11, జూన్ 2016, శనివారం

2005 తానా సభలు – ఓ జ్ఞాపకం



2005 జులై మొదటి వారంలో అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో తానా సభలు జరిగాయి. ఆ రోజుల్లో దూరదర్శన్ లో పనిచేస్తున్ననేను, నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ సభలకు హాజరయ్యాను.  అక్కడినుంచి దూరదర్శన్  వార్తలకోసం పంపిన కొంత సమాచారం పాత కాగితాలు వెతుకుతుంటే కనిపించింది.  అదే ఇది.
“మోటారు వాహనాల పరిశ్రమకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెరికన్  నగరం డెట్రాయిట్  లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం , తానా  ద్వైవార్షిక సభలు ఘనంగా మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, పీసీసీ అధక్షుడు కే. కేశవరావు, రాష్ట్ర మంత్రులు నేదురుమల్లి  రాజ్యలక్ష్మి, నాయని నరసింహారెడ్డి, పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, వీ.హనుమంత రావు, వై.ఎస్.వివేకానంద రెడ్డి, మధుయాష్కీ, శాసన సభ్యులు ఎర్రబల్లి దయాకరరావు, నాగం జనార్ధనరెడ్డి  ప్రభ్రుతులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ వేడుకలకుహాజరయ్యారు. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగువారు సుమారు ఎనిమిది వేలమంది  మూడురోజులపాటు జరిగే ఈ సభలకు తరలివచ్చారు.


“డెట్రాయిట్  మాజీ  మేయర్ , కీర్తిశేషులు  ఆల్బర్ట్ కోబో పేరిట నిర్మించిన సువిశాల సభామందిరంలో తానా సభలు మొదలయ్యాయి. 1960 లో  ఈ  ప్రాంగణాన్ని మొత్తం ఇరవై నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో ప్రదర్శనలు, సదస్సులు సమావేశాలు నిర్వహించుకోవడానికి  సుమారు ఏడులక్షల ఇరవై మూడువేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన  మందిరాలు  సకల వసతులతో  కొలువై వున్నాయి. 




ఆహూతులుగా వచ్చిన పలువురు తెలుగు సినీ కళాకారులు సమర్పించిన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా సభికులను ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లో విలువలు,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటిపారుదల రంగాలపై ప్రత్యేక  గోష్టులను  తానా సభల్లో  భాగంగా నిర్వహించారు. అంశం ఏదైనప్పటికీ చర్చ తెలంగాణా వైపుగానే సాగడం విశేషం. ప్రసంగించిన వక్తలు ప్రధాన అంశాన్ని పక్కనబెట్టి, తమదయిన రాజకీయ కోణంతో చర్చను మళ్ళించాలని ప్రయత్నించినప్పుడల్లా, వారిని చర్చనీయాంశం వైపు తిప్పుకు రావడానికి సదస్సుకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ ఐ. వెంకట్రావ్  చాలా శ్రమ పడాల్సి వచ్చింది. హాజరయిన ప్రేక్షకుల ప్రతిస్పందనను గమనిస్తే, వారిలో అధికులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వున్నట్టు కానవచ్చింది.
“తానా సభలను పురస్కరించుకుని కొందరు తెలుగు ప్రముఖులను సన్మానించారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ మాజీ  వైస్  చాన్సలర్ భద్రిరాజు కృష్ణమూర్తిని గిడుగు రామమూర్తి స్మారక పురస్కారంతో గౌరవించారు. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు,ప్రసిద్ధ పరిశోధకులు డాక్టర్ సి.ఆర్. రావు, పత్రికా సంపాదకుడు వ్మూరి బలరాం పురస్కార గ్రహీతల్లో వున్నారు.
“తానా ప్రస్తుత అధ్యక్షులు గొర్రెపాటి నవనీత కృష్ణ నుంచి కొత్తగా ఎన్నికయిన బండ్ల హనుమయ్య తానా నూతనాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలోని పలు నగరాల్లో హోటల్ పరిశ్రమను విస్తరించడం ద్వారా ప్రసిద్దికెక్కిన కోమటి జయరాం తానా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అట్లూరి సుబ్బారావు తానా మహాసభల సంధానకర్తగా వ్యవహరించారు.

“విదేశీ గడ్డపై నివసిస్తూ తెలుగు  సంస్కృతికి  దూరంగా ఉంటున్నప్పటికీ దాన్ని కాపాడుకోవాలనే  వారి తపన మెచ్చదగింది. అయితే  పెళ్లి సంబంధాలకోసం, వైభవ ప్రదర్శన కోసం కొందరు ఈ వేదికలను దుర్వినియోగం చేస్తున్నారనే అపవాదును తొలగించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది” (జులై, 2005)                 

కామెంట్‌లు లేవు: