30, జూన్ 2019, ఆదివారం

హామీల అమలు దిశగా జగన్ తొలి అడుగులు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA dated 30th June, 2019, SUNDAY)
ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పదవిని స్వీకరించి నేటికి సరిగ్గా నెల రోజులు. అయిదేళ్ళు పరిపాలించడం కోసం  ప్రజాతీర్పు పొందిన వ్యక్తి పనితీరును   ముప్పైరోజులకు కుదించి పోల్చిచూడడం సబబు అనిపించుకోదు. అయినా ఆయన ఏ దిశగా సాగుతున్నారు, ఏ మార్గంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది స్థాలీపులాక న్యాయంగా పరిశీలించుకోవడానికి ఈ స్వల్ప కాలం అక్కరకు వస్తుంది.
తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనిపించుకునే నిర్ణయాలను ఎన్నింటినో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత నెల రోజులుగా ప్రకటిస్తూ వచ్చారు. పదవిని చేపట్టిన కొద్ది  గంటల్లోనే  డీజీపీతో సహా ఉన్నతాధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు నవరత్నాల పేరుతొ ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు సమర్దులయిన అధికారుల బృందాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్ మాదిరిగా జరిగేవన్నీ ఒక పద్దతి ప్రకారం చకచకా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశం, మంత్రివర్గ నిర్మాణం, శాఖల పంపిణీ, స్పీకర్ ఎన్నిక, పదమూడు జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, గత ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది ముందు  అమలు చేసిన అన్నదాతా సుఖీభవ పధకం రద్దు, దాని స్థానంలో  రైతు భరోసా పధకం, పారిశుధ్య పనివారు, అంగన్ వాడీ మహిళల వేతనాల పెంపు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అనే వివక్ష లేకుండా  ఇంటర్ విద్యార్ధులకు కూడా అమ్మవొడి పధకం వర్తింపు,  పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సత్సంబంధాలు పెంపొందించుకునే ప్రయత్నాలు,  ఢిల్లీ యాత్రలు, ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రులతో భేటీలు ఇలా అలుపూసొలుపు లేని పనులతో, ప్రతి  రోజూ ఏదో ఒక కొత్త  నిర్ణయం ప్రకటిస్తూ  ముఖ్యమంత్రి జగన్  బిజీ బిజీగా వున్నారు. గతానికీ ఇప్పటికీ కొట్టవచ్చినట్టు కనబడుతున్న  తేడా ఒకటుంది. అది  ప్రచార ఆర్భాటంలో తగ్గుదల. అధికారుల సమీక్షా సమావేశాల్లో కొత్త ముఖ్యమంత్రి మార్కు మార్పు స్పుటంగా కానవస్తోంది. ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు అంటూ  నిర్వహించకుండా వారికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వమే విడుదల చేసే పద్దతిని కూడా ప్రవేశపెట్టినట్టు ఈ నెల రోజుల పాలన తీరుతెన్నులు చూసేవారికి అర్ధం అవుతోంది.
పార్టీ మార్పిళ్ల విషయంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రజాస్వామ్య ప్రియులను ఎంతగానో అలరించింది. తమ పార్టీలోకి వేరేవారు ఎవరు రావాలన్నా ముందు పదవులకు రాజీనామా చేయాలని పునరుద్ఘాటించారు. అలా గీత దాటే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా వారిపై అనర్హత వేటువేయాలని కొత్తగా స్పీకర్ గా ఎన్నికయిన తమ్మినేని సీతారాంకు సభానాయకుడి స్థానం నుంచి  ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి సూచించడం ముదావహం. ప్రజాస్వామ్యానికి చెదపురుగుల్లా తయారయిన పార్టీ మార్పిళ్ళకు ఈ సాహసోపేత నిర్ణయం అడ్డుకట్ట వేస్తుందనడంలో సందేహం. చట్టంలోని లొసుగులను నిస్సిగ్గుగా వాడుకుంటూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వచ్చిన ఇతర పార్టీలు కూడా జగన్ సూచించిన ఈ విధానాన్ని పాటిస్తే, చట్ట సవరణ అవసరం లేకుండానే ఈ అనైతిక విధానాలను చాలావరకు నిర్మూలించవచ్చు.
అటు రాష్ట్ర పరిపాలకుడుగా, ఇటు  రాజకీయ పార్టీ అధినేతగా జగన్ మోహన రెడ్డి  తన రెండు చేతుల్లోను  పగ్గాలు ధరించి ముందుకు సాగుతున్నారనేది కూడా సుస్పష్టం. పాలనాపరంగా, రాజకీయంగా ఈ నెల రోజుల్లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఒకపక్క సెహభాష్ అనిపించుకునే ప్రకటనలు. మరో పక్క తొందర పడుతున్నారేమో  అనిపించే రాజకీయ నిర్ణయాలు.    
విచ్చలవిడిగా పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలనే గట్టి నిర్ణయానికి ఆయన వచ్చినట్టు తోస్తోంది. ఈ విషయంలో శషభిషలకు తావు లేకుండా ఏకంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలోనే జగన్ మోహన రెడ్డి కుండబద్దలు కొట్టారు. సమావేశం జరుగుతున్న ప్రజావేదిక కట్టడమే ఒక అక్రమ నిర్మాణమని చెబుతూ, వీటి తొలగింపు అనేది ప్రజాజవేదికను నేలమట్టం చేయడంతోనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆ వేదిక సాక్షిగానే ఆదేశించారు. సదస్సు అలా ముగిసిందో లేదో  అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి ఆదేశాలను తుచ తప్పకుండా అమలు చేసింది. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రజావేదిక కట్టడం కూల్చివేత కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే  పూర్తిచేసింది. ఈ చర్య సహజంగానే   రాజకీయ వర్గాల్లోనే కాక సాధారణ ప్రజల్లో కూడా సంచలనాన్ని కలిగిస్తోంది.  అక్రమ నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో అలజడి రేపుతోంది. కొందరు దీనికి రాజకీయ ఉద్దేశ్యాలు ఆపాదిస్తుంటే మరికొందరు తొందరపాటు చర్యగా పరిగణిస్తున్నారు. అయినా ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని, అక్రమనిర్మాణాలను ఎట్టి పరిస్తితిలోను అనుమతించేది లేదనీ, అవినీతి రహిత పాలనను అందించాలంటే   అక్రమార్కులపై కొరడా విదల్చక తప్పదనీ ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేయడంతో ఈ విషయంలో ఆయన యెంత పట్టుదలగా వున్నారో అన్న సంగతి అర్ధం అవుతోంది. ఆయన అనుకున్నట్టుగానే కృష్ణానది కరకట్ట మీద నిబంధనలకు విరుద్ధంగా  అనేకమంది శ్రీమంతులు నిర్మించుకున్న భవంతులను కూల్చివేసే ప్రయత్నంలో అధికారులు తలమునకలుగా వున్నారు. అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివసిస్తున్న గెస్ట్ హౌస్ కూడా వీటిలో ఒకటి కావడం రాజకీయ కలకలం రేపుతోంది.  అవతల ప్రభుత్వం నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటూ ఉన్నందున పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశాన్ని మరింత వివాదం చేయకుండా విజ్ఞతతో వ్యవహరిస్తే బాగుంటుంది. ఇదే దృఢ సంకల్పంతో ముందుకు సాగి అక్రమ నిర్మాణాలకు ముకుతాడు వేయగలిగితే ప్రజల మద్దతు ప్రభుత్వానికి పుష్కలంగా  లభిస్తుంది.
ఉద్దేశ్యం మంచిదే. పెట్టుకున్న లక్ష్యం గొప్పదే. కానీ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆచరణలో దోవతప్పి మరో బాట పట్టడం కొత్త విషయం ఏమీ కాదు. యెంత మంచి  పధకం అయినా ప్రజల మద్దతు  లేనిదే విజయవంతం కానేరదు. కొన్ని కొన్ని విషయాల్లో పాలకులు తమ పట్టుదలలకు కొంత వివేచన జత చేస్తే బాగుంటుందేమో ఏలికలు ఆలోచించాలి.
వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పాలన కొన్ని శుభశకునాలతో మొదలయింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనూ  పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ చక్కటి స్నేహపూర్వక సంబంధాలు వున్నాయి. ఢిల్లీలో ప్రధానమంత్రిని తొలిసారి కలిసి వచ్చిన తర్వాత మోడీ  చేసిన ట్వీట్ ఇందుకు చక్కని ఉదాహరణ. జగన్ మోహన రెడ్డితో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ప్రధాని వర్ణించడం మోడీ వ్యవహార శైలి తెలిసిన వారికి  గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించి వుంటుంది. అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో చంద్రబాబు నాయుడితో వ్యవహరించిన తీరు గుర్తున్న వారికి ఇప్పుడు వై.ఎస్. జగన్ తో ఆయన వ్యహరిస్తున్న విధానం ఒకింత అచ్చెరువు కొలిపేదిగా వుంది. ఒక విధంగా ఉభయ రాష్ట్రాలకు ఈ మార్పు ప్రయోజనకరం. రెండు కొత్త రాష్ట్రాల నడుమ పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు వున్నాయి. అయిదేళ్ళు గడిచిపోయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనేమాదిరిగా కొన్ని ఇంకా  అపరిష్కృతంగానే  వున్నాయి. ముఖ్యమంత్రుల స్థాయిలో చొరవ చూపిస్తే వాటిల్లో చాలావాటికి పరిష్కారం దొరకడం అసాధ్యమేమీ కాదు. అలాగే ప్రతియేటా సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగం, నానాటికీ తగ్గిపోతున్న కృష్ణానదీ జలాల గరిష్ట వాడకం. వీటిని సుసాధ్యం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్. తెలంగాణా రాష్ట్రాలకు సేద్యపు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. చినుకు పడితేనే బతుకు అనే రైతాంగం దుస్తితికి తెర పడుతుంది. ఈ రెండు నదుల అనుసంధానానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆచరణలోకి తేగలిగితే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ధిక స్తితిగతులు ఊహించలేనంతగా మారిపోతాయి. మొన్న శుక్రవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం ఈ దిశగా సానుకూల ఫలితాలను ఇవ్వగలదని ఆశించడం అత్యాశ కాబోదు.

28, జూన్ 2019, శుక్రవారం

కేసీఆర్ పద్మవ్యూహంలో చిక్కుకున్న జగన్ ? | Hot Topic with Journalist Sai



ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 News ఛానల్ లో రంజిత్ నిర్వహించిన Hot Topic చర్చాకార్యక్రమంలో నాతోపాటు ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు

కేసీఆర్ స్నేహం తో నైనా ఆంధ్రా కి న్యాయం జరుగుతుందా ? | Hot Topic with Jo...



ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime 9 News ఛానల్ లో రంజిత్ నిర్వహించిన Hot Topic చర్చాకార్యక్రమంలో నాతోపాటు ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు

26, జూన్ 2019, బుధవారం

Debate On Praja Vedika Demolition | News & Views #2 | hmtv





ఈరోజు బుధవారం ఉదయం   HMTV లో  శ్రీ రాజేష్ నిర్వహించిన    News & Views చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ రాజశేఖర్ (వైసీపీ), శ్రీ విల్సన్ (బీజేపీ).

Debate On Praja Vedika Demolition | News & Views #1 | hmtv





ఈరోజు బుధవారం ఉదయం   HMTV లో  శ్రీ రాజేష్ నిర్వహించిన    News & Views చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ రాజశేఖర్ (వైసీపీ), శ్రీ విల్సన్ (బీజేపీ).

25, జూన్ 2019, మంగళవారం

KSR Live Show: YS Jagan Orders to Demolish Praja Vedika Building - 25th ...





ప్రతి మంగళవారం మాదిరిగానే ఈ ఉదయం  సాక్షి టీవీ ఛానల్ లో   శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన KSR LIVE SHOW   చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు:      డాక్టర్  శ్రీదేవి (తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే), శ్రీ శ్రీనివాస్ (టీఆర్ ఎస్), శ్రీ శ్రీధర రెడ్డి (బీజేపీ), శ్రీ జనక్ ప్రసాద్, (కాంగ్రెస్)

Bhandaru Srinivas Rao comments on TDP MPs Joining in BJP






23, జూన్ 2019, ఆదివారం

పరాకాష్టకు చేరిన పార్టీ మార్పిళ్లు – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 23-06-2019, SUNDAY)
‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం’
ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రజలు నేరుగా ఎన్నుకోకుండా పరోక్ష పద్దతిలో  చట్ట సభల్లో అడుగుపెట్టిన వాళ్ళు ఈ మాటలు చెబుతుంటే అసహజంగా అనిపిస్తుంది.
కానీ వాళ్ళు చెబుతూనే వుంటారు. మనం వింటూనే వుంటాం. ఇదంతా ఒక సహజమైన ప్రక్రియగా మారిపోయింది.
నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు, సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన రావు, టీజీ వెంకటేష్ లు  పార్టీ ఫిరాయించి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం న్యాయమా ! ధర్మమా అనే చర్చలు గత కొద్దిరోజులుగా టీవీల్లో సాగుతున్నాయి. న్యాయమో ధర్మమో అటుంచి చట్టబద్ధమే అని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. రాజ్యాంగం లోని పదో షెడ్యూల్, నాలుగో పేరాను వారు పదేపదే పేర్కొంటున్నారు. చట్టబద్ధంగా చూసినప్పుడు అది న్యాయమే. కానీ ధర్మబద్ధంగా చూసినప్పుడు న్యాయం కాకపోవచ్చు. న్యాయం కాదని టీడీపీ అంటోంది, తన గతాన్ని కాసేపు తాత్కాలికంగా మరచిపోయి. కానీ జనాలకు అంతటి మతిమరపు లేదుగా.
కష్టాలు ఒంటరిగా రావు, వచ్చినప్పుడు కట్టకట్టుకుని వస్తాయని అంటారు.
ఇప్పుడు టీడీపీ పరిస్తితి అదే. ఒకటా రెండా కష్టాలు. అన్నీఇన్నీ కావు.
ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కనీవినీ ఎరుగని పరమ ఘోరమైన  పరాజయం ఇటీవలి ఎన్నికల్లో అనుభవంలోకి వచ్చింది. అసెంబ్లీలో ఇరవై మూడు స్థానాలకు, లోక సభలో మూడంటే మూడు స్థానాలకు  టీడీపీని పరిమితం  చేస్తూ ఓటర్లు తీర్పు చెప్పారు. పైగా అధికారం కట్టబెట్టింది ఎవరికో కాదు, తమ  ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి వైసీపీకి. అదీ అద్భుతమైన మెజారిటీతో. ఇది చాలదన్నట్టు కేంద్రంలో అధికారానికి వచ్చింది బీజేపీ. గత ఎన్నికల సమయంలో కంటే హెచ్చు మెజారిటీ ఇచ్చి ఆ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టారు. మళ్ళీ ప్రధానిగా మోడీ రాకూడదు అనే ధ్యేయంతో కాలికి బలపం కట్టుకుని దేశమంతా తిరిగి ప్రచారం చేసివచ్చిన చంద్రబాబుకు మోడీ, అమిత్ షా ద్వయం తిరుగు లేని విధంగా అధికారంలోకి రావడం నిజంగా మింగుడు పడని విషయమే. ఇటు రాష్ట్రంలో జగన్. అటు కేంద్రంలో మోడీ. తను నమ్ముకున్న కాంగ్రెస్ ఎన్నికల్లో బొక్క బోర్లాపడి తేరుకోలేని స్తితిలో వుంది. మరో పక్క పొరుగు రాష్ట్రంలో కేసీఆర్. ఆయనకు వ్యతిరేకంగా కూటమికట్టి ఓటమి పాలయిన సంగతి టీడీపీ అధినేత మరపున పడితే పడి ఉండవచ్చు. కానీ కేసీఆర్ ఎలా మరచిపోతారు?  ఎన్నికలకు ముందు నుంచీ వీరందరినీ టీడీపీ నాయకులు అనని మాట లేదు. వాడని పరుష పదం లేదు.
ఇలా దిక్కుతోచని స్తితిలో వున్న టీడీపీకి పులిమీది పుట్రలా కొత్తగా పార్టీ ఫిరాయింపులు. నలుగురు రాజ్యసభ సభ్యులు అదీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు చెప్పాపెట్టకుండా బీజేపీ కండువాలు కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించి ఊరుకుంటే  కొంత ఉపశమనంగా వుండేది. ఏదో వెళ్ళిపోయారు. ఒకరు పొతే నలుగు వస్తారు అని షరా మామూలుగా సమాధానపడడానికి వీలుండేది. రాజ్యసభలో వున్న ఆర్గురు టీడీపీ సభ్యుల్లో మూడింట రెండు వంతులు బయటకు వచ్చాం కాబట్టి మమ్మల్ని వేరే ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించండి అంటే మరో రకంగా వుండేది. అలా చేయకుండా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం రాజ్యసభలోని టీడీపీని ఏకంగా బీజేపీలో విలీనం చేయాలని సభ చైర్మన్ కు మహజరు ఇచ్చారు. ఆయన కూడా పరిశీలిద్దాం అని ఊరుకుంటే అదో రకంగా వుండేది. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఆ నలుగురినీ బీజేపీ సభ్యులుగా పరిగణిస్తున్నట్టు వెనువెంటనే ప్రకటించేశారు. టీడీపీ అధినాయకత్వం తేరుకునేలోగానే ఇదంతా వాయువేగంతో జరిగిపోయింది. పైగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబంతో కలిసి విదేశాల్లో వున్నప్పుడు.
సరే! పరిస్తితిని సరిదిద్దుకోవడానికి ఏమీ లేకపోయినా అయన తన వంతు ప్రయత్నం అక్కడి నుంచే ప్రారంభించారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా అమరావతిలో పార్టీ ప్రముఖులతో సంప్రదింపులు జరిపారు. అధినాయకుడి ఆదేశం మేరకు పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా ముందుకువచ్చి పార్టీ మారిన తమ వారిపై కారాలు మిరియాలు నూరడం మొదలుపెట్టారు. గతజల సేతుబంధనం.
ఈ చరాచర సృష్టిలో కడుపు నిండుగా వున్నప్పుడు, ఆకలి లేనప్పుడు కూడా ఆహారాన్ని వెతుక్కునో, వేటాడో తినే స్వభావం వున్నది ఒక్క మనుషులకే. మరీ ముఖ్యంగా రాజకీయులకి. కాకపొతే వాళ్ళ ఆహారం సంఖ్యాబలం. లేకపోతే జనం మంచి మెజారిటీతో గెలిపించి  అధికారం అప్పగించినప్పుడు కూడా పరాయి పార్టీ వాళ్ళకోసం ఈ వెంపర్లాటలేమిటి? ఇప్పుడు బీజేపీ చేసిన పనే గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని టీడీపీ చేసింది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ  ఇప్పుడు కాషాయదళం వెక్కిరిస్తుంటే   టీడీపీ దగ్గర జవాబు ఏముంటుంది, మౌనం తప్ప.
గత చరిత్ర గమనిస్తే రాజ్యసభకు సంబంధించి చంద్రబాబుకు గంధర్వుల శాపం ఉందేమో అనిపిస్తుంది. ఆయన ఏరికోరి, పార్టీలో వేరేవారి అభ్యంతరాలను, అభ్యర్ధనలను త్రోసిపుచ్చి అనేకమందిని రాజ్యసభ సభ్యులుగా చేసారు. వారిలో ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ ఇప్పుడు పార్టీలో లేరు. దానికి ప్రధాన కారణం వారికి ఉన్న వ్యాపార ప్రయోజనాలు. ఎవరు అధికారంలో వుంటే వారి ద్వారా మాత్రమే నెరవేర్చుకోవడానికి వీలున్న వ్యాపార, వాణిజ్య లావాదేవీలాయె. అంచేత వ్యక్తిగత విధేయతలు తప్పిస్తే పార్టీపట్ల నిబద్దతను అలాంటి వారి నుంచి ఆశించడం కష్టం. నిజానికి ఇప్పుడు పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు నలుగురికీ ప్రభుత్వంతో పనిపడే వ్యాపారాలు అనేకం వున్నాయి. పైగా వారందరూ చంద్రబాబు ఆప్త వర్గంలో ముందువరసలోని వాళ్ళు. పదవుల పందేరం విషయానికి వస్తే వారికే ముందు పీట వేస్తారని పార్టీలోనే ప్రచారం జోరుగా సాగేది. వాళ్ళే ఇప్పుడు చంద్రబాబుకు మొండి చేయి చూపి తమ దోవ చూసుకున్నారు.
జూలియస్ సీజర్ నాటకంలో బ్రూటస్ అనే పాత్ర వుంటుంది. సీజర్ కు అతడు ఆరోప్రాణం. సీజర్ అంటే ప్రాణం ఇచ్చే తత్వం బ్రూటస్ ది. చివరికి ఏమైంది. సీజర్ ని అంతమొందించే కుట్రలో అతడూ పాలుపంచుకుంటాడు. ప్రత్యర్ధులు కత్తులు దూసి తనను పొడుస్తుంటే చలించని సీజర్, బ్రూటస్ తనను చంపడానికి కత్తి ఎత్తినప్పుడు అతడి మొహం వివర్ణమౌతుంది. ‘యూ టూ బ్రూటస్’ (బ్రూటస్ !నువ్వు కూడానా) అంటూ ఆశ్చర్యంగా అతడివైపు చూస్తూ ప్రాణాలు వదులుతాడు.
రాజకీయాల్లో ఇవన్నీ సహజమని సరిపుచ్చుకోక తప్పని పరిస్తితి. ఎందుకంటే ఈనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అనేకమందికి ఇలాంటి గతమే వుంది.
టీడీపీ బీజేపీ నాయకుల నడుమ ఇలా వాగ్యుద్ధాలు సాగుతుండగానే కధ ఓ కొత్త మలుపు తిరిగింది.   
ఇంతకీ జరిగింది ఫిరాయింపా, పురమాయింపా అనే మీమాంస మొదలయింది. వైసీపీ అగ్రనాయకుల్లో ఒకరయిన విజయ సాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ ఇందుకు కారణం. చంద్రబాబు నాయుడు పురమాయించిన మీదటే ఈ నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని ఆ ట్వీట్ తాత్పర్యం. మోడీతో తగవు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేకపోగా, ముందు ముందు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాన్ని పసికట్టి ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు తన సొంత మనుషులు, నమ్మకస్తులు అనుకున్నవారిని బీజేపీలో చేర్పించారని సోషల్ మీడియాలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.         
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో  పార్టీ మారిన వారి సంఖ్యను లెక్కవేయాలంటే అది  చేతివేళ్ళతో సాధ్యం అయ్యే పనికాదు, కాలిక్యులేటర్లు కావాలి. ఈ లెక్కలు చూస్తే ఈ చట్టం ఉద్దేశ్యం నెరవేరిందా లేక ఫిరాయింపులకు చట్టబద్ధమైన మార్గాన్ని ఏర్పరిచిందా అనే సందేహం కలుగుతోంది.
బీజేపీతో పొత్తులేకుండా, కనీసం ఎన్నికల అవగాహన లేకుండా తెలుగుదేశం పార్టీ ఏనాడూ  గెలవలేదని బీజేపీ నాయకులుతరచూ చెబుతుంటారు. బీజేపీ సాయంతోనే టీడీపీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిందని కూడా ఆ పార్టీ నాయకుడు ఒకరు టీవీ చర్చల్లో చెప్పారు. రానున్న అయిదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కొట్టేయలేమని, ఆ పరిస్తితే తలెత్తితే ప్లాన్ బి కింద బీజేపీ అధినాయకత్వం మరో ప్రణాళిక సిద్ధం చేసుకుంటుందేమో అనే అనుమానాలు కూడా పొటమరిస్తున్నాయి. గతంలో మాదిరిగా టీడీపీ , బీజేపీలు అనేక మార్లు చేతులు కలిపాయి. అదే మాదిరిగా విడిపోయాయి కూడా. ఒకవేళ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అధినాయకుడు జగన్ మోహన్ రెడ్డితో అద్యతన భావిలో ఇలాగే స్నేహ సంబంధాలు కొనసాగే పరిస్తితులు లేకపోతె అప్పుడు మళ్ళీ ఈ రెండు పార్టీలు దగ్గరవుతాయా అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల చేరికకు వెనుక  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నిన రాజకీయ వ్యూహంవుందని  సందేహించడానికి ఇదే కారణం.        
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పార్టీ మార్పిళ్ళకు  వ్యతిరేకంగా గట్టి విధాన నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో  టీడీపీలో అసంతృప్తులకు ఒక ప్రధాన మార్గం మూసుకుపోయింది. వారికి ఇప్పుడు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటే. రాష్ట్రంలో తమ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి ఒక బలమైన రాజకీయ శక్తిగా తయారుచేయాలనే ఉద్దేశ్యం బీజేపీకి వుంది. ఆ కారణంగా టీడీపీలో సమర్దులయిన నాయకులను ఆకర్షించే కార్యక్రమానికి ఆ పార్టీ సిద్ధంగా వున్నట్టు ఈ పరిణామాలు తెలియచేస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పనికట్టుకుని ఢిల్లీకి  పలుమార్లు వచ్చి, మోడీ వ్యతిరేక కూటమిని కూడగట్టే ప్రయత్నాలు చేయడం ఇంకా వారి మనసులో పచ్చిగానే వుంది. అంచేత ఏ అవకాశం వచ్చినా సరే దాన్ని వాడుకుని టీడీపీ ఉనికి  రాష్ట్రంలో లేకుండా చేసి ఆ స్థానంలో తమ పార్టీ బలాన్ని పెంచుకోవాలనే అభిమతాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పలుమార్లు బహిరంగంగానే వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబుకు అధ్యతన భవిష్యత్తులో ఎదురయ్యే పెను ప్రమాదాల్లో  ఇది ప్రధానమైనది.
తమ పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని ఆపార్టీ నాయకులు గతాన్ని గుర్తు చేసుకుని చెబుతుంటారు. కానీ అవన్నీ  సొంత పార్టీ నుంచి ఎదురయిన సంక్షోభాలు. ఇవి అలా కాదు, బయటి శక్తుల నుంచి పొంచి వున్న ప్రమాదాలు. ప్రమత్తంగా ఉండని పక్షంలో తీరిగ్గా విచారించాల్సివస్తుందేమో ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది.
స్వయంకృతాలకు ఇతరులను నిందించడం కన్నా ఆత్మ పరిశీలన చేసుకోవడం ఆవశ్యకం.

అవినీతిని తవ్వి తీసి ఆదా చేస్తారా? | News Scan Debate With Vijay | TV5 News





ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 న్యూస్ ఛానల్ ఎక్జిక్యూటివ్ ఎడిటర్ విజయనారాయణ్  నిర్వహించిన  News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ లక్ష్మినారాయణ, శ్రీ సయ్యద్ రఫీ (విశ్లేషకులు).

22, జూన్ 2019, శనివారం

బీజేపీ డోర్ తీస్తే ఏపీలో సునామి..! | BJP Leader Bhanu Prakash Over TDP L...





శుక్రవారం రాత్రి NTv లో రుషి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రావులపాటి సీతారామారావు, శ్రీ చలసాని శ్రీనివాస్,  శ్రీ  పెంటపాటి పుల్లారావు, శ్రీ ఎస్. రామచంద్రరావు, శ్రీమతి అనూరాధ (టీడీపీ), శ్రీ భాను ప్రకాష్ (బీజేపీ), శ్రీ వర్ల రామయ్య (టీడీపీ), శ్రీ రఘురాం (బీజేపీ)

Discussion | TDP Leaders slams BJP over MPs defection | Public Point





ప్రతి శనివారం మాదిరిగానే ఈ  ఉదయం   ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ తో నేను.

20, జూన్ 2019, గురువారం

Senior Journalist Bhandaru Srinivas Sensational Prediction Over TDP Part...

Senior Journalist Bhandaru Srinivas About Reasons Behind Crisis in TDP |...

బీజేపీ లోకి టీడీపీ సీనియర్ నాయకులు.. చంద్రబాబు ఘోర పరాజయం | Bhandaru On ...

మోడీ " ఒకే దేశం - ఒకే ఎన్నిక" Bhandaru Comment On Modi's One Nation One ...

19, జూన్ 2019, బుధవారం

KSR Live Show | AP Assembly LIVE 2019 Highlights | YS Jagan vs Chandraba...





ప్రతి మంగళవారం మాదిరిగానే  సాక్షి టీవీలో శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్న వాళ్ళు:  శ్రీ  జోగారావు (వైసీపీ  ఎమ్మెల్యే ), శ్రీ  కిరణ్ యాదవ్ (కాంగ్రెస్), శ్రీ కోటేశ్వరరావు (బీజేపీ), శ్రీ విద్యాసాగర్   (టీఆర్ఎస్)

సెక్యూరిటీ పంజరాల్లో వీవీఐపీలు – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Prabha telugu daily on 19-06-2019, SUNDAY)  
అమెరికా  మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ ఒక చక్కని మాట చెప్పారు.
ఒక మంచి వాడిని, సద్గుణ సంపన్నుడిని ఎంపిక చేసుకోండి. అతడికి అధికారం ఇచ్చి చూడండి, ఇక అతడెలా మారిపోతాడన్నది మీరే చూస్తారు.
చాలామందికి అర్ధం కానిది ఇదే. అధికారంలో లేని సమయంలో ఎలాంటి బందోబస్తూ లేకుండా ప్రజల నడుమ అరమరికలు లేకుండా స్వేచ్చగా తిరిగిన రాజకీయ నాయకులు, పదవిలోకి రాగానే చుట్టూ భద్రతా వలయాలు నిర్మించుకుని ప్రజలకు ఎందుకు దూరం అవుతారన్నదే జవాబు లేని ప్రశ్న.
ప్రముఖుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా,  ఏదైనా  జరగరానిది జరిగితే అది సంచలన వార్త అవుతుందని, అంచేత సెక్యూరిటీ విషయంలో తాము చెప్పినట్టు విని తీరాల్సిందే అని భద్రతా విభాగం వారు నాయకులకు నొక్కి చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే కావచ్చు. మరి వందల కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతున్న ఈ భద్రతా ఏర్పాట్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు కదా, తద్వారా  ప్రముఖుల రాకపోకల సందర్భంలో బందోబస్తు పేరుతొ సామాన్యుల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను ఓ మేరకు తగ్గించవచ్చు కదా! అనేది  మామూలు మనుషులకు కలిగే సందేహం. ప్రస్తుతం అలా కూడా చేస్తున్నారు. అంగరక్షకుల చేతుల్లో చిన్న సైజు బ్రీఫ్ కేసులు కనిపిస్తుంటాయి. వాటిల్లో ఇటువంటి పరికరాలే వుంటాయి. అయినా ప్రముఖుల రాకకు ముందు, అది వివాహ వేడుక కావచ్చు,  సాధారణ సమావేశం కావచ్చు  పోలీసు జాగిలాలతో, బాంబులను నిర్వీర్యం చేసే దళాలతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం తప్పనిసరి. అలాగే ప్రముఖులు  ప్రయాణం చేసే మార్గాల్లోనే కాకుండా  భద్రతాధికారులు ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ  మార్గాల్లో సయితం వాహనాల కదలికలపై ఆంక్షలు విధించడం కద్దు.  ఇంత శ్రమ పడ్డా, ఇంతటి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేదు. దరిమిలా సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించి వాటిని మరింత పటిష్టం చేయడం ఒక్కటే జరుగుతోంది. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతూనే వస్తోంది.
పొతే, ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత, పటాటోపం, అధికార దర్పం ప్రదర్శించడానికే తప్ప వారి ప్రాణరక్షణకు సరిగా ఉపయోగపడడం లేదన్న అభియోగాలు వున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల పేరుతొ కొందరికి కల్పిస్తున్న భద్రత అపహాస్యానికి గురవుతున్న మాటా నిజమే.
ఈ విషయాలను మననం చేసుకోవడానికి ఓ కారణం వుంది. ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో సాధారణ ప్రయాణీకుడి మాదిరిగా సెక్యూరిటీ చెక్ ద్వారం నుంచి వెళ్ళారనీ, విమానం ఎక్కడానికి ఇతర ప్రయాణీకుల వలెనే షటిల్ బస్సులో ప్రయాణించారనీ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆయనకు చాలా సంవత్సరాలుగా జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటూ వచ్చింది. దేశ విదేశాల్లో ప్రయాణాలు అన్నీ చాలావరకు ప్రత్యేక విమానాల్లోనే చేసేవారు. ఆ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న సమాచారం ఇంతవరకు అధికారికంగా లేదు. ఎయిర్ పోర్ట్ నిబంధనలు ఉన్నప్పటికీ బాబుకు ఉన్న  ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎలా అనుమతించారో అర్ధం కాని విషయం. బహుశా, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.
ఈ ఉదంతం చాలా మందికి విడ్డూరంగా అనిపిస్తే తెలుగు దేశం వర్గాలకు మనస్తాపం కలిగించింది. దానితో ఇదొక రాజకీయ వివాదంగా మారి చర్చలు సాగుతున్నాయి.
మొన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి కారణాలను అన్వేషించే ప్రయత్నం చేసారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు దేశం పార్టీ అధినాయకుల్లో మానవీయ స్పర్శ మటుమాయం అయిందన్న అభిప్రాయం ఆ  సమావేశంలో వ్యక్తమైంది. నిజమే. పార్టీ అధినేత పార్టీ శ్రేణులకు దగ్గర కాకుండా అడ్డుపడిన అనేకానేక కారణాల్లో భద్రతా ఏర్పాట్లు కూడా వున్నాయి. ఇది నిజం.
జనం నడుమ వుండే నాయకులకే జనం దగ్గరవుతారు. 2019 లో జగన్ అద్భుత విజయం, 2014లో చంద్రబాబు చేసిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ఈ వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు రుజువు చేస్తున్నాయి.
తగ్గించిన భద్రతకు ఎవరు కారణం అనే రంద్రాన్వేషణ ఇప్పుడు  అనవసరం. సమస్యలనుంచి అవకాశాలను వెతుక్కుంటానని చంద్రబాబు తరచూ చెబుతుంటారు.
వెతకబోయిన తీగ ఎదురయింది. అదే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. అంశాన్ని వివాదాంశం చేసి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాలు మాని పారేసుకున్న చోటునే వెతుక్కోవడం అనేది విజ్ఞత అనిపించుకుంటుంది.
అధికారం చేజారిన పిదప, అధికారంతో సమకూరే కొన్ని అదనపు సౌకర్యాలు కూడా దానితో పాటే తప్పుకుంటాయి. గతంలో విశేషాధికారాలు అనుభవించిన గొప్ప గొప్ప  నాయకులు సైతం ఈ దశలను దాటుకుంటూ వచ్చారు. రాజకీయాల్లో అది అత్యంత సహజంగా తీసుకోవాలి.          
ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,   మోస్తరుగా ఆహ్వానించే నాయకులు కూడా లేకపోయారు. గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం మాజీ ప్రధాని బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లోని   హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన సత్తు చెంచాతో తినలేక ఇబ్బందిపడిన  ఇందిరాగాంధిచివరకు  చేత్తోనే  తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి  అయిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు (మాజీ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్  రావులపాటి సీతారామారావు తండ్రి) వున్నారు.  
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెసు (కాంగ్రెస్ ఓ) లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి   ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చోటా మోటా స్థానిక నాయకుల మీద పడింది
పీవీ నరసింహారావు ప్రధానిగా వున్నంతకాలం అందరూ ఆహా! ఓహో!!అన్నారు.
పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన
సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యాబలం  బొటాబొటిగా
వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలంఅధికార పీఠంపై వుంచిన
అపర చాణక్యుడని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాతపదవి
నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్లతోనే  ఆయన్ని  తెగడడం
ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం
కాగానే వాళ్ళూ దూరం జరిగారు.
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని
హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ
దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన
చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ
మార్బలాలు, వందిమాగధులుఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు.
ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
ప్రధానమంత్రి హోదాలో పీవీ నరసింహా రావు  రాష్ట్ర పర్యటనకు
వస్తున్నారు అంటే చాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన  యావత్ యంత్రాంగాలు
అప్రమత్తం అయిపోయేవి. ఉన్నతస్థాయి సమావేశాలు జరిపి ప్రధాని పర్యటన
ఏర్పాట్లు సమీక్షించేవారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి ప్రత్యేకంగా
చెప్పనక్కరలేదు. ప్రధాని పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని రెండు టేపుల్లో
రికార్డు చేయడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  ప్రత్యేక బృందాలను
ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ముగియగానే ఆ వివరాలు రాసివున్న ఒక టేపును
అక్కడికక్కడే ప్రధాని బృందంలోని అధికారులకు అందచేసేవారు. అవన్నీ ప్రధాని
పాటు ఢిల్లీ చేరిపోయి ఆ తరువాత ప్రధాని కార్యాలయంలోని 'ఆర్చివ్స్'
విభాగానికి దఖలు పరిచేవారు.
పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ప్రతి ఏటా  బేగంపేటలోని
ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు.
ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. భద్రతా ఏర్పాట్ల గురించి చెప్పే పనే లేదు. ప్రధాని వెళ్ళే దారి దారంతా జల్లెడ పట్టేవాళ్ళు. పదవి నుంచి
దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన
హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...'
అనే పద్యపాదం  జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు
అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.
ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలియని విషయాలు కావు. అధికారం శాశ్వతం కాదని అందరికంటే వారికే బాగా తెలుసు. అయితే అది శాశ్వతం అనే భ్రమలో వుంటారు. పదవి నుంచి దిగిపోయిన తరవాత కానీ తత్వం బోధ పడదు.