16, జూన్ 2016, గురువారం

మంచి ప్రభుత్వం అనిపించుకోవాలంటే......


‘ఎవరి పాలనలో అయితే  పాలకుల ప్రమేయం లేకుండా పాలితులు తమ దినవారీ జీవితాలను నిశ్చింతగా గడపగలుగుతారో ఆ ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం’ అని రాజనీతి శాస్త్రం చెబుతుంది.
ఇప్పటి ప్రభుత్వాలు పాలితులకు అలాంటి పాలన ఇవ్వగలుతున్నాయని చెప్పగలిగిన స్తితి వుందా  అంటే సందేహమే.
సబ్సిడీ బియ్యం కావాలంటే రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు కావాలంటే ఎవరో ఒక ప్రభుత్వాధికారి సంతకం కావాలి. అతగాడికి ఇదొక్కటే పనికాదుకదా!  అంచేత, దానికోసం చెప్పులు అరిగేలా తిరగాలి. ఎవరయినా పుణ్యాత్ముడు దొరికి సంతకం పెట్టినా, మరో  అధికారి ఆదాయం సర్టిఫికేట్ ఏదీ అంటాడు. అది ఇచ్చే ఆయన  అడ్రసు ప్రూఫ్  పట్రా అంటాడు.  అది ఇచ్చేవాడు ఆ అడ్రసులో వుంటున్నది నువ్వే అని  దాఖలా చూపమంటాడు. ఇవన్నీ లేకపోయినా తెలివి మాత్రం వున్నవాడు అన్నీ ఇట్టే పుట్టించి కావాల్సిన  సర్టిఫికేట్లు కావాల్సిన విధంగా ఒక్క రోజులో  తెచ్చుకుంటాడు. తెచ్చుకోలేని వాడు తన అసమర్ధతని ఒక పక్కా, ప్రభుత్వాన్ని మరోపక్కా ఆడిపోసుకుంటూ వుంటాడు. ఇలానే అనేకం. అది ఆసుపత్రిలో వైద్యం కావచ్చు,  బళ్ళో ప్రవేశం కావచ్చు, గుళ్ళో దర్శనం కావచ్చు దేనికైనా ప్రభుత్వం మీద ఆధార పడాల్సిందే. అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందే.   చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడం  అవసరమా?  
‘దుర్భలస్య బలం రాజ’ అంటాడు కౌటిల్యుడు తాను సూత్రీకరించిన ‘మత్య్స న్యాయం’లో.
చిన్న చేపలను పెద్ద చేపలు తినడం అందరూ ఎరిగిందే. సమాజంలోని బలహీనులను బలవంతులు దోచుకోకుండా రాజులు కాపాడాలి అన్నది కౌటిల్యుడు బోధించిన సూక్తి. కానీ, నేటి సమాజంలో పాలకులు ఆ విధంగా బలహీనుల కాపు కాస్తున్నారా అంటే ఔనని చప్పున చెప్పడం కష్టం. కాకపొతే  దారిద్ర్య రేఖకు దిగువన వున్న దరిద్ర నారాయణుల సంక్షేమం కోసం కొన్ని, కొన్ని  పధకాలు ప్రవేశ పెడుతుంటారు. ప్రచార ఆర్భాటం తప్పిస్తే అవి అర్హులకు అందుతున్నాయని, దుర్వినియోగం కావడం లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పలేని పరిస్తితి. కాకపొతే,   ఈ సంక్షేమ పధకాల పుణ్యమా అని కొందరు దళారులు కోటికి పడగలెత్తుతున్నారనేది కాదనలేని వాస్తవం. పూటకో పధకం తెచ్చాం అని ప్రకటించుకోగానే పాలన బాగున్నట్టు కాదు. అమలు కాని పధకాల వల్ల లాభపడేది కేవలం ప్రకటన కర్తలు మాత్రమే. రోజుకో కొత్త చొక్కా తొడుక్కున్నంత మాత్రాన పండగ కాదు కదా!  
సమాజంలో ప్రజలందరూ తినాకుడవా సమృద్ధిగా  వున్నట్టు పైకి కనబడాలంటే కొందరు అవి లేనివాళ్ళు కూడా వుండాలి అని వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు. రైలు బోగీల్లో రెండో తరగతి వున్నప్పుడే మొదటి తరగతికి ఆ హోదా, ఆ  భోగం అన్నది వాళ్ళ థియరీ.   
రాజులు ఎలా పాలించాలి అనే విషయంలో  శుక్రుడు, విదురుడు, చాణక్యుడు మొదలయిన వారు ప్రవచించినవి రాజనీతి శాస్త్రాలుగా ప్రసిద్ధి పొందాయి. భర్తృహరి ‘నృప నీతి అనేక రీతి’ అంటూ సూత్రీకరించాడు. ప్రజల పట్ల రాజులు ఎలా వ్యవహరించాలి అన్నదే ఈ శాస్త్రాలు అన్నింటిలో కీలకాంశం.
శ్రీకృష్ణ దేవరాయలు ఓ చెంప రాజ్య పాలన చేస్తూనే, మరో వంక సాహితీ సేద్యం చేసేవారట. అలా  ఆయన  సాహిత్య క్షేత్రంలో పుట్టుకొచ్చినదే ‘ఆముక్తమాల్యద’ కావ్యం. అందులో యమునాచార్యుల చేత రాయలవారే తన మనసులోని మాట చెప్పిస్తారు.’ రాజ్యాంతే నరకం ధృవం’ అని. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాడు. కారణాలు అనేకం వుండొచ్చు కానీ తప్పనిసరై కొన్ని హింసలకు పాల్పడతాడు. మరిక నరక ప్రాప్తి తప్పదు కదా!
ఈ పాపపరిహార్ధం రాజులు యాగాలు, యజ్ఞాలూ చేసేవాళ్ళు. మరి వాళ్లకు పుణ్యలోకాలు సిద్ధించాయో, నరకలోకమే ప్రాప్తించిందో వెంటబోయి, వెనక్కి వచ్చి  చెప్పినవాళ్ళు ఎవరూ లేరు. కానీ వారి పరిపాలన వల్ల జనాలు సుఖపడ్డారా లేక కష్టపడ్డారా అన్నది ఒక్కటే  మంచిచెడ్డల ఎంపికకు సరయిన గీటురాయి.
ఒకసారి నాకు బాగా  తెలిసిన పెద్ద మనిషికి ఒక పెద్ద పదవి దక్కింది. అంతా వెళ్లి శుభాకాంక్షలు చెబుతున్నారు. నేనూ వెళ్లి చెప్పాను. యేమని?
“మంచి అవకాశం లభించింది మీకు. అవసరంలో వున్నవారికి అడగకుండానే సాయం చేయండి’
ఆయనకు మరోలా అర్ధం అయినట్టు వుంది. అధికారంలో వున్నన్నాళ్ళు అవసరం పడ్డ వాళ్లకు బాగానే సాయపడ్డాడని ప్రతీతి.
సాక్షరా విపరీతాశ్చేత్ అని హితోపదేశం చెబుతోంది.  అంటే అక్షరాస్యులు విపరీత మనస్కులు అయితే  రాక్షసులు అవుతారని అర్ధం. ఇప్పుడు సాక్షరులు అంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు.  సాంఘిక మాధ్యమాల్లో వీరి విశృంఖల వీర విహారాలు చూస్తుంటే, ‘సాక్షరా తిరగేస్తే రాక్షసా అవుతుంద’ని కీర్తిశేషులు ఆర్వీయార్  చెప్పిన మాట గుర్తుకు వస్తుంది.
రాజకీయాలు రాయడం పత్రికల ప్రధాన వ్యాపకం. ఈ నింద మోస్తూ కూడా అప్పుడప్పుడూ ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తుంటాయి. అవి రాసే ప్రతివార్తను రాజకీయ కోణంలో చూడకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ప్రజలు సుఖపడతారు. వెనుకటి రోజుల్లో ప్రజల కష్టాలను  స్వయంగా గమనించడానికి రాజులు మారువేషాల్లో తిరిగేవారు. లేదా వారి వేగులు ఈ పని చక్కబెట్టేవారు. ఇప్పుడూ ప్రభుత్వంలో ఈ పనులు చూడడానికి ఒక ప్రత్యేక నిఘా విభాగమే వుంది. ప్రతిపక్షాల మీద కన్నేసి వుంచడంలోనే వారి  పుణ్యకాలం గడిచిపోతోంది. ఇక ప్రజల ఇబ్బందులు ఎక్కడ పట్టించుకుంటారు. కావున,  ఏలినవారికి నచ్చినా నచ్చకున్నా, ఈ పనికి కొంతలో కొంత పత్రికల మీద ఆధారపడడమే మేలు.
జనాలకు ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా చేయండి. ఆ  ప్రభుత్వాలను జనమే నెత్తిన పెట్టుకుంటారు.
ఉపశృతి:
గ్రామ రెవెన్యూ  అధికారి దగ్గరికి వెళ్ళాడు తిరుపతయ్య చిన్న పని మీద.
'ఇదిగో ఇప్పుడే వస్తా! ఎమ్మార్వో గారు వెంటనే రమ్మనమని ఫోను. గంటలో తిరిగొస్తా, ఇక్కడే కూర్చో' అంటూ వీఆర్వో  మోటారు సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు.  
వీఆర్వో ఆఘమేఘాల మీద వెళ్లేసరికి ఎమ్మార్వో  అతడికోసమే ఎదురుచూస్తున్నట్టు మొహం పెట్టి, ‘వచ్చావా! మొన్న చెప్పాను చూడు...' అంటూ ఉండగానే ఆయన చేతిలో సెల్లు ఘల్లున మోగింది. కంగారుగా వింటూనే  అంతకంటే కంగారుగా 'ఇదిగో ఇప్పుడే  జేసీ గారు వున్నఫలాన రమ్మంటున్నారు, మాట్లాడి ఇప్పుడే వస్తా కూచో' అంటూ అంతకంటే  కంగారుగా వెళ్ళిపోయాడు ఎమ్మార్వో జీపెక్కి.  జేసీ గారి ఆఫీసుకు చేరి కనుక్కుంటే ఆయన పియ్యే చావు కబురు చల్లగా చెప్పాడు. 'మిమ్మల్ని రమ్మనమని ఫోను చేసారా, అలా రమ్మనమని కలెక్టరు దొరగారి ఫోను. పని చూసుకుని వస్తారు కూర్చోండి’ అన్నాడు తాపీగా.
అక్కడ జేసీ గారికి కలెక్టర్ ఆఫీసులో ఇదే సీను. 'మంత్రి గారు కబురు పెడితే వెళ్ళారు, వస్తారు కూర్చోండి’ అంటూ క్యాంప్ క్లర్కు మర్యాద.
కలెక్టర్ గారి  కారు మంత్రి గారి బంగ్లాలో ప్రవేశిస్తూ ఉండగానే గేటు దగ్గరే ఎదురొచ్చింది మంత్రి గారి వాహనం. 'ఇదేమిటి  రమ్మనమనిచెప్పి  ఆయన ఎటు వెడుతున్నట్టు' అని  అనుకుంటూ ఉండగానే సెల్లు మోగింది. అవతల మంత్రి గారు. 'చూడండి కలెక్టర్ గారు, అర్జెంటు పనిమీద రమ్మన్నాను. కానీ ఈలోగా సీఎం గారి నుంచి కబురు, వెంటనే రమ్మనమని. వెళ్లి వస్తా  కాసేపు వెయిట్ చేయండి, ఏమనుకోవద్దు'
మంత్రిగారు సీఎమ్ ఇంటికి వెళ్లేసరికి ఆయన ఢిల్లీ ఫోనులో వున్నారు. అది తెమిలేసరికి రాత్రి ఎనిమిదయింది. మంత్రిగారిని చూస్తూనే ఆయన అన్నారు 'అయ్యో ఇంతసేపు వెయిట్ చేస్తున్నారా. ఏదో చిన్న విషయం మాట్లాడదామనుకున్నాను. మళ్ళీ చూద్దాం లెండి' అన్నారు 'మళ్ళీ రండి' అన్న భావం కళ్ళల్లో ప్రదర్శిస్తూ.
అక్కడ వూళ్ళో వీఆర్వో గారింట్లో తిరుపతయ్య, ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్వో, జేసీ కార్యాలయంలో ఎమ్మార్వో, కలెక్టర్  క్యాంప్ ఆఫీసులో జేసీ, మంత్రి బంగాళాలో కలెక్టర్, ముఖ్యమంత్రి నివాసంలో మంత్రిగారు - అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా గడ్డాలు, మీసాలు పెంచుకుంటూ ఎదురుచూపులు.  
సరదాకు రాసిందే అయినా కొంత నిజం లేకపోలేదు. ఔనా!
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595


3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

1000%

Unknown చెప్పారు...

guntur district lo rooju jarigedi ede ....bhale raasaru

నీహారిక చెప్పారు...

పాపపరిహార్ధం రాజులు యాగాలు, యజ్ఞాలూ చేసేవాళ్ళు. మరి వాళ్లకు పుణ్యలోకాలు సిద్ధించాయో, నరకలోకమే ప్రాప్తించిందో వెంటబోయి, వెనక్కి వచ్చి చెప్పినవాళ్ళు ఎవరూ లేరు :p