26, డిసెంబర్ 2023, మంగళవారం

ఆకాశ దర్శన్ అను తల్లి కోరిక తీర్చిన తనయుడు – భండారు శ్రీనివాసరావు

 ప్రతి తల్లీ  కోరుకునేదే ఆ తల్లీ కోరుకున్నది. తన కుమారుడు బాగా చదువుకుని జీవితంలో ఎన్నో ఎత్తులకి ఎదగాలని. ఆ మహా తల్లి పేరు పాలకుర్తి ఇందిరమ్మగారు. ఆమె మనసులో కోరుకున్నట్టే ఆ కుమారుడు పాలకుర్తి మధుసూదన రావు చాలా ఎత్తులకు ఎదిగాడు. పెద్దలు వద్దంటున్నా  కష్టపడుతూ తాను బాగా  ఇష్టపడిన చదువే (ఎమ్మే తెలుగు) చదువుకున్నాడు. ఆ ధైర్యమే ఆయన్ని పై ఎత్తులకు చేర్చింది. మనసుపడిన ఉద్యోగాలు చేయించింది. అలా అలా ఎక్కడయితే ఒక చిన్నస్థాయి ఉద్యోగంలో చేరాడో, అదే సంస్థకు ఉత్తరాధికారి కాగలిగాడు. రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా చేరి స్టేషన్ డైరెక్టర్ అయ్యాడు. అందరికీ ఇలా ప్రమోషన్లు వచ్చే అవకాశం వుండదు. అందుకే కష్టపడి దోవలో ఎదురయిన ప్రతి పోటీ పరీక్షలో నెగ్గి, అతి త్వరగా నిచ్చెన మెట్లు ఎక్కగలిగాడు. దూరదర్సన్ లో అలాగే ఒక స్థాయి హోదానుంచి ఏకంగా  హైదరాబాదు  స్టేషన్ డైరెక్టర్ గా  సుదీర్ఘ కాలం పదవీ బాధ్యతలు నిర్వహించి, రిటైర్ అయిన పిదప టీటీడీ వారి ఆధ్యాత్మిక ఛానల్  శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీ.ఈ.ఓ. గా పనిచేశారు. ఈ మహత్తర అవకాశం  తన పూర్వజన్మ సుకృతంగా భావించే పాలకుర్తి మధుసూదనరావు, తన జీవిత అనుభవాలను, రేడియో, దూరదర్సన్ లలో తన ఉద్యోగ పర్వాలతో కూడిన,  “నేను – నా ఆకాశ దర్సన్” అనే పేరుతొ దాదాపు 250 పేజీల గ్రంధం రాశారు. రేడియో, దూరదర్సన్ లు ఉచ్చస్తితిలో ఉన్నప్పుడు పనిచేసిన అధికారిగా, వాటిలోని అన్ని విభాగాల్లో అనుభవం గడించిన ఉద్యోగిగా రాసిన ఈ పుస్తకంలో,  ఒకప్పటి ఆ సంస్థల శ్రోతలను, వీక్షకులను  అలరించే అనేక సంగతులు ఈ పుస్తకంలో వున్నాయి.  

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇన్ని మెట్లు ఎక్కినా, తన మొదటి మెట్టు ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్ గా పనిచేసిన రోజులను మరచిపోలేదు. ఆయన్ని ఆ ఉద్యోగానికి రికమండ్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ యాదగిరి రెడ్డి గారు చెప్పిన హితవాక్యాన్ని మధుసూదనరావు ఇన్నేళ్ళ తర్వాత కూడా గుర్తు పెట్టుకుని  ఇందులో ప్రస్తావించడం విశేషం.

“ మధూ! జీవితంలో ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకో. జీవితంలో పైకి  రావాలి అంటే వినమ్రత ముఖ్యం. దాన్ని విస్మరించకు. అది సంజీవని లాంటిది.”

ఈ మాటలు బాగా గుర్తు పెట్టుకున్నట్టుంది. తన సర్వీసులో ఎదురైన  పెద్దలపట్ల, చిన్నల పట్లకూడా అదే వినమ్రత, అదే గౌరవం. ఇవే  ఆయన్ని పెద్దవాడిని చేసాయి. పెద్దలను  దగ్గర చేసాయి. చిన్నలను  దూరం జరగకుండా చేసాయి.

సాధారణంగా  జీవిత చరిత్రలలో సకృత్తుగానైనా ఆత్మస్తుతి, పరనింద పంటికిందరాళ్లులా తగులుతుంటాయి. ఈ పుస్తకంలో ఆ రెండూ మృగ్యం. బహుశా  గురువు బోధించిన ఈ వినమ్రతే కారణం కావచ్చు.  

ఈ పుస్తకం ఇలా వెలుగు చూడడానికి ప్రధాన కారణం అయిన ఇద్దర్ని స్మరించడం నా కర్తవ్యమ్.

సరే! రాసింది పాలకుర్తి. ప్రచురించింది కిన్నెర పబ్లికేషన్స్ తరపున శ్రీ మద్దాళి రఘురాం. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయినా కూడా శ్రీరఘురాం పెద్ద మనసుతో ఈ పుస్తకం నా చేతిలో పెట్టారు.

పెట్టే ముందు మధుసూదన రావు ఇంకొంచెం పెద్ద మనసు చేసుకుని  ఆటోగ్రాఫ్ పెడుతూ నా గురించి కొన్ని మంచి మాటలు రాయడం నా అదృష్టం.

ఇప్పుడే వినమ్రత గురించి రాసి, వెంటనే ఆ వాక్యాలు రాయడం నాకు ఇష్టం లేదు. అంత గొప్పగా రాసారు.

నిజానికి నాకొక టెస్ట్ మోనియల్.



(డాక్టర్ పాలకుర్తి మధుసూదన రావు)


(26-12-2023)               

25, డిసెంబర్ 2023, సోమవారం

అమ్మకు డబ్బెందుకు? – భండారు శ్రీనివాసరావు

 అనసూయ, అనసూయమ్మగా రూపాంతరం చెందడానికి ఎక్కువ కాలం పట్టలేదు. పూర్వకాలం కనుక చాలా చిన్నతనంలోనే పెళ్ళిచేసి కాపురానికి పంపారు. వరసకాన్పులతో వయసుకు మించిన పెద్దరికం వచ్చిపడింది. ఆమె పేరు అనసూయకు అమ్మను చేర్చి అందరూ ఆమెను అనసూయమ్మ అనే పిలవడం మొదలెట్టారు. పెనిమిటి పోవడంతో బస్తీలో పిల్లల ఇంటికి చేరింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కొన్నాళ్ళు పెద్దవాడి దగ్గరా, మరికొన్నాళ్ళు చిన్నవాడి దగ్గరా హాయిగా కాలం వెళ్ళిపోతోంది. అనసూయమ్మ గారికేం, ఎత్తుకెత్తుగా చూసుకునే పిల్లలు, నోరు తెరిచి అడిగే పనే లేదు, కొండమీద కోతిని అయినా తెచ్చి ఇవ్వగల సమర్ధులు ఆమె పిల్లలు. కోడళ్ళు కూడా అత్తగారిని  అపురూపంగా చూసుకునేవారు.  ఇది అది అని కాకుండా దేశంలోని పుణ్యక్షేత్రాలు  అన్నీ ఓపికగా  చూపించారు. అనసూయమ్మ మరిది కొడుకు అమెరికాలో ఉంటాడు. అతడికి కూడా ఆమె అంటే ఎంతో ఆపేక్ష. ఒకసారి వీసా ఇప్పించి తన వెంట ఆ దేశం తీసుకువెళ్లి ఓ ఆరు నెలలు ఆ దేశం  అంతా తిప్పాడు. ఎక్కడో మారు మూల పల్లెటూర్లో పుట్టి, బస్సు రైలు ఎక్కడమే గగనం అనుకునే అనసూయమ్మ,  ఏకంగా విమానంలో ఫస్ట్ క్లాసులో అమెరికా వెళ్లి రావడం చుట్టపక్కాల్లో ఆమె స్థాయిని పెంచింది.

ఇంతకంటే ఒక ఆడజన్మకు ఇంకేం కావాలి అనేవారు ఇరుగింటిపొరుగింటి అమ్మలక్కలు.

వయసు మీద పడిన అనసూయమ్మ ఒకరోజు పెద్దవాడి వడిలోనే తలపెట్టుకుని అనాయాసంగా కన్ను మూసింది. ఎంత పుణ్యాత్మురాలో అని అన్ని నోళ్ళు ఆమెని కొనియాడాయి.

అయితే కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆమెకు ఒక కోరిక వుండేది. మామగారు తన కొద్ది సంపాదనలోనే కొన్ని డబ్బులు భార్యకు ఇచ్చేవాడు. పిల్లలు, మనుమలు, మనుమరాండ్రు ఇంటికి సెలవుల్లో వచ్చి తిరిగి వెడుతూ కాళ్ళకు దణ్ణం పెట్టినప్పుడు, మగడు ఇచ్చిన  డబ్బులు పావలా, అర్ధా వారిచేతిలో పెట్టేది. అప్పుడు  ఆ పిల్లల కళ్ళల్లో, అత్తగారి కళ్ళల్లో కనిపించే మెరుపును, తృప్తిని అనసూయ గమనించేది. తను పెద్ద అయినప్పుడు చిన్నపిల్లలు దగ్గరకు వస్తే, అత్తగారిలాగానే ఎంతో కొత్త మొత్తం చిన్నపిల్లల చేతిలో పెట్టాలని ఎంతోకాలంగా మనసులో గూడు కట్టుకుంటున్న ఈ చిన్న కోరిక తీరకుండానే ఆమె దాటిపోయింది.

అమ్మను దగ్గరుండి అన్నీ కనుక్కుంటున్నాం అనే భావనలో, అమ్మకు డబ్బు అవసరం ఏమిటి అనుకుంటూ ఉన్న  అనసూయమ్మ పిల్లలకు ఇంత చిన్న విషయం తట్టకపోవడం అనసూయమ్మ చేసుకున్న ఒకే ఒక దురదృష్టం.

25-12-2023       

23, డిసెంబర్ 2023, శనివారం

వ్యూహం ఫలిస్తుందా! – భండారు శ్రీనివాసరావు

 ఎవరీ పీకే

(రెండేళ్ల క్రితం ఆంధ్ర ప్రభలో ప్రచురితం)

"Larger than life, Bigger than life అని ఇంగ్లీష్ లో ఈ వాక్యాలను తెగ వాడేస్తుంటారు. వీటికి అసలు అర్ధం మారిపోయి, ఉన్న మనిషిని ఉన్నదానికన్నా పెంచి చూపించడం అనే కోణంలో ఉపయోగిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనిషిలోని గొప్పతనాన్ని మరింత పెంచి చూపించడం అంటే ఇమేజ్ బిల్డింగ్ అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ఒక స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకులు అందరూ ఈ ఇమేజ్ బిల్డింగ్ తాపత్రయంలో పడిపోతున్నారు. బహుశా ఇదంతా ప్రశాంత్ కిషోర్ (పీకే) మహిమ కాబోలు.

కొన్ని వారాల క్రితం ఒక వెబ్ ఛానల్ వాళ్ళు ఈ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడమని అడిగారు. ‘ఎవరీ పీకే? ఈయన వెనక ఎవరున్నారు?’ అనేది మొదటి ప్రశ్న.

ఆయన వెనుక ‘ఆయనే’ వున్నారు’ అనేది నా జవాబు.

ఇంకొకరు వెనక ఉండడానికి ఆయన అల్లాటప్పా రకం కాదు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి లాగా ప్రశాంత్ కిషోర్ ఖాతాలో కూడా వరస విజయాలు వున్నాయి. ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను అంచనా వేయడానికి ఈనాటి వాణిజ్య ప్రపంచంలో విజయాన్ని మించిన కొలమానం లేదు. ఆ విజేతలు పట్టింది బంగారం. చెప్పింది వేదం. వారి మాటకు ఎదురు చెప్పేవారు వుండరు. చెప్పరు కూడా. అది విజయంలో దాగున్న అసలు రహస్యం.

బీహార్ లోని రోహతాస్ జిల్లా కోనార్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కిషోర్ వైద్యుడైన తన తండ్రితోపాటు బక్సర్ కు వెళ్లి అక్కడే స్కూలు చదువు ముగించాడు. ఆరోగ్యరంగంలో ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో ఐక్యరాజ్యసమితిలో ఎనిమిదేళ్లు పనిచేసి భారత దేశానికి తిరిగివచ్చారు. అందరు నడిచేదారిలో కాకుండా రాజకీయ వ్యూహకర్తగా తన వృత్తిని ఎంచుకున్నారు.

మొదటి విజయానికి పునాది గుజరాత్ లో పడింది. ప్రస్తుత ప్రధాని 2012లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం ఎన్నికలను ఎదుర్కుంటున్న తరుణంలో పీకే తన వ్యూహ చాతుర్యాన్ని ప్రదర్శించి ఆయన గెలుపుకు కారణం అయ్యారు. తిరిగి రెండేళ్ల తరువాత 2014 లో బీజేపీ తరపున ప్రధాని అభ్యర్ధిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా పీకే ‘చాయ్ పె చర్చా’ వంటి వినూత్న కార్యక్రమాలతో దేశ ప్రజల దృష్టిలో నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేక స్థానం కల్పించడంలో విశేష కృషి చేశారు. ఆ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం, దరిమిలా ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్థిర పడడానికి, వివిధ రాష్ట్రాలలో అధికార పీఠం ఎక్కడానికి తోడ్పడింది. రెండు ఎన్నికలలో బీజేపీతో కలిసి పనిచేసిన పీకే 2015 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించారు. అంతే! అక్కడ కూడా పీకే వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అమరేంద్ర సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. తరువాత పీకే తన సొంత రాష్ట్రం అయిన బీహార్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అక్కడా ఆయనకు ఎదురు లేకుండా పోయింది.

నన్నెవ్వరాపరీవేళా’ మాదిరిగా పీకే ప్రభలు దేశ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన రెడ్డి నుంచి ఆహ్వానం అందింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎదుర్కోవడం, ఎదుర్కుని గెలవడం అనేవి జగన్ మోహన రెడ్డికి చావోరేవో అనే తరుణంలో పీకే ఆయనతో జట్టు కట్టారు. అంతవరకూ సాంప్రదాయక ప్రచార పద్ధతులకు అలవాటు పడిన రాష్ట్ర రాజకీయ నాయకులకు ఈ వ్యూహకర్తల పాత్ర ఏమిటన్నది అర్ధం కాలేదు. పైగా ఈ పీకే అనే పెద్దమనిషి ఎవరో ఏమిటో కూడా చాలామందికి తెలవదు. ఎన్నికలకు ముందు జగన్ మోహన రెడ్డి ఒక బహిరంగ సభలో ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానించి, పక్కన నిలబెట్టుకుని ఇదిగో వీరే ప్రశాంత్ కిషోర్ అని పరిచయం చేసేవరకు ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీ ఎం కె విజయానికి దోహదం చేసింది కూడా పీకే వ్యూహ చాతుర్యమే. అలాగే బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ గెలుపులో కూడా పీకే హస్తం వుంది.

అల్లాంటి పీకే మళ్ళీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఎవరీ పీకే అని ఆరాలు తీస్తున్నారు. పీకే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలుగునాట ప్రచారంలో ఉండడం ఓ కారణం.

ఒకటి మాత్రం నిజం. పీకే వల్ల అధికార పగ్గాలు చేజిక్కించుకున్నవాళ్ళు ఆ మాట ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన వల్ల పరాజయం పాలయిన వాళ్ళు మాత్రం ఏదో ఒక రోజు ఆయన సాయం తీసుకోరని అనుకోవడానికి లేదు. ఇందుకోసం క్యూలో నిలబడి వున్నా ఆశ్చర్యం లేదు.

ఎందుకంటే ఆయన పెద్ద బిజినెస్ మాన్. తను చేసిన పనికి తన ఫీజు తాను తీసుకుని కమిటెడ్ గా పనిచేస్తాడు. రిజల్ట్ చూపిస్తున్నాడు బాహుబలి రాజమౌళి లాగా. రాజకీయ పార్టీలు కూడా వ్యాపార పార్టీలే. లాభం లేదు అనుకుంటే ఒక పైసా విదల్చవు"

ముందే పేర్కొన్నట్టు ఇది రెండేళ్ల క్రితం రాసిన వ్యాసం.

అనుకున్నట్టే, ఈ ఎన్నికల వ్యూహకర్త   ప్రశాంత్ కిశోర్   ఈరోజు  విజయవాడ వెళ్లి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడిని కలిసి  మూడు గంటలకు పైగా చర్చించారని వార్తలు వచ్చాయి.

ఈ ఎన్నికల బాహుబలి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతుందా అనే విషయం తేలడానికి మరో మూడు, నాలుగు నెలలు ఆగాలి.


(ప్రశాంత్ కిశోర్) 


23-12-2023

 

20, డిసెంబర్ 2023, బుధవారం

తండ్రి స్వప్నాన్ని నెరవేర్చిన తనయుడు – భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN SAKSHI DAILY ON 20-12-2023, WEDNESDAY)  

వై.ఎస్ రాజశేఖర రెడ్డి పేదల ఆరోగ్యం గురించి ఒక బృహత్తరమైన కలకంటూ అది పూర్తిగా నెరవేరక ముందే అర్ధంతరంగా నిష్క్రమించారు. దాన్ని ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి నెరవేర్చారు.

ఇంతకీ వై.ఎస్. కన్నకల ఏమిటి?

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సామాన్య ప్రజలకోసం ఆరోగ్య శ్రీ పేరుతొ ఒక బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేశారు.  సామాన్యులకు అందని ద్రాక్షగా ఉన్న కార్పొరేట్ స్థాయి వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చిన పధకమే ఆరోగ్య శ్రీ. అందులో భాగంగానే అత్యవసర సమయాల్లో, పిలుపు అందగానే రయ్యిమని వచ్చి ప్రమాదాల్లో చిక్కుకున్నవారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలు కాపాడడానికి ఉద్దేశించిన 108 అంబులెన్స్ సర్వీసు, ప్రజల వద్దకే వెళ్లి రోగనిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన మందులు అక్కడికక్కడే ఉచితంగా ఇచ్చే 104 సర్వీసు. వీటిని వైఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తూ వచ్చి ఈ పధకాల ద్వారా ఎలాంటి పరిపూర్ణ ఫలితాలు రాబట్టాలని ఆశించారో ఆ స్వప్నం సాకారం కాకుండానే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసారు. ఆయన కన్నకలను నిజం చేసే మహత్తర అవకాశం, వైఎస్ మరణించిన పదేళ్ల తర్వాత 2019 లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ మోహన రెడ్డికి లభించింది.

ముందు వైఎస్ కన్న కల ఎలాంటిదో చెప్పుకుందాం.

రోడ్లు విశాలంగా ఆధునికంగా తయారవుతున్నప్పుడు వాటిపై ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా  పెరుగుతాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు గురయి కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతూ, అమృత ఘడియల్లో (వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్స్) అవసరమైన  వైద్యసాయానికి నోచుకోకుండా ఏటా వందల వేల సంఖ్యలో, కలిగినవారు లేనివారు అనే తేడాలేకుండా మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి వారికి ప్రాణభిక్ష పెట్టేదే 108 అంబులెన్స్ సర్వీసు. 

ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలకు మూడు మైళ్ళ దూరంలో నివసించే పేదవారికి  కార్పొరేట్ వైద్యం సంగతి సరే, సాధారణ వైద్యం కూడా అందని మావే. షుగర్ బీపీ వంటి రోగాలు వారి శరీరంలో దూరిన సంగతి కూడా వారికి తెలియదు. ఎందుకంటే వారు తమ జీవితంలో ఎన్నడూ ఆరోగ్య పరిక్షలు చేయించుకుని ఎరుగరు. అవి ముదిరి పక్షవాతం, గుండెజబ్బులకు దారితీసినప్పుడు కానీ పరిస్థితి తమ చేయిదాటి పోయిందనే ఎరుక వారికి కలగదు. ఈ నేపధ్యంలో కలిగిన ఆలోచన  104 సర్వీసు.

జబ్బులు, రోగాలు చెప్పిరావు. వచ్చిపడిన తరువాత తల తాకట్టు పెట్టయినా వైద్యం చేయించాల్సిన పరిస్థితి. చాలీచాలని ఆదాయాలతో రోజులు గడిపేవారికి ఆసుపత్రులు, ఖరీదైన  వైద్యం అంటే మాటలు కాదు. అందుకే వైఎస్, ఆరోగ్య శ్రీ అనే పధకానికి రూపకల్పన  చేసి అమల్లో పెట్టారు. గుండె జబ్బుల వంటి పెద్ద జబ్బులకు కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోగలిగే అద్భుత అవకాశం పేదప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

ఇంతటితో సరిపోలేదని వైఎస్ మరిన్ని ఆలోచనలను జత చేస్తూ ఆరోగ్యశ్రీని మరింత  మెరుగుపరచి, విస్తరించాలని తలపోశారు.

104 వాహనం ప్రతినెలా ఒక నిర్దిష్ట దినంనాడు ప్రతిగ్రామానికీ వెళ్లి బాలింతలు, చూలింతలు, వృద్ధులు, బాలబాలికలకు వైద్య పరీక్షలు చేసి తగిన మందులు ఇస్తుంది. వారి ఆరోగ్య రికార్డులను కంప్యూటర్లలో భద్రపరచి, ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ రికార్డుల ద్వారా వైద్య సాయం, చికిత్స పొందడానికి వీలైన ఏర్పాట్లు ఈ పధకంలో పొందుపరిచారు.  గర్భిణులకు  క్రమబద్ధంగా పరీక్షలు చేసి, గర్భస్త శిశువు పెరుగుదల గమనించి,  తదనుగుణంగా  వారికి  పోషకాహారం అందించడమే కాకుండా పురుడు వచ్చే రోజును నిర్ధారించి, 108 అంబులెన్స్ కు కబురుచేసి, వారికి సకాలంలో ఆసుపత్రులలో పురుడుపోసుకునే వీలుకల్పించాలని అనుకున్నారు. అలాగే ప్రసవానంతరం ఆ తల్లీ బిడ్డలను క్షేమంగా  ప్రభుత్వ  అంబులెన్స్ లోనే ఇంటికి చేర్చాలనేది కూడా వైఎస్ తలంపు.

వైఎస్ కన్నకలలో పూర్తికాని, అమలుకు నోచుకోని   ఆయన ఆలోచనలకు వైఎస్ జగన్ తన హయాంలో పూర్తి స్వరూపం కల్పించారని ఆరోగ్య శ్రీ గురించి ఆయన ఈరోజు  చేసిన ప్రకటన చెప్పకనే చెబుతోంది. వైఎస్ స్వప్నం నేరవేర్చడానికి ఆయన ప్రస్తుతం లభ్యం అవుతున్న అధునాతన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం హర్షణీయం.

విశాలమైన రహదారులు, రమ్య హర్మ్య భవనాలు అభివృద్ధికి కొలమానాలు కావచ్చు. అయితే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం  కూడా కళ్ళకు కనిపించని పురోగతే.                  

తోక టపా:

సీనియర్ జర్నలిస్ట్ దారా గోపి తన అనుభవం గురించి ఓసారి చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే:       

“రాజశేఖర్ రెడ్డి ముఖ్యంత్రిగా ఉండగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు.

చాలామంది డబ్బున్నోళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకుని వైద్యం చేయించుకుంటున్నారు.

అప్పుడు ఓ సారి ఆయన విజయవాడ వచ్చినప్పుడు నేను ఇదే ప్రస్తావన చెప్పా.

ఆయన నాకు రెండు ఉదాహరణలు చెప్పారు.

1. వరద వచ్చినప్పుడు ముందుగా చెత్తా చెదారం వస్తుంది. మంచినీళ్ళు ఆ తర్వాతే వస్తాయి. ఈ స్కీం ఇప్పుడే పెట్టాం కాబట్టి చెత్తా చెదారం ఉంటుంది.

2. నేను పేదలకు అన్నదానం అని ప్రకటించా. ఓ పెద్దాయన ప్లేట్ పట్టుకుని వరసలో నుంచుంటే, ఆ ప్లేట్ లో అన్నం పెట్టకుండా ఎలా ఉంటాను?



(20-12-2023)

 

18, డిసెంబర్ 2023, సోమవారం

రిటైర్ అయిన జర్నలిస్టులు ఏం చేయాలి? – భండారు శ్రీనివాసరావు

 


తమ అనుభవాలను డాక్యుమెంట్ చేయాలి

ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, ఈరోజు (15-12-2023) ఒక మంచి సందర్భంలో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ  కొందరు సీనియర్ జర్నలిస్ట్లులు  వెలిబుచ్చిన  అంతరంగ ఆవిష్కరణ కూడా.

వారందరికీ ఈ అవకాశం కల్పించింది, సీనియర్ పాత్రికేయులు, బహు గ్రంధకర్త అయిన శ్రీ గోవిందరాజు చక్రధర్. సందర్భం ఆయన రాసి, కూర్చి ప్రచురించిన ఐదు పదుల అక్షర యాత్ర అనే స్వీయ చిత్రావలోకనం. పదహారు పేజీల ఈ చిరుపొత్తంలో నిజానికి అక్షరాలు తక్కువ చక్కటి ఛాయా చిత్రాలు ఎక్కువ. అయిదు దశాబ్దాల పాత్రికేయ జీవన గమనాన్ని స్పర్శిస్తూ వెలువరించిన పుస్తకం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇటీవల స్వీకరించిన జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న తర్వాత తనలో పొటమరించిన ఆలోచనకు  చక్రధర్ గారు ఈవిధమైన రూపం కల్పించారు. ఆయన్ని తెలియనివారు, తెలుసుకోవాలని అనుకునేవారు ఈ పుస్తకాన్ని ఒకసారి తిరగేస్తే చాలు, నిమిషంలో ఆయన ఏమిటన్నది చదువరికి అర్ధం అవుతుంది. అందుకే ఈ ప్రయోగం అనేది చక్రధర్ ఆలోచన.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వజాతీయ మీడియా సలహాదారు శ్రీ దేవులపల్లి చేతుల మీదుగా ఈ కార్యక్రమం  జరిగింది. పాత్రికేయ ప్రముఖులు శ్రీయుతులు ఆర్వీ రామారావు, మందలపర్తి కిషోర్, వల్లీశ్వర్, తాడి ప్రకాష్, బుద్ధవరపు రామకృష్ణ,  శంకరనారాయణ, ఎమెస్కో సంపాదకులు శ్రీ చంద్రశేఖర రెడ్డి, శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర, వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి శ్రీ  కొండా లక్ష్మణ రావు, ఫేస్ బుక్ స్పెషల్ కరస్పాండెంట్  జాగర్లమూడి రామకృష్ణ, ఎస్. రాము, దుగ్గరాజు స్వాతి  ప్రభ్రుతులు ఇష్టాగోష్టిగా జరిగిన ముచ్చట్లలో పాలుపంచుకున్నారు.

సభాధ్యక్షుడు దేవులపల్లి అమర్ ప్రారంభంలోనే ముఖ్య అతిధులకు, అతిధులకు నడుమ ఉన్న విభజన రేఖను చెరిపేస్తూ తమ కుర్చీలను ఆహూతులకు దగ్గరగా జరిపించడంతో కార్యక్రమం యావత్తూ, కొందరు మాట్లాడడం అందరు వినడంలా కాకుండా అనదరూ మాట్లాడుతూ అందరూ వినే ఇన్ఫార్మల్ గెట్ టుగెదర్ గా మారిపోయింది.

ముందు చెప్పినట్టు ఫేస్ బుక్ ధర్మమా అని చాలామంది జర్నలిస్టులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను అనుదినం పోస్ట్ చేస్తూనే వున్నారు. వాళ్లకు రాయడం మాత్రమే తెలుసు. అతి కొద్ది మంది మాత్రమే వాటిని పుస్తక రూపంలోకి తేగలుగుతున్నారు. పుస్తక ప్రచురణలోని కష్ట నష్టాలు తెలిసిన చంద్రశేఖర రెడ్డి గారు తలచుకుంటే ఇదేమంత పెద్ద పని కాదు. ఆ పెద్ద మనసు వారికి ఉందనే నా నమ్మకం.

15-12-2023                

చార్లీ మైక్ రెడీ టు స్టార్ట్ - భండారు శ్రీనివాసరావు

 “నాకోసం ట్రాఫిక్ ఆపొద్దు” అంటూ తెలంగాణా కొత్త ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. గొప్ప నిర్ణయం అని సామాన్యులు చాలామంది హర్షం వెలిబుచ్చుతుంటే ఈ ముచ్చట ఎన్నాళ్ళు? బుద్ధి బుధవారం దాకా వుంటే బూరెలు వండి పెడతాను అందట ఒక ఇల్లాలు అంటూ మరికొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతంలో ఇలా ప్రకటనలు చేసి నిలబెట్టుకోలేని ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ముఖ్యమంత్రి సమయం చాలా విలువైనది,  అంచేత ఆయన రాకపోకల కోసం ట్రాఫిక్ ని కొంతసేపు నిలిపితే తప్పేమిటి అనేవారు కూడా వున్నారు.

సరే! రాజకీయాలు అన్న తర్వాత ప్రతిదీ రాజకీయమే. అంచేత వాదప్రతివాదాలు ఎలాగూ తప్పవు. వీటిని అలా వుంచి గతాన్ని గుర్తు చేసుకోవడమే వ్యాసకర్త ఉద్దేశ్యం.

సమైక్య రాష్ట్రంలో  ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట,  ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు,  గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడంతిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. నగరంలో జనాలు ఆయన కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కున్న దాఖలాలు తక్కువ.  తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీఆ మాట  నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా వెంగళరావు ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడంతిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు.

తరువాత ముఖ్యమంత్రి అయిన శ్రీ మర్రి చెన్నారెడ్డి సమయం విలువ తెలిసిన వారే అయినా సమయ పాలనకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు.  ఇంటి నుంచి సచివాలయానికీ మళ్ళీ ఇంటికీ బయలుదేరే సమయంలో భద్రతా సిబ్బంది పోలీసు కమ్యూనికేషన్ రేడియోలో చార్లీ మైక్ ( సీఎం కాన్వాయ్ కి గుప్తనామం) రెడీ టు స్టార్ట్ అని  వర్తమానం పంపేవారు. దానితో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై వాహనాల రాకపోకలు నిలిపివేసేవారు. అయితే ముఖ్యమంత్రి మంత్రులతో, అధికారులతో మాట్లాడుతూ ఉండడంతో మళ్ళీ ఆ విషయం ట్రాఫిక్ సిబ్బందికి రేడియో సెట్లలో చెప్పేవారు. దాంతో ఆపిన ట్రాఫిక్ ని వదిలేసేవారు. ఇలా చాలా సార్లు ఆపడం వదలడం ఆయన హయాములో జరుగుతూ వుండేది.  అయితే ఇలా జరుగుతున్న విషయాన్ని చెన్నారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళే ధైర్యం ఎవరికీ వుండేది కాదు.

తదుపరి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య అధికారులు చెప్పిన టైముకే లిఫ్టులో కిందికి దిగేవారు. కానీ ఆయన బలహీనత జనం. దిగి కారు దగ్గరికి వచ్చిఎక్కబోయే లోపు చుట్టూ జనం గుమికూడేవారు.  దానితో కాన్వాయ్ బయలుదేరడం ఆలస్యం అయ్యేది. ట్రాఫిక్ చిక్కులు తప్పేవి కావు. అయితే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే మూడే మూడు వాహనాలు. ముందు పైలట్ జీపు, వెనక ముఖ్యమంత్రి అంబాసిడర్ కారు, తరువాత మరో పోలీసు జీపు. అంతే! అంచేత ప్రజలకు, వాహనదారులకు కలిగే అసౌకర్యం కూడా అదే స్థాయిలో తక్కువగా వుండేది.

అంజయ్య తరువాత ముఖ్యమంత్రులు అయిన శ్రీయుతులు భవనం వెంకట్రాం, విజయ భాస్కరరెడ్డి హయాంలో  కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పరిమితంగానే ఉండేవి. శ్రీయుతులు ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కరరావు లకు కూడా పరిమిత సంఖ్యలో వాహనాలు కలిగిన  కాన్వాయ్ వుండేది.        నక్సల్  ముప్పు కారణంగా నేదురుమల్లి జనార్ధన రెడ్డి కాన్వాయ్ లో కొత్త భద్రతా వాహనాలు చేరాయి. శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బాంబు దాడి తట్టుకునే బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు వాడేవారు. తిరుమల ఘాట్ రోడ్డులో అలిపిరి వద్ద నక్సల్స్ పేల్చిన బాంబు దాడిలో ఆ వాహనం తుక్కు తుక్కు అయినా అదృష్టవశాత్తు చంద్రబాబు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. తదుపరి పోలీసు శాఖ ముఖ్యమంత్రి భద్రత కోసం యాంటీ బాంబు స్క్వాడ్ వంటి అధునాతన వాహన శ్రేణి, అంబులెన్స్ కాన్వాయ్ లో చేరాయి. రాజశేఖర రెడ్డి హయాములో భద్రతా వాహనాల సంఖ్య అలాగే వుంది. రాష్ట్ర విభజన తరువాత, అంతకు ముందు ముఖ్యమంత్రులు అయిన శ్రీ రోశయ్య, శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి ప్రభ్రుతుల కాన్వాయ్ లు మరింత మెరుగైన భద్రతా సౌకర్యాలను సమకూర్చుకున్నాయి.  ప్రజలకు అదే దామాషాలో ఇబ్బందులు పెరిగాయి. దానికి ప్రధాన కారణం నాకు అనిపిస్తోంది ఏమిటంటే సమయపాలన పట్ల సరైన శ్రద్ధ లేకపోవడం.

అనుకున్న సమయానికి బయలుదేరి అనుకున్న సమయానికి చేరగలిగే వీలుసాళ్ళు ఉన్న  వీవీఐపీలు, నిర్దేశిత సమయంలో రాకపోకలకు సిద్ధంగా వున్న పక్షంలో ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం వుంది. 

తోకటపా :

ఒక గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు డీజీపీలు ఇలా ఒకే నగరం హైదరాబాదులో వున్న రోజులు రాష్ట్ర విభజన అనంతరం అనుభవంలోకి వచ్చాయి. ఆ రోజుల్లో ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది ఆ వీవీఐపీల రాకపోకల సమయాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. వాహనదారుల్ని ఇబ్బందులు పెట్టారు. 

(16-12-2023)