“నాకోసం ట్రాఫిక్ ఆపొద్దు” అంటూ తెలంగాణా కొత్త ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. గొప్ప నిర్ణయం అని సామాన్యులు చాలామంది హర్షం వెలిబుచ్చుతుంటే ఈ ముచ్చట ఎన్నాళ్ళు? బుద్ధి బుధవారం దాకా వుంటే బూరెలు వండి పెడతాను అందట ఒక ఇల్లాలు అంటూ మరికొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతంలో ఇలా ప్రకటనలు చేసి నిలబెట్టుకోలేని ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ముఖ్యమంత్రి సమయం చాలా విలువైనది, అంచేత ఆయన రాకపోకల కోసం ట్రాఫిక్ ని కొంతసేపు నిలిపితే తప్పేమిటి అనేవారు కూడా వున్నారు.
సరే! రాజకీయాలు అన్న తర్వాత ప్రతిదీ రాజకీయమే.
అంచేత వాదప్రతివాదాలు ఎలాగూ తప్పవు. వీటిని అలా వుంచి గతాన్ని గుర్తు చేసుకోవడమే
వ్యాసకర్త ఉద్దేశ్యం.
సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు వ్యవహార శైలి చాలా విలక్షణంగా
వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట, ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి
బయలుదేరారంటే చాలు, గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని
చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు
గారికే చెల్లింది. నగరంలో జనాలు ఆయన కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కున్న
దాఖలాలు తక్కువ. తదనంతర కాలంలో ఎంతోమంది
ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ, ఆ మాట నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ
ముఖ్యమంత్రిగా కూడా వెంగళరావు ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్
పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి
రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో
జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు.
తరువాత
ముఖ్యమంత్రి అయిన శ్రీ మర్రి చెన్నారెడ్డి సమయం విలువ తెలిసిన వారే అయినా సమయ
పాలనకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు.
ఇంటి నుంచి సచివాలయానికీ మళ్ళీ ఇంటికీ బయలుదేరే సమయంలో భద్రతా సిబ్బంది
పోలీసు కమ్యూనికేషన్ రేడియోలో చార్లీ మైక్ ( సీఎం కాన్వాయ్ కి
గుప్తనామం) రెడీ టు స్టార్ట్ అని వర్తమానం
పంపేవారు. దానితో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై వాహనాల రాకపోకలు నిలిపివేసేవారు.
అయితే ముఖ్యమంత్రి మంత్రులతో, అధికారులతో మాట్లాడుతూ ఉండడంతో మళ్ళీ ఆ విషయం
ట్రాఫిక్ సిబ్బందికి రేడియో సెట్లలో చెప్పేవారు. దాంతో ఆపిన ట్రాఫిక్ ని
వదిలేసేవారు. ఇలా చాలా సార్లు ఆపడం వదలడం ఆయన హయాములో జరుగుతూ వుండేది. అయితే ఇలా జరుగుతున్న విషయాన్ని చెన్నారెడ్డి
దృష్టికి తీసుకు వెళ్ళే ధైర్యం ఎవరికీ వుండేది కాదు.
తదుపరి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య అధికారులు
చెప్పిన టైముకే లిఫ్టులో కిందికి దిగేవారు. కానీ ఆయన బలహీనత జనం. దిగి కారు
దగ్గరికి వచ్చిఎక్కబోయే లోపు చుట్టూ జనం గుమికూడేవారు. దానితో కాన్వాయ్ బయలుదేరడం ఆలస్యం అయ్యేది.
ట్రాఫిక్ చిక్కులు తప్పేవి కావు. అయితే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే మూడే
మూడు వాహనాలు. ముందు పైలట్ జీపు, వెనక ముఖ్యమంత్రి అంబాసిడర్ కారు,
తరువాత మరో పోలీసు జీపు. అంతే! అంచేత ప్రజలకు, వాహనదారులకు కలిగే అసౌకర్యం కూడా అదే స్థాయిలో
తక్కువగా వుండేది.
అంజయ్య తరువాత ముఖ్యమంత్రులు అయిన శ్రీయుతులు
భవనం వెంకట్రాం, విజయ
భాస్కరరెడ్డి హయాంలో కూడా ట్రాఫిక్
ఇబ్బందులు పరిమితంగానే ఉండేవి. శ్రీయుతులు ఎన్టీ రామారావు,
నాదెండ్ల భాస్కరరావు లకు కూడా పరిమిత సంఖ్యలో వాహనాలు కలిగిన కాన్వాయ్ వుండేది. నక్సల్
ముప్పు కారణంగా నేదురుమల్లి జనార్ధన రెడ్డి కాన్వాయ్ లో కొత్త భద్రతా
వాహనాలు చేరాయి. శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బాంబు దాడి
తట్టుకునే బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు వాడేవారు. తిరుమల ఘాట్ రోడ్డులో అలిపిరి
వద్ద నక్సల్స్ పేల్చిన బాంబు దాడిలో ఆ వాహనం తుక్కు తుక్కు అయినా అదృష్టవశాత్తు
చంద్రబాబు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. తదుపరి పోలీసు శాఖ ముఖ్యమంత్రి భద్రత కోసం
యాంటీ బాంబు స్క్వాడ్ వంటి అధునాతన వాహన శ్రేణి, అంబులెన్స్ కాన్వాయ్ లో చేరాయి.
రాజశేఖర రెడ్డి హయాములో భద్రతా వాహనాల సంఖ్య అలాగే వుంది. రాష్ట్ర విభజన తరువాత, అంతకు
ముందు ముఖ్యమంత్రులు అయిన శ్రీ రోశయ్య, శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి,
కేసీఆర్,
చంద్రబాబు, జగన్
మోహన్ రెడ్డి ప్రభ్రుతుల కాన్వాయ్ లు మరింత మెరుగైన భద్రతా సౌకర్యాలను
సమకూర్చుకున్నాయి. ప్రజలకు అదే దామాషాలో
ఇబ్బందులు పెరిగాయి. దానికి ప్రధాన కారణం నాకు అనిపిస్తోంది ఏమిటంటే సమయపాలన పట్ల
సరైన శ్రద్ధ లేకపోవడం.
అనుకున్న సమయానికి బయలుదేరి అనుకున్న సమయానికి
చేరగలిగే వీలుసాళ్ళు ఉన్న వీవీఐపీలు,
నిర్దేశిత సమయంలో రాకపోకలకు సిద్ధంగా వున్న పక్షంలో ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు
కొంతవరకు తగ్గే అవకాశం వుంది.
తోకటపా :
ఒక గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు,
ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు డీజీపీలు ఇలా ఒకే నగరం హైదరాబాదులో వున్న
రోజులు రాష్ట్ర విభజన అనంతరం అనుభవంలోకి వచ్చాయి. ఆ రోజుల్లో ట్రాఫిక్ పోలీసు
అధికారులు,
సిబ్బంది ఆ వీవీఐపీల రాకపోకల సమయాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. వాహనదారుల్ని
ఇబ్బందులు పెట్టారు.
(16-12-2023)
1 కామెంట్:
వెంగళ రావు గారి కాలం లో ఉన్న ట్రాఫిక్ కంటే ఇప్పుడు వంద రెట్లు ఎక్కువ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి