31, అక్టోబర్ 2013, గురువారం

దిగ్భ్రాంతి ప్రకటనలు కాదు – కావాల్సింది కనికరంతో కూడిన కార్యాచరణ


బస్సు ప్రమాదంలో నలభయ్ అయిదు మంది ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దుర్ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి చేతులు దులుపుకున్నారు. పరామర్శలతో పని ముగించుకున్నారు.  తమ వారినిపోగొట్టుకుని నిండు బాధల్లో వున్న వారి బంధువులను మరిన్ని బాధలు పెట్టే చర్యలకు స్వీకారం చుట్టారు. కాలి  బూడిద కుప్పలుగా మారిన వారిని గుర్తించడం కోసం రక్త బంధువులందరూ  హైదరాబాదు నాంపల్లిలోని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పలానా సమయానికల్లా  రావాలని ఓ పత్రికా ప్రకటన చేసి వూరుకున్నారు. ఇంత కనికరం లేని అధికారులు, పాలకులు బహుశా మన దేశంలోనే వుంటారేమో. ఒక పక్క సొంత మనుషులు చనిపోయారు. ఆ బాధ ఒకటయితే సాంప్రదాయాల ప్రకారం నిర్వర్తించాల్సిన కర్మకాండల వొత్తిడి మరో పక్క.  వారిలో చాలామంది బయటి ప్రాంతాలవాళ్ళు. ఏమాత్రం బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా వారికోసం కొన్ని కనీస ఏర్పాట్లు చేసివుండేది. ఓ వంద మందికో నూటపాతిక మందికో హైదరాబాదులో ఆశ్రయం కల్పించలేని దుస్తితిలో ప్రభుత్వం వుందని అనుకోలేము. వారందరికీ ప్రభుత్వ అతిధి గృహాల్లో ఒక రోజో రెండు రోజులో వసతి  భోజన సౌకర్యాలు, లేబొరేటరీకి వెళ్ళి రావడానికి రవాణా ఏర్పాట్లు చేసివుంటే మన రాష్ట్రంలో ఒక సంక్షేమ ప్రభుత్వం పనిచేస్తోందని వాళ్లు తమ వారితో చెప్పుకునే వారు. బాధల్లో వున్నవారికి కాసింత ఆపన్న హస్తం అందించడం వల్ల సర్కారు నిధులేమీ తరిగిపోవు, కరిగిపోవు.  ‘మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం’  అని ప్రకటనలు చేయగానే సరిపోదు. ఆ చిత్తశుద్ధి ఆచరణలో కూడా కనబడాలి. ప్రభుత్వం తలచుకోవాలే కాని రక్త బంధువుల రక్త నమూనాలు వారికి ఎలాటి అసౌకర్యం లేకుండా సేకరించడం కూడా పెద్ద పనేమీ కాదు. వారి చిరునామాలు, వివరాలు అన్నీ ప్రభుత్వ అధికారుల వద్ద వున్నాయి. వాళ్ల ఇళ్లకు వెళ్ళే ఈ పని పూర్తిచేయవచ్చుకూడా.  ఇంట్లో ఓ మనిషి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో పరిస్తితి యెంత దయనీయంగా వుంటుందో అర్ధం చేసుకోవడానికి పెద్ద మేధస్సు అక్కరలేదు. అర్ధం చేసుకునే మనస్సు వుంటే చాలు. రక్త నమూనాలు ఇవ్వడానికి వచ్చినవారి కడగండ్లు టీవీల్లో చూసినప్పుడు ఇలాటి కష్టం  పగవారికి కూడా రాకూడదు అనిపించింది. కానీ సర్కారు వారికి మాత్రం  చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏం చేస్తాం. మన రాతల్ని బట్టే మన పాలకులు.
-    (31-10-2013)

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

దిగ్భ్రాంతి ప్రకటనలు కాదు – కావాల్సింది కనికరంతో కూడిన కార్యాచరణ అన్నారు.

నిజానికి ప్రజలకు ప్రభుత్వం కనికరం అక్కరలేదు.
ప్రజలకు కావలసిన బాధ్యతల పట్ల శ్రధ్ధ కలిగి వ్యవహరించే ప్రభుత్వం.

ప్రభుత్వాలే ప్రజల కనికరం మీద బ్రతుకుతున్నాయి కాని ప్రజలు ప్రభుత్వాల కనికరం మీద బ్రతకటం లేదు. దురదృష్టవశాత్తూ ప్రజల్లో కూడా ప్రజాప్రభుత్వం కూడా పెత్తందారీ వ్యవస్థ అనే భావన బలంగా ఉంది. ఇది పొరబాటు.

అజ్ఞాత చెప్పారు...

చేయవలసినది మెహర్బానీ కి చేస్తున్నట్లు ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. ఇది మారాలి, ప్రజలు మార్చాలి, చట్టాలలో లొసుగుల్ని, గూడాగిరి, రాజకీయం, వ్యాపారాన్ని కలగలవడాన్ని నిరసించాలి.

అజ్ఞాత చెప్పారు...

సందర్భమో కాదో తెలీదు కానీ -

నాయకులు విసిరే కుక్క బిస్కెట్లకి ఆశపడి నీతి, నిజాయితీ లేని నాయకులని గెలిపించినంత కాలం ఈ తీరు మారదు. నాకు తెలిసి భారత దేశ ప్రజలకి నాయకులని విమర్శించే అర్హత లేదు. భండారు గారితో సహా. స్వలాభం ఆశించకుండా లోక్ సత్తా(ఉదాహరణకి) లాంటి నిజాయితీ గల పార్టీ లకి వోటు వేసిన వారికి మాత్రమే ఆ హక్కు ఉన్నది.

What you sow, so shall you reap.
ఆముదం విత్తనాలు వేసి వరి పండమంటే పండదు కదా. Indians deserve every thing that is happening right now. I don't regret in saying this.

ఇప్పటికయినా మించి పోయింది లేదు. ప్రజలంతా (బై అండ్ లార్జ్ ) మూర్ఖత్వం వదిలి ఇప్పటికయినా తనకి ఏమైనా చేసే వాళ్ళని కాకుండా దేశానికీ మంచి చేసే వాళ్ళని ఎన్నుకుంటే మార్పు కన్పిస్తుంది. అలా కాకుండా అదే దివాకర్ రెడ్డినో, అదే బొత్స సత్తి బాబునో , అదే దానం నాగేందర్ నో ఎన్నుకుని దేశం సింగపూర్ లాగ కావాలంటే అదే కలలో మాత్రమె సాధ్యం. ప్రతీ సమస్యకి మూలం అక్కడే ఉంది.