30, జూన్ 2016, గురువారం

హాఫ్ లయన్ పీవీ నరసింహారావు


సూటిగా....సుతిమెత్తగా...... భండారు శ్రీనివాసరావు
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 03-07-2016, SUNDAY)
పుస్తకములు బహు భంగులు.
చదివేవీ చదివించేవీ  కొన్ని. చదివిన తరువాత ఎందుకు చదివాము అనిపించేవి మరి కొన్ని.
ఇప్పుడు చెప్పుకోబోయేది మొదటి రకం పుస్తకం గురించి.
దాని పేరు ‘నరసింహుడు’. సినిమా టైటిల్  లా అనిపించినా మంచి పుస్తకానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ వున్నాయి. చూడగానే కళ్ళల్లోపడేట్టు తీర్చి దిద్దారు. దానికి కారణం ఈ అనువాద గ్రంధాన్ని ప్రచురించింది ఎమెస్కో కావడం. ఖర్చుకు వెనుతీయకుండా వెలువరించిన ఘనత ఎమెస్కో విజయకుమార్ ది.


ఆంగ్లంలో ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ జర్నలిష్టు  వినయ్ సీతాపతి రచించారు. తెలుగు తెలియకపోయినా ఒక తెలుగు ప్రధాని గురించి రీసెర్చ్ చేసి మరీ రాశారు. మువ్వురు సుప్రసిద్ధ జర్నలిష్టులు, జీ. వల్లీశ్వర్, టంకశాల అశోక్, డాక్టర్ కే.బీ.గోపాలం కలిసి తెలుగులోకి  అనువదించారు. వీరిది మక్కికి మక్కి తెనుగుసేత కాదు అనడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఆంగ్లంలో ఈ పుస్తకం పేరు ‘HALF LION” (సగం సింహం). తెలుగులో ‘అరసింహుడు’ అని అనువదించకుండా ‘నరసింహుడు’ అనే పెట్టారు. పుస్తకం రాసింది మాజీ ప్రధాని, కీర్తిశేషులు పీవీ నరసింహారావు గురించి కాబట్టి ఆ పేరు పెట్టడమే భావ్యం. పుస్తకంలో ఘనత అంతా  దీన్ని ఇంగ్లీష్ లో తొలుత రాసిన  వినయ్ సీతాపతిదే. అయితే ముగ్గురు చేయి తిరిగిన తెలుగు జర్నలిష్టు రైటర్లు ఒకే స్రవంతిలో పుస్తకం చదువుతున్న అనుభూతిని పాఠకులకు మిగల్చడంలోనే వారి అసమాన ప్రతిభ దాగివుంది. దానికి కారణం వారు పాత్రికేయ రచయితలు కావడమే. ఈ కార్యానికి వారిని ఎంచుకున్న ఎమెస్కో వారు అభినందనీయులు.  
ఈ పుస్తకంలో ఏముందీ అన్నది  విడుదలకు ముందే జనాలకు తెలిసిపోయింది. ఆ మేరకు ఒక ప్రముఖ దినపత్రిక, ఆంధ్ర జ్యోతిలో  ఈ పుస్తకంలోని ఆసక్తికరమైన అంశాలను మరింత ఆసక్తికరంగా ప్రచురించడంతో పాఠకులకు కూడా దీని పట్ల ఆసక్తి రగిలింది. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి  హాజరయిన అసంఖ్యాక ప్రేక్షకులే దీనికి దృష్టాంతం.
పీవీ ప్రధానిగా వున్నప్పుడు ఆయనకు సన్నిహితంగా వున్న ఐ.ఏ.ఎస్. అధికారులు, పద్మనాభయ్య, పీవీ ఆర్కే ప్రసాద్, ఐ.పీ.ఎస్. అధికారి కే.విజయరామారావు ఆహూతుల్లో వున్నారు. అలాగే పీవీ  కుమారులు పీవీ రాజేశ్వర రావు, పీవీ ప్రభాకరరావు హాజరయిన వారిలో వున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  డిప్యూటీ స్పీకర్  మండలి బుద్ధ ప్రసాద్ తమ ప్రసంగంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే.రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ ఆంగ్ల తెనుగు పుస్తకాలను ఆవిష్కరించారు.
ఇక ఈ పుస్తకం గురించి చెప్పుకుందాం.  ఈ వ్యాసంలో పేర్కొన్నవన్నీ ఈ పుస్తకంలోని విషయాలే.
సాధారణంగా ప్రసిద్దులయిన రాజకీయ నాయకుల జీవిత విశేషాలు గురించి రాసే రచయితలు సంచలనాత్మక అంశాలను అందులో జోడిస్తుంటారు. ఇందుకు  ఈ పుస్తకం మినహాయింపు  కాదు.
అయితే రచయిత వినయ్ సీతాపతి ఈ విషయంలో  ఒక కఠోర నియమం పాటించినట్టు పుస్తకం చదివిన వారికి అర్ధం అవుతుంది.
సంచలన అంశాలే కాదు, సాధారణ అంశాలను కూడా  ఎంతో శ్రమకోర్చి వివరాలు ధ్రువ పరచుకున్న తరువాతనే వాటిని  తన పుస్తకంలో పొందుపరిచారు. ప్రతి విషయమూ ఎవరి నుంచి సేకరించిందీ పుస్తకం చివర్లో ఒక జాబితా ఇచ్చారు. దానికి తోడు విషయాలను ధ్రువ పరచుకోవడానికి అవసరమైన పత్రాలను పరిశీలించిన మీదనే వాటిని ఈ గ్రంధంలో క్రోడీకరించ డాన్ని బట్టి చూస్తే, ఇదొక పరిశోధనాత్మక గ్రంధం అనిపిస్తుంది. దీనివల్ల  రచయిత పట్ల ఆయన చేసే రచనల పట్ల పాఠకుల్లో విశ్వసనీయత పెరుగుతుంది.
రాజకీయ పార్టీల్లో, కాస్త హెచ్చు తగ్గులు వుండవచ్చు కానీ,  అధినాయకుల ఆజమాయిషీ ఎక్కువే. కాంగ్రెస్ పార్టీలో ఇది కాస్త హెచ్చుగా కనిపిస్తుంది. వారిది నాయకుడు ఎప్పుడూ రైటే అనే పాలసీ. అంతే కాదు వెనుకటి రాజుల్లో వుండే ఆగ్రహానుగ్రహాల పాలు కూడా ఎక్కువే.
తెలంగాణా  నుంచి ఎన్నికయిన రాజ్య సభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంత రావు , గతంలో, ఒకసారి  పీవీ విగ్రహం వరంగల్లులో పెట్టించాలని అప్పటి ముఖ్యమంత్రికి  ఉత్తరం రాసారు. స్థానిక నాయకులు పడనివ్వలేదు. కారణం, విగ్రహం పెట్టినప్పటినుంచి, ఏటా జయంతులకీ, వర్ధంతులకీ  వెళ్లి దండలు వేయాలి,  ఎవడన్నా ఫోటో తీసి  సోనియాకు పంపుతారేమో అని వారి  భయంట.
పీవీ చనిపోయిన చాలా ఏళ్ళ తరువాత కానీ  ఈ  పరిస్తితిలో మార్పు రాలేదు. తెలంగాణలో అధికారానికి వచ్చిన టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం,  పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. అంతే కాకుండా పీవీ చరిత్రను హైస్కూలు స్థాయిలో  పాఠ్య ప్రణాళికలో చేర్చాలని కూడా  నిర్ణయం తీసుకుంది.
అలాగే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే  ప్రభుత్వం ఢిల్లీలో పీవీ స్మారక చిహ్నాన్ని  ఏర్పాటు చేసింది.  ఇక సుబ్రమణ్య స్వామి,  పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లోపలి మనిషి మాదిరిగా కానవచ్చే పీవీలో ఇచ్చిన మాటకు కట్టుబడే గుణం వుంది.
పీవీ కన్న తలితండ్రులు  ఆయన్ని దత్తు ఇచ్చారు. కన్న తండ్రి అవసాన దశలో,  పీవీని దగ్గరకు పిలిపించుకుని,  ‘చూడూ నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు దత్తత వెళ్లావు కాబట్టి ఈ కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని అనుకోకు, మీ అమ్మనీ, తమ్ముళ్ళ  చూసుకోవాల్సిన బాధ్యత  నీదే’ అని మాట తీసుకున్నారు. ఆయన కూడా జీవితాంతం ఆ మాట నిలబెట్టుకున్నారు.
చిన్న వయస్సులోనే తలితండ్రులకి దూరం కావడం పీవీ మనస్సులో గట్టిగా నాటుకు పోయింది. డెబ్బయి ఆరేళ్ళ తరువాత ఢిల్లీ ఆసుపత్రిలో చివరి రోజులు గడుపుతున్నప్పుడు ఆయన నోట ఇవే పలవరింతలు. ‘అదిగో మన వూళ్ళో చెరువు గట్ట మీద నడుస్తున్నాను. నాన్న తెల్లటి బట్టలు వేసుకుని రమ్మని పిలుస్తున్నాడు. నన్ను వెళ్ళనివ్వండి అంటూ పలరించేవార’ని  పీవీ చిన్న కుమారుడు ప్రభాకరరావు గుర్తు చేసుకున్నారు.
ఆయన ఒక జీవిత సత్యాన్ని తానే  రాసుకున్నారు.
‘ఎవరయినా జీవితంలో ముందుకు సాగుతూ , పైకి ఎదుగుతున్నప్పుడు, తన మనస్సుకి నచ్చే విధంగా నడుచుకోగలిగే సందర్భాలు తగ్గిపోతుంటాయి’.
ఒక రకంగా ఇందిరాగాంధీ హయాములోనే ఆయన హాయిగా ఊపిరి పీల్చుకోగలిగారు. ఎందుకంటే రాజకీయంగా ఎదగాలి అన్న కాంక్ష లేకపోవడమే. ఇందిరకు కూడా పీవీలోని ఈ మనస్తత్వం బాగా నచ్చింది. అయినా, అధినాయకురాలికి యెంత నమ్మకస్తుడయినా పీవీకి ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పలేదు.   
‘ఇందిరా గాంధీకి రాజకీయంగా బలం లేని,  బలవంతుడయిన (సమర్దుడయిన) నామినేటెడ్ ముఖ్యమంత్రి కావాలి. కానీ ఇది ఎలా సాధ్యం’ అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తరవాత పీవీకి కలిగిన  మీమాంస.  
వయస్సు మీరినట్టు కానవచ్చే పీవీలో జనాలకు అంతగా తెలియని దార్శనికుడు వున్నాడు. అంచేతే ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఎవరూ సాహసించని భూసంస్కరణలకు ఆయన తెర తీశాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు భూసంస్కరణల చట్టం తెచ్చింది ఆయనే. ఇదే ఆయన ఉద్వాసనకు మార్గం వేసింది. ఆ చట్టం కింద,   స్వగ్రామం వంగరలో తనకున్న పన్నెండువనదల ఎకరాల్లో వెయ్యి ఎకరాలను  స్వచ్చందంగా  ప్రభుత్వానికి అప్పగించారు. వూళ్ళో భూమిలేని పేదలకు తలా రెండెకరాల చొప్పున అధికారులు పంచి పెట్టారు. అంచేత వాళ్లకి పీవీలో ఒక అనాధరక్షకుడిని చూసారు. వంగర వెళ్ళినప్పుడు పొలం గట్ల మీద నడుస్తూ, రైతులతో  ముచ్చటించడం ఆయనకు ఇష్టం. భూసంస్కరణల  చట్టం ఆయన పదవికి మోసం తెచ్చింది కానీ పేదల గుండెల్లో మాత్రం  ఆయనకు స్థానం కల్పించింది.
అలాగే కొన్ని సందర్భాలలో మితభాషిగా పేరుపొందిన పీవీని అయన వ్యాఖ్యలే ఇబ్బందుల్లోకి నెట్టాయి. ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీం తీర్పుపై ‘ ‘అది ఫైనల్’ అంటూ ఆయన అతి క్లుప్తంగా చేసిన వ్యాఖ్య వీటిల్లో ఒకటి. అలాగే ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ విషయంలో పీవీ అన్యాపదేశంగా చేసిన మరో వ్యాఖ్య.
‘సంప్రదింపులతో పని జరిగే చోట సంకెళ్ళు పనిచేయవు’ అని  పార్టీ అంతర్గత సమావేశంలో ఆయన ఒకసారి అన్నమాటను,  పార్టీలోని  ప్రత్యర్ధులు ఎమర్జెన్సీతో  ముడిపెట్టి  వదంతులు ప్రచారం చేయడం ఆయన రాజకీయ పురోగతికి అడ్డంగా మారింది. అప్పట్లోనే అంటే ఇందిరా గాంధి హయాములోనే  అఖిల భారత కాంగ్రెస్  పార్టీ అధ్యక్ష పదవి ఈసారి పీవీకే  అని ఢిల్లీలో సాగిన  ప్రచారంపై, ఆ పుకార్లు నీళ్ళు చల్లాయి. దరిమిలా ఇందిరాగాంధీకి పీవీ పట్ల విముఖత కలగడానికి కారణం అయింది. వస్తుంది అనుకున్న అధ్యక్ష పదవి రాకపోగా పార్టీ  ప్రధాన కార్యదర్శి పదవి కూడా పోయింది.
పదవి పోయిన తరువాత దొరికిన ఖాళీ సమయాన్ని పీవీ స్పానిష్ భాషని నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నారు. సొంతంగా కారు నడుపుకుంటూ జవహర్ లాల్ నెహ్రూ  యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళేవారు.
అలా పట్టిన ఏలిన నాటి, ఏడేళ్ళ తరువాత, జనతా ప్రభుత్వ పతనంతో  ముగిసింది. తిరిగి అధికారంలోకి వచ్చిన  ఇందిరాగాంధి  ప్రభుత్వంలో మళ్ళీ మంత్రి పదవి లభించింది.
ఇందిరాగాంధి  దారుణ హత్య అనంతరం అనూహ్యంగా రాజీవ్ గాంధి ప్రభుత్వ పగ్గాలు స్వీకరించారు. అప్పటికే పీవీ ద్వితీయ స్థానంలో కొనసాగగలిగే  రాజనీతిని అలవరచుకున్నారు. తనకన్నా వయస్సులో ఇరవై మూడేళ్ళు చిన్న వయస్కుడయిన ప్రధానమంత్రితో సర్దుకుపోయి పనిచేయగలిగారు. ఇందుకు ఓ ఉదాహరణ.  పీవీ నరసింహారావు  సమక్షంలోనే రాజీవ్ గాంధీ ఒక మిత్రుడితో చెప్పాడు. ‘దేశంలోకి కంప్యూటర్ల దిగుమతులని పోత్సహించాలని అనుకుంటున్నాను. ఎటొచ్చీ మా పార్టీలో ముసలాళ్ళకు ఇది అర్ధం కాదు. ‘.  అప్పుడు రక్షణ మంత్రిగా వున్న పీవీకి  ఈ మాటలు వినపడ్డాయి. వినబడనట్లే వుండిపోయారు.
తరువాత ఆయన అమెరికాలో వున్న తన కుమారుడు ప్రభాకర్ తో చెప్పి ఒక కంప్యూటర్ తెప్పించుకున్నారు. అంతవరకూ ఆయన ఎప్పుడూ విని ఎరుగని కోబాల్, బేసిక్స్  అనే కంప్యూటర్ భాషలను పట్టుబట్టి నేర్చుకున్నారు.
వెంకట్రామన్ రాష్ట్రపతి కాకముందు పీవీ  ఆ  పదవి కోసం కొన్ని ప్రయత్నాలు చేసారు. రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిగా  ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులతో మాట్లాడిపెట్టమని, ఎన్. కిరణ్  కుమార్ రెడ్డి (తదనంతర కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు) తనతో చెప్పారని   రచయిత వినయ్ సీతాపతి పేర్కొన్నారు.
పీవీలోని రచయిత  మేల్కొన్నప్పుడు ఆయన, వామపక్ష భావజాల మాస పత్రిక  మెయిన్ స్ట్రీమ్ ఆంగ్ల పత్రికకు  ఆకాశరామన్న అనే మారు పేరుతొ వ్యాసాలు రాసేవారు. బహుశా తన అసలు పేరుతొ కాకుండా రాయడం వల్ల ఆకాశరామన్న అనే పేరు పడిందేమో తెలవదు. సాధారణంగా అలా పీవీ రాసే రచనలను  ‘అవతలి సగం’ అనో, ఆకాశ రామన్న అనో ఆ వ్యాసం కింద వేసి ప్రచురించేవాళ్ళు. అధిష్టానం పై నిప్పులు చెరగడానికి ఆయన ఈ రచనా వ్యాసంగాన్ని ఎంచుకుకున్నారని అనుకోవచ్చు. అయోధ్య విషయంలో రాజీవ్ గాంధీ చేతకానితనాన్ని ఎండగడుతూ అదే పత్రికలో ‘ఒక కాంగ్రెస్ కార్య కర్త’ అనే పేరుతొ  పీవీ ఒక విమర్శనాత్మక వ్యాసం రాసారు.  
రాజీవ్ ఆకస్మిక ఘోరమరణం తరువాత పీవీని ప్రధానిని చేయడానికి ముందు కధ అనేక మలుపులు తిరిగింది.  ఆ క్రమంలో సాగిన అనేక అంతపుర రహస్యాలు ఈ పుస్తకంలో వున్నాయి. రాజీవ్  వారసుడిగా  తన పేరు బయటకు వచ్చిన తరువాత కూడా తనని వెనక్కి నెట్టేయడానికి పార్టీలో కొందరు చేసినప్రయత్నాలు ఆయనకి ఆగ్రహం తెప్పించాయి కూడా. అయినా సంయమనంతో వ్యవహరించడం వల్ల, సోనియా ఆమోద ముద్ర వేయడం వల్ల అడ్డంకులు తొలగిపోయాయి.  ఆ సమయంలో క్షణ క్షణానికీ మారిపోతున్న పరిణామాల క్రమంలో తెలియవచ్చిన విషయాలు అవగాహన చేసుకున్న తరువాత  ‘నా మెదడులో చిత్రం పూర్తిగా వచ్చింది’ అని పీవీ అనుకున్నట్టు  ఈ పుస్తకంలో తెలుగు అనువాదంలో వుంది. (పేజీ 130- ఈ అనువాదం కాస్త కృతకంగా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పనిలేదు)
ఉపశ్రుతి: వెనకటి రోజుల్లో బాపూరమణలు  తమ ‘బంగారు పిచిక’ సినిమా కోసం హాస్య స్పోరకమైన  యాడ్  రూపొందించారు. ఇందులో భారీ సెట్టింగులు లేవు, ప్రఖ్యాత నటీ నటులు లేరు. రంగురంగుల సెల్యూలాయిడ్ సినిమా కాదు. మంచి కధ. మంచి చిత్రం చూడాలని వుంటే మా సినిమా చూడండి.
ఎమెస్కోవారి ఈ పుస్తకానికి ఇది  అక్షరాలా వర్తిస్తుంది. ఇప్పుడు  షరా మామూలుగా ఆత్మకధలు, జీవిత చరిత్రలు మొదలయిన పుస్తకాల్లో వుంటున్న సంచలనాలు ఇందులో వున్నా  వాటికి ఆధారాలు పొందుపరిచారు.  ఇక షరా మామూలు వ్యక్తి పూజలూ లేవు, వ్యక్తిత్వ హననాలు లేవు. కేవలం ఒక గొప్పనాయకుడి ఘన చరిత్ర. దాన్ని గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి. 
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595     
            

    

29, జూన్ 2016, బుధవారం

App connecting the doctor with his patient 24 x 7

HEALTHSINC
App connecting the doctor with his patient 24 x 7
I don’t know ABCD of Apps.
First time I came to know about an App, when my wife was seriously ill and admitted to hospital for a long time.
Without knowing and using an App till that time, I started  using  this from that day. It connects well the patient with his/her doctor, however busy he may be.
One   can download and test to believe himself.



This is not an advertisement.   

28, జూన్ 2016, మంగళవారం

తనకు తానుగా మోడీ విధించుకున్న తుది గడువు



సూటిగా...సుతిమెత్తగా .....భండారు శ్రీనివాసరావు
తనకు తానుగా మోడీ విధించుకున్న తుది గడువు
చంద్రకాంత్ కులకర్ణి. ఈయన ఒక విశ్రాంత ఉద్యోగి. ప్రధాని నరేంద్ర మోడీ నోట ఈయన పేరు వినబడేంత వరకు ఈ కులకర్ణి గారెవరో ఎవరికీ తెలియదు.
నెలనెలా ఆకాశవాణి ద్వారా ప్రధాని ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో దేశ ప్రజలతో ముచ్చటించడం అనేది  ఆనవాయితీ. గత ఆదివారం నాడు రేడియోలో మాట్లాడుతూ ప్రధాని ఈ కులకర్ణి ప్రసక్తి తెచ్చారు. తాను ప్రవేశపెట్టిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమం పట్ల ముగ్ధుడైన చంద్ర కాంత్ కులకర్ణి, తనకు నెలనెలా వచ్చే పదహారువేల రూపాయల పించనులో నెలకు ఐదువేల చొప్పున స్వచ్చ భారత్ కార్యక్రమానికి  విరాళంగా ఇచ్చినట్టు తెలియచేశారు. ఒక పించనుదారుడు ఈ విధంగా ఒక ప్రభుత్వ కార్యక్రమానికి తనకున్నంతలో సాయపడాలి అనుకోవడం మెచ్చదగిన సంగతే.  అంతటి బృహత్తరమైన కార్యక్రమం అమలుకు ఆ అయిదువేలు ఏపాటి అనిపించవచ్చు. కానీ అందులో దాగున్న స్పూర్తిని లెక్కతీసుకుంటే అది గొప్ప సంగతే.


ప్రధాని పనిలో పనిగా తన మనసులోని మరో మాటగా నల్ల ధనం ప్రసక్తిని కూడా  తీసుకువచ్చారు. అసలు ఈ నల్లధనం గురించి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీనే ప్రజలకు వాగ్దానం చేసారు. విదేశాలకు తరలి వెళ్ళిన నల్ల ధనాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు మొదలు పెడతామని భారతీయ జనతా  పార్టీ తన ఎన్నికల ప్రణాళిక ఐదో పేజీలో పేర్కొన్నది.  ఈ వాగ్దానానికి కొన్ని రంగులు అద్ది విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న పాతిక లక్షల కోట్ల పైచిలుకు నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి ప్రతి పౌరుడికి  కొన్ని లక్షల రూపాయల చొప్పున వారి వారి ఖాతాల్లో జమచేస్తామని ఎన్నికల  సభల్లో బీజేపీ నాయకులు హామీలు గుప్పించిన మాట నిజమే అయినా అంత విస్పష్టంగా  ఎన్నికల  ప్రణాళికలో పేర్కొనని మాట కూడా నిజమే. అయితే,  బహిరంగ సభల్లో చేసిన ప్రసంగాల్లో ఉత్ప్రేక్షాలంకారయుక్తంగా నేతలు ఇచ్చిన హామీలే జనాలకు బాగా గుర్తుండిపోయాయి. అందుకే నల్లధనం గురించి ఎవరయినా అడిగినప్పుడల్లా పాలక పక్షం నేతలు మొహం చాటేసుకోవాల్సి వస్తోంది.
ఇక  ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే ఈ ప్రసక్తి తీసుకు వచ్చారు. అయితే  మన్ కీ బాత్ ఆయన పేర్కొన్నది మన దేశంలో అడ్డూ అదుపూ లేకుండా కొండల్లా పెరిగిపోతున్న నల్లధనం గురించి. విదేశీ బ్యాంకుల్లో లెక్కా పత్రమూ తెలియకుండా  కొందరు సంపన్నులు దాచుకున్న నల్లధనం గురించి కాదు.  
సెప్టెంబర్ నెల ముగిసేలోగా ఇంతవరకు లెక్కల్లో చూపని అప్రకటిత  ధనానికి లెక్కలు చెప్పాల్సిందే అంటూ ప్రధాని నొక్కిచెప్పారు. ‘ఇదే చిట్టచివరి అవకాశం. స్పందించని సంపన్నులకు తిప్పలు తప్పవు’  అంటూ తీవ్రంగా హెచ్చరించారు.
‘స్వచ్చందంగా వివరాలు ప్రకటించేవారిపై ఎలాటి విచారణ జరగదు. ఎలాంటి ప్రశ్నలు అడగరు. ప్రభుత్వానికి తెలవకుండా గుప్తంగా దాచుకున్న ఆదాయాన్ని బయట పెడితే అపరాధ రుసుముతో సరిపెడతారు. తద్వారా అనేక రకాల భారాల నుంచి బయటపడవచ్చు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ పారదర్శక వ్యవస్థలో భాగం కావడానికి ఇది చిట్టచివరి అవకాశం’ అని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.
 ‘పాత భారాన్ని ఒదిలించుకొండి, కొత్త ఇబ్బందులను కొనితెచ్చుకోకండి’ ఇదీ ప్రధాని సందేశ సారాంశం.
దేశ జనాభా నూటపాతిక కోట్లు వుంటే ఇందులో యాభయ్ లక్షల పైచిలుకు  ఆదాయం కలిగిన వారు లక్షా యాభయ్ వేలమందే కావడం విచిత్రం. ఇవి అధికారిక లెక్కలు. ఇంతకు మించిన ఆదాయం కలిగిన వాళ్ళు లక్షల్లో వున్నారు. అయినా  వారు పన్ను చెల్లించడానికి సిద్ధంగా లేరు. 
ఆదాయం లేని వారి సంఖ్య కూడా ఈ పేద దేశంలో తక్కువేమీ కాదు. కానీ ఆదాయం భారీగా వుండి కూడా, పన్ను చెల్లించకుండా తప్పుకుంటున్న వారిని ఉద్దేశించే ప్రధాని తన మనసులోని మాట చెప్పారన్నది విస్పష్టం.
ఒక్క రోజు గడిచిందో లేదో, సోమవారం నాడే మోడీ మళ్ళీ కొరడా ఝలిపించారు.
‘అవినీతిపరులకి, నల్ల కుబేరులకి చట్టం అంటే ఏమిటో తెలిసివచ్చేట్టు చేస్తా’ అని ఒక ఆంగ్ల జాతీయ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోమారు తీవ్రంగా హెచ్చరించారు. ఈసారి ఆయన మాటల్లో పదును పెరిగింది. ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయబోనని కూడా స్పష్టం చేసారు.       
ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవడానికి ఆయన పెట్టిన గడువు కొంచెం  అటూ ఇటూగా మూడు మాసాలే. అంచేత, అప్పటివరకు వేచి ఉండడానికి అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. ఐతే, ఇది తాజాగా దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కాబట్టి అమలు విషయంలో ఏదైనా తాత్సారం జరిగితే అప్పుడు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే వుంటుంది.
ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించుకోవాలి.
గుప్త ధనాన్ని స్వచ్చందంగా వెల్లడి చేసుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం ఇవ్వడం ఇది మొదటి సారేమీ కాదు. గతంలో కూడా ప్రభుత్వాలు ఇటువంటి  గంభీర ప్రకటనలు చేసాయి. ఇలానే తుది గడువులు విధించాయి. ఇలానే కఠిన  హెచ్చరికలు చేశాయి. కాబట్టి ఇలా అవకాశం ఇవ్వడం ఇదే ఆఖరుసారి కూడా కాకపోవచ్చన్న సందేహాలు జనంలో వున్నాయి.  
1997 లో ఒకసారి ఈ స్వచ్చంద గుప్త ధన వెల్లడి  పధకాన్ని అ నాటి కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రకటించారు. అప్పుడు కూడా డిసెంబరు ముప్పయి ఒకటిని తుది గడువుగా పేర్కొన్నారు. గడువు పెంచేది లేదనీ, తిరిగి మరో అవకాశం ఇచ్చేదిలేదనీ ఇలాగే హెచ్చరించారు.
ఫలితాలు కళ్ళు తిరిగేలా వచ్చాయి. గుప్తధనం ఆసాములు పోటీలు  పడి, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ అంచనాలను మించి తమ రహస్య ఆదాయాల లెక్కలు బయట పెట్టారు. మూడులక్షల  యాభయ్ వేలమందికి పైగా సంపన్నులు ఈ పధకం కింద ధరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ విధంగా ప్రకటించిన రెండువందల అరవై బిలియన్ రూపాయల నల్ల ధనం ఈ పధకం ధర్మమా అని  తెల్లధనం రూపాన్ని సంతరించుకుంది.  అందుకోసం వాళ్ళు ముప్పయి శాతం అపరాధ రుసుము ప్రభుత్వానికి చెల్లించారు. ఏతావాతా అక్షరాలా డెబ్బయి ఎనిమిది బిలియన్ల రూపాయలు అదనంగా ప్రభుత్వ ఖజానాకు చేరాయి. అనుకున్న దానికి అయిదు రెట్లు, దాదాపు ఏడువేల ఎనిమిది వందల కోట్లు ఒకేఒక ఆర్ధిక సంవత్సరంలో సమకూరడంతో ప్రభుత్వ వర్గాలు రెట్టింపు  ఖుషీ.
“ప్రజలకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు పులుకడిగిన ముత్యాల్లా బయటకు వస్తారు అనేది నా నమ్మకం. అదే నిజమయింది” అని వ్యాఖ్యానించారు నాటి ఆర్ధిక మంత్రి చిదంబరం. ఇది జరిగి పందొమ్మిది ఏళ్ళు. అంటే అప్పటి రూపాయి విలువతో పోల్చి చూసుకుంటే అప్పుడు ఖజానాకు చేరిన మొత్తం లక్ష కోట్ల పైమాటే.
మళ్ళీ ఇప్పుడు మరోసారి తుది అవకాశం అంటున్నారు. మళ్ళీ కొన్ని లక్షల కోట్లు సర్కారు ఒళ్ళో అప్పనంగా వచ్చి పడతాయి. మోడీ అంటే ఏమిటో, తన తడాఖా అంటే ఏమిటో చూపిస్తాను అని ప్రధాని చాలా గట్టిగా చెబుతున్నారు కనుక ఈ మొత్తం మరింత బాగా పెరగనూ వచ్చు. ఖజానా పొంగి పొరలనూ  వచ్చు.
అయితే, ఇదే  ఆఖరు అవకాశమా అన్నదే సందిగ్ధం. ఎందుకంటే అలా అని అప్పుడు కూడా ఇంత భీకరంగానే చెప్పారు కాబట్టి.
ప్రభుత్వం అన్నా, చట్టాలు అన్నా ప్రజలకు భయం వుండాలి. అదే సమయంలో గౌరవం కూడా వుండాలి. ఇవి రెండూ వుంటే ఇక చెప్పే పనే లేదు. చట్టాలు చట్టుబండలు కాకుండా వుంటాయి.
అలాగే,  ప్రభుత్వాలు చెప్పే మాటలపై ప్రజలకు విశ్వాసం వుండాలి. ప్రభుత్వంలో వున్నవాళ్ళు ఏదైనా చెబితే దాన్ని అమలుచేసి తీరతారన్న నమ్మకం వారికి వుండాలి. అప్పుడే ప్రభుత్వాలు జారీ చేసే ఈ విధమైన హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేస్తారు.
నల్లధనం వివరాలు స్వచ్చందంగా వెల్లడించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ ముప్పయి తుది గడువు అని ప్రకటించారు. సంతోషం.
దేశప్రజల ముందు తనని తాను  రుజువు చేసుకోవడానికి, ప్రజలు తనమీదపెట్టుకున్న ఆశలు అడియాసలు కాకుండా చూడడానికీ,  మోడీ గారికి కూడా  అదే సెప్టెంబర్ ముప్పయి తుదిగడువు.
భర్తృహరి ‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’ అన్నాడు. అంటే గుప్తంగా దాచుకున్న ధనం వంటిది అని అర్ధం.  ఈ గుప్తధనం జాతిని ఉద్దీపింప చేస్తుంది. సంపన్నులు రహస్యంగా దాచుకునే  గుప్తధనం అలాంటిది కాదు. అది జాతిని నిర్వీర్యం చేస్తుంది. అంచేత మోడీ ఈ విషయంలో విజయులు కావాలనే అందరూ కోరుకుంటారు.  
ఉపశృతి:
సినిమా విడుదల పోస్టర్ విషయంలో బాపూరమణల జోక్  ఒకటి వుంది.
“నేడే విడుదల, రేపే ఆఖరి రోజు, త్వరపడి నేడే చూడండి”
దీనికీ, ఈ స్కీముకీ సంబంధం ఏమిటంటారా! ఏమో!
(29-06-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595
     
    


నాది నాది అనుకున్నది నీది కాదురా


పిల్లి పిల్లల్ని పెట్టి ఏడిళ్ళు మారుస్తున్దంటారు. మేము పిల్లలతో కలిసి ఏడిళ్ళకు పైగా మారి ఉంటాము.  ఆఖరికి ఇళ్ళ సమస్య లేని మాస్కోలో కూడా రెండు ఫ్లాట్లు మారాము. మాస్కో వెళ్ళేటప్పటికే ఊలిత్స వావిలోవాలోని రేడియో మాస్కో భవనంలో మాకోసం డబల్ రూమ్ ఫ్లాటు సిద్ధంగా వుంచడం, దాంట్లో చేరిపోవడం జరిగింది. అందులో ఒక చిన్నపొరబాటు జరిగింది. దాన్ని అధికారులే గుర్తించి దిద్దుకున్నారు. పిల్లల సంఖ్యను  బట్టి ఎన్ని పడక గదులు ఉండాలో నిర్ణయం అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలు కాబట్టి మూడు పడక గదుల ఫ్లాటుకు వెంటనే  మార్చారు. మంచాలు, పరుపులతో సహా సమస్తం అమర్చి పెట్టిన ఫ్లాట్ కాబట్టి ఆ అయిదేళ్ళు కాలుమీద కాలువేసుకుని కాలక్షేపం చేశాము.
1975 లో హైదరాబాదు  రేడియోలో  చేరినప్పుడు 75  రూపాయలకు అశోక్ నగర్ చమన్ దగ్గర ఒక వంటిల్లు, ఒక గదితో మా జీవనయానం మొదలయింది. అక్కడి నుంచి చిక్కడపల్లి సుధా హోటల్ దగ్గర మరో వాటాలో దిగాము. అక్కడే మా ఆవిడ ‘అమ్మ ఒడి పేరుతొ ఒక చైల్డ్ కేర్ సెంటర్ మొదలు పెట్టింది. 1987 లో మాస్కో వెళ్ళేవరకు అదే ఇల్లు. తిరిగొచ్చిన తరువాత మకాం పంజాగుట్ట వైపు మారింది. దుర్గానగర్లో రెండిళ్ళు , తరువాత అమీర్ పేటలో మరో ఇల్లు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అవుట్ ఆఫ్ టర్న్ పద్దతిలో కేటాయించిన ఎర్రమంజిల్ ఐ.ఏ.ఎస్.  కాలనీలో, సెకండ్ క్లాసు టిక్కెట్టుతో  ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తున్న అనుభూతితో అక్కడి క్వార్టర్ లో కాపురం.  రిటైర్ కాగానే,  తదుపరి ఎల్లారెడ్డి గూడా. ఇదిగో ఇప్పుడు మాధాపూర్. ఇలా మారుతూ, మారుతూ ఊరి చివరకు చేరుతామేమో తెలవదు. ఒకప్పుడు ఇంట్లో ఒంట్లో బాగా వున్నవాళ్ళు ఊరి నడిబొడ్డున వుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళూ ఊరి పొలిమేరలకు చేరి విల్లాలు కట్టుకుంటున్నారు. మా పక్కన పలానా పెద్దమనిషి వుంటున్నాడని మేమూ చెప్పుకునే రోజు వస్తుందేమో. ఇలా ఇళ్ళు మారడంలో ఓ సులువు కూడా వుంది. కొత్త ప్రాంతాలు, కొత్త వ్యక్తులు  పరిచయం అవుతారు. అదే  కట్టుకున్న సొంత ఇల్లు అయితే, ఒండుకున్న అమ్మకు ఒకటే కూర సామెత చందం.
నిన్ననే మా ఇంటాయన, ఆయన  ఢిల్లీలో ఉంటాడో, విశాఖపట్నంలో ఉంటాడో తెలియకుండానే ఈ ఇంట్లో దిగాము,  ఆయన తాలూకు ఒక పెద్ద మనిషి నిన్న పొద్దున్నే వచ్చి  చల్లటి కబురు చెవులో వేసి వెళ్ళాడు. రెండు నెలల్లో ఖాళీ చేయమని.
మరి, ఈ ఇంట్లోకి వచ్చి దాదాపు రెండేళ్ళు దాటుతోంది కదా! అడక్క వారికీ తప్పదు, ఖాళీ చేయక మాకూ తప్పదు. అంతయు మన మేలునకే అనుకుంటే  పోలా.

బాధ అల్లా ఒక్కటే. మిగిలిన చోట్లతో పోలిస్తే, ఈ మాదాపూర్ లో మానవ సంబంధాలు అంతంత మాత్రం. పావురాలు, మొక్కలతోనే అనుబంధం. దాన్ని తెంచుకోవడం ఎల్లా అన్నదే ఇప్పుడు పట్టుకున్న మనాది.       

27, జూన్ 2016, సోమవారం

ఇలాగా కూడా జరుగుతుంది

కొన్ని విషయాలు వింటుంటే నిజమా అనిపిస్తుంది.
మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి బీటెక్ పాసయింది. ఎం టెక్ కూడా చేసింది. వాళ్ళు వుండేది నల్గొండలో.
సర్వీసు కమీషన్ వాళ్ళు  మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగంలో టెక్నికల్ ఆఫీసరు పోస్టుకు పరీక్ష పెడితే రాసింది. ఇంటర్వూకు పిలిస్తే వెళ్ళింది. ఏదో మోటారు సైకిల్ కంపెనీ వారి ‘ట్యాంకులో పెట్రోలు నింపండి, ఇక మరచిపొండి’ అనే ప్రకటన తరహాలో ఆ విషయం మరిచిపోయింది.
నిన్ననో మొన్ననో ఆమెకు నియామక పత్రాలు పోస్ట్  లో అందాయి. ఆ అమ్మాయికి ఆనందం, ఇంట్లో వాళ్లకి ఆశ్చర్యం.  ఆ ఉద్యోగం కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, ఏ రకం అయిన పైరవీలు చేయలేదు. అందుకే ఆ ఆనందం, అందుకే ఆ ఆశ్చర్యం.
ఆర్డరులో చూస్తే బోధన్ పోస్టింగు ఇచ్చారు. ఆ అమ్మాయే ధైర్యం చేసి ఆ విభాగం చీఫ్ ఇంజినీరును కలిసి ముందు థాంక్స్ చెప్పింది, తరువాత వచ్చిన పని చెప్పింది.
ఆ అమ్మాయికి ఈ సారి ఆనందంతో పాటు ఆశ్చర్యం.
ఎందుకంటే క్షణాల్లో ఆ ఆర్డరు మార్చి బోధన్ బదులు నల్గొండకు పోస్టింగు  ఇచ్చారు.
పైరవీ లేదు పైసా ఖర్చులేదు. ఆ కుటుంబం ఆనందమే ఆనందం.

(ఘంటా చక్రపాణి గారూ వింటున్నారా!)  

25, జూన్ 2016, శనివారం

ఎమర్జెన్సీ విశేషాలు


ఎమర్జెన్సీతో పాటే పత్రికలపై సెన్సార్ షిప్  విధించారు.
ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చే వార్తలు, ఫోటోలను ముందుగా సెన్సార్ అధికారికి  చూపించి,  ఆయన అనుమతి లభించిన తరువాతనే వాటిని ప్రచురించాల్సిన పరిస్తితులు ఉండేవి.
ఢిల్లీ  స్టేట్స్ మన్  పత్రికలో  ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. అయన పేరు రఘురాయ్ . ఎమర్జెన్సీ విధించిన తరువాత నగరంలో పరిస్తితులను కళ్ళకు కట్టినట్టు చూపే ఒక ఫోటో తీసాడు.
ఒకతను సైకిల్ పై ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకుని దాన్ని తోసుకుంటూ  వెడుతుంటాడు. వెనకనే  అతడి భార్య నడిచి వస్తుంటుంది.
ఆ ఫోటోకి కింద పెట్టిన క్యాప్షన్ ఇలా వుంటుంది.
“చాందినీచౌక్ ప్రాంతంలో  జనజీవనం చాలా సాధారణంగా వుంది”
సెన్సార్ అధికారికి అందులో అభ్యంతర  పెట్టాల్సింది ఏమీ కనిపించలేదు. దాన్ని ఓకే చేసాడు. ఫోటోగ్రాఫర్ తెలివి అతడ్ని పప్పులో కాలేసేలా చేసింది.  ఆ ఫోటో చూస్తే జనజీవనం సాధారణంగా సాగిపోతున్న భావన కలిగే మాట నిజం. కానీ అదే వీధిలో గుంపులు గుంపులుగా గస్తీ తిరుగుతున్న పోలీసులు కూడా ఆ ఫోటోలో లీలగా కనిపిస్తారు. ఆ అధికారి ఆ విషయం  గమనించలేదు.  అంచేత మరునాడు పత్రికలో ఆ ఫోటో అచ్చయింది.
సెన్సార్ అధికారులు తరువాత నాలుక కరుచుకున్నారు. ఆ ఫోటో ప్రచురణకు అనుమతి ఇచ్చిన అధికారిని బదిలీ చేసారు.



అమ్మా నాన్నా ఒక అమ్మాయి


 డియర్ నాన్నా!
ఒక్క క్షణం తండ్రికి చేతులు వొణికాయి. మనసు కీడు శంకించింది. భార్యను పిలుద్దామనుకున్నాడు. లిప్తపాటు  ఆలోచించి ఆలోచన మానుకున్నాడు. మనసు కుదుట పరచుకుని కుమార్తె రాసిన ఉత్తరాన్ని చదవడం ప్రారంభించాడు.
డియర్  నాన్నా! ఇలా నిన్ను పిలిచే అదృష్టానికి నా అంతట నేనే దూరం జరుగుతున్నాను. అల్లారుముద్దుగా, ఏలోటూ తెలియకుండా నన్ను పెంచారు. దానికి ప్రతిఫలంగా నేనిస్తున్న కానుకే ఇది.
కారణం  తెలియదు కానీ, రామూని నేను మరచిపోలేకపోతున్నాను. అందుకే అతడితో వెళ్లి పోతున్నాను. నాన్నా! ఇంత నిస్సిగ్గుగా రాస్తున్నానన్న  కోపంతో   ఉత్తరాన్ని చించేయకండి. దయచేసి చివరదాకా చదవండి నాన్న. దగ్గరగా లేకపోయినా  మీ కంటిలోని తడిని నేను దూరంనుంచే   చూడగలుగుతున్నాను. క్షణంలో భూమి బద్దలయితే బాగుండని అనుకుంటూ  మనసులో మీరు  పడుతున్న  ఆవేదనను అర్ధం చేసుకోగలుగుతున్నాను. ఒక్క విషయాన్ని  మీరూ పెద్దమనసుతో అర్ధం చేసుకోండి నాన్నా. ఇంతవరకు నా జీవితంలో అపరిమితమయిన ప్రేమను పంచి ఇచ్చింది మీరూ అమ్మా మీరిద్దరేఅలాగే నాకో నమ్మకం,  మీకంటే, అమ్మకంటే నన్ను ఇంతగా ప్రేమించేవాళ్ళు లోకంలో మరెవరూ  వుండరని. కానీ రామూ పరిచయంతో నమ్మకం కాస్తా ఆవిరై పోయింది.
రామూ లాంటి వ్యక్తులు మీకు నచ్చరని తెలుసుఅలాగే, అతడికున్న  అలవాట్లను మీరు కలలో కూడా భరించలేరని, క్షమించలేరని  కూడా నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసే సాహసం చేయలేకపోయాను. కానీ,  మీరు తెలుసుకోవాల్సింది కూడా వుంది  నాన్నా. రామూ అంటే నాకు పిచ్చి ప్రేమ. ప్రేమ ముందు అతడి అలవాట్లు, అతడి మొరటుతనం ఏదీ  నాకు ఆనడం లేదు. అతడిమీద ప్రేమతో నా కళ్ళు మూసుకుపోయాయి. అతడి చెడ్డ అలవాట్లన్నీ ఇప్పుడు  నాకు  మంచిగా కనబడుతున్నాయి. అతడి సమక్షంలో  నేను వేరే వ్యక్తిని అన్న భావన కూడా రాదు. అతడికేది ఇష్టమయితే దాన్నే నా ఇష్టంగా మలుచుకోవడం నాకిష్టం. ఇష్టంతోనే  అతడికిష్టమని  నేనూ సిగరెట్లు తాగుతున్నాను. అతడి కోసమే మందు, భంగు అలవాటు  చేసుకున్నాను. రామూ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నా నాకు మరో  విధంగా అనిపించడం లేదు. అంటే అతడిపై నేను ఎంతగా ప్రేమను పెంచుకున్నానో, దాని తీవ్రత ఎంతగా  వుందో దయచేసి అర్ధం చేసుకోండి నాన్నా.
నిజమే! కాదనను. వయస్సులో  మా ఇద్దరి మధ్యా ఎంతో వ్యత్యాసం. కొద్ది అటూ ఇటూగా మీ వయసు అతడిది. అయితేనేంఅతడి  మీద నాకున్న ప్రేమ  కూడా అంతే  పెద్దది. అంతే గొప్పది. అది అర్ధం చేసుకోండి నాన్నా. అన్నీ అర్ధం అయిపోతాయి.
అల్లరి చిల్లరగా తిరుగుతాడనే రామూ వాళ్ల అమ్మా నాన్నా అతడిని వొదిలేశారట. ఇంటి నుంచి తరిమేశారట. స్తితిలో నా తోడు కూడా అతడికి దూరం అయితే ఏమయిపోతాడో అని నా బెంగ. ఇంకో విషయం కూడా మధ్యనే తెలిసింది. దానితో అతడి పట్ల నా జాలి మరింత పెరిగిపోయింది. రామూకు ఎయిడ్స్ అని డాక్టర్లు చెప్పారట. ఇన్ని  రోగాలకు మందులు కనుకున్న శాస్త్ర వేత్తలు ఏదో ఒకనాడు ఎయిడ్స్ కు చికిత్స కనుక్కోలేకపోతారా నేను బాగుచేయించలేకపోతానా చెప్పండి.
బాధ పడకండి డాడ్! ఇప్పుడు నా వయసెంతని. నిండా పదిహేనేళ్ళు కూడా నిండనే లేదు. కాకపోతే నా బాగోగులు నేనే  చూసుకోగల మనస్తయిర్యాన్ని మీ పెంపకంలో అలవర్చుకున్నాను. అదే పదివేలు. ఏదో ఒక రోజు మీ మనుమడిని తీసుకుని రామూని వెంటబెట్టుకుని మిమ్మల్నీ అమ్మనీ చూడడానికి వస్తాను. అంతదాకా సెలవ్ మీ ముద్దుల కూతురు
పీ ఎస్: -  డాడ్పైన రాసినదంతా శుద్ద అబద్ధం. నేను పక్కింట్లో   సుధక్కతో కూర్చుని  చెస్ ఆడుతున్నాను. రామూ లేడూ  సోమూ లేడూ  అంతా ఉత్తిదే. నా స్కూలు ప్రోగ్రెస్ కార్డు కంటే దారుణమయిన విషయాలు లోకంలో ఇంకా చాలా  వుంటాయని చెప్పడానికే ఇదంతా రాశాను. కార్డు పక్కనే సొరుగులో వుంది. చూసీ చూడనట్టుగా చూసి సంతకం పెట్టండి. పెట్టి ఫోను చేయండి. ఇంటికి వస్తాను. (15-07-2011)