అదృష్టరేఖ అంటుంటారు. అదేదో నాకు జెర్రిపోతు మందాన
వున్నట్టుంది.
పొద్దున్న ఓ చానెల్ చర్చకు వెళ్ళి ఇంటికివచ్చి
పడుకుంటే మాగన్నుగా నిద్రపట్టింది. ఈ అరవై ఎనిమిదేళ్ళ వయస్సులో ఈ ప్రభాత భేరీలు
యెందుకంటూ మా ఆవిడ సన్నాయి నొక్కులు. కానీ చాపల్యం అలాటిది మరి. అది ఆవిడకు అర్ధం కాదులే అని నేనే పెద్దమనసు
చేసుకుని ఆవిడను అర్ధం చేసుకుంటూ వుంటాను.
ఇంతలో ఫోను గణగణ. ఆ చప్పుడు విని ఎన్నాళ్ళు
అయిందో అనిపించింది. ఎందుకంటే అది లాండ్ లైన్. ఇంట్లో ఒక అలంకార వస్తువుగా అలా
మన్నుతిన్న పాములా పడి వుంటుంది. ఒకప్పుడు దాని వైభోగం యెలా వుండేదో చెబితే ఈనాటి
సెల్ ఫోన్లకు ఒక పట్టాన అర్ధం కాదేమో.
“నేను వరూధిని మాట్లాడుతున్నాను’ అవతలనుంచి
వినబడింది. అసలే నిద్ర మత్తేమో ‘వూ చెప్పండి’ అన్నాను అతి మామూలుగా.
“మీరు రాసిన పుస్తకం చదివానండి. చాలా బాగుంది”
“ఓహో! అలానా థాంక్స్”
“రోజూ ఎన్నో పుస్తకాలు చదువుతూ వుంటాం కాని మాస్కో గురించి మీరు రాసిన విషయాలు చాలా
బాగున్నాయి. పుస్తకం పేరు కూడా. మార్పు చూసిన కళ్ళు. భలేగా వుంది. అది చెబుదాం అనే
ఫోను చేస్తున్నాను.”
ఎవరీవిడ అని ఆలోచిస్తూ కొంత మౌనంగా వున్నాను.
నా మౌనాన్ని ఆవిడ అర్ధం చేసుకున్నట్టున్నారు.
“మొన్న జానకీరాణి ఫంక్షన్ లో మీ పుస్తకం నా
చేతికి వచ్చింది. ఆవిడ బలవంతంవల్ల అక్కడికి వచ్చాను. మంచిదే అయింది. మీ పుస్తకం
చదివే అవకాశం దొరికింది”
అమ్మబాబోయ్! ఆ వరూధిని గారా! కొడవటిగంటి
కుటుంబరావు గారి భార్యతోనా ఇప్పటిదాకా ఇలా మాట్లాడుతున్నది? నిద్రమత్తు ఒక్క
పెట్టున వొదిలిపోయింది. మంచం మీద నిటారుగా లేచి కూర్చున్నాను. ఈ పొరబాటు దిద్దుకోవడం యెలా!
ఆవిడ మాట్లాడుతూనే వున్నారు.
‘నేను మా అమ్మాయి, అల్లుడి దగ్గర కొండాపూర్ లో
వుంటున్నాను. పుస్తకంలో మీ అడ్రసు చూసాను. అమీర్ పేటకి చాలా దగ్గర్లో వుంటున్నట్టున్నారు.
మేము లోగడ అక్కడే వుండేవాళ్ళం”
కొడవటిగంటి గారి సాన్నిహిత్యమో తెలవదు, ఆయన
సాహిత్యాన్ని ఆస్వాదించిన ఫలితమో తెలవదు. ఆవిడ స్వరం అమృతం సేవించినట్టుగా అతి
మధురంగా వుంది. కుసుమ కోమలంగా వుంది. తొంభై రెండేళ్లు దాటిన మనిషిలా లేదు. (తొంభై
మూడేళ్లకు తక్కువ వుండవు అంటారు మా డి. వెంకట్రామయ్యగారు ఆవిడ గురించిన వివరాలు
చెబుతూ. అంత వయస్సులో ఇంత శ్రద్ధగా ఓ పుస్తకం చదివి ఆ రచయితకు ఫోను చేసి మాట్లాడే
సంస్కారం గురించి ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు). అది తలచుకోగానే, అయిదున్నర అడుగుల పైన మరికొన్ని అంగుళాల పొడవుండే
మనిషిని కాస్తా ఓ మరుగుజ్జుగా మారిపోయాను.
ఆవిడ చాలా సేపు మాట్లాడారు. చాలా విషయాలు
చెప్పారు. కొడవటిగంటి కుటుంబరావుగారి గురించీ, వారి అబ్బాయి రోహిణీప్రసాద్ గురించీ (ఏడాది అయిందనుకుంటాను ఆయన పోయి), అమ్మాయి శాంత సుందరి గురించీ, వారి అమ్మగారు
కొమ్మూరి పద్మావతి గురించీ, వారికి దగ్గర బంధువు, సాహితీ సింధువు అయిన ‘చలం’గారి
గురించీ. ఇక తురగా జానకీరాణి గారి సంగతి సరేసరి.
నిజంగా ఈరోజు భలే మంచి రోజు.
అంతటి పెద్ద మనిషి నాతొ ఫోనులో మాట్లాడ్డమే ఓ
అదృష్టం అనుకుంటే, నేను రాసిన ఓ
పుస్తకాన్ని గురించి ఆవిడ మెచ్చుకోవడం. నిజంగా ఇది నాకు అయాచితంగా లభించిన మరో గొప్ప అవార్డ్.
అందుకే అన్నాను. ‘పూర్వజన్మ సుకృతం’ అని. అదీ మరో మాట దొరక్క. పూర్వజన్మలమీద నమ్మకం లేకపోయినా ‘సుకృతం’ మీద మాత్రం
నాకున్న విశ్వాసం మరింత ఇనుమడించింది. అంతేకాదు.
ఎదిగినకొద్దీ వొదిగివుండడంలో వున్న గొప్పతనం
ఏమిటో మరోమారు తెలిసివచ్చింది.
జీవితంలో గొప్పవారుకావడం గొప్ప విషయం కాకపోవచ్చు.
కానీ ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన గొప్పతనం.
హాట్స్ ఆఫ్ వరూధిని గారు.
(17-10-2013)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి