్రత్తగా గమనించుకోవడం సమర్ధుడయిన పాలకుని ప్రధమ కర్తవ్యం.
కొంపల్లి ప్లీనరీ అందుకు తగిన వేదిక కాగలదని ఆశిద్దాం. (EOM)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   


                    

20, ఏప్రిల్ 2017, గురువారం

బాబోయ్ ఇన్ని కాల్సా!


కింది అంకెలు అన్నీ ఏదో కార్పొరేట్ కాలేజీ ప్రకటన తాలూకు అనుకోకండి. నిన్న ఆంధ్రజ్యోతిలో నేను రాసిన ‘ఆ నాటి చంద్రబాబు’ అనే నా వ్యాసం చదివి నాకు ఫోను చేసిన వాళ్ళలో కొందరి మొబైల్ నెంబర్లు ఇవి. మొదట చేసిన వారిలో కొందరి నెంబర్లు డిలిట్ చేయడం వల్ల ఇవే మిగిలాయి. దీపావళి నాడు కాల్చి పడేసిన టపాసుల్లో కొన్ని మరునాడు పేలినట్టు బుధవారం ఆంద్ర ప్రాంతం జ్యోతిలో వస్తే ఫోన్లు మాత్రం మరునాడు కూడా కొనసాగాయి. ఇది రాస్తున్నప్పుడు విశాఖ నుంచి శివప్రసాద్ అనే ఆడిటర్ గారు ఫోను చేశారు. వీరిలో చాలామంది చంద్రబాబు మీద పెంచుకున్న అవ్యాజానురాగంతో ఫోన్లు చేస్తే కొందరు దురభిమానంతో, మరి కొందరు పిచ్చి అభిమానంతో ఫోన్లు చేసి మాట్లాడారు. వాటన్నిటినీ వడబోస్తే, చంద్రబాబు నాయుడు పరిపాలనపై ఒక మినీ అభిప్రాయ సేకరణ అని నాకు అనిపించింది.(ఉదయం పూట టీవీ ఛానల్ లైవ్ లో వుండడం వల్ల కొన్ని Missed Calls లో ఉండిపోయాయి.)
RECEIVED:
96764....., 94405....., +1 905-266-...., 79954....., 98481....., 88866....., 98412....., 96764....., 83417....., 94414....., 98660....., 90109....., 83309....., 99494....., 94402....., 95506....., 99084....., 94411....., 95535....., 99124....., 94406....., 99632....., 77023....., 77802....., 944078....., 97049....., 99632....., 81799....., 98664....., 99082....., 95507....., 99121....., 70938....., 99121....., 70938....., 99121....., 89777....., 90805....., 94417....., 88852....., 98484....., 70751....., 98483....., 94402....., 92474....., 79891....., 9963949090, 82472....., 79954....., 94946....., 98669....., 99893....., 91772....., 93910....., 84639....., 86394....., 80961....., 94404....., 94917....., 72078....., 99493....., 77027....., 94917....., 94945....., 79950....., 93470....., 9890....., 93470....., 83309....., 94402....., 99084....., 89853....., 944069....., 88617....., 95507....., 83318....., 94417....., 88866....., 94417....., 88852....., 95506....., 94942....., 99632......
MISSED:
94402....., 95506....., 91770....., 77802....., 94404....., 72071....., 94404....., 72071....., 94404....., 94945......
REFUSED (May be when I was in TV studio)    19, ఏప్రిల్ 2017, బుధవారం

ఆనాటి చంద్రబాబు


https://ci6.googleusercontent.com/proxy/RnNZfQn2o2xpggJQqefCOervMbPIci5mujDPJnvl43kv6Rtxjyh5gHN_JKVzeU-aaGz3pePFgxfoAAtZJZNx8mveVTc-11j98EfuAJVcumUenA=s0-d-e1-ft#https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif


( ఏప్రిల్ 20 చంద్రబాబు జన్మదినం)
(Published in AP Edition of ANDHRAJYOTHY daily today, Wednesday, 19-04-2017)
సుమారు 40 సంవత్సరాల క్రితం, స్థానికులకు ఏమాత్రం పరిచయం లేని ఓ యువకుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించాడు. గడప గడప తొక్కాడు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించాడు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించాడు. ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.
రచ్చబండ్లమీద ఇళ్ళ అరుగుల మీద  సేద తీరాడు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల  వద్దే అడ్డంకులు ఎదురయినా  మడమ తిప్పలేదు.ఓ జత దుస్తులు, కాలికి చెప్పులుతోడుగా కొందరు యువకులు. ఇంతకు  మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా  కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగాడు.రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని ఎన్నికల్లో గెలిచాడు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టాడు.
ఆయన ఎవ్వరో కాదు, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబునాయుడు.
నేను రేడియో విలేకరిని కనుక, అందులోను పనిచేసేది హైదరాబాదులో కనుక అప్పటి మీడియా వాతావరణంలో రాజకీయ నాయకులతో మరీ దూరం, దగ్గర కానీ సత్సంబంధాలు ఉండేవి.  మంచి సంబంధాలు అని ఎందుకు అంటున్నాను అంటే ఏవిషయం పైన అయినా, రాజకీయ నాయకులు తమ  మనసులోని మాటల్ని ఎలాంటి భేషజాలు, సంకోచాలు లేకుండా పంచుకోవడానికి వీలున్న విలేకరిని కదా!  ఊహాగానాలకు, సంచలనాలకు రేడియో వార్తల్లో తావుండదు. అదీ వాళ్లకు  నాతొ వున్న భరోసా! ఈ ఒక్క కారణంతో కాబోలు చంద్రబాబునాయుడు మాత్రమే కాదు1975 నుంచి  2005 వరకు అనేకమంది ముఖ్యమంత్రులతో పరిచయాలు ఓ పరిమితి మించి బాగానే ఉండేవి. ఆ చనువుతో నేను కొన్నిసార్లు చంద్రబాబును  కోరిన కోరికలు,  ముఖ్యమంత్రి సిబ్బందిని ఇబ్బందుల్లో పడేసేవి. ఒకాయన నేరుగానే తన మనసులోని మాటను నా మొహం మీదే చెప్పేశారు కూడా.      
ముఖ్యమంత్రితో వ్యవహరించాల్సిన పద్దతి ఇది కాదు, శ్రీనివాసరావు గారు..అన్నాడా అధికారి మనసులోని అసహనాన్ని సాధ్యమైనంత మృదువైన మాటల్లో వ్యక్తపరుస్తూ.
చంద్రబాబునాయుడు సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయన దగ్గర పనిచేసే ఈ ఐ.ఏ.ఎస్. అధికారి చాలా చాలా సౌమ్యుడు. పేషీలో పనిచేసే అధికారులను బట్టి ముఖ్యమంత్రి పనితీరు అంచనాలు  ఆధారపడివుంటాయంటారు. ఆ రోజుల్లో సమర్దుడయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో ఆయన పేషీ అధికారుల పాత్రకూడా వుంది.
ఆ అధికారితో నాకు చాలా సన్నిహిత పరిచయం. ఐ.ఏ.ఎస్. అనే డాంబికత్వం ఏకోశానా కానవచ్చెది కాదు. అయినా ఆయన సహనాన్ని పరీక్షించేలా నేను కొన్ని సార్లు ప్రవర్తించేవాడిని. అందుకే ఆయన అలా నిష్టూరంగా మాట్లాడారు. అయినా, అది నాకు కొత్తేమీ కాదన్నట్టు మరోమారు ముఖ్యమంత్రి అపాయింట్ మెంటు కోరేవాడిని. అపాయింట్ మెంటు అంటే ఆయన్ని కలుసుకోవడం కాదు. సీఎం ని కలవడానికి ఆరోజుల్లో పెద్దగా  ప్రయాసపడాల్సిన  అగత్యం విలేకరులుకు ఉండేదికాదు. కాకపొతే, వేరే తెలిసినవారి కార్యక్రమాలకు సీఎం ను తీసుకుపోవాలనే నా అభ్యర్ధనలను మన్నించడానికి అధికారులు  చాలా ఇబ్బంది పడేవారు.
ఇది మరీ అన్యాయం. ఆయన ముఖ్యమంత్రి. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఇలా పెళ్ళిళ్ళకూ, వేడుకలకూ పిలుస్తూ పొతే ఏం బాగుంటుంది. మీ ఇంట్లో పెళ్లి అంటే అర్ధం వుంది, ఇలా మీకు తెలిసిన వాళ్ళ పెళ్లిళ్లకు కూడా ముఖ్యమంత్రి రావాలంటే ఎలా!అనేది సౌమ్యుడయిన ఆ అధికారి వాదన.
ఎమోనండీ! అది నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా పిలిచే వాళ్ళు ఆయన వీరాభిమానులు. పెళ్ళికి వస్తే మహాదానందపడిపోయేవాళ్ళు. వున్న వూళ్ళో హైదరాబాదులోనే పెళ్లి. ఒక్కసారి వీలు చేసుకుని వస్తే సరిపోతుంది. అందుకే నేను అడగగానే ఆయన ఒప్పుకుని వస్తామని మాట ఇచ్చారు. ఇక మీ ఇష్టం
తరవాత కధ చెప్పాల్సిన పనిలేదు. ఏ పెళ్ళికి ముఖ్యమంత్రిని పిలిచినా ఆయన వీలు చేసుకుని ఏదో ఒక సమయంలో వచ్చి వధూవరులను ఆశీర్వదించి, పూల బొకే ఇచ్చి వెళ్ళేవాళ్ళు.  కొన్ని చోట్ల భద్రతాపరమయిన ఇబ్బందులు అడ్డు వచ్చేవి. ముఖ్యమంత్రి వెళ్ళే చోట కనీసం రెండు లిఫ్టులు వుండాలి. రెండు ద్వారాలు వుండాలి. సెక్యూరిటీ వాళ్ళు ఇలాంటివి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకున్న తరువాతనే క్లియరెన్సు ఇచ్చేవాళ్ళు. కానీ, నా విషయంలో వాళ్ళు అనేకసార్లు రాజీ పడాల్సిన పరిస్తితి ఎదురయ్యేది.  పెళ్ళిళ్ళకే  కాదు, చిన్న చిన్న స్కూళ్ళ వార్షికోత్సవాలు, ఆటలపోటీలు ఇలా దేనికీ పిలిచినా చంద్రబాబునాయుడు మారుమాట లేకుండా వచ్చిపోయేవారు. ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇది కాదని పేషీ అధికారి కినుక వహించడం వెనుక కధ ఇదే.
ఆరోజుల్లో ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్త పోగు ఆయన కంట పడింది.  వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి  లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.  
నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తిఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని జనంలో కలిగిస్తే, కింద పనిచేసే  ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా?’ అనేది సిబ్బంది వాదన.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా చాలాకాలం పనిచేసారు. ఆఫీసులో ఆయన్ని కలవడానికి ఎవరు వచ్చినా, ఎందరు వచ్చినా కాదనకుండా అందర్నీ కలిసి మాట్లాడే వారు. వారు చెప్పింది సావధానంగా  వినేవారు. కలవడానికి వెళ్ళిన వాళ్ళు ఆయన  గదిలో ప్రవేశించగానే కుర్చీ దగ్గర నిలబడి మాట్లాడే వారు. వచ్చిన వారిని  కూర్చోమని తాను  నిలబడే  మర్యాద చేసేవారు. అంత పెద్ద అధికారి నిలబడి వున్నప్పుడు, తాము కూర్చోవడం బాగుండదేమో అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ముక్తసరిగా వచ్చిన పని క్లుప్తంగా చెప్పుకుని  బయటపడేవాళ్ళు.  దొరికిందే తడవుగా కుర్చీల్లో సెటిలయిపోయే బాతాఖానీరాయుళ్ళను ఆ అధికారి అలా కట్టడి చేసేవారన్న మాట.
కాలికి బలపం కట్టుకుని చంద్రబాబు చేసే నిరంతర పర్యటనల్లో కూడా ఇదే  ఉద్దేశ్యం వుందేమో అనిపిస్తుంది. అలా అలుపెరుగకుండా తిరిగే మనిషిని ఓ పట్టాన పట్టుకోవడం కష్టం. పట్టుకున్నా ఆయన సమయాన్ని వృధాచేయడం అంతకన్నా కష్టం. అలా సీరియస్  గా పనిచేసుకుపోయే చంద్రబాబు నవ్వుకు దూరం అయ్యారా అని అప్పట్లో విలేకరులకు అనిపించేది. ఉమ్మడి రాష్ట్రానికి  ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో తెలియదు.  కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
అరుదుగానే కావచ్చు కానీ చంద్రబాబు నవ్వుతారు.
అందుకు సందేహం అక్కరలేదు. కాకపొతే నవ్వించాలి.
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగానే  వున్న  జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరే పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈ లోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల  సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, ‘సీఎం బయలుదేరి రావచ్చాఅని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేసారు. విలేకరులు పలుచగా వుండడాన్ని ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను, నేను కల్పించుకుంటూ. అవేమిటో చెప్పమని అడిగారు  చంద్రబాబు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడే అవకాశం వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్  వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి  వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
ఇప్పుడాయన అమరావతి వెళ్లి పోయారు. నేను హైదరాబాదులో విశ్రాంత జర్నలిష్టుగా  వుండిపోయాను.
ఒకప్పుడు రోజూ కలిసిన మనిషిని ఈరోజు కలిసే అవకాశం లేదు. నాకా కోరికా లేదు, ఒకవేళ వున్నా ఆయనకీ అంతటి తీరిక ఉండకపోవచ్చు. గతంలో చంద్రబాబు పుట్టిన రోజంటే నేనే అనేకమందిని వెంట తీసుకువెళ్ళి కలిపించేవాడిని. ఇప్పుడా వీలుసాలు లేదు. అందుకే ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈ విధంగా తెలుపుకుంటున్నాను. (EOM)  


(ANDHRAJYOTHY - 19-04-2017)

https://ci6.googleusercontent.com/proxy/RnNZfQn2o2xpggJQqefCOervMbPIci5mujDPJnvl43kv6Rtxjyh5gHN_JKVzeU-aaGz3pePFgxfoAAtZJZNx8mveVTc-11j98EfuAJVcumUenA=s0-d-e1-ft#https://ssl.gstatic.com/ui/v1/icons/mail/images/cleardot.gif

18, ఏప్రిల్ 2017, మంగళవారం

బహుకాల దర్శనం


గుండు చేయించుకున్న వాళ్లకు  తమ నెత్తి మీద జుట్టు లేదు అన్న స్పృహ ఎన్నడూ కలగదు. కానీ ఎదుటివారు ఆ తేడాను ఇట్టే పట్టేస్తారు. తేడా అయితే పడతారు కానీ మనిషిని అయితే గుర్తుపట్టలేరు. ఈ కారణంగానే  గుండూ రావులు ఎదుటి వారిని కనబడగానే  ‘హలో సుబ్బారావు బాగున్నావా’ అనేస్తుంటారు. గుండూరావును ఆ గుండుతో  పోల్చుకోలేని సుబ్బారావులు జుట్టు పీక్కుంటూ వుంటారు.
ఈరోజు పార్కులో పెళ్లి నడకలు నడుస్తున్న సమయంలో దూరంగా ఎదుటి నుంచి పరుగు లాంటి నడకతో వస్తున్న ఓ పెద్దమనిషి కనిపించాడు. ఎక్కడో చూసినట్టు వుందే అనుకుంటూ ఉండగానే బుర్రలో లైటు వెలిగి ‘మన ఏబీసీడీ ప్రసాద్ కదూ’ అనిపించింది. వెంటనే ఎదురెళ్ళి ‘ఏం ప్రసాద్ గారు ఎలా వున్నారు, మీరు అమరావతిలో వున్నారనుకుంటున్నాను’ అనేశాను. కానీ ఆయన మోహంలో నన్ను గుర్తుపట్టిన ఛాయలు కనిపించలేదు. అప్పుడు గుండు గుర్తొచ్చి దాన్నొకసారి గోక్కుంటూ ‘ తిరుపతి’ అన్నాను. అయన తేరిపార చూసి, మరు క్షణంలో నన్ను గట్టిగా పట్టుకుని ‘ఎన్నాల్టికెన్నాళ్ళకు మిమ్మల్ని  చూసాను చాలా సంతోషం, నిజంగా ఈరోజు చాలా మంచి రోజు’ అన్నాడు.  నిజానికి అయన ఇంటి పేరు ఏబీసీడీ కాదు.  
అయితే కొందరి పేర్లను, వారి ఇంటి పేర్లను  వాళ్ళతో నిమిత్తం లేకుండానే ఇతరులు అందరూ కలిసి మార్చేస్తుంటారు.
వారిలో ఏబీసీడీ ప్రసాద్ ఒకరు. ఆయన అసలు పేరు ఎల్.వీ.ఎస్.ఆర్.కే. ప్రసాద్. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పార్టీ కార్యాలయంలో పత్రికా సంబంధాలు వగయిరా చూస్తుండేవారు. అంచేత హైదరాబాదులోని పత్రికల వాళ్ళందరికీ ఆయన చిరపరిచితుడు. ప్రెస్ వాళ్ళే పెట్టారు ఏబీసీడీ ప్రసాద్ అని ఆయన ఇంటిపేరుకో మారుపేరు. ఇప్పుడాయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా. రాష్ట్రం విడిపోయిన తరువాత చూసి చాలా కాలం అయింది.
పరవాలేదు, అప్పుడప్పుడన్నా ఇలా పార్కుల్లో మార్నింగు వాకులు చేస్తుంటే, ఎప్పుడో విడిపోయిన వాళ్ళు తెలుగు సినిమాల్లో ఇంటర్వెల్ తరువాత కలుసుకున్నట్టు, పాత స్నేహితులు పార్కుల్లో   తారసపడే అవకాశాలు ఉన్నాయన్న మాట.   

అంచేత ఏమన్నమాట! అంతయు మన మేలునకే! 

జీవన యానంలో ఓ చిన్ని పాదయాత్ర


“పార్కుకు వెడదామా?” అంది మా ఆవిడ.
“నలభయ్ ఏళ్ళు ఆలస్యం అయిందేమో!” అనబోయి తెలివి తెచ్చుకుని, ఆ మాట బయటకు అనకుండా నాలుక కిందే నొక్కిపట్టి  యాభయ్ ఏళ్ళ కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాను.   
మొత్తం మీద మా జీవన యానంలో ‘తొలి నడక’, నా డెబ్బయ్యవ ఏట  బ్రహ్మానందరెడ్డి పార్కులో మొదలయింది.
‘మా నడక మా కాళ్ళ మీద మేము నడవడానికి తల ఒక్కింటికి పాతిక రూపాయల టిక్కెట్టా! ఔరా’ అనబోయి మళ్ళీ మా ఆవిడ తొలిసారి కోరిన కోరిక గుర్తొచ్చి గమ్మున ఉండిపోయాను.
అదే మొదటిసారి ఆ పార్కులో నా కుడి కాలు పెట్టడం. ఇంత కాలం బ్రహ్మానందరెడ్డి పార్కు గురించి ఏదో బ్రహ్మాండంగా ఊహించుకుంటూ వచ్చిన నేను అక్కడి వాతావరణం చూసి కాస్త నిరాశ పడ్డాను. నడక దారి చుట్టూ చెట్లు వున్నాయి కానీ వాటిలో చాలావరకు ఎండిన మోడులే. పచ్చగా ఉండాల్సిన పొదలు కూడా గోధుమ వర్ణంలోకి మారిపోయివున్నాయి. ఎండాకాలం కదా మనుషులమే మోడులుగా తయారవుతున్నప్పుడు చెట్లు అనగా యెంత అని సరిపుచ్చుకున్నాను. నాకెందుకో అక్కడ పచ్చటి వృక్షాలకంటే నడిచే మనుషులే ఎక్కువ అన్న భావన కలిగింది. అది ఎల్లా వుంటే ఏమిటి మళ్ళీ మళ్ళీ వచ్చేదా నా పిచ్చికాని.

ఈ ఉరుకుల పరుగుల హైదరాబాదు నగరంలో ఇంతమంది నడిచేవాళ్ళు వున్నారా అనిపించింది. వారంలో ఒక్కరోజయినా అందరూ వాహనాలు షెడ్లో పెట్టి నటరాజా సర్వీసు మొదలు పెడితే నగర ఆరోగ్యం చక్కబడుతుంది కదా అని కూడా  అనిపించింది. కానీ అది అత్యాశ. పార్కులో నడవడానికి కార్లు వేసుకు వచ్చేవాళ్ళు ఆఫీసులకు కూడా అలా నడిచి  వెడతారా! ఊహాతీతం.      

16, ఏప్రిల్ 2017, ఆదివారం

శ్రోతలు కోరిన పాటలు


పూర్వం రేడియో సిలోన్ లో మీనాక్షి పొన్నుదొరై ఘంటసాల వోం, సుశీలా వోం అని తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటుంటే  మా బామ్మగారు ఆమె తెలుగును  ఆటపట్టించేది. కానీ ఆమె వేసే తెలుగు పాటల్ని కోరుతూ వందల సంఖ్యలో శ్రోతలు ఉత్తరాలు రాసేవాళ్ళు.
ఆ తరువాత చాలా ఏళ్ళకు నేను హైదరాబాదు రేడియోలో చేరిన తరువాత శ్రోతలు రాసే కార్డుల్ని బట్వాడా చేయడానికి తపాలా బంట్రోతులు (అనవచ్చా) కిందామీదా పడడం కళ్ళారా చూసాను.
“అమలాపురం నుంచి అరుంధతి ఆమె కుటుంబసభ్యులు, ఆదిలాబాదు నుంచి యాదగిరి ఆయన కుటుంబ సభ్యులు, అనంతపురం నుంచి వీరారెడ్డి, రంగారెడ్డి, వెంకటరెడ్డి వారి కుటుంబ సభ్యులు, శ్రీకాకుళం నుంచి అప్పల నాయుడు ఘంటసాల సుశీల పాడిన యుగళగీతం ప్రసారం చేయమని కోరుతున్నారు.”
ఇలా వచ్చిపడ్డ  వందలాది ఉత్తరాల గుట్టలోనుంచి శ్రోతలు కోరిన పాటల్ని ఎంపిక చేసుకోవడానికి అనౌన్సర్లు చాలా ప్రయాస పడేవాళ్ళు.  
అలాగే, స్కూలు అడ్మిషన్ సీజను వచ్చింది అంటే తెలిసిన వాళ్ళు తమ పిల్లలకోసం విలేకరుల వెంట పడడం ఒక విలేకరిగా నాకు తెలుసు. రిటైర్ అయి పుష్కర కాలం దాటిన తరువాత కూడా వస్తున్న ఎస్సెమ్మెస్ అభ్యర్ధనలు చూస్తుంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
అలాంటిది, తలచుకుంటే ఏదైనా చేయగలిగిన అధికారాలు కలిగిన ముఖ్యమంత్రికి రోజూ ఎన్ని విజ్ఞప్తులు వస్తుంటాయో అర్ధం చేసుకోవడానికి కష్టపడనక్కర లేదు.
మరి ఏపీ సీఎమ్ కనెక్ట్ యాప్ అంటున్నారు.
ఆయన్ని ఉడ్డుకుడుచుకోనిస్తారా! అనుమానమే!
ఉపశృతి: లోగడ ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రం వున్న కాలంలో ఒక ముఖ్యమంత్రి ప్రజారంజక పాలన అందివ్వడానికి అహరహం శ్రమించేవారు. ఒక కార్డు ముక్క తనకు రాస్తే చాలు సమస్యలను చిటికెలో పరిష్కరిస్తానని ఓ ప్రకటన చేసారు. అంతే! పోస్టాఫీసుల్లో కార్డులు దొరకని పరిస్తితి ఏర్పడింది. ప్రజల సమస్యలు కనిపించకుండా పోయాయి, కొత్త సమస్యల మరుగున పడి.   

15, ఏప్రిల్ 2017, శనివారం

అన్నం పెట్టే రైతుకు యెంత చేసినా తక్కువే


(రైతులకు వచ్చే ఏడాది నుంచి ఎరువులు ఉచితంగా అందివ్వాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మనసారా అభినందిస్తూ, ఈ అంశంపై రెండేళ్ళ నాడు రాసిన ఈ చిన్ని వ్యాసాన్ని మరోమారు పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నాను)
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతున్నది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నం పెట్టె రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి. ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో కార్పొరేట్లు, ఉద్యోగాలు, భూసేకరణలు, భూమి పందారాలు, మిషన్లు, గ్రోత్ కారిడార్లు అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో కాస్త పేరున్న ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారం, అధికారం లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ రెండు నాలుకల ధోరణికి కారణం. దీన్ని అర్ధం చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, ఆ మాటకు వస్తే జనాలకు మొదటి ముద్ద పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సినవి యేవో కనుక్కుని ప్రభుత్వాలు సకాలంలో వాళ్లకు అందిస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది మన్ను పదును చెడకముందే అదునులో దున్ని పైరు వేసుకోవడానికి మంచి విత్తనాలు, ఎరువులు. పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు మించి ఏ రైతూ ఆశించడు. ఈ మాత్రం సాయం కూడా సకాలంలో చేయలేక పోవడం వల్లనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను ఓదార్చడం తప్పుకాకపోవచ్చు. కానీ అసలు ఆత్మహత్య చేసుకోకుండా ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయన్నదే సమాధానం లేని ప్రశ్న.
ఉపశ్రుతి : ఆధునిక జాతక కధలో బుద్దుడు ఓ గ్రామానికి వెడతాడు. చనిపోయిన తన పిల్లవాడికి ప్రాణదానం చేయమని ఓ తల్లి గౌతముడ్ని వేడుకుంటుంది. ఆయన సరే అని చెప్పి, 'పరిశ్రమలకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్రా మీ అబ్బాయిని బతికిస్తా' అంటాడు. ఆ తల్లి ఆశతో ఎన్ని వూళ్ళో తిరుగుతుంది. యెంత తిరిగినా అటువంటి వారి జాడ కనబడక నిరాశగా తిరిగొస్తుంది. ఇందులో నీతి ఏమిటన్నది వేరుగా చెప్పక్కరలేదేమో!
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
(16-05-2015)