4, అక్టోబర్ 2013, శుక్రవారం

నా గురించి నలుగురు ........


నా గురించి శ్రీ డి.వెంకట్రామయ్య గారు

నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి. వెంకట్రామయ్య) 

“ నాకిప్పటికీ బాగా గుర్తుంది. సందర్భం ఏమిటో జ్ఞాపకం లేదు. ఒకనాటి సాయంత్రం డ్యూటీ ముగించుకుని నేనూ భండారు శ్రీని వాసరావు గారూ (ఇకనుంచి ఈ గౌరవ వాచకం తీసివేసి రాస్తాను) న్యూస్ రూమ్ నుంచి బయటకు నడుస్తుండగా ఆయనో మాట అన్నారు.
“మీరు కుండలు బద్దలు కొట్టండి.  కాని కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొడతానంటే యెలా “ అని. అంతకుముందు ఆఫీసులో ఏదో జరిగింది. ...ఎవరితోనో నేను ఘర్షణకు దిగడమో, తీవ్రస్థాయిలో వాదించడమో జరిగింది.  అలాటి సందర్భాలలో అవసరానికి మించి ఆవేశపడడం, అవతలి వ్యక్తి ఎవరయినా సరే, ఏమాత్రం సంకోచించకుండా వున్న మాట మొహాన  అనేయడంవంటి నా సహజ స్వభావం గురించి , శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య ఇది. ‘కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొట్టడం’ అన్న ఆయన చమత్కారానికి నేనూ నవ్వుకున్నాను. ఆ చమత్కారపు మాటల వెనక నా బోటివారు ఆలోచించవలసిన, చేతనయితే అనుసరించవలసిన మంచి సలహా వున్నట్టు నాకనిపించింది.
అప్పుడే కాదు,  అంతకి ముందు ఆ తరువాతా కూడా ఎన్నో సందర్భాలలో, తన చమత్కారాలు, చతురోక్తులు  జోడించి  ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  నాకెన్నో సలహాలు అందించేవారాయన. కాని నేను వింటేగా. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు నా మొండితనం నాదే. ఎన్నిమార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన నన్నెంత మాత్రం మార్చలేకపోయారు, ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో. శ్రీనివాసరావులాటి మిత్రుల  సుదీర్ఘ సహవాసంవల్ల ఆఫీసునుంచి బయటకు వచ్చిన తరువాతైనా  కాస్త నవ్వడం నేర్చుకున్నాను. నలుగురిలో మసలడం నేర్చుకున్నాను. నాలుగు మాటలు నేర్చుకున్నాను. అయినా ఆఫేసులో కూర్చున్నంతసేపు నా పని నాదే, నా పద్ధతులు నావే. నా నియమాలు నావే. సక్రమం, సమజసం  అనుకున్న మార్గాన్ని ఏమాత్రం విడవలేదు”  
(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 
(04-10-2013)


కామెంట్‌లు లేవు: