5, అక్టోబర్ 2013, శనివారం

నా గురించి నలుగురూ ......3

నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది. కేవలం ఈ వొకే ఒక్క కారణంతో,  ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ డి. వెంకట్రామయ్య గారు ‘రచన’ మాస పత్రిక తాజా సంచికలో తన రేడియో అనుభవాల్లో భాగంగా  నా గురించి చేసిన కొన్ని ప్రస్తావనలను పోస్ట్ చేస్తున్నాను. నిజానికి వీటిని నేను   చక్కని ప్రశంసాపత్రాలుగా భావిస్తాను.- భండారు శ్రీనివాసరావు


(శ్రీ డి.వెంకట్రామయ్య)

“సుమారు పాతికేళ్ళక్రితం సకుటుంబంగా సోవియట్ రష్యా వెళ్ళి నాలుగున్నర సంవత్సరాలపాటు అక్కడ వుండి  రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదివొచ్చారు భండారు శ్రీనివాసరావు.  అప్పుడాయన కాకుండా నేను మాస్కో వెళ్ళవలసింది. రేడియో మాస్కోలో తెలుగు వార్తలు చదవడం కోసం ఆకాశవాణి న్యూస్ రీడర్లను ఒకరి తరువాత ఒకరిని తీసుకువెళ్ళి రెండేళ్లో మూడేళ్లో  అక్కడ  వుంచుకునేవారప్పట్లో. నాకంటే సీనియర్లయిన  తిరుమలశెట్టి శ్రీరాములుగారు, కందుకూరి సూర్యనారాయణగారు ఏడిద గోపాలరావుగారు (గోపాల్రావుగారు రేడియో సర్వీసులో నాకంటే జూనియర్ కాని న్యూస్ రీడర్ గా  కాస్త సీనియర్) లాంటి వాళ్ళంతా రష్యా వెళ్ళివచ్చాక నా వంతు వచ్చింది. వ్యక్తిగతమైన కొన్ని ఇబ్బందులవల్ల నేను వెళ్ళలేకపోగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని,  తాను న్యూస్ రీడర్ కాకపోయినా ఆకాశవాణి, రేడియో మాస్కో అధికారుల ఆమోదంతో రష్యా వెళ్లివచ్చారు శ్రీనివాసరావు. వెళ్ళడమేనా,  తనకంటే ముందు వెళ్ళిన వాళ్ళకంటే రెండేళ్లు ఎక్కువగానే అక్కడవుండి  మాస్కో మహానగరంలో తన జెండా ఎగరేసి మరీ వచ్చారు శ్రీనివాసరావు. రేడియో  మాస్కోలో తెలుగులో వార్తలు చదివిన చివరి వ్యక్తి శ్రీనివాసరావే. ఆ తరువాత ఆ రేడియోలో తెలుగు వార్తల  ప్రసారాన్ని నిలిపివేశారు.
“శ్రీనివాసరావు మాస్కోలో వున్నంతకాలమూ అక్కడా ఆయన ఇల్లు ధర్మసత్రంగానే వుండేదట. అక్కడ వుండి  చదువుకునే తెలుగు విద్యార్ధులు, ఒంటరి ఉద్యోగులు, యాత్రీకులూ అందరికీ అన్నివేళలా తలుపులు బార్లా తెరిచి స్వాగతం పలికేవారు భండారు  దంపతులు. తన సరసోక్తులతో, మధురసాలతో శ్రీనివాసరావు ఆతిధ్యం ఇస్తే, తెలుగు తిండికి మొహం వాచిపోయి వున్న వాళ్ళందరికీ కమ్మటి భోజనం వండి వార్చేవారు నిర్మల గారు. తానూ, తన భార్యాబిడ్డలూ ఆ నాలుగేళ్ళూ మాస్కోలో గడిపిన జీవిత విశేషాలతో ‘మార్పు చూసిన కళ్ళు’ అన్న పేరుతొ ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఒక చిరు గ్రంధాన్ని కూడా గత సంవత్సరాంతంలో రచించారు భండారు శ్రీనివాసరావు “
ఇంకా వుంది .........

(ఆకాశవాణిలో నా అనుభవాలు – శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచన’ అక్టోబర్, 2013 సంచిక నుంచి – రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు) 

కామెంట్‌లు లేవు: