ఆయన ఐ.పి.ఎస్. అధికారి కాదు, అసలు సాధారణ పోలీసు అధికారి కూడా కాదు. అయినా ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు
శాఖలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన
చనిపోయి ఏడాది గడిచింది. ఈరోజు హైదరాబాదులో జరిగిన ఆయన ప్రధమ వర్ధంతికి గతంలో
పోలీసు డైరెక్టర్ జనరల్స్ గా పనిచేసిన
హెచ్.జే. దొరవంటి ఉన్నతాధికారులతో సహా చిన్నా
పెద్దా పోలీసు అధికారులు ఎంతో మంది హాజరై
ఆయన చిత్రపఠానికి పుష్పాంజలి ఘటించి పోలీసు శాఖకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
మా అన్నయ్య రామచంద్ర రావు గారితో
కలిసి, ఆయన కుమారుడు శంకర ప్రసాద్ ని కలవడానికి వారి ఇంటికి వెళ్ళాము. పుష్కర కాలం
క్రితం ముగిసిన నా ఉద్యోగపర్వంలో భాగంగా పరిచయం అయిన అనేకమంది రిటైర్డ్ అధికారులు, ముఖ్యంగా వరుసగా పలువురు డీజీపీ లకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన
కామేశ్వర రావు వంటి వారిని కలవగలిగాను. దశాబ్దాల తరువాత కలిసినా కూడా చాలామంది నన్ను నా పేరుతొ సహా గుర్తువుంచుకుని
పలకరించారు.
ఆయన పేరు మాదిరాజు రామకిషన్ రావు గారు. మాకు దూరపు
చుట్టం. వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయులు. ఖమ్మం జిల్లా పుట్టకోట గ్రామ వాస్తవ్యులు. పోలీసు
డైరెక్టర్ జనరల్ కు ప్రధాన న్యాయ సలహాదారుడిగా సుదీర్ఘకాలం చాలామంది పోలీసు
డైరెక్టర్ జనరల్స్ దగ్గర పనిచేసిన అనుభవం ఆయనది. వయసు రీత్యా 1999 లోనే రిటైర్ అయినప్పటికీ, ఉద్యోగబాధ్యతల్లో ఆయన చూపిన
నిబద్దత, అంకితభావం కారణంగా తరువాత అనేక సంవత్సరాలు ఉద్యోగాన్ని పొడిగిస్తూ పోయారు.
చివరికి ఆయనే 2008 లో నాకీ కొలువు చాలనుకుని స్వచ్చందంగా ఉద్యోగబాధ్యతల నుంచి తప్పుకుని
తనకిష్టమైన శృంగేరి పీఠం అప్పగించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో
మునిగిపోయారు. ఖమ్మంలో అతిపురాతన రామాలయాన్ని పునరుద్ధరించారు. ఖమ్మం సమీపంలో గోశాలతో కూడిన దేవాలయ ప్రాంగణాన్ని
నిర్మించారు. ఉత్తమ ధర్మాధికారిగా శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య నుంచి సత్కారం అందుకున్నారు.
13-12-2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి