4, జూన్ 2016, శనివారం

అందరూ బాగుండాలి


ఈ భావన యెంత గొప్పది.
మనం అందరి మంచి కోరితే మనకి కూడా మంచి జరుగుతుంది. లోకమంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉండడం వల్ల ఎల్లప్పటికీ మనకు మంచే జరుగుతుంది. 
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తాః సుఖినో భవస్తు
ఈ శ్లోకంలోని పరమార్ధం ఇదే. ఇదే అయినప్పుడు గోవులు, బ్రాహ్మణులు శుభంగా వుంటే సరిపోతుందా  అనే కుశంక ఒకటి ఎలాగు వుంది. దీనికి జవాబు కంచి పరమాచార్య ఏనాడో  తానూ రాసిన ‘హిందువుల ధర్మంలో చెప్పారు.
పూర్వాచారాలు పాటించే బ్రాహ్మణ కుటుంబాల్లో వైశ్వదేవం అని చేస్తారు. భోజనం చేసే ముందు చేసే బలిహరణం అన్నమాట. దాన్ని ఆంతర్యం చాలా గొప్పది. మనం వుంటున్న ఈ భూమండలానికి పైనా కిందా అనేక లోకాలు వున్నాయి. వాటిల్లోని ఎన్నో కోట్ల జీవరాశులకు తృప్తి కలిగించడం దీని ఉద్దేశ్యం. ఈ విధమైన భూత తృప్తి భోజనానికి ముందూ తరువాత చేయడం విధాయకం. ఉత్తరాపోసన పట్టేటప్పుడు ‘ఇతర ప్రాణులను ఉద్దేశించి ఇది చేయడం జరుగుతోంది’ అని చెబుతారు.
బ్రాహ్మణులే కాదు ఇలా ఎవరయినా చేయవచ్చు. సమస్త భూతరాశి తృప్తి కోసం ప్రార్ధించవచ్చు. బ్రాహ్మణులకు ఇది విధాయకం కనుక వారు శుభంగా వుండి ప్రార్ధిస్తే సమస్త జీవ రాశులకు శుభం కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఆ శ్లోకంలో పేర్కొన్నారు. గోవులు బాగా వుంటే ఇక చెప్పేది ఏముంది.
ఇలా భోజనాత్పూర్వం సకల జనుల తృప్తి కోసం ప్రార్ధన చేయడం అనేది అనేక దేశాల్లో వుంది.
మిసెస్ సూజన్ విల్సన్ బెల్ వ్యూ లోని ఒక పాఠశాలలో టీచరు. ఆవిడ భర్త మిస్టర్ గోర్డన్ - రెడ్మండ్ టౌన్ సెంటర్ లోని కార్యాలయంలో పనిచేస్తారు. వారికి అయిదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయాయి. మిగిలిన ముగ్గురి చదువులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. హాస్టళ్ళలో వుంటున్నారు. ప్రస్తుతానికి భార్యాభర్తా ఇద్దరే బెల్ వ్యూ లోని సొంత ఇంట్లో వుంటున్నారు. కొన్నేళ్ళ క్రితం మేము సియాటిల్  లో ఉంటున్న మా పిల్లలకోసం అమెరికా వెళ్ళినప్పుడు సూజన్ దంపతులు  ఒక రాత్రి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఇల్లు పొందికగావుంది. ముందూ వెనుకా విశాలమయిన ఖాళీ జాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే నల్లటి రంగులో తళ తళ మెరిసిపోతూ పియానో దర్శనమిచ్చింది. దాని పక్కనే మరింబా అనే మరో సంగీత వాయిద్యం.
 శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లులా ఇంట్లో అంతా సంగీత వాతావరణం. సాధారణంగా అమెరికన్లు బయటవారిని ఎవరినీ భోజనాలకు ఇళ్లకు పిలవరు, అంతగా పిలవాల్సి వస్తే హోటల్లో డిన్నర్ ఇస్తారని చెప్పుకునేవాళ్ళు. అందుకే మేము వాళ్లు పిలిచినప్పుడు కొంత సందేహిస్తూనే వెళ్ళాము. కానీ వారి ఆదరణలో కృత్రిమత్వం ఏమీ కనిపించలేదు. పైగా సాయంత్రం మొత్తం మాతోనే గడపడానికి సిద్దమయినట్టు కనిపించారు. ఇండియానుంచి, అదీ దక్షిణ భారతం నుంచి వచ్చిన శాకాహారులమని తెలిసి వంటకాలను తయారుచేసినట్టున్నారు. అందరం కలసి భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోజనం చేసాము. అంతకు ముందు మిస్టర్ గోర్డన్, మిసెస్ విల్సన్ ప్రార్ధన చేసారు.
! లార్డ్! ఇండియానుంచి వచ్చిన అతిధులు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మా పిల్లలు నిరుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు వీరు వారిని చక్కగా చూసుకున్నారు. వారికి ఇలా భోజనం పెట్టగలిగే అవకాశం కల్పించిన నీకు కృతజ్ఞతలు.
మా బామ్మ గారు జ్ఞాపకం వచ్చారు. భోజనానికి ముందు ఆవిడ తప్పకుండా దేవుడి ప్రార్ధన చేసేవారు.
అమెరికన్లు అనగానే విందుతో పాటు మందు అనే దురభిప్రాయం తొలగిపోయేలా మా భోజనం పూర్తయింది. తరవాత మిసెస్ విల్సన్ చక్కటి పాటలు పాడారు. మిస్టర్ గోర్డన్ పియానోతో సహకారం అందించారు. డిజర్ట్ సర్వ్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు నెమరు వేసుకున్నారు. భాష అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయినా వారి ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాము.
కావున, చెప్పేది ఏమిటంటే మంచి అనేది విశ్వవ్యాప్తంగా వుంటుంది. ఒకరి సొంతం కాదు.
(04-06-2016)

  

2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...బాగుందండీ మీ స్వస్తి ప్రజాభ్యః !


అందరు బాగుండాలి! మ
నందరి మదిలో జిలేబి యందము గానన్
విందులన బిలిచిరి భళీ !
అందుకు భండారు జోతలందించిరిటన్!

చీర్స్
జిలేబి

Lalitha చెప్పారు...

మీ అమెరికన్ స్నేహితులింట విందు విశెషాలు బావున్నాయండీ!