30, అక్టోబర్ 2021, శనివారం

నాకు తెలిసింది సున్నా! – భండారు శ్రీనివాసరావు


చాలామంది అడుగుతుంటారు అభిమానం కొద్దీ, 'మీకు ఇన్నిన్ని విషయాలు ఎలా తెలుసు' అని. కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే 'నాకు తెలిసింది సున్నా' అని.
కొన్నేళ్ళ క్రితం ఇంటింటి సర్వే వాళ్ళు వచ్చి అడిగారు, 'మీ మండలం ఏమిటి, మీ పోలీసు స్టేషన్ ఏమిటీ' అంటూ. నోరెళ్ళబెట్టడం తప్ప నేనేమీ చెప్పలేకపోయాను. నేనున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళే రాసుకుపోయారు కాబట్టి నా అజ్ఞానం పూర్తిగా బయటపడలేదు.
ఒక విషయం మాత్రం నేను రూడిగా చెప్పగలను. అన్నీ తెలుసనుకుంటాం కానీ, చాలామందికి కొన్నే తెలుసు. ఆ తెలిసినవాటిలో కూడా చాలావరకు మిడిమిడి జ్ఞానం బాపతు. అయితే తెలియచెప్పడంలో కాస్త చాకచక్యం చూపిస్తే మనలో నిండి నిబిడీకృతంగా వున్న అజ్ఞాతిమిరం చాలావరకు అంధకారంలోనే వుండిపోతుంది. సరే! ముందు ఈ అంధకారంలో నుంచి బయటపడి అసలు విషయం మాట్లాడుకుందాం.
నేను రేడియోలో పనిచేసేటప్పుడు అనేకమంది రాజకీయ నాయకులు ప్రకటనలు (డబ్బు చెల్లించే వాణిజ్య ప్రకటనలు కాదు, ఏదైనా అంశం మీద తీవ్రాతితీవ్ర ఖండనముండనలు, హర్షాతిరేక ప్రకటనలు, ప్రగాఢ సంతాపసందేశాలు వగయిరా అన్నమాట) పట్టుకుని వస్తుండేవారు. వారిలో ఎక్కువమంది వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ వారిలో మాజీలు వుండేవారు. వారిలో మళ్ళీ చాలామంది, వారివారి నొసటిరాత ప్రకారం మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా మారి, వారి వారి ఛాంబర్లలోనే విలేకరుల సమావేశాలు పెట్టే స్థాయికి ఎదిగిపోయేవారు. అదివేరే కధ.
అజ్ఞానం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఇలా ప్రకటనలు పట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళ లెటర్ హెడ్లమీద చక్కగా ఇంగ్లీష్ లో టైపు చేయించుకుని తెచ్చేవాళ్ళు. ఒకనాడు ఒక పెద్దమనిషి, నిజంగా పెద్దమనిషే సుమా, మా వద్దకు వచ్చి ఒక ప్రకటన పాఠం చేతికి ఇచ్చారు. లెటర్ హెడ్డు మీద పలానా నియోజకవర్గం ఎంపీ అని వుంది. నా మట్టి బుర్రకు యెంత పనిచెప్పినా ' నా ముందు కూర్చుని వున్న ఈ ఎంపీ ఆ నియోజకవర్గపు ప్రస్తుత ఎంపీ ఒకరు కాదు' అని చెబుతూనే వుంది. లెటర్ హెడ్డు అధికారికంగా అన్ని హంగులు, మూడు సింహాల గుర్తుతో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కాసేపు ఆ ప్రకటన చదువుతున్నట్టుగా పరకాయించి చూసే సరికి విషయం అర్ధం అవడమే కాకుండా ఆ పెద్దమనిషి మీద జాలి కూడా వేసింది. ఎందుకంటె ఆయన నిజంగా ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు సభ్యుడే. కానీ ప్రస్తుతం కాదు. గతంలో ఎప్పుడో అయిదేళ్ళు ఎంపీగా పనిచేసిన పెద్దాయనే. అయితే ఇప్పుడు మాజీ. 'అశ్వద్ధామ హతః' అన్నట్టు పేరు హోదా పెద్దగా వేసుకుని కింద చిన్న అక్షరాలతో పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అని బ్రాకెట్లో చిన్న అక్షరాలలో ముద్రించారు. అది చూసి 'ఇంకా అడిగిన వాడ్ని కాదు' అని నాకునేనే సమాధాన పడ్డాను.
ఆ విధంగా నా అజ్ఞానం బయటపడే సమయంలో అది బయటపడకుండా నేను జాగ్రత్తగా బయటపడడం వల్ల, ఇదిగో ఇప్పుడిలా, కొంతమందయినా 'నాకు అన్నీ తెలుసు' అని అనుకునేట్టు చేయగలుగుతున్నాను. కానీ, ముందే చెప్పినట్టు, 'నాకు బాగా తెలుసు, నాకు తెలిసింది సున్నా' అని.
తోక టపా: రేడియో 'ప్రకటనకర్త'ల్లో ఒకాయన గురించి చెప్పుకోవాలి. వారంలో రెండు రోజులు ఏదో ఒక 'ఖండన ముండన' ప్రకటన పట్టుకుని వచ్చేవాడు. రాగానే, 'ఇవ్వాళ ఎవరయినా పోయారా, పొతే సంతాపం ప్రకటించేవాళ్ళల్లో నా పేరు కూడా పెట్టండి' అనే వాడు. పోయినవాళ్ళు ఎవరో కూడా తెలియకుండానే సంతాపం చెప్పిన పుణ్యం ఎక్కడికి పోతుంది ? కొన్నాల్టికి, రాష్ట్రంలో ఒక పెద్ద దేవస్థానం కమిటీ సభ్యుడు అయ్యాడు.



29, అక్టోబర్ 2021, శుక్రవారం

ఆరు ఆటంబాంబులతో కాపురం – భండారు శ్రీనివాసరావు

 1975 లో హైదరాబాదుకు వచ్చినప్పుడు కొత్త కాపురం ఇబ్బందులు  ఎలా ఉంటాయో ఏమిటో తెలియకుండా, అశోక్ నగర్ చమన్ దగ్గర  మా రెండో  అన్నయ్య రామచంద్రరావు గారింట్లో కొన్నాళ్ళు కాలక్షేపం చేశాము. తర్వాత వాళ్ళ పక్కనే ఉన్న  ఇంట్లో చిన్న వాటా దొరికితే అక్కడకు మారాము. ఇల్లుగలవాళ్ళు ఆ ఇంటిని ఎవరికో అమ్మివేయడంతో వాళ్ళకీ, మాకూ ఆ ఇంటితో రుణం తీరిపోయింది. మళ్ళీ ఇల్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి. సరే! ఎక్కువ వెతుకులాట, ప్రయాస లేకుండానే చిక్కడపల్లి త్యాగరాయ గానసభ సమీపంలో ఒక పోర్షన్ దొరికింది. మాస్కో వెళ్ళే దాకా అక్కడే మా ఆల్ మకాం.  ఆ ఇంటి వాస్తు మహిమ ఏమోకానీ ఎప్పుడూ నలుగురు వచ్చేపోయేవాళ్ళతో కళకళలాడుతూ వుండేది. పగలల్లా మా ఆవిడ నడిపే అమ్మవొడి, సాయంత్రం అయ్యేసరికి రచయితలు, కవులు, ఉన్నతాధికారులతో కూడిన  ఆస్థానంగా మారిపోయేది. ఆఫీసునుంచి నా రాకతో నిమిత్తం లేకుండా జనం జమ అయ్యేవారు. వాళ్లకు, కాఫీలు, ఉప్మాలు, కొండొకచో అర్ధరాత్రి భోజనాలతో మా ఆవిడ నిర్మల అన్నీ అమర్చిపెట్టేది. ఇవన్నీ చూసి రేడియోలో నా సహచరులు, న్యూస్ రీడర్,  ప్రముఖ రచయిత డి. వెంకట్రామయ్య గారు, వండ నలయదు వేవురు వచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌ నతనిగృహిణి” అనేవారు, మనుచరిత్రలో అల్లసాని పెద్దన గారి పద్యాన్ని ఉటంకిస్తూ. అనడమే కాదు తన జీవిత చరిత్ర గ్రంథంలో  పేర్కొన్నారు కూడా.  

ఇదలా ఉంచుదాం.

‘పొయ్యి పైనా, పొయ్యి లోపలా వున్నవాడే కలవాడు అనేది మా బామ్మగారు. అంటే నలుగురికి సమృద్ధిగా  వండి పెట్టే సరుకులు, పొయ్యి వెలిగించడానికి ఎండు కట్టెలు ఎల్లప్పుడూ ఇంట్లో వుండాలి అనేది ఆవిడగారి మన్ కి బాత్.

ఆ రోజుల్లో లాగా కట్టెల బాధ ఇప్పుడు లేదు. వచ్చిన బాధల్లా  గ్యాస్  సిలిండర్ ఖాళీ అయితేనే. సింగిల్ సిలిండర్ సిస్టం కావడం వల్ల గ్యాస్ అయిపోతే ప్రత్యామ్నాయం వుండేది కాదు. ఆ కాలంలో సామాన్య గృహస్తుకు డబ్బుతో పాటు బాగా కటకటగా ఉండేవి  మరో మూడు. కరెంటు, నల్లా నీళ్ళు, గ్యాస్ సిలిండరు.    

ఇంట్లో నిత్యం జరిగే సంతర్పణలు, సమారాధనలు, సంభారాల భారంతో  నిమిత్తం పెట్టుకోకుండా అవన్నీ అంతా మా ఆవిడ భుజాల మీదకు వదిలేసి, కొరతలుగా ఉన్న ఈ మూడింటి సంగతి చూడడానికి, అధికార దుర్వినియోగం ఆనండి, ఏదైనా అనండి ఎంతదూరం అయినా వెళ్ళేవాడిని. నీళ్ళు రాని రోజున ఏకంగా మంచినీళ్ళ మంత్రి, ఆయన్ని అలానే పిలిచేవాడిని,  మునిసిపల్ శాఖ మంత్రి, బండారు సత్యనారాయణ మూర్తిగారికి పొద్దున్నే ఫోన్ కొట్టేవాడిని. ఆయన విసుక్కోకుండా ‘ట్యాంకర్ కావాలి కదా పంపిస్తాను అనేవారు. అన్నట్టే అరగంటలో మంచి నీళ్ళ ట్యాంకర్ వచ్చి సంపులో  నీళ్ళు నింపి పోయేది మా  ఇరుగు పొరుగుకు కూడా సరిపోయేలా.   

అలాగే కరెంటు. పోవడం ఆలస్యం, విద్యుత్ బోర్డుచైర్మన్ నార్ల తాతారావు గారెకి ఫోన్. ఆయన నా బాధ పడలేక మా ఇంటి దగ్గరలోనే ఓ ట్రాన్స్ ఫార్మర్ వేయించారు.

పొతే మూడోది మరీ ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్. ఖాళీ అయిందని మా ఆవిడ ఫోన్ చేసి చెప్పడం ఆలస్యం అన్ని పనులు వదిలిపెట్టి ఆ పనిమీదనే  కూర్చొనే వాడిని.        

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో తెలిసిన జనరల్ మేనేజర్లకు ఫోన్ చేసేవాడిని. అరగంటలో సిలిండర్ డెలివరీ అయిన సంగతి తెలిసిన  తర్వాతనే ఆఫీసు పనయినా  ఏదైనా. నా బాధ ప్రపంచం బాధ అన్నట్టు సాగేది నా వ్యవహారం. అదేమిటో ఆ రోజుల్లో ఒక సిలిండర్ ఇరవై రోజులు కూడా వచ్చేది  కాదు. ఇప్పుడు రెండు నెలలు వస్తోంది. ఈ ఖర్చులు అయితే తగ్గాయి. కానీ మరో రూపంలో పెరిగాయి. పక్షి పిల్లలు రెక్కలు వచ్చి ఎగిరి పోయిన తర్వాత గూడు విశాలమైనట్టు ఇప్పుడు  ఇళ్లు కూడా ఖాళీగా, విశాలంగా  కనిపిస్తున్నాయి.

ఆ తర్వాత అయిదేళ్లు ఇలాంటి ఏ కొరతలు లేని సోవియట్ యూనియన్ లో కాలుమీద కాలేసుకుని దర్జాగా బతికాము. దేనికీ కొరతలేదు, చివరాఖరుకి డబ్బుకు కూడా. పైగా గ్యాసు, కరెంటు, ఫోను, మూడు పడక గదుల ఇల్లు ఉచితం. దాంతో వారానికి రెండు మార్లు, వారాంతపు రోజుల్లో  మాస్కోలోని తెలుగు విద్యార్ధులతో, తెలుగు కుటుంబాలతో  మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చ తోరణం.

ఇక అయిదేళ్ళ ప్రవాస జీవితం తర్వాత తిరిగి వస్తే, హైదరాబాదు ఎయిర్ పోర్టులోనే నాటి కమ్యూనికేషన్ల మంత్రి రంగయ్య నాయుడు గారు కలిసి ఫోన్ లేకపోతె ఎల్లా అంటూ ఆయనే చొరవ తీసుకుని  ఫోన్  కనెక్షన్  మంజూరు చేశారు. డిపార్ట్ మెంటు వాళ్ళు మర్నాడు  ఫోను, లాంగ్ కార్డు పట్టుకుని రేడియో స్టేషన్ కు వచ్చారు, ఇల్లెక్కడ అడ్రసు చెప్పండని అంటూ. అప్పటికి రెంటుకు ఇల్లే దొరకలేదు. మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారింట్లో ఉంటున్నాము.

ఆకస్మికంగా వచ్చి పడ్డ ఫోన్ కోసం ఇంటి వేట ముమ్మరం చేశాము. చివరికి పంజాగుట్టలోని మా అన్నయ్య ఇంటికి దగ్గరలోనే దుర్గానగర్ కాలనీలో ఓ ఇల్లు దొరికింది. ఓడలో మాస్కో సామాను వచ్చేలోగా  దగ్గరలో ఉన్న మరో పెద్ద ఇంటికి మారాము. అద్దె రెండు వేలు. లంకంత కొంప. ఇంటివాళ్ళు ముస్లిమ్స్. ఎక్కడో ఏదో దేశంలో వుంటారు. ఆ ఇల్లు కట్టిన తాపీ మేస్త్రీకి  చిన్న చిన్న గదులు కట్టడం తెలియదల్లె వుంది. అన్నీపెద్ద పెద్ద  హాల్సే. ఇల్లంతా కట్టిన తర్వాత చూసుకుంటే వంటిల్లు కనబడనట్టుంది. ఏదో చిన్న జాగా చూసి వంట గది అనిపించాడు. ఆ ఇంట్లో మా మాస్కో సామాను భేషుగ్గా సరిపోయింది కానీ సిలిండర్లకు ఆ చిన్న కిచెన్ లో  జాగా దొరకలేదు. దాంతో వున్న ఆరు సిలిండర్లలో  ఒకటి స్టవ్ కు బిగించి, మిగిలిన అయిదింటినీ బయట హాల్లో దసరా బొమ్మల కొలువులా వరసగా పెట్టేవాళ్ళం.

ఆరు సిలిండర్లు కధ ఏమిటంటారా!

నేను మాస్కోనుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే అప్పటి పెట్రోలియం మంత్రి చింతా మోహన్ గారు ఓ రెండు,  ఎంపీలు డాక్టర్ మల్లు రవి, రాయపాటి సాంబశివరావు గార్లు చెరి రెండు సిలిండర్లు నోరు తెరిచి అడగకుండానే తమ కోటాలో ఇప్పించారు. దాంతో ఆరు సిలిండర్లు గృహ ప్రవేశం చేసాయి. నట్టింట్లో బాంబులు పెట్టుకుని శ్రీనివాసరావు మళ్ళీ కొత్త కాపురం మొదలు పెట్టాడని ఫ్రెండ్స్ సరదాగా అనేవారు. అయితే మా ఆవిడ పబ్లిక్ రిలేషన్స్ కు అవి బాగా ఉపయోగపడ్డాయి. ఎవరికి ఎప్పుడు సిలిండర్ అవసరమైనా వాళ్ళు గ్యాస్ కంపెనీకి కాకుండా మా ఆవిడకు  ఫోన్ చేసేవాళ్ళు. అలా కొన్నాల్తికి ఎవరికి ఇచ్చామో తెలియని పరిస్థితుల్లో చివరికి మా ఇంట్లో అయిదే మిగిలాయి.

ఈలోగా రూల్స్ మారి ఒక పేరు మీద ఒకే కనెక్షన్ అన్నారు. శాపవిమోచనం అయిన గంధర్వుల మాదిరిగా ఓ మూడు సిలిండర్లు  రెక్కలు కట్టుకుని తమ దేవలోకానికి తరలి పోయాయి. ఆచూకీ దొరక్కుండా పోయిన సిలిండర్ డబ్బు మా చేత కట్టించుకున్నారు. అలా ఆరు సిలిండర్ల కధ కంచికి చేరింది.

ఇక ఇప్పుడు దేనికీ కొరత లేదు, ఒక్క మా ఆవిడ లేదనే చింత తప్ప. అనుభవించే దశలో దాటిపోయింది.

(29-10-2021)    

28, అక్టోబర్ 2021, గురువారం

నడిచి వచ్చిన దారి – భండారు శ్రీనివాసరావు

 ఇక్కడి నా మిత్రులలో అన్ని వయసులవాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది కొంచెం అటూఇటూగా నా ఈడువాళ్ళే. నా తరం వాళ్ళే. కాబట్టి మా పెంపకాల్లో, జీవన విధానాల్లో కొంచెం పోలికలు కనిపిస్తాయి. మొదటి మెట్టు మీద కాలు మోపిన దగ్గరినుంచి పడిన కష్టాలు, ఇబ్బందులు ఇప్పుడు పై మెట్టు మీద నిలబడి చూసుకుంటూ వుంటే చాలా వింతగా వుంటుంది. నడిచి వచ్చినదారి ఇలాంటిదా అని ఆశ్చర్యం వేస్తుంది.

ఈరోజు పొద్దున్న ఒక పోస్టు పెడితే మితృలు అనేకమంది స్పందించారు. ధరవరల్లో తేడాలు గురించి మాట్లాడారు.
నిజం చెప్పాలి అంటే నాకు ఇప్పటికీ పాల ప్యాకెట్ ధర ఎంతో తెలియదు.
‘ఇలా గారాబం చేసి మీ ఆయన్ని చెడగొడుతున్నావు అనేవారు మా ఆవిడతో ఆమె ప్రాణస్నేహితురాలు వనం గీత.
వనం జ్వాలా నరసింహారావు, మా అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు, నేను కొద్ది సంవత్సరాల తేడాతో హైదరాబాదులో కాపురాలు పెట్టాము. ఈ విషయంలో జ్వాలా సీనియర్. ఆయన భార్య అయిన మా మేనకోడలు విజయలక్ష్మి, మా వదిన గారు విమల, మా ఆవిడ నిర్మల కలిసి చిక్కడపల్లిని కాలినడకన చుట్టబెట్టేవారు. మా అన్నయ్య అప్పటికే స్టేట్ బ్యాంకులో రీజినల్ మేనేజర్. (చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు). ఉద్యోగ రీత్యా ఎన్నో వ్యాపార సంస్థలకు రుణాలు ఇచ్చారు. కానీ ఆయన అశోక్ నగర్ లో తన ఇంటికి దగ్గరలో వున్న కిరాణా దుకాణంలో రెండు వందలు ఖాతా పెట్టాల్సి వస్తే, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబితే ఇస్తాను అన్నాడు ఆ దుకాణదారు. చివరికి మా మేనకోడలు కూతురి సిఫార్స్ మీద ఆ రెండు వందలు అప్పు పుట్టిందట.
మా మేనకోడలు , మా వదిన గారు అశోక్ నగర్ నుంచి నడుచుకుంటూ త్యాగరాయ గానసభ దగ్గర వున్న మా ఇంటి (అమ్మవొడి)కి వచ్చి మా ఆవిడను తీసుకుని సరుకులు కొనడానికి చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు వెళ్ళేవాళ్ళు.
ఎండ బాగా వుంటే ముగ్గురూ కలిసి ఒక రిక్షా మాట్లాడుకుని మధ్యలో మా ఆవిడను దింపేసి వాళ్ళిద్దరూ అశోక్ నగర్ వెళ్ళేవాళ్ళు.
లక్ష్మీ షో రూములో వాయిదాల మీద చీరెలు కొనుక్కునే వాళ్ళు.
ఆ రోజుల్లో లోటస్ స్టీల్ షాపులో నెలకు పది రూపాయలు చొప్పున పది నెలలు కడితే నెలకోసారి లాటరీ తీసి వంద రూపాయల స్టీలు వస్తువు ఇచ్చేవాడు. ప్రతినెలా ఆ షాపు దగ్గరికి పోవడం, బోర్డు మీద చాక్ పీసుతో రాసిన విజేతల జాబితాలో తమ నెంబరు లేకపోవడం, ఉసూరుమంటూ తిరిగివస్తూ సుధా హోటల్లో టు బై త్రీ కాఫీ తాగడం నెలనెలా ఓ తంతుగా మారింది.
ఇంట్లో అందరి పేరు మీద కట్టినా, లాటరీ ఎప్పుడూ తగలకపోవడంతో, మా వదిన గారు ఓ నెల, మా రెండో పిల్లవాడు సంతోష్ పేరు మీద కడితే మూడో నెలలోనే లాటరీ తగిలిందట. వంద రూపాయల వస్తువు తీసుకుంటూ, మా వాడికి కూడా, పాలు పట్టడానికి ఓ స్టీలు గ్లాసు కొనిచ్చింది.
ఆ రోజుల్లో ఇలా ఇబ్బందులు అందరికీ ఉండేవి కానీ, అవి ఇబ్బందులుగా అనిపించక పోవడానికి కారణం అందరూ ఒకే బోటులో ప్రయాణీకులు కావడమేమో మరి!
(28-10-2021)

ఐ నో సీఎం, ఐ నో పీఎం - భండారు శ్రీనివాసరావు

 మా పాత డైరీల్లో రాసుకున్న పాత విషయాలు

న్యూ ఇయర్ గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31 వ తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే సుమారుగా నలభయ్ ఎనిమిదేళ్ళ కిందటి మాట అన్నమాట)
నూనె : Rs.3-25
నెయ్యి:Rs. 2-75
పెరుగు: Rs.0-20
టమాటాలు:Rs. 0.55
అగ్గిపెట్టె: Rs. 0.10
సబ్బు: Rs.1-00
రిక్షా: Rs. 0-50
వక్కపొడి పొట్లం: Rs. 0-10
(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా ఐ నో సీ ఎం - ఐ నో పీఎం బాపతు)


(2021)
Ramakrishna Jagarlamudi and Subramanyam Dogiparthi

26, అక్టోబర్ 2021, మంగళవారం

రేడియో చిన్నక్క రతన్ ప్రసాద్ – భండారు శ్రీనివాసరావు

 

రతన్ ప్రసాద్ అంటే చాలా మందికి తెలుసు. అదే రేడియో చిన్నక్క అంటే ఒకతరం తెలుగువారిలో తెలియనివారంటూ వుండరేమో!
మొన్న ఫోన్ చేశారు. ఏదో పనిలో వుండి నేను రెస్పాండ్ కాలేదు. రాత్రి నేనే ఫోన్ చేశాను. ఇప్పుడు ఆవిడ హైదరాబాదులో లేరు. ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. ఎనభయ్ ఎనిమిది సంవత్సరాల ముది వయసులో కూడా ఆమె కంఠస్వరం , ఓ నలభయ్ అయిదేళ్ళ క్ర్తితం నేను రేడియోలో చేరినప్పుడు ఎలా వుందో అలానే వుంది. అమృతం తాగిన ఆ స్వరంలో అతులిత మాధుర్యం అలాగే వుంది ఇప్పటికీ. కట్టుకున్న భర్త, కన్న కొడుకు కళ్ళ ముందే దాటిపోయారు అనే దుఖం ఆవిడ గొంతులో ఇంకా సజీవంగా వుంది. ‘అయితే నా మనుమలు ఇద్దరూ ఈ వయసులో తనని కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూస్తున్నారన్న తృప్తితో కొంత ఊరటగా వున్నాను నాన్నా!’ అన్నారావిడ విచారం,ఆనందం సమ్మిళితమైన గొంతుకతో.
ఫ్యాను, ఏసీ వేసుకోవాలన్నా, టీవీ పెట్టుకోవాలన్నా, లైట్లు ఆఫ్ చేయాలన్నా దేనికీ కాలు కదపకుండా తన పడక పక్కనే అన్ని పరికరాలు తనకు అందుబాటులో ఉంచారని, వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన తర్వాత పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ రోజులు దొర్లిస్తున్నానని చెప్పుకొచ్చారు.
అదృష్టం! ఆవిడ ధారణ శక్తి ఏమాత్రం తగ్గలేదు. పాత విషయాలు అనేకం చెప్పుకొచ్చారు. (వీటిల్లో చాలా వరకు గతంలో వార్త దినపత్రిక కోసం కె.ఎం.జి. కృష్ణకు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ ప్రసాద్ చెప్పారు. Courtesy: రేడియో అభిమాని శ్రీ కప్పగంతు శివరామ ప్రసాద్)
రేడియోలో సంగీతం ఆడిషన్ కోసం వెడితే తన స్వరానికి, ఉచ్ఛారణకు ముచ్చట పడి అనౌన్సర్ గా సెలక్ట్ చేశారట. రేడియో అనౌన్సర్ గా చేనుగట్టు కధాపఠంనంతో 1955లో మొదలైన తన రేడియో ప్రస్థానం సుదీర్ఘ కాలం సాగి 1992లో సెలక్షన్ గ్రేడ్ అనౌన్సర్ గా ముగిసిందని చెప్పారు. కార్మికుల కార్యక్రమంలో చిన్నక్కగా తాను పోషించిన పాత్ర తనను శ్రోతలకు మరింత దగ్గర చేసిందని, అంతకుముందు (ఆవిడ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు) తెలంగాణా యాసలోనే చంద్రి అనే పాత్రలో గ్రామసీమలు కార్యక్రమం నిర్వహించానని గుర్తు చేసుకున్నారు. చిన్నక్క పాత్రకు ముందు రతన్ ప్రసాద్ రమణక్క పేరుతొ ఆ కార్యక్రమాన్ని మరో అనౌన్సర్, వి. సత్యనారాయణతో (పాత్ర పేరు జగన్నాధం) కలిసి నిర్వహించారు. అనుకోకుండా ఒకరోజు ఆ కార్యక్రమం ప్రసారం అవుతున్నప్పుడు జగన్నాధం పాత్రధారి, ‘రమణక్కా! నీకు నోరు ఎక్కువ’ అంటాడు. ఇది ఆంధ్రప్రాంతం శ్రోతలకు మనస్తాపం కలిగించింది. పెద్ద సంఖ్యలో నిరసన లేఖలు వెల్లువెత్తడంతో అధికారులు కొంత కాలం ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
తరువాత అదే కార్యక్రమాన్ని పాత్రల పేర్లు మార్చి చిన్నక్క(రతన్ ప్రసాద్), ఏకాంబరం (వి.సత్యనారాయణ) పేర్లతో, మూడో పాత్రను మొదట్లో పెదబాబు (ఉషశ్రీ), తరువాత యాదగిరి ( టీ.వీ.ఆర్కే సుబ్బారావు, ఆ పిమ్మట చాలా కాలం రాంబాబు (డి.వెంకట్రామయ్య) లతో జోడించి ప్రసారం చేయడం మొదలుపెట్టారు.
చాలా ఏళ్ళ కిందట ఓసారి గండిపేటకు గండి పడింది అనే వదంతులతో హైదరాబాదు అట్టుడికి పోయింది. ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకుని భయాందోళనలకు గురైన సమయంలో ‘వదంతులు నమ్మకండి, మీ ఇళ్లకు వెళ్ళిపొండి’ అంటూ తాను పదేపదే రేడియో ద్వారా విజ్ఞప్తులు చేశానని, మరునాడు పోలీసు కమిషనర్ స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తనని అభినందించడం ఇప్పటికీ మరిచిపోలేదని రతన్ ప్రసాద్ చెప్పారు.
ఆవిడ అసలు పేరు రత్నావళి. భర్త ప్రసాద్ పేరులో ప్రసాద్ అనే పదాన్ని, తన పేరులోని రత్న అనే పదాన్ని కలిపి రతన్ ప్రసాద్ గా రేడియో పేరు పెట్టుకున్నారట. (రత్న రతన్ గా మారడానికి కారణం ఉత్తర హిందూస్థానంలోని పై అధికారులు అనేది ఆవిడ నమ్మకం)
సుబ్బులక్ష్మిగారి సంగతితో కదా మొదలు పెట్టింది. కింది ఫోటో చూశారా! ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారి కచ్చేరీ. పక్కన నిలబడి రేడియోకి అనౌన్స్ మెంట్స్ చేస్తున్నది అప్పటికి పాతికేళ్ళు కూడా నిండని రేడియో చిన్నక్క అనబడే రతన్ ప్రసాద్.
ఈ కధ ఆవిడ మాటల్లోనే.
“అప్పుడు రేడియో సంగీత సమ్మేళనాలు జరుగుతున్నాయి. జూబిలీ హాల్ వేదిక. అక్కడ ఆహూతుల నడుమ జరిగే ఎం ఎస్ సుబ్బులక్ష్మి సంగీత కచ్చేరీని హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. కార్యక్రమానికి ముందు నేను ఎమ్మెస్ గారెని కలిసి ఆమెగారు పాడబోయే కీర్తనల వివరాలు తీసుకుంటున్నాను. ఏ వరసలో పాడుతారో తెలిస్తే ఒక కీర్తన పూర్తికాగానే మరో కీర్తన పలానాది వినబోతున్నారు అని నేను అనౌన్స్ చేయాలి.
‘ఒక కీర్తన పూర్తికాగానే పక్కకి తిరిగి నావైపు చూస్తే చాలు ఆ సంకేతాన్ని అందుకుని నేను అనౌన్స్ మెంట్ చేస్తాను’ అని ఆవిడగారితో చెప్పాను. అప్పుడు ఎమ్మెస్ తన అరచేతిని చాపి ఇలా అన్నారు, ‘నేను ఉంగరపు వేలు చూపెడితే మరొక కీర్తన వుందని అర్ధం. చిటికిన వేలు ముడిచి చూపిస్తే అదే ఆఖరి కీర్తన అనుకోండి’.
కచ్చేరీ పూర్తయిన తరువాత ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు నాతొ చెప్పారు మెచ్చుకోలుగా.
‘బాగా అనౌన్స్ చేశావు, మంచి సంగీత పరిజ్ఞానం వున్నదానివే’
ఆవిడ ఇచ్చిన ఈ చిన్ని కితాబు నాకు పెద్ద ఆస్కారుతో సమానం’
ఇలా రతన్ ప్రసాద్ ఫోనులో చెబుతూనే వున్నారు. నాకూ వినాలనే వుంది కానీ అవన్నీముక్కున పెట్టుకుని రాయాలి కదా!
అంచేత మళ్ళీ మరో రోజు నేనే ఫోన్ చేస్తాను అని సంభాషణ ముగించ బోయాను. ఇదంతా నేను బుద్ధిగా విన్నది రాయడానికి అని ఎలా గ్రహించారో ఏమో!
చటుక్కున ఇలా అన్నారు.
‘నాన్నా! నాదో కోరిక. నువ్వు రాసేవన్నీ మా మనుమలు చదువుతుంటారు. నా గురించి కూడా ఏమైనా రాయవూ?
కళ్ళు చెమర్చాయి. నోరు పూడుకుపోయింది.
ఫోన్ పెట్టేసాను, కంప్యూటర్ ముందు కూర్చోడానికి.


(26-10-2019)

25, అక్టోబర్ 2021, సోమవారం

ఆగండి వినండి గమనించండి వెళ్ళండి

 ఉద్యమ పార్టీల పుట్టుక, ఎదుగుదల ఎన్నో ప్రతికూల పరిస్తితుల నడుమ సాగుతాయి. ఇందుకు టీఆర్ ఎస్ పార్టీ కూడా మినహాయింపు కాదు. రెండు దశాబ్దాల నాటి సంగతులను సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్ట కట్టిందీ అవగతమవుతుంది.

తెలంగాణా ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదు. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం గతంలో కూడా పలుమార్లు ఉద్యమాలు జరిగాయి. అయితే ప్రతిసారీ అవి హింసాత్మకంగా మారాయి. సాధించింది ఏమీ లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగే పరిస్తితుల్లో కేసీఆర్ రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు మినహాయిస్తే పుష్కర కాలం పైచిలుకు సాగిన తెలంగాణా సాధన పోరాటంలో ఎక్కడా అపశృతులు దొర్లిన దాఖలాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ముందు చెప్పినట్టు, వినూత్నంగా ఆలోచించే  కేసీఆర్ తత్వం, ఏ దశలోనూ తెలంగాణా ఉద్యమ స్పూర్తిని  దెబ్బతినకుండా కాపాడింది. ఉద్యమజ్యోతి వెలుగులు మసిబారకుండా చూసింది. ఈ క్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు, సీమాంధ్రుల మనోభావాలను కొంత మేరకు దెబ్బతీసేవిలా ఉన్నప్పటికీ, తెలంగాణావాదుల ఉద్యమ తీవ్రత తగ్గుముఖం పట్టకుండా ఎప్పటికప్పుడు  చేయగలిగాయి. వెలుగుతున్న పెట్రోమాక్స్ లైట్ లో  గాలి ఒత్తిడి తగ్గి, వత్తి ఎర్రబడుతున్నప్పుడల్లా,  పంపుతో గాలికొట్టి మళ్ళీ వత్తిని తెల్లగా  ప్రకాశవంతం చేసినట్టు, ఉద్యమకాలంలో కేసీఆర్ తన వ్యూహాలను, ఎత్తుగడలను  తాజా రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు  తగినట్టుగా మార్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా వుండిపోయేట్టు చేయగలిగారు. ఈ పరిణామ క్రమంలో కేసీఆర్ ఎదుర్కున్న ఇబ్బందులు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. తీసుకున్న ప్రతి నిర్ణయం అవహేళనలకు గురయింది. వేసిన ప్రతి అడుగు అపనిందల పాలయింది. అయినా కేసీఆర్ ప్రతి మలుపును గెలుపు దిశగా మళ్ళించుకుని, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలను అందిస్తూ పోయారు. దశలు దశలుగా, రూపాలు మార్చుకుంటూ  సాగించిన ఉద్యమం ఒక కొలిక్కి రావడానికి పట్టిన సమయం కూడా పుష్కర  కాలం పైమాటే. మరి అన్నేళ్ళు ఒక ఉద్యమ పార్టీ ఊపిరి పీల్చుకోవాలంటే మాటలు కాదు. సాధ్యమూ కాదు. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన సత్తా ఉండబట్టే కేసీఆర్ తెలంగాణా ప్రజల దృష్టిలో ఒక గొప్ప నాయకుడు కాగలిగారు. మొత్తం మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు.

సరే ఇదొక ఎత్తు అనుకుంటే, అధికారం సిద్ధించిన తరువాత ఎదురయ్యే పరిణామాలను సమర్ధవంతంగా  నిభాయించుకోవడం మరో ఎత్తు. ఏమరుపాటుగా వుంటే చాలు ఏమి చేయడానికయినా సిద్ధం అన్నట్టు వ్యవహరించే ఇతర పార్టీల్లోనే కాదు స్వపక్షంలోని  రాజకీయ శక్తులను కూడా  ఆదిలోనే కట్టడి చేసి, తనదారి లోకి తెచ్చుకున్న విధానం కేసీఆర్ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని వెలుగులోకి  తెచ్చింది. ఆయన ఒక ఉద్యమ నేత మాత్రమే కాదు, చాణక్య నీతిని సయితం వంటబట్టించుకున్న వ్యూహకర్త అని ప్రపంచానికి వెల్లడయింది.

అందలం ఎక్కినంత మాత్రాన పండగ కాదు. తెలంగాణాలో రాజకీయం చాలా విభిన్నమైనది. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తూ వుంటుంది.  లక్ష్యసాధనలో ఏకోన్ముఖంగా సాగిన తెలంగాణా సమాజం అదేమాదిరి కొత్త ప్రభుత్వం చేసిన ప్రతి పనికీ తలూపకపోవచ్చు. తెలంగాణా స్వప్నం నెరవేరింది కనుక, ఇప్పుడు ప్రజల దృష్టిలో  ఒకప్పటి ఉద్యమ పార్టీ, ఇప్పటి పాలక పక్షం అయిన  టీఆర్ఎస్ కూడా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో ఒకటి మాత్రమే.

ఒక విషయం పార్టీ అధినేత గుర్తుంచుకోవాలి. ఉద్యమ సమయంలో జరిగిన విధంగానే అన్ని వైపులనుంచి ప్రత్యర్ధులు బాణాలు గురిపెడతారు. పద్మవ్యూహాల రచన బృహత్తరంగా సాగుతుంది. వాళ్ళు ఎక్కుబెట్టే అస్త్రాల పదును పెరగడానికి  పాలకపక్షం స్వయంకృతాపరాధాలు కూడా తోడ్పడడానికి అవకాశం వుంది.

అన్నిటికన్నా ముఖ్యం, అలనాడు ప్రజల్లో అపరిమితంగా భావోద్వేగాన్ని రగిల్చిన  తెలంగాణా అనే బ్రహ్మాస్త్రం  ఇప్పుడు టీఆర్ఎస్ అంబుల పొదిలో లేదు. అదిప్పుడు స్వతంత్ర భారత దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రం రూపంలో ఆవిర్భవించి ఏడేళ్లు దాటిపోయాయి.

టీఆర్ ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఏళ్ళు. వ్యక్తుల జీవితాల్లో అయినా, వ్యవస్థల జీవితాల్లో అయినా ఈ వయసు చాలా ప్రమాదకరమైనది. దారి తప్పడానికి, గాడి తప్పడానికి ఈ ప్రాయమే కారణం. ఒకింత జాగ్రత్త పడగలిగితే అవసరమైన పరిణతి  లభిస్తుంది. ఆగి, నిలిచి, వెనక్కి తిరిగి చూసి తిరిగి  ముందడుగు వేయాల్సిన సమయం.

అధికారంలో ఉన్నవాళ్ళకి ఎన్నో చేశామనే అభిప్రాయం వుంటుంది. అన్నీ చేయలేదేమో అని కొందరికి అనిపిస్తే తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రాధాన్యతల ఎంపికలో వచ్చే తేడా ఇది.

టీఆర్ఎస్ ప్లీనరీలో ఇటువంటి ‘కీలక’ అంశాలపై దృష్టి పెట్టాలనేది హిత వాక్యం.



(25-10-2021)

ఈనాటి మీడియా - భండారు శ్రీనివాసరావు


రాముడు వనవాసం చేస్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. కొంతసేపు గడిచిన తర్వాత తన ధనుర్బాణాల కింద నలిగిపోతూ నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపిస్తుంది.
రాముడి మనసు చివుక్కుమంటుంది.
‘రక్తం స్రవిస్తూ కూడా ఇంతటి బాధను ఎలా ఓర్చుకున్నావు మండూకమా! వెంటనే నాకు చెప్పక పోయావా’ అంటాడు ఓదార్పుగా.
కప్ప ఇలా జవాబిస్తుంది.
“ఓ శ్రీరామచంద్రా! సమస్త ప్రాణులను కాపాడే దేవదేవుడివి నువ్వు. నువ్వే నా బాధకు కారణం అయినప్పుడు నేనెవ్వరికి చెప్పుకుంటాను చెప్పు?’
అలాగే వుంది ఈనాటి మీడియా వ్యవహారశైలి

24, అక్టోబర్ 2021, ఆదివారం

ప్రజలు గమనిస్తున్నారు - భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha Daily today, SUNDAY)
“ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది?”
అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ పొద్దున్నే ఫోను చేసి.
ఆయన మృదు స్వభావులు. సున్నిత మనస్కులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గా పనిచేశారు. రేడియో కార్యక్రమాల్లో ఏదైనా అప్రాచ్యపు పదం ఒక్కటి పొరబాటున దొర్లినా విలవిలలాడేవారు. ఇక నేటి రాజకీయుల ఇష్టారాజ్యపు మాటల తూటాలు టీవీల్లో వింటూ ఇంకా యెంత మధన పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అనకూడని మాట, అనదగ్గ మాట అనే తేడా లేకుండా పోతోందని ఆయన బాధ. కానీ చేయగలిగింది ఏముంది? ఆయనంటే త్రేతాయుగం నాటి మనిషి.
త్రేతాయుగం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ కాలంలో కూడా ఇలా ప్రల్లదనపు మాటలు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. సీతను అపహరించుకుని పోయి లంకలో అశోకవనంలో బంధించిన రావణుడు సీతమ్మ వారితో అంటాడు.
“చనిపోయాడో, బతికున్నాడో తెలియని నీ మొగుడు రాముడి కోసం ఇలా అస్తమానం బాధపడుతూ నీ నిండు జీవితాన్ని ఎందుకిలా, ఎన్నాళ్ళిలా పాడు చేసుకుంటావు. నువ్వు ఊ అను, నా భార్యగా చేసుకుని లంకకు రాణిగా చేస్తా. జీవితంలో కనీ వినీ ఎరుగని భోగాలు అనుభవించేలా చేస్తా!” అంటూ పరాయి స్త్రీతో అనకూడని మాటలు అంటాడు.
దానికి సీత జవాబుగా అన్నట్టు అక్కడ కనపడ్డ ఒక గడ్డిపోచను తనకూ, రావణుడికీ నడుమ ఉంచుతుంది, ‘నా దృష్టిలో నువ్వు తృణప్రాయం’ అనే సంకేతం ఇస్తూ.
ఇక ద్వాపర యుగంలో ఉచితానుచితాల అన్వయం మరింత రూపు మార్చుకుంది.
నిండు కొలువులో ఏకవస్త్ర అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చే ముందు, దుర్యోధనుడు ఆమెకు తన వామాంకాన్ని చేతితో చూపుతూ, ‘రా! వచ్చి ఇక్కడ కూర్చో!’ అని సైగ చేస్తాడు. సభలో ఉన్న భీష్మ ద్రోణాదులు సిగ్గుతో మెలికలు తిరుగుతారు.
ఇక కలియుగం సంగతి చెప్పేది ఏముంది!
విలువల పతనం అనేది శంభుని శిరంబందుండి....అన్నట్టుగా అతివేగంగా సాగుతోంది. ఇక ఔచిత్యం, అనౌచిత్యం అనే తేడా లేకుండా పోతోంది. అందరూ ఔనని తలూపుతున్నప్పుడు ఇక ఈ తేడాపాళాల ప్రసక్తి ఏముంది?
పూర్వం కవులు తమ రచనల అవతారికలో ఒక విన్నపం చేసుకునేవారు.
“అనౌచిత్యంబు పరిహరించుచు, ఔచిత్యంబు పాటించుచు, ఈ రచన చేసాను” అని పేర్కొనేవారు, తెలిసీ తెలియక ఏమైనా రాయకూడని పదాలు వాడామేమో అనే శంకతో.
ఇప్పుడా కుశంకలు దివిటీ పెట్టి వెతికినా కనబడవు.
మంచీచెడులను అభివ్యక్తీకరించే సమయంలో మహా కవులు కొన్ని ఔచిత్యాలను పాటించేవారు. అంటే ఎక్కడ ఆకట్టునేలా ఎక్కడ ఎలా చెప్పాలో, ఎక్కడ కర్రుకాల్చి వాత పెట్టాలో వారికి వెన్నతో పెట్టిన విద్య.
ఒకసారి తెనాలి రామకృష్ణుడు లేని సమయంలో శ్రీ కృష్ణ దేవరాయలు "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరణకి ఇవ్వగా, సభలో ఎవ్వరూ పూరించలేకపొయారు. అది తెనాలి రామలింగడు ఎలా పూరిస్తాడా అని రాజగురువు తాతాచార్యులవారు అదే సమస్యని ఒక ద్వారపాలకుడితో అడిగిస్తాడు. దానికి తెనాలి రామలింగడి పూరణః
గంజాయి త్రాగి తురకల
సంజాతల గూడి కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా ఎచ్చట
కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్
అని సమస్యను పూరించడంతో తేలుకుట్టిన దొంగల్లా తాతాచార్యులు, భట్టుమూర్తి కిక్కురు మనకుండా ఊరుకుంటారు. అయితే ఎలాగైనా రామకృష్ణుడికి బుద్ధి చెప్పాలని రాయల వారికి ఫిర్యాదు చేస్తారు. రాయల వారు వికటకవిని పిలిచి అదే సమస్యను ఇచ్చి పూరించమంటాడు. అపుడు రామకృష్ణుడు తెలివిగా ఈ క్రింది పద్యం చెబుతాడు..
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాలైరకటా!
సంజయా! విధి నేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !
అది విని రాయలవారు "శభాష్! రామకృష్ణా! నీ బుద్ధి బలానికి రెండు ప్రక్కల పదునే" అని మెచ్చుకుంటాడు.
కొన్ని పదాలు నోటితో అనడానికి, చెవితో వినడానికి కూడా కంపరం కలిగిస్తాయి. అందుకే కాబోలు, బూతు బూతులా వినిపించకుండా దర్శకుడు జంధ్యాల ఓ చిత్రంలో చక్కటి సన్నివేశం సృష్టించి చూపారు.
ప్రత్యక్ష ప్రసారాల కారణంగా వాటిని అప్పటికప్పుడు ఎడిట్ చేసి ప్రసారం చేయడంలో కొంత సాంకేతిక ఇబ్బంది ఉన్నమాట నిజమే. ప్రత్యక్ష ప్రసారం వల్ల మొదటిసారి అటువంటి పదాలను తొలగించి ప్రసారం చేయడానికి వీలు ఉండకపోవచ్చు. కానీ తదుపరి ప్రసారాల్లో వాటిని పదేపదే పనికట్టుకుని అదేపనిగా పునః ప్రసారం చేయడం వల్ల గరిష్ట స్థాయిలో అవన్నీ చేరకూడని ప్రజలకు చేరిపోతున్నాయి. ఇందులో రాజకీయ నాయకుల తప్పిదం కంటే మీడియా బాధ్యతారాహిత్యమే ఎక్కువ. ఇది తగ్గించుకుంటే సమాజానికి మంచిది.
టీవీ ఛానల్ చర్చలకు వచ్చే ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిర్మొహమాటంగా ఒకసారి నాతోనే చెప్పారు, ‘జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి' అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది ఎంత అప్రదిష్ట.
రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అర్ధం కానట్టు వుండిపోతున్నారని అనుకోవాలి. ఇదో విషాదం.
‘నైతిక హక్కు, చిత్తశుద్ధి, ప్రజలు గమనిస్తున్నారు’ ఈ మూడు ముక్కలూ రాజకీయ పార్టీల ప్రతినిధులు అలవోకగా వల్లెవేసే పడికట్టుపదాలు.
మొదటి రెండూ అన్ని పార్టీల్లో హుళక్కే. కనీసం ‘ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ తరచూ తాము పేర్కొనే ఊతపదాన్ని అయినా గుర్తుంచుకుంటే అన్ని పార్టీలకీ మంచిది. ప్రజాస్వామ్యానికి మరింత మంచిది.
ఈ ‘గమనించే ప్రజల్లో’ వారికి మద్దతుగా నిలిచే కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు, అసలు ఏ పార్టీకి చెందనివాళ్ళు, రాజకీయాల అంటూ సొంటూ ఎరగని వాళ్ళూ ఉంటారని కూడా గమనంలో పెట్టుకోవడం ఆయా పార్టీలకి ఇంకా మంచిది.
తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. కవులు, రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే, ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు తమకు తామే అడ్డుకట్ట వేసుకోవాలి. సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే బాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి.
మంచీ చెడు అనికదా మొదలు పెట్టాం, అవేమిటో చెప్పుకుని ముగిద్దాం.
ఈ ప్రపంచం పుట్టినప్పుడే మంచీ చెడు అనేవి కూడా పుట్టాయి. వాటిని ఎలా తెలుసుకోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం భారతంలో వుంది.
కృష్ణుడు, భీష్ముడు కలిసి ఇది తెలుసుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించారు.
ముందు దుర్యోధనుడిని పిలిచి సూర్యాస్తమయం వరకు నగరంలో తిరిగి రమ్మన్నారు. ఎక్కడయినా ఒక మంచి మనిషి తటస్థ పడితే వెంటనే రాజసభకు వచ్చి ఆ విషయం తెలియచేయమన్నారు.
తరువాత ధర్మరాజును విడిగా పిలిచి నగర పర్యటన చేసి ఎక్కడయినా ఒక చెడ్డ మనిషి కనిపిస్తే తక్షణం ఆ సంగతి తమతో చెప్పాలని ఆదేశించారు.
పొద్దుగుంకుతున్న సమయంలో దుర్యోధనుడు తిరిగి వచ్చాడు. యెంత దూరం తిరిగినా మంచివాడు అనేవాడు ఒక్కడు కూడా తన కంటికి కానరాలేదని చెప్పాడు. కాసేపటికి యుధిష్టురుడు వచ్చాడు. అతడిదీ అదే సమాధానం. యెంత వెతికినా ఒక్క దుర్మార్గుడు కూడా ధర్మజుడుడికి తటస్థ పడలేదు.
అంటే ఏమిటి?
నాలో ఉన్న ‘నేను’ ఎలాటివాడినో, బయటి ప్రపంచంలో నాకు అలాటి వాళ్ళే కనబడతారు. నిజానికి బయట కనబడేది అంతా, మన లోపల ఉన్నదానికి ప్రతిరూపమే.



22, అక్టోబర్ 2021, శుక్రవారం

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య......


పిన్ డ్రాప్ సైలెన్స్
సూది కింద పడ్డా వినబడేంత నిశ్శబ్దం అని దీనికి అనువాదం చెప్పుకోవచ్చు. ఇలాటిది ఎప్పుడయినా అనుభవంలోకి వచ్చిందా?
ఫీల్డ్ మార్షల్ శామ్ బహదూర్ మానెక్ షా. ఒకానొక కాలంలో స్వతంత్ర భారత దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన ఒక సారి గుజరాత్ లోని అహమ్మదాబాదులో సభలో మాట్లాడుతున్నారు. మానెక్ షా ఇంగ్లీష్ లో మాట్లాడ్డం సభికులకు నచ్చలేదు. గుజరాతీ భాషలోనే ప్రసంగించాలని పట్టుబట్టారు. అసలే సైన్యాధ్యక్షుడు. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే రకం. ఆయన ఒక్క నిమిషం సభికులని తేరిపార చూసి ఇంగ్లీష్ లోనే ప్రసంగం కొనసాగిస్తూ ఇలా చెప్పారు.
“నేను అనేక యుద్ధాల్లో పాల్గొన్న మనిషిని. సైన్యం అంటే ఏ ఒక్క భాష మాట్లాడేవాళ్ళో వుండరు. అనేక ప్రాంతాలవాళ్ళు సైన్యంలో చేరతారు. సిఖ్ రెజిమెంట్ లో పనిచేసే వారి నుంచి పంజాబీ నేర్చుకున్నాను. మరాఠా రెజిమెంటులో చేరిన వారి నుంచి మరాఠీ భాష నేర్చుకున్నాను. అలాగే మద్రాసు సాపర్స్ నుంచి తమిళ భాష బెంగాలీ సాపర్స్ నుంచి బెంగాలీ నుడికారం పట్టుకున్నాను. బీహార్ రెజిమెంటు నుంచి హిందీ, ఘూర్ఖా రేజిమెంటు నుంచి నేపాలీ భాష నేర్చుకున్నాను. దురదృష్టం, గుజరాతీ భాష నేర్చుకుందాం అంటే అదేమిటో గుజరాత్ నుంచి ఎవ్వరూ సైన్యంలో చేరడం లేదు, అందరూ వ్యాపారాల పట్ల మక్కువ చూపే వాళ్ళే!’
అంతే! సభ మొత్తం ‘పిన్ డ్రాప్ సైలెన్స్!’

తోకటపా:

ఫీల్డ్ మార్షల్ మానెక్ షా అంటే ఆషామాషీ కాదు. అప్పటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ కు నో అని మొహం మీదనే చెప్పగలిగిన ధీశాలి. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వెంట ఆయన కుమార్తె ఇందిరా గాంధి సైనిక స్థావరాల్లోకి ప్రవేశించడానికి అనుమతించని గొప్ప సైనికాధికారి.





21, అక్టోబర్ 2021, గురువారం

దారి ఇచ్చిన కుక్క – భండారు శ్రీనివాసరావు


ఇదేదో పరాయి దేశాన్ని పొగిడి, మన దేశాన్ని కించపరచడానికి కాదు ఈ పోస్టు. ప్రపంచంలో అన్ని దేశాలకు భారతదేశం నాగరికత నేర్పిందని చరిత్ర చెప్పే పాఠాలు నిజమే. కానీ అది గతం. ఇప్పుడెక్కడున్నాం. అదీ ఆలోచించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అమెరికాలో కుమారుడి దగ్గర ఉంటున్న శాస్త్రి గారు పొద్దున ఫోన్ చేశారు. శాస్త్రి గారంటే వేమూరి విశ్వనాధ శాస్త్రి. వీవీ శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి బాగా తెలుస్తుంది. స్టేషన్ డైరెక్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు.
శాస్త్రిగారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నది దక్షిణ సాన్ ఫ్రాన్సిస్ స్కోలోని పసిఫికా అనే ప్రాంతంలో. దగ్గరలో పసిఫిక్ మహాసముద్రం బీచ్. అక్కడికి మార్నింగ్ వాక్ కోసం వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. రోడ్డు పక్కన సన్నటి కాలిబాట బాగానే ఉన్నప్పటికీ దారి ఎగుడు దిగుడుగా ఉంటుందట. ఈయన గారెకి కాలు ఎత్తివేసే అలవాటు. దానికి ఆయనే అవిటి కాలు అని పేరు పెట్టుకున్నారు. వయసు ఎనభై దాటడం వల్ల అది సహజంగా వచ్చి వుంటుంది. ఆయన మెల్లగా నడిచి వెడుతున్నప్పుడు ఎదురుగా వచ్చేవారు బాట మీద నుంచి కొంచెం పక్కకు దిగి దారి ఇస్తారట. వృద్ధులకు అక్కడి వారు ఇచ్చే గౌరవం అది. మొన్న ఒక వ్యక్తి కుక్కతో సహా వాహ్వ్యాలికి వచ్చి ఈయనకు ఎదురు పడ్డాడట. కుక్క ముందు నడుస్తోంది. ఆ ఆసామీ దాని గొలుసు పట్టుకుని వెనకనే వస్తున్నాడట. చిత్రంగా ఆ కుక్క కూడా శాస్త్రి గారు ఎదురుపడగానే పక్కకు తప్పుకుని శాస్త్రి గారెకి దారి ఇచ్చిందట. ఇది చూసినప్పుడు ఆయనకు హైదరాబాదు అనుభవం గుర్తుకు వచ్చిందట.
శాస్త్రి గారెకి కృష్ణా నగర్ ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో స్థలంలో సొంత ఇల్లు వుంది. రోజూ ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళే అలవాటు. అసలే ఇరుకు రోడ్లు. పేవ్ మెంట్లు సరిగా వుండవు. పైగా వన్ వే. వాహనాలు వేగంగా దూసుకు పోతుంటాయి. ఆటోలు అడదిడ్డంగా కాలిబాటల మీదనే పార్క్ చేస్తారు. ‘కాస్త పక్కకు తీస్తావా’ అని ఒక ఆటో డ్రైవర్ ని మర్యాదగానే అడిగారట. ‘నేనెందుకు తీయాలి, మీరే దిగి రోడ్డు మీద వెళ్ళండి’ అని దురుసుగా జవాబిచ్చాడట.

వృత్తి - ప్రవృత్తి - భండారు శ్రీనివాసరావు

యాచక ప్రవృత్తి కంటే యాచక వృత్తి మేలంటారు డాక్టర్ బాలాజీ

నిజమే అనిపిస్తుంది కాస్త ఆలోచిస్తే.
యాచకుడు తన వృత్తి ధర్మంలో భాగంగా రోజల్లా అడుక్కుని ఎంతో కొంత సంపాదించి తను తినగా మిగిలినదాన్ని అవసరంలో ఉన్న తన తోటివారికి ఇస్తాడు.
యాచక ప్రవృత్తి కలిగిన వాళ్ళు అలా కాదు.
కట్టుకుపోలేము, పోయేటప్పుడు వెంట పట్టుకుపోలేము అని తెలిసి కూడా సంపాదన యావలో పడి కొట్టుమిట్టాడే వాళ్ళకి అడుక్కునే బుద్ది అంత తేలిగ్గా వదలదు. చిన్న చిన్న వాటికి కూడా కక్కుర్తి పడడం అందరూ ఎరిగినదే

20, అక్టోబర్ 2021, బుధవారం

మీడియాకు విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు

కొన్ని పదాలు నోటితో అనడానికి, చెవితో వినడానికి కూడా కంపరం కలిగిస్తాయి. అందుకే కాబోలు, బూతు బూతులా వినిపించకుండా దర్శకుడు జంధ్యాల ఓ చిత్రంలో చక్కటి సన్నివేశం సృష్టించి చూపారు.
ప్రత్యక్ష ప్రసారాల కారణంగా వాటిని అప్పటికప్పుడు ఎడిట్ చేసి ప్రసారం చేయడంలో కొంత సాంకేతిక ఇబ్బంది ఉన్నమాట నిజమే. తెలుగునాట ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో అనేక మంది రాజకీయ నాయకులు వాటిని యధేచ్చగా ఉచ్చరిస్తూ వుండడం అందరూ చూస్తూ వున్నారు. ఈ విషయంలో ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. కొంచెం డిగ్రీ డిఫరెన్స్.
ఒక మీడియా మనిషిగా మీడియాకు నా సలహా ఏమిటంటే, ప్రత్యక్ష ప్రసారం వల్ల మొదటిసారి అటువంటి పదాలను తొలగించి ప్రసారం చేయడానికి వీలు ఉండకపోవచ్చు. కానీ తదుపరి ప్రసారాల్లో వాటిని పదేపదే ప్రసారం చేయడం వల్ల గరిష్ట స్థాయిలో అవన్నీ చేరకూడని ప్రజలకు చేరిపోతున్నాయి. ఇందులో రాజకీయ నాయకుల తప్పిదం కంటే మీడియా బాధ్యతారాహిత్యమే ఎక్కువ. ఇది తగ్గించుకుంటే సమాజానికి మంచిది.
(నోట్: ఇది చాలా పాత పోస్టు. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు ఓ సందర్భంలో రాసిన వ్యాసంలోని వాక్యాలు ఇవి. అంచేత జరిగిన, జరుగుతున్న పరిణామాల మీద మీ వ్యాఖ్య ఏమిటి అంటూ వివాదం చేయవద్దు. దారి తప్పిన రాజకీయం కంటే, దోవ తప్పిన మీడియా వల్ల సమాజానికి ఎక్కువ చెడుపు జరుగుతుందనేది నా నమ్మకం. రాజకీయుల దండాగిరి గురించి, వారి అనాగరిక చర్యలు గురించి గతంలో రాసి రాసి, రాసేవారికి, చదివేవారికి విసుగు పుడుతోంది. అంచేత వారికి నీతి బోధలు చేయడం వృధా)




NOTE: COURTESY CARTOONIST RAJU EPURI


(20-10-2021)

మంచితనానికి దైవానుగ్రహం తోడయితే..... భండారు శ్రీనివాసరావు

 మూడేళ్ల క్రితం ఇదే రోజున తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి కొంత సమయం పట్టిన మాట నిజం.

ఈ అమ్మాయి ఎవరో చెప్పడానికి ముందు కొంచెం నేపధ్యం తెలపడం అవసరం.
1992 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. అద్దె పద్దెనిమిది వందలు. మాస్కోనుంచి ఓడలో వచ్చే సామాను కోసం అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో కాపురం ఉంటున్న యాదమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం. ఈ తిరుమల అనే అమ్మాయి యాదమ్మ, మల్లయ్యల కడసారి కుమార్తె. ఆ దంపతులకు అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ, తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో మేము అనేక ఇళ్ళు మారుతూ వచ్చినా ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. యాదమ్మ మనుమడు సందీప్ తొమ్మిదో తరగతి. ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్న అతడికి తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్ లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు.
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం బలహీన వర్గాలకు కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళికి ముందు ఏదో పెద్ద బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా పనిచేసేది.
నువ్వేం చేస్తున్నావని తిరుమలమ్మను అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్. ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను’ అంది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!




19, అక్టోబర్ 2021, మంగళవారం

రేడియో ప్రాంగణంలో సమాధి చేయాలి – రావూరి భరధ్వాజ కడపటి కోరిక

 

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారి రెండో వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాల్ని మననం చేసుకుంటూ రాసిన దానికి ఇది జోడింపు." భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది. మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు అందులో భరద్వాజ గారు. నేను రేడియో మనిషిని కనుక దాన్ని అందరితో పంచుకోవాలని సహజంగా అనిపించింది. అదే ఇది.



(రావూరి భరధ్వాజ)


"ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది? రెంటాల గారి ప్రశ్న. భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన సమాధానం : "కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగం రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)