31, అక్టోబర్ 2013, గురువారం

దిగ్భ్రాంతి ప్రకటనలు కాదు – కావాల్సింది కనికరంతో కూడిన కార్యాచరణ


బస్సు ప్రమాదంలో నలభయ్ అయిదు మంది ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దుర్ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి చేతులు దులుపుకున్నారు. పరామర్శలతో పని ముగించుకున్నారు.  తమ వారినిపోగొట్టుకుని నిండు బాధల్లో వున్న వారి బంధువులను మరిన్ని బాధలు పెట్టే చర్యలకు స్వీకారం చుట్టారు. కాలి  బూడిద కుప్పలుగా మారిన వారిని గుర్తించడం కోసం రక్త బంధువులందరూ  హైదరాబాదు నాంపల్లిలోని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పలానా సమయానికల్లా  రావాలని ఓ పత్రికా ప్రకటన చేసి వూరుకున్నారు. ఇంత కనికరం లేని అధికారులు, పాలకులు బహుశా మన దేశంలోనే వుంటారేమో. ఒక పక్క సొంత మనుషులు చనిపోయారు. ఆ బాధ ఒకటయితే సాంప్రదాయాల ప్రకారం నిర్వర్తించాల్సిన కర్మకాండల వొత్తిడి మరో పక్క.  వారిలో చాలామంది బయటి ప్రాంతాలవాళ్ళు. ఏమాత్రం బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా వారికోసం కొన్ని కనీస ఏర్పాట్లు చేసివుండేది. ఓ వంద మందికో నూటపాతిక మందికో హైదరాబాదులో ఆశ్రయం కల్పించలేని దుస్తితిలో ప్రభుత్వం వుందని అనుకోలేము. వారందరికీ ప్రభుత్వ అతిధి గృహాల్లో ఒక రోజో రెండు రోజులో వసతి  భోజన సౌకర్యాలు, లేబొరేటరీకి వెళ్ళి రావడానికి రవాణా ఏర్పాట్లు చేసివుంటే మన రాష్ట్రంలో ఒక సంక్షేమ ప్రభుత్వం పనిచేస్తోందని వాళ్లు తమ వారితో చెప్పుకునే వారు. బాధల్లో వున్నవారికి కాసింత ఆపన్న హస్తం అందించడం వల్ల సర్కారు నిధులేమీ తరిగిపోవు, కరిగిపోవు.  ‘మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం’  అని ప్రకటనలు చేయగానే సరిపోదు. ఆ చిత్తశుద్ధి ఆచరణలో కూడా కనబడాలి. ప్రభుత్వం తలచుకోవాలే కాని రక్త బంధువుల రక్త నమూనాలు వారికి ఎలాటి అసౌకర్యం లేకుండా సేకరించడం కూడా పెద్ద పనేమీ కాదు. వారి చిరునామాలు, వివరాలు అన్నీ ప్రభుత్వ అధికారుల వద్ద వున్నాయి. వాళ్ల ఇళ్లకు వెళ్ళే ఈ పని పూర్తిచేయవచ్చుకూడా.  ఇంట్లో ఓ మనిషి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో పరిస్తితి యెంత దయనీయంగా వుంటుందో అర్ధం చేసుకోవడానికి పెద్ద మేధస్సు అక్కరలేదు. అర్ధం చేసుకునే మనస్సు వుంటే చాలు. రక్త నమూనాలు ఇవ్వడానికి వచ్చినవారి కడగండ్లు టీవీల్లో చూసినప్పుడు ఇలాటి కష్టం  పగవారికి కూడా రాకూడదు అనిపించింది. కానీ సర్కారు వారికి మాత్రం  చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏం చేస్తాం. మన రాతల్ని బట్టే మన పాలకులు.
-    (31-10-2013)

పీవీ నరసింహారావు గారితో నా అనుభవం


ప్రధానిగా వున్నంతకాలం అందరూ ఆహా! ఓహో!!అన్నారు. పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. బొటాబొటి మెజారిటీ తో వున్న పాలక పక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలంఅధికార పీఠం పై వుంచిన అపర చాణక్యుడని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాత, ఆయన పదవి నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్ల తోనే తెగడడం ప్రారంభించారు. ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన వ్యక్తికి ఆయన్ని మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ పదవేసర్వస్వమయిన  కాంగ్రెస్ వారికి  ఆయన భజనేసర్వస్వమయిపోయింది. పీవీని విమర్శించిన పత్తిత్తులకుఆయన చేసిన మేళ్ళుకానరాలేదు. అయిదేళ్ళు తెలుగువాడిలోని వాడినీ వేడినీలోకానికి చాటిచెప్పిన వృద్ధ రాజకీయవేత్త న్యాయస్థానాలలో నిస్సహాయంగా బోనులోనిలబడినప్పుడు,  ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ తెలియనట్టు కళ్ళు’, ‘నోళ్ళు’  మూసుకున్నారు. ప్రధానిగా పీవీని సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు. రాజకీయాల్లో కృతజ్ఞత, ‘విధేయత’  అనే పదాలకి  తావు లేకుండాపోయిందన్న విషయాన్ని విశదం చేయడానికే ఈ ఉదాహరణ.


(పీవీతో సోనియాగాంధీ)

పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.

మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  పీవీ గారిని చూడడం వీలుపడుతుందాఅని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.


పెట్టిన తరవాత మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయోఅన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.  

30, అక్టోబర్ 2013, బుధవారం

అంజయ్య గారితో నా అనుభవాలు - చివరాఖరు భాగం


జ్ఞాపకాల తవ్వితీతలో జరిగిన ఓ పొరబాటు కారణంగా  ఓ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోకముందే ‘ఆఖరి భాగం’ రాసేశాను. మన్నించాలి.
ఆరోజు ముఖ్యమంత్రిగా అంజయ్య గారు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పగలల్లా విపరీతమనిన జనం తాకిడి. సాయంత్రానికి గ్రీన్ లాండ్స్ అతిధి గృహం చేరుకున్నారు. అప్పటివరకు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నందువల్ల గెస్ట్ హౌస్ లో దిగడం ఆనవాయితీ. సమయం గడిచిపోతోంది. అక్కడా జనమే జనం. మధ్యలో ఒకసారి వెళ్ళి ఢిల్లీ ఫోను చేసి మాట్లాడారా అని అడిగాను. ఆయనకు కూడా ఏదో పొరబాటు జరిగిందని అర్ధం అయింది. పార్టీ అధ్యక్షురాలికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పత్రికా  ప్రకటన కూడా  విడుదల చేయాలి. అప్పటివరకు చెన్నారెడ్డి గారికి పీ.ఆర్.వో. గా మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు పనిచేసేవారు. ముఖ్యమంత్రి మారగానే ఆయన తన సొంత శాఖ సమాచార శాఖకు వెళ్లిపోవాలని అనుకున్నారు. ప్రెస్ రిలీజ్ తయారు చేయడానికి ఆయన్ని రమ్మంటే  ముందు ఇష్టపడలేదు. ‘సీఎం  పేషీలో మిగిలిన అధికారుల సంగతి వేరు, పీ.ఆర్.వో.  వేరు. ఈ పోస్ట్ కు కావాల్సిన వ్యక్తిని ముఖ్యమంత్రే స్వయంగా ఎంచుకుంటారు’ అన్నది ఆయన థియరీ. ఆయన్ని తీసుకురావడానికి జ్వాలా వెళ్లాడు. మొత్తం మీద  వొప్పించి జ్వాలా ఆయన్ని తన స్కూటర్ వెనుక కూర్చోపెట్టుకుని గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ కి వెంటబెట్టుకు వచ్చాడు. కూర్చుని ప్రెస్ నోట్ రాస్తుంటే కరెంటు పోయింది. ఏం చెయ్యాలో తెలియలేదు. నేనూ జ్వాలా బయటకు పరిగెత్తి ఒక వీధి బండి మీది కిరోసిన్ దీపం పట్టుకు వచ్చాము. ఆ వెలుగు లోనే మా అన్నయ్య తన పని పూర్తి చేసాడు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే మొదటిరోజే  కరెంటు పోయినా అంజయ్య గారిలో ఏమాత్రం కోపం కానరాలేదు. అదే చెన్నారెడ్డి గారయితే ఎలక్ట్రిసిటీ బోర్డులో కనీసం  రెండు మూడు పెద్ద తలకాయలు తెగిపడేవని అక్కడి అధికారులు బహిరంగంగానే చెవులు కొరుక్కున్నారు.
దట్ ఈజ్ అంజయ్య! 

అంజయ్య గారితో నా అనుభవాలు (ఆఖరి భాగం)


అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు  ముఖ్య మంత్రి పదవికి  రాజీనామా చేసారు. మర్నాడు కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి  ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ముఖ్యమంత్రి అధికార నివాసం జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి పొద్దు బాగా  పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ లేదు.  మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి చూడు శ్రీనివాస్ ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షికను నా జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.

అంజయ్య గారితో నా అనుభవాలు - 7


ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తీసుకుని  మధ్యాహ్నం వొంటి గంటా పది నిమిషాలకు ప్రసారం అయ్యే  న్యూస్ బులెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది. అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్ లో కూర్చునే వారు.ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్ లో ఎవరికి వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీట్ కి మారిపోయారు.

సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకుపోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి ‘సీఎం గారు పిలుస్తున్నారు రండి’ అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి.
అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజాను రాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచితనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.


29, అక్టోబర్ 2013, మంగళవారం

అంజయ్య గారితో నా అనుభవాలు - 6


ఆనాడు మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆ తరువాత మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్  అనాలా?)లో  ఇంటికి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పదఅన్నారు. నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఇల్లు ఏ పరిస్తితిలో  తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో అమ్మవొడిపేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు. అలా ఆలోచించే లోపలే అక్కడినుంచి మూడో ఇల్లే మాది మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా ఇంట్లో  బాగా వెనగ్గా  వుంటుంది. గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో  ఎక్కడ గుంటవుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా  లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము. అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని  చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది. గోడకు ఆనించి  పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ  సరిపోయేలా లేవు. ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు  భవనం వెంకట్రాం కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. మిగిలినవారందరూ నిలబడేవుండాల్సిన పరిస్తితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా వున్నారు. మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరికొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు. మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్. అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాదికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ఇదేం పద్ధతిగా లేదుఅన్నాడు.
నాకు కోపం చర్రున లేచింది. ఆయన్నేమన్నా బొట్టుపెట్టి  పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది.

ఏవయినా అవి బంగారు రోజులు.                     

28, అక్టోబర్ 2013, సోమవారం

రెండే నిమిషాల్లో 'ట్రీ ప్లాంటేషన్'

మొక్కలు నాటడాన్ని ట్రీ ప్లాంటేషన్ అని యెందుకు అంటారో తెలియదు కాని ఈ రెండు నిమిషాల నిడివి కలిగిన షార్ట్ ఫిలిం చూస్తే తెలుస్తుంది.


కోపం


చిన్నప్పటి నుంచే నాకు ముక్కు మీద కోపం. ‘కోపం వచ్చినప్పుడు వంద వొంట్లు చదవరా తగ్గిపోతుంది’ అని మా బామ్మ ఒకటే పోరుపెట్టేది. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు అది తీర్చుకోవాలని అనుకుంటారు కానీ వొంట్లు, ఎక్కాలు లెక్కబెడుతూ కూర్చుంటారా ఎవ్వరయినా. అందులో కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా బోటివారు. కోపంలో నన్ను మించిన వాడు లేడు అని ఇన్నాళ్ళుగా అనుకుంటూ వచ్చిన నేను రంగనాధం కధ వినగానే నేనెంత శాంత మూర్తినో అర్ధం అయింది.    
రంగనాధం నాకు బాగా తెలిసిన వాడే. కోపిష్టి వాడే. సందేహం లేదు. కానీ మరీ ఇంతా. ఛా ఛా!. అతడి  సంగతి విన్నప్పుడు  కోపం యెంత అనర్ధ కారణమో లక్షా ముప్పయ్ ఒకటో సారి తెలిసివచ్చింది. ఇంతకీ జరిగిన విషయం ఏమిటంటే-
అతడో ఆదివారం నాడు ఇంటి ముందు కారాపుకుని దాన్ని కడిగే పని పెట్టుకున్నాడు. పనిలో పనిగా కారుకు చిన్న చిన్న రిపేర్లు చేయడం కూడా అతడికో హాబీ. రెంచీలు గట్రా  దగ్గర పెట్టుకుని ఏదో పనిచేసుకుంటూ వుంటే అతగాడి ఏకైక ముద్దుల కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి పనిలో నిండా మునిగివున్నప్పుడు ఆ పిల్లవాడు ఓ స్క్రూ డ్రైవర్ తీసుకుని కారు డోరు మీద గీయడం మొదలు పెట్టాడు. అది చూసిన రంగానాధానికి చర్రున కోపం వచ్చింది. అదీ వొళ్ళూ పై తెలియని కోపం. చేతిలో వున్న రెంచ్ తీసుకుని పిల్లవాడి చేతిపైన గట్టిగా కొట్టాడు. యెంత గట్టిగా అంటే ఆ కోపంలో అతడికి తాను పిల్లవాడి చేతి వేళ్ళపై కొడుతున్నది ఇనుప రెంచీతో  అన్న సోయలేదు. ఫలితం పిల్లాడి వేళ్ళు చితికి పోయాయి. రక్తం బొటబొటా కారసాగింది. అతడి ఏడుపుకు ఇంటిల్లిపాదీ అక్కడికి చేరారు. జరిగిన ఘోరం చూసి నిర్ఘాంత పోయారు. అప్పుడు కానీ తాను చేసినదేమిటో రంగనాధానికి తెలిసిరాలేదు. కానీ ఏం లాభం. ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఒక వేలు పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పి తీసేసారు. ఆ సాయంత్రం అంతా ఇంటికి వచ్చారు. రంగానాధానికి తలకొట్టేసినట్టుగా వుంది. తన కోపం మీద తనకే పిచ్చి కోపం వచ్చింది. దీనికంతటికీ కారణమైన కారు  ఇంటి ముందు  అలాగే వుంది. కొడుకుని  కొట్టిన రెంచీ చేతిలోకి తీసుకుని దూరంగా విసిరివేయబోతుంటే  కారు డోరు మీద అడ్డదిడ్డంగా రాసిన  అక్షరాలు కనిపించాయి.
“ మా నాన్నంటే నాకిష్టం”

ఆ రోజు ఉదయం స్క్రూ డ్రైవరుతో రంగనాధం కొడుకు  గీసిన  అక్షరాలవి.
(పుస్తక ప్రియులు దేవినేని మధుసూదనరావు గారు పంపిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం) 

అంజయ్య గారితో నా అనుభవాలు – 5



ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికి కానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో అమ్మ అమ్మఅంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.



ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. వెడుదుగానిలే! కాసేపు కూర్చో!అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.

నేనెందుకు పత్రికల్లో రాయడం లేదు?


నా బ్లాగులో రాసేవాటిని చదివే పాఠకులు చాలామంది మీరు యెందుకు పత్రికల్లో రాయరు? అని ఈ మెయిల్స్ పంపుతుంటారు. దానికి కారణం నా వయస్సే. ఓ పదేళ్లు పెద్దవాడిని అయినా లేదా ఓ పదేళ్లు చిన్నవాడిని అయినా నాకు ఈ సమస్య వచ్చి వుండేది కాదేమో. ఈనాడు పత్రికలకు ఎడిటర్లుగా వుంటున్నవారు చాలామంది నాకన్నా ‘వయస్సులో’ చిన్నవాళ్ళు. అలా అని మరీ చిన్నవాళ్ళేమీ కాదు. అంచేత రాయమని వాళ్లు నన్ను అడగలేరు. రాస్తానని నేను వాళ్ళతో చెప్పలేను. జర్నలిష్టులనే వాళ్లకి ఏమున్నా లేకపోయినా ఈ ‘గోరోజనానికి’ మాత్రం ఏం తక్కువ వుండదు. ప్రత్యేకించి నాలాటి వాళ్లకు. కొన్నాళ్ళు ఓ దినపత్రిక వాళ్లు వారం వారం వెంటబడి మరీ అడిగి రాయించుకున్నారు. రాయడం తప్ప ‘ఇచ్చిపుచ్చుకునే’ వొప్పందం ఏమీ లేదు. పైగా రాసిన దానికి ఇంత అని లెక్క కట్టి టీసుకుంటే ఆ రచనకు విలువ అంతటితో సరి – అమరావతి లింగం మీద మేకు కొట్టినట్టే – అని  నమ్మేవాడిని నేను. కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఓసారి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాసిన ఓ  వ్యాఖ్య వారి యజమానికి నచ్చలేదు. ‘అందువల్ల వేయడం లేదు’ అని ఫోను చేసి మరీ  చెప్పారు. ‘అంచేతే నేనూ  ఇకనుంచి  మీకు రాయను గాక రాయను’  అని చెప్పేశాను. ఆ తరువాత ఎన్నిసార్లు అడిగినా నా పాలసీ అదే. దాంతో వాళ్లు కూడా అడగడం మానుకున్నారు. నిజానికి మార్కెట్లో రాసేవాళ్ళ కొరత ఏమీ లేదు కదా!
పోతే ఈ ఉపోద్ఘాతానికి కారణం లేకపోలేదు. మీ అందరి అభిమానం వల్ల నా బ్లాగు వీక్షకుల సంఖ్య నేటికి రెండు లక్షలు దాటింది. పత్రికలమీద ఆధారపడే పనేవుంది చెప్పండి.

నిజంగా నేనిప్పుడు అక్షరాలా  ‘లక్షాధికారి’ని.’ నన్ను ఇలా ఇన్ని  లక్షలకు అధిపతిని చేసిన అందరికీ మరోమారు మనః పూర్వక కృతజ్ఞతలు.


 భండారు శ్రీనివాసరావు
 (28-10-2013)

   


27, అక్టోబర్ 2013, ఆదివారం

అంజయ్య గారితో నా అనుభవాలు - 4


ముప్పయ్యేళ్ళ కిందటి మాట.
ముఖ్యమంత్రిగా వున్న మర్రి చెన్నారెడ్డిని మార్చి ఆయన స్తానంలో టి.అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అంజయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో అనేకమందికి ఇష్టం లేదు. అయినా వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని అధిష్టానం తన ఇష్ట ప్రకారమే నడుచుకుంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి వుంటుంది కనుక. ఆ మాటకు వస్తే అధిష్టానానికి సంబంధించినంతవరకు  కాంగ్రెస్ లో ఈ నాటికీ అదే పరిస్తితి.

అంజయ్య పాలన తొలిదినాల్లోనే అసమ్మతి సెగలు బయలుదేరాయి. ఈ సంగతి  ఆ నోటా ఈ నోటా పడి చివరకు అధినేత్రి చెవుల్లో పడింది. అసమ్మతిని మొగ్గలోనే  తుంచేయాలని భావించిన  ఇందిరా గాంధి వున్నపాటున హైదరాబాద్ వచ్చారు. సంప్రదాయానికి భిన్నంగా, పార్టీ లెజిస్లేటర్ల సమావేశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి అధికార నివాసం జయ ప్రజాభవన్ (గ్రీన్ లాండ్స్ అతిధి గృహం) లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్  అతిరధులంతా ఆ సమావేశానికి హాజరయ్యారు. అంజయ్యకు అధిష్టానం అండగా వుందన్న సంకేతాన్ని ఆ విధంగా పార్టీ శ్రేణులకు శ్రీమతి గాంధి అందించారు. అంతే! కొన్నేళ్లవరకు అసమ్మతివాదులు కుయ్ కయ్ అంటే వొట్టు.    

అంజయ్య గారితో నా అనుభవాలు - 3


ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.


(కీర్తిశేషులు శ్రీ టంగుటూరి అంజయ్య)

ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. (ఇప్పటిమాదిరిగా ఇన్ని టీవీలూ, టీవీ స్క్రోలింగులు లేవు. వార్త తెలుసుకోవాలంటే రోజుకు మూడుసార్లు వచ్చే రేడియో వార్తలు కానీ, లేదా ఉదయం వెలువడే పత్రికలు కానీ ఆధారం ఆరోజుల్లో) కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి- ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది - మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి - ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను. అందులో జరిగిన పొరబాటు ఏమిటంటే అరవై మంది మంత్రుల రాజీనామా అని రేడియోలో చెప్పేసాం. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గ సభ్యుల సంఖ్య అరవై. సాయంత్రం వార్తల్లో తప్పు దిద్దుకుని చెంపలేసుకున్నాను.   

ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే - విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.

26, అక్టోబర్ 2013, శనివారం

ఇదీ జర్నలిజం

మొన్నో రోజు ఒకతను ఫోను చేసాడు. ఒక ప్రముఖ పత్రిక విలేఖరిగా (మామూలుగా అయితే విలేకరి- వొత్తు ‘ఖ’ కాదు) పరిచయం చేసుకున్నాడు. ఆకాశవాణి తెలుగు వార్తలు ప్రారంభించి అక్షరాలా డెబ్బయ్ అయిదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంటర్వ్యూ చేయాలని కోరాడు. సరే అన్నాను. 'నన్ను వెతుక్కుంటూ రానక్కరలేదు మీ ఈ మెయిల్ అడ్రసు ఇవ్వండి నాకు తెలిసిన సమాచారం నేనే పోస్ట్ చేస్తాన'ని చెప్పాను. మరునాడు నాకు కుదరలేదు. బాగా దగ్గర చుట్టం చనిపోయి పన్నెండో రోజు . పోవాల్సిన పరిస్తితి. అయినా ఇచ్చిన మాట జ్ఞాపకం వుంది. అందుకే ఫోను చేసి చెప్పాను 'మరునాడు పంపుతాన'ని. అతను సరే అన్నాడు. ఆరోజు రాత్రి చాలా సమాచారం సేకరించి పెట్టుకున్నాను. ఆలిండియా రేడియోకు ‘ఆకాశవాణి’ అనే పేరు సూచించింది ఎవరు? ఇలాటి ఆసక్తికరమైన వివరాలు. రేడియోలో మూడు దశాబ్దాలు పనిచేసిన అనుభవం నా చేత ఆ పని చేయించింది. మొన్న  బుధవారం మొత్తం జడివాన. నెట్ కనెక్షన్ పనిచేయలేదు. వెంటనే అతడికి ఎస్.ఎం.ఎస్. ఇచ్చాను. మరునాడు  ఉదయం టీవీ ఛానల్ డిస్కషన్ కు వెడుతూ కూడా మరిచిపోకుండా మరో ఎస్.ఎం.ఎస్. పంపాను. 'ఇంటికి వెళ్ళగానే ఆ పనిచూస్తానని. వీలుంటే ఫోను చేయమని'.  అతడూ వెంటనే జవాబిచ్చాడు. పదిగంటలకల్లా ఫోను చేస్తానని. ఇంటికి రాగానే నెట్ ఓపెన్ చేసి అతడికి వివరాలు పంపే పనిపెట్టుకున్నాను. బోలెడు వివరాలాయే. పదయింది. పదిన్నరయింది. పదకొండు దాటిన  తరువాత ఫోను. నేను అప్పటికి ఇంకా ఆ పని ముగింపులో వున్నాను. అతడు లైన్లోకి వచ్చాడు. ‘ఇప్పటికే చాలా సమాచారం సేకరించాను. అది చాలు...’అని ఏదో చెప్పబోయాడు. ఈ మాత్రం దానికి నన్ను ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు? బహుశా కుర్ర రిపోర్టర్ అయివుంటాడు. అరవై ఎనిమిదేళ్ళ వయస్సున్న నాతొ ఇలా వ్యవహరించడం ఏం భావ్యంగా వుంటుంది? నేనేమన్నా అతడి వెంటబడి అడిగానా? అతడే నన్ను సంప్రదించాడు. పలానా విషయం మీద వివరాలు చెప్పమని కోరాడు. చివరికి ఇలా చేసాడు? అతడి పైఅధికారులకు ఈ విషయం తెలుసో లేదో తెలియదు. నాకు తెలిసినదల్లా నన్ను ఇలా ఇబ్బంది  పెట్టే  హక్కు అతడికి ఏమాత్రం లేదనే. పెద్దవాడిని కనుక అతడి పేరు వివరాలు బయట పెట్టడం లేదు. కానీ భవిష్యత్తులో అతడు ఇలా ఎవరితో కూడా ఇలా వ్యవహరించాకూడదనే ఉద్దేశ్యంతో ఇది రాస్తున్నాను.                     

అంజయ్యగారితో నా అనుభవాలు - 2



ఎనభయ్యవ దశకంలో కౌలాలంపూర్ లో ప్రపంచ తెలుగు  మహాసభలు జరిగాయి. ముఖ్యమంత్రిని ఆ సభల ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఆహ్వానించారు. కారణాలు ఏమైతేనేం కాంగ్రెస్ అధిస్థానం అంజయ్య గారిపై కినుకతో వున్నరోజులు.  ఆయన్ని ఆ సభల ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఆహ్వానించారు.  ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి చూసావా!అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.


(అంజయ్యగారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న దృశ్యం. ఆయన వెనుక గడ్డం మీద చేయి ఆనించుకుని నేను) 



కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి రాజకీయ జ్వరంపట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం. (13-09-2010)

25, అక్టోబర్ 2013, శుక్రవారం

అంజయ్య గారితో నా అనుభవాలు

రాజీవ్ గాంధీ - అంజయ్య గురించి రాసిన తరువాత అనేకమంది అంజయ్య గారి గురించి రాయమని కోరారు. లోగడ రేడియో అనుభవాల్లో అనేక సందర్భాల్లో అంజయ్య గారి గురించి ప్రస్తావన వుంది. వాటిని కాస్త కుదించి, అంజయ్య గారికి మాత్రమే పరిమితం చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. పునరుక్తి దోషం అని ఎవరికయినా అనిపిస్తే మన్నించండి. 


(ఏదో సినిమాలో రాళ్ళపల్లి చెప్పినట్టు టేప్ రికార్డర్ పట్టుకుని ఈ పక్కన నేను, ఆ పక్కన అంజయ్య గారు. మా మధ్యలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ చైర్మన్  శ్రీ వై.వి.ఎస్. మూర్తి)

ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు.  అమ్మ   (శ్రీమతి ఇందిరాగాంధి)  కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు.  ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేది. అంజయ్య గారు  ముందు సీటు ఎంపిక చేసుకోవడానికి నాకు మరో కోణం కనిపించేది.  ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ.  లైఫ్ బాయ్ ఎక్కడవుంటే  ఆరోగ్యం అక్కడ వుంటుంది’  అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం.  బాత్రూంబెడ్ రూముల్లో  కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.

ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ  కారుకు  యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం  పూర్తిగా మారిపోయింది. మంత్రులుముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా  యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు అభివాదం చెయ్యడానికీరెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం  మరో కారణం.

రాజీవ్ గాంధీ – రాహుల్ గాంధీ – కొన్ని దోమలు


మధ్య ప్రదేశ్ లో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ‘తనని పాతికవేల దోమలు కుట్టాయని చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. ఇది చదివినప్పుడు హైదరాబాదులో ఆయన తండ్రి రాజీవ్ గాంధీ దోమలతో తిప్పలు పడ్డ సందర్భం జ్ఞాపకం వచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ కు అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధి తనయుడు పైలట్ గా పనిచేస్తున్నారు. ఓ రోజు ముఖ్యమంత్రిగారు సచివాలయంలో నలుగురితో మాటా మంతీ సాగిస్తున్న సమయంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. ఆయన తత్తరపడుతూ లేచి వున్నపాటున బరకత్ పురాలో వున్న తన ఇంటికి బయలుదేరారు. అప్పటికి అంజయ్య గారు అధికార నివాసం గ్రీన్ లాండ్స్ (ముద్దుగా ఆయన పెట్టుకున్న పేరు ‘జయ ప్రజా భవన్) కి మకాం మార్చలేదు. బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇంట్లోనే వుంటున్నారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు.
సరే! అంజయ్య గారు హడావిడి పడుతూ ఇంటికి వెళ్ళి ఆయాసపడుతూ మెట్లెక్కినప్పుడు కనబడ్డ దృశ్యం ఈనాటి ఛానళ్ళకు దొరికివుంటే పండగే పండగ. రాజీవ్ గాంధీ అక్కడి చిన్న గదిలో అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని తనను పీక్కుతింటున్న దోమల్ని తోలుకునే పనిలో నిండా మునిగి తేలుతున్నాడు. అసలే పండంటి మనిషి. లేత శరీరం. ఆయన మొహం మీద దోమ కాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అసలు జరిగిన విషయం ఏమిటంటే – రాజీవ్ గాంధీ పైలట్ గా హైదరాబాదు వచ్చిన విమానం, తిరిగి వెళ్ళడానికి బాగా వ్యవధానం వున్నట్టుంది. యెందుకు అనిపించిందో తెలియదు కాని, ఆయన బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఎవర్నో అడిగి ఓ కారు తీసుకుని నేరుగా బరకత్ పురాలోని అంజయ్య గారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ కబురు అంది, ముఖ్యమంత్రిగారు ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చేసరికి ఇదీ సీను.
'అమ్మ ఇచ్చిన ఉద్యోగం' ఇది అని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిగా  అంజయ్య గారు ఏనాడు నామోషీ పడలేదు. పైగా కూసింత గర్వంగా చెప్పుకునేవారు. రాజీవ్ గాంధీ ఆయన ఇంటిని చూసి వాళ్ల అమ్మ సెలెక్షన్ మంచిదే అనుకుని కూడా వుంటారు. కాకపొతే పేరడీ ఏమిటంటే అంజయ్య గారి ముఖ్యమంత్రి పదవి వూడడానికి కూడా తదనంతర కాలంలో రాజీవ్ గాంధీయే కారణం అయ్యారు.
పోతే! పైకి చెప్పకపోయినా ఇది చదివే వారికి ఓ  సందేహం తొలుస్తుండవచ్చు. ఇదంతా మీకెలా తెలుసనీ. మీలో కొందరికి తెలియని విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో నేను  రేడియో రిపోర్టర్ గా వుండేవాడిని. కారణం చెప్పలేను కాని ఆయనకు నేనంటే అవ్యాజానురాగం. నేను కాసేపు దగ్గర్లో కనబడకపోతే చాలు  అంజయ్య గారికి క్షణం తోచేది కాదు. ‘శ్రీనివాస్ ఏడీ’ అని సొంత సిబ్బందిని ఆరా తీయడం ఆయనకు అలవాటు. అంచేత ఆరోజు నేను కూడా అంజయ్య గారి వెంటే వున్నాను. అదన్న మాట. (25-10-2013)
 

22, అక్టోబర్ 2013, మంగళవారం

రెండే రెండు ప్రశ్నలు. కానీ జవాబు చెప్పేముందు రెండు నిమిషాలు ఆలోచించండి


మొదటి ప్రశ్న :
ఆవిడ కడుపుతోవుంది. అప్పటికే ఆమెకు ఎనిమిదిమంది సంతానం. వారిలో ఇద్దరు చెవిటి పిల్లలు. ఇద్దరు పుట్టు గుడ్డివారు. ఒక పిల్లవాడికి మానసికంగా ఎదుగుగుదల లేదు. మొగుడివల్ల అధిక సంతానం ఒక్కటే కాదు దిక్కుమాలిన లైంగిక వ్యాధులు కూడా సంక్రమించాయి. ఈ పరిస్థితుల్లో ఆవిడకు మీరు యేమని సలహా ఇస్తారు? ఇక కన్నది చాలు, గర్భస్రావం చేయించుకోమని చెబుతారా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి రెండో ప్రశ్న కూడా ఏమిటో కూడా గమనించండి.
అదే ఇది :
ఒక ప్రపంచ స్తాయి నాయకుడిని ఎన్నిక చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ముగ్గురు అభ్యర్ధులు పోటీలో వున్నారు. మీ ఒక్క వోటుతోనే వారి భవితవ్యం తేలుతుంది. అంటే మీ వోటే నిర్ణయాత్మకం అన్నమాట.
ఆ ముగ్గురి గుణగణాలు ఇలా వున్నాయి.
మొదటివాడు పక్కా  తాగుబోతు. రోజుకు కనీసం పది పెగ్గులు పట్టించనిదే నిద్రపోడు. పైగా తిరుగుబోతు కూడా. ఇవి చాలవన్నట్టు  ఇద్దరు ఉంపుడుగత్తెలు. ఒకదానివెంట మరో చుట్ట  వెలిగించడమే కాని ఆర్పడం తెలియదు.
ఇక రెండో అభ్యర్ధి సంగతి ఇంకా ఘోరం. అప్పటికే రెండు సార్లు ఉద్యోగం నుంచి ఉద్వాసన చెప్పారు. అర్ధరాత్రిదాకా మేలుకుంటాడు. మధ్యాహ్నం బారెడు పొద్దెక్కిన దాకా మంచం దిగే అలవాటు లేదు. కాలేజీ రోజుల్లోనే నల్లమందుకు బానిస. ఇక సాయంత్రం  అయ్యిందంటే చాలు దేవదాసు అవతారం ఎత్తినట్టే లెక్క.
పోతే మూడో అభ్యర్ధి వున్నాడే బహు బుద్దిమంతుడు.
వీర సైనికుడు. అనేక యుద్ధాల్లో పాల్గొని అనేకానేక పతకాలు సంపాదించుకున్నాడు. పచ్చి శాకాహారి. మాంసం ముట్టడు. పొగ తాగడు. కాకపొతే మద్యం అప్పుడప్పుడు  పుచ్చుకుంటాడు. కానీ చాలా  మితంగా.  అదీ  తక్కువ మైకం కలిగించే బీరు వంటి  వాటినే. కట్టుకున్న భార్యను మోసం చేయాలని కలలో కూడా అనుకోని అపర శ్రీరామచంద్రుడు. పరస్త్రీలను పొరబాటున కూడా కన్నెత్తి చూడడు.
ఇదీ ఈ ముగ్గురి సంక్షిప్త జీవిత చరిత్ర.
ఇప్పుడు వాళ్ళలో ఒక్కడ్ని ప్రపంచ స్తాయి నాయకుడిగా ఎన్నుకోవాల్సిన  చారిత్రాత్మక బాధ్యత మీ భుజస్కంధాలపై పడింది. ముందే చెప్పినట్టు మీ ఒక్క వోటే కీలకం. మీరు వోటు వేసినవాడే ఎన్నికవుతాడు. ఈ విషయం గమనంలో పెట్టుకుని రెండో ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేసుకుంటారు.
జవాబు దొరికితే మంచిదే. లేకపోతే కింద చూడండి.
మొదటి ప్రశ్నకు మీ జవాబు ‘అవును’ అయితే, అంటే ఆ గర్భవతికి గర్భస్రావం చేయించడం మంచిదని మీరు అనుకుని వుంటే –
అలాటి నిర్ణయం వల్ల ఒక మంచి సంగీతకారుడు ఈ ప్రపంచానికి  దక్కకుండా పోయేవాడు. బీతోవెన్ అనే ప్రపంచ ప్రసిద్ది చెందిన సంగీతకారుడు అప్పుడు ఆమెకు తొమ్మిదో సంతానంగా  జన్మించాడు.
అలాగే రెండో ప్రశ్నకు జవాబు చెబుతూ తాగుబోతు, తిరుగుబోతు అని మొదటి ఇద్దర్నీ మీరు తిరస్కరించివుంటే ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్, విన్ స్టన్ చర్చిల్ వంటి రాజకీయ దురంధరులను మీరు పక్కనబెట్టినట్టు అయ్యేది. ఇక రాముడు మంచి బాలుడు వంటి లక్షణాలు కలిగిన మూడో అభ్యర్ధి అందరికీ తెలిసినవాడే. ఆడాల్ఫ్ హిట్లర్
కాబట్టి నీతి ఏమిటంటే పైకి కనబడే లక్షణాలు చూసి మనుషుల మంచి చెడ్డలు గురించి వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు అని.

(ఒక ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)

21, అక్టోబర్ 2013, సోమవారం

జస్ట్ ఫర్ ఫన్


(నెట్లో ఇంగ్లీషులో చదివిన జోకు)
ఈమధ్య ఓ సర్వేలో మూడు ప్రశ్నలు అడిగితే ఒకతను రాసిన సమాధానాలు గమ్మత్తుగా అనిపించాయి.
మొదటి ప్రశ్న : వచ్చే ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని భావిస్తున్నారు?
జవాబు : చంద్రబాబు నాయుడు
రెండో ప్రశ్న: 2014 ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు?
జవాబు : లోక్ సత్తా పార్టీ
మూడో ప్రశ్న: మన రాష్ట్రం పరిస్తితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణం ఏవనుకుంటున్నారు?
జవాబు: పై విధంగా జనాలు ఆలోచిస్తూవుండడం వల్ల.

        

స్పోర్టివ్ గా తీసుకుందాం


విజయాన్ని అస్వాదించినట్టుగా వోటమిని జీర్ణించుకోలేం.  పైకి  వొప్పుకున్నా వొప్పుకోలేకపోయినా ఇది  మనుషుల్లోని బలహీనత.
మొన్నో క్రికెట్ మ్యాచ్ లో మన ఆటగాడు ఒకడు ఒక్క వోవర్లో ముప్పయి పరుగులు ఇస్తే అతడిని దుమ్మెత్తి పోశారు. ఆట కీలకదశలో వున్నప్పుడు, పైగా విజయం అతి చేరువలో వున్నప్పుడు ఆ సంతోషాన్ని దూరం చేసిన ఈరకం బాధ్యతారాహిత్యాన్ని ఎవ్వరు సమర్ధించరు. కానీ అదే పాత్రలు తారుమారై మన బ్యాట్స్ మన్ కు ప్రత్యర్ధి బౌలర్ ఇలానే పరుగుల దక్షిణ సమర్పించుకుంటే ఆ ఆటను మనం యెలా ఎంజాయ్ చేసివుండేవాళ్ళమో ఒక్కసారి వూహించుకుంటే మన ఆలోచనల్లో, అంచనాల్లో వున్న లొసుగు అర్ధం అవుతుంది.
నిజానికి నాకు క్రికెట్ గురించి తెలిసింది తక్కువ. ఇక ఆటగాళ్లను గురించి వ్యాఖ్యానించే అర్హత నాకుందని అనుకోను. టీవీల్లో క్రికెట్ వస్తున్నప్పుడు ఆ ఆటను చూసి ఆనందించడం ఒక్కటే తెలుసు. అదొక ఆటనీ, ఎవరు యెంత బాగా ఆడినా ఒక్క జట్టే గెలుస్తుందనీ, మొన్న ఆడిన ఆటే ఫైనల్ కాదనీ, ఇంకా తుది గెలుపుకు అవకాశాలు మిగిలేవున్నాయనీ తెలుసు. ఒక్క రోజు ఆట తీరును బట్టి ఆ ఆటగాడి ప్రతిభను అంచనా వేయడం తగదన్నది నా అభిప్రాయం. కాకపోతే ‘మ్యాచ్ ఫిక్సింగులు’ ‘డబ్బు ప్రభావాలు’ వంటి మాటలు వినబడుతున్న నేపధ్యంలో ఎవరయినా ఆటగాడు ఇటువంటి పొరబాట్లు అనాలోచితంగా చేసినా అనుమానించే పరిస్తితుల మధ్య జీవిస్తున్నాం కాబట్టి ఆటగాళ్ళు ఇలాటి విషయాల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం వుందని కూడా వొప్పుకుంటునాను.
‘క్రీడాస్పూర్తి’ అనే మాటను అందరం తరచూ వాడుతుంటాం. దాన్ని ఆచరణలో కూడా చూపించినప్పుడే ఆమాటకు అర్ధం వుంటుంది.

జస్ట్ టేకిట్ స్పోర్టివ్ ప్లీజ్.              

18, అక్టోబర్ 2013, శుక్రవారం

రావూరి భరద్వాజ గారు ఇక లేరు



జ్ఞానపీఠం అవార్డ్ గ్రహీత రావూరి భరద్వాజ గారు హైదరాబాదులో స్వల్ప అస్వస్థత అనంతరం కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.  సమయాభావంవల్ల  - ఆయనకు జ్ఞానపీఠం  అవార్డ్ వచ్చిన సందర్భంలో రాసిన ఈ చిన్ని రచనను ఆయనకు నివాళిగా అర్పిస్తున్నాను     

రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. రేడియోలో పనిచేస్తున్నప్పుడు విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను. మా గురువుగారికి మనఃపూర్వక అభినందనలు - భండారు శ్రీనివాసరావు  


(కీర్తిశేషులు రావూరి భరద్వాజ)

జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
మరో చిన్న జ్ఞాపకం: 
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - తెలుగు అనువాదం : రావూరు భరద్వాజ 
జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయిన రావూరు భరద్వాజ (పూర్వాశ్రమంలో రావూరు శరభాచారి) గురించి 
మరో చిన్న జ్ఞాపకం: 
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - తెలుగు అనువాదం : రావూరు భరద్వాజ 

ఈ పుస్తకం వెనుక చిన్న కధ చెప్పుకోవడం నాకు తెలుసు. రాజకీయ నాయకుల్లో నెహ్రూ ఒక్కరినే అమితంగా అభిమానించే సుప్రసిద్ధ జర్నలిస్టు కేయే అబ్బాస్, నెహ్రూ అనంతరం ఆయన బిడ్డ ఇందిర ప్రధాని కాగానే 'Return of the RED ROSE' అనే పేరుతొ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని 'మొగ్గ తొడిగిన ఎర్రగులాబి' పేరుతొ శ్రీ రావూరి భరద్వాజ తెలుగులోకి అనువదించారు. శ్రీమతి గాంధి హైదరాబాదు వచ్చినప్పుడు, అప్పుడు రేడియోలో పనిచేస్తున్న భరద్వాజ గారే స్వయంగా తాను అనువదించిన ఈ పుస్తకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీకి బహుకరించారు. ఆవిడ అంతకుముందు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా వున్నప్పుడు రేడియోలో (అప్పటికి దూరదర్శన్ లేదు) పనిచేస్తున్న స్టాఫ్ ఆర్టిస్టుల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలతో సమానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న భరద్వాజ గారు ఆమె చేసిన ఈ మేలుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ పుస్తకాన్ని ఆమెకు అందచేసారు.
మొగ్గతొడిగిన ఎర్రగులాబి - కె.ఎ.అబ్బాస్‌
వెల: 100 రూపాయలు
తెలుగు అనువాదం : రావూరి భరద్వాజ
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
(
భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ క్రమానుగతంగా వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి, ఆయా సందర్భాలలో శ్రీమతి ఇందిరాగాంధీని ప్రభావితం చేసిన సంఘటనలు, ఆమెను తీర్చిదిద్ది వ్యక్తిత్వాన్ని రూపొందింపజేసిన సంఘటనలూ తీసుకొని ఆమెను ఇందులో పరిచయం చేయడం జరిగింది- ప్రకాశకులు)