2, జూన్ 2016, గురువారం

ఓ జ్ఞాపకం



హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు  ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగిన రోజుల్లో ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగానో, పీసీసీ అధ్యక్షుడిగానో వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వచ్చి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని  పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో  వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. కాసేపట్లో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు ప్రెస్ క్లబ్ దగ్గర ఆగకుండా  గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే ముందుకు వెళ్ళిపోయింది. నేను వెంటనే కేవీపీ కి ఫోన్ చేశాను. ఆయన ‘అర్రెర్రే బషీర్ బాగ్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ  వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.         

కామెంట్‌లు లేవు: