31, డిసెంబర్ 2015, గురువారం

HAPPY NEW YEAR – 2016



"వొత్తిలా వెలగండి

కత్తిలా మెరవండి

కొత్త ఏడాదిలో

ఎత్తుగా ఎదగండి!

"అత్తరువు గంధమై

చిత్తరువు చందమై

కొత్త ఏడాది

మిము హత్తుకోవాలి!"

నూతన సంవత్సర శుభాకాంక్షలతో – HAPPY NEW YEAR - 2016

-నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు – హైదరాబాద్


NOTE:Courtesy Image Owner

30, డిసెంబర్ 2015, బుధవారం

2015


సూటిగా............సుతిమెత్తగా........... భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN"SURYA" TELUGU DAILY ON 31-12-2015, THURSDAY)

2015లో ఇది ఆఖరి రోజుకావొచ్చేమో కానీ ఇదే చివరాఖరి రోజు కాదు.
అనాదిగా అలుపులేకుండా తిరుగుతున్న కాలచక్రం, తిరిగి తిరిగి, తిరిగొచ్చిన చోటికే తిరిగిరావడం  మామూలే.
అనేక అనుభవాలను, అనుభూతులను మన మదిలో, ఒడిలో  ఒదిలిపెట్టి  ఈ ఏడాది సెలవు తీసుకుంటోంది. కొత్త ఏడాది సరికొత్త ఆశలతో గుమ్మంలో నిలబడి వుంది.


గతంలోకి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్న ఏడాదిని విహంగ వీక్షణం చేస్తే –
కోటి ఆశలతో జనాలు గద్దె ఎక్కించిన మోడీ సర్కారు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రణాళికా సంఘం రూపురేఖలు మార్చి ‘నీతి అయోగ్’ పేరుతొ ఏర్పరచిన కొత్త వ్యవస్థ అమల్లోకి రావడంతో ఈ కొత్త ఏడాది మొదలయింది. అంతకుముందు 2014 వ సంవత్సరం  మోడీకి అందించిన అపూర్వ విజయాలు  2015 లో ఆవిరి అయిపోయాయి. ఏడాది మొదట్లో ఢిల్లీ ఎన్నికల ఫలితాల రూపంలో ఎదురయిన ఎదురు గాలులు, ఏడాది మధ్యలో జరిగిన బీహారు ఎన్నికల నాటికి ప్రచండ రూపం ధరించాయి. ఘన విజయాలను మూటగట్టుకున్న ఒడిలోకే ఏడాది తిరక్కముందే ఘోర పరాజయాలు వచ్చి చేరాయి. దీన్ని రాజకీయాల్లో ప్రజలు ప్రదర్శించే చమత్కారం అనుకోవాలేమో!
ప్రధాన మంత్రి మోడీ ఏడాది కాలంలో జరిపిన అనేక విదేశీ పర్యటనలు బయట దేశాల్లో ప్రశంసలను  వెల్లువెత్తిస్తే, స్వదేశంలో అనేక వర్గాలనుంచి ఆయనపై  విమర్శల జడివానలు కురిపించాయి. ఏడాది చివర్లో జరిపిన చివరాఖరు పర్యటనలో మోడీ విసిరిన  వ్యూహాస్త్రం విమర్శకుల నోళ్లకు తాళం వేయించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తిరిగొస్తూ, మార్గమధ్యంలో అనుకోని విధంగా  లాహోరులో దిగి పాక్ ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు స్వయంగా తెలిపిన తీరు అంతర్జాతీయంగా మోడీకి  మంచి  పేరు తెచ్చిపెట్టింది. కాకపొతే కొత్త సంవత్సరం కానుకగా మోడీ సర్కారు వంట గ్యాసు సబ్సిడీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని  ప్రజలు ఎంతవరకు జీర్ణించుకుంటారనేది నూతన సంవత్సరంలో తేలుతుంది.
‘కలలు కంటూ వుండండి, వాటిని నిజం చేసుకోండి’ అని భారత యువతకు ఉద్బోధించిన  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2015 జులైలో కన్నుమూయడం   ప్రజలకు తీరని వ్యధ. అబ్దుల్ కలాం  స్పూర్తితో మొదలయిన భారత అంతరిక్ష పరిశోధనలు ఒక మైలు రాయిని అదే ఏడాది చేరుకోవడం అనేది ఆయన స్మృతికి ఒక ఘన నివాళి.             
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే, కొత్తగా ఏర్పడ్డ  రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది పరిస్తితులు కొంత కుదుట పడుతున్నట్టే అనిపిస్తోంది.
ఉమ్మడి రాజధానిలో వుండడానికి పదేళ్ళ వ్యవధానం వున్నాకూడా, సొంత రాష్ట్రానికి వెంటనే తరలివెళ్ళాలని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఆలస్యంగా అయినా సరయిన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. నవజాత ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఒకచోటా, పాలకులు మరో చోటా వుండే  పరిస్తితి మంచి పాలనకు మంచిది కాదు. రాజధాని అమరావతి నిర్మాణానికి పునాది రాయి కూడా పడింది. కళ్ళు చెదిరే ఆధునిక రాజధాని ప్రణాళికలు తుది రూపానికి వచ్చాయి. ఇక శుభస్య శీఘ్రం అనుకుంటూ అడుగు ముందుకు వేయడమే మంచి  పద్దతి.
గతిస్తున్న ఏడాది  ఆంద్ర ప్రదేశ్  ప్రజలకు  చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెడుతోంది. అట్టహాసంగా మొదలయిన గోదావరి పుష్కరాల్లో తొలినాడే చోటుచేసుకున్న అపశ్రుతి ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో యాత్రీకులు ప్రాణాలు పోగొట్టుకోవడం విషాద పరిణామం. హైదరాబాదులో బయటపడిన ‘నోటుకు ఓటు’,  బెజవాడలో జరిగిన కల్తీ మద్యం మరణాలు, వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారాలు చంద్రబాబు ప్రభుత్వానికి సమర్ధించుకోలేని సంగతులుగా మిగిలాయి. ప్రతిదానికీ ప్రతిపక్షాన్ని బాధ్యులుగా చేసి తమ బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం దీర్ఘకాలంలో సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఈ చేదు నిజాన్ని తెలుగుదేశం నాయకత్వం అర్ధం చేసుకోవాలి. గత ఇరవై మాసాల కాలంలో  ఎంతో చేశామని చెప్పుకుంటున్నా ఇంకా చేయాల్సింది  చాలావుంది, అవన్నీ  పూర్తి చేయడానికి తమకున్న వ్యవధానం చాలా తక్కువ అన్న వాస్తవాన్ని కూడా చంద్రబాబు సర్కారు యెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.  సమర్ధత ప్రాతిపదికగా ప్రజలు తనకు కట్టబెట్టిన ప్రజల నమ్మకం వమ్ముకాకుండా చూసుకోవడానికి చంద్రబాబుకి మిగిలిన ఏకైక వనరు కూడా ఆ సమర్ధతే. మిగిలిన వనరులకు దారులు మూసుకు పోతున్నట్టు కానవస్తున్న ఈ తరుణంలో కొత్త ఏడాదిలో అయన తన సమర్ధతను నిరూపించుకోవాల్సిన అగత్యం ఆయనకే ఎక్కువగా వుంది. ఈ దిశగా కొత్త ఏడాదిలో తన వ్యూహాలకు చంద్రబాబు  కొత్త రూపం ఇవ్వాల్సి వుంటుంది.
ఇక జగన్ మోహన రెడ్డి. ఎదురు గాలుల్లోనే ఆయన పార్టీ తొలినుంచీ రాజకీయ పయనం సాగిస్తోంది. ఈ ఏడాదీ అలాగే సాగింది. సాధారణంగా అధికారం ఎటు వుంటే అటు మొగ్గుచూపే, అటే వాలిపోయే ఈనాటి రాజకీయ  వాతావరణంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. శాసన సభ్యులు కట్టు దాటకపోవడం ఒక్కటే ఆయనకు మిగిలిన ఊరట. ప్రధాన  ప్రతిపక్షంగా సమర్ధంగా వ్యవహరించలేకపోతున్నారనే అపప్రధ ఆయన మీద వుంది.  ఇది పోగొట్టుకోవడానికి వీలైన దిద్దుబాటు చర్యలు కొత్త ఏడాదిలో తీసుకోవడం అవసరం. 
పొతే, తెలంగాణా వ్యవహారం.
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం నల్లేరు మీది బండి నడకలా సాగిపోతోంది. కేసీఆర్ మాట అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సుగ్రీవాజ్ఞగా చెల్లుబడి అవుతోంది. వరంగల్ ఉపఎన్నికలో సాధించిన అపూర్వ ఘన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసింది. ఎదురులేదన్న నమ్మకంతో వేస్తున్న కొన్ని అడుగులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న సంగతిని ఆ పార్టీ అధినేత గమనించడం లేదేమో అనిపిస్తోంది. అనేక మంచి పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్సలు పట్టించు కోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో తెలియదు. అందుకే పన్నెండు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం అన్నింటినీ కైవసం చేసుకోవాలని చేసిన ప్రయత్నం ఇందుకు అద్దం పడుతోంది.   టీఆర్ ఎస్  ఖాతాలో  ఆరు ఏకగ్రీవంగా పడగా, ఆరింటికి ఎన్నికలు జరిగాయి. వాటిల్లో రెండింటిని కాంగ్రెస్ ఎగరేసుకుపోవడం కొసమెరుపు. అయినా కానీ, పన్నెండు స్థానాల్లో పదింటిలో టీఆర్  ఎస్ సాధించిన గెలుపు , మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడానికి ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి లభించినవి రెండే అయినా ఆ పార్టీకి ఈ గెలుపు అయాచిత వరం. తెలంగాణా ఇచ్చింది కేంద్రంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమకు న్యాయం జరగలేదని బాధపడుతున్న టీ. కాంగ్రెస్ నాయకులకు ఈ విజయం ఎడారిలో ఒయాసిస్సు లాంటిది.
కాలం ఎలాటి మార్పులు తెస్తుంది అనడానికీ,  ఆ మార్పులు రావడానికి ఎంతో కాలం పట్టదు అన్న వాస్తవానికీ,  ఢిల్లీ, బీహారు, వరంగల్, మండలి ఎన్నికల ఫలితాలు మచ్చు తునకలు. 
2014 లో కనీవినీ ఎరుగని ఘన విజయం సాధించిన మోడీ  ఏడాది తిరక్కముందే జరిగిన ఢిల్లీ, బీహారు ఎన్నికల్లో అతి దారుణ పరాజయం చవిచూశారు. అలాగే  వరంగల్ ఉప ఎన్నికలో, అన్ని ప్రతిపక్షాలను మట్టికరిపించి  టీఆర్ ఎస్ ను  మురిపించిన ఘనాతిఘన విజయం, కొద్ది నెలలు గడవక ముందే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిని రుచి చూసేలా చేసింది.
2015 అనుభవాల నుంచి రాజకీయ పార్టీలు ఒక గుణపాఠం నేర్చుకోవాలి. లభించిన విజయం ఆఖరిది అనుకుని పనిచేయాలి. అప్పుడే మరో గెలుపు  తలవాకిట నిలుస్తుంది. పలకరించిన పరాజయం చిట్ట చివరిది అనుకుని తిరిగి కష్టపడాలి. అప్పుడే కొత్త విజయం తలుపు తడుతుంది.
365 ఖాళీ పేజీల 2016  కొత్త పుస్తకం  తయారుగా వుంది. మంచి వాక్యంతో మొదలు పెట్టమని కోరుతోంది.
ఉపశ్రుతి:
అయుత చండీయాగం అనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియని వ్యవహారం. అలాంటి అపూర్వ యాగాన్ని, తెలంగాణా ముఖ్యమంత్రి  కేసీఆర్ అద్భుతంగా చేసి చూపించారు. నిజానికి ఒక  రకంగా   2015 సంవత్సరానికి ఇదే కొసమెరుపు. ‘ఈ యాగం విశ్వ శాంతికోసం’ అని కర్తలు చెప్పుకొచ్చారు. కాకతాళీయం కావచ్చుకాని, ప్రధానమంత్రి మోడీ ఆకస్మికంగా పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇది మొదటి అడుగని అందరూ అంటున్నారు. అదొక విషయం. పొతే, ఈ యాగం కేసీఆర్ కి వ్యక్తిగతంగా బాగా కలిసివచ్చిందని, హైదరాబాదులో స్థిరపడ్డ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి గృహిణుల్లో మునుపు ఆయనపట్ల వున్న ఒకింత వైమనస్య  వైఖరి ఇప్పుడు  సానుకూలంగా మారిపోయిందని, జూబిలీ హిల్స్ లో నివాసం ఉంటున్న ఒక పెద్దమనిషి తన సొంత అనుభవం చెప్పుకొచ్చారు. యాగం జరిగినన్ని రోజులూ ఇళ్ళల్లో ఆడంగులు  టీవీలకి అతుక్కుపోయి చూస్తూ, ప్రతి  అంశాన్ని పరిశీలనగా గమనిస్తూ,   యాగదీక్షలో వున్న కేసీఆర్, అత్యంత  నిష్టగా, త్రికరణశుద్ధిగా క్రతువును నిర్వహించిన తీరును వేనోళ్ళ మెచ్చుకున్న వైనాన్ని  ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రతి పనికీ ఒక ఫలితం ఉన్నట్టే, ప్రతి యాగానికీ ఒక ప్రతిఫలం ఉంటుందేమో! (31-12-2015)

రచయిత ఈమెయిల్ : bhandarusr@gmail.com  మొబైల్:  98491 30595
NOTE: Courtesy Image Owner


29, డిసెంబర్ 2015, మంగళవారం

నిలబెట్టుకోలేని మాట


ఈ మాట అనగానే రాజకీయుల వాగ్దానాలు గుర్తొస్తే చేసేదేమీ లేదు.
కానీ, నేను చెప్పబోయే 'ఈ మాట' ఎవరికి వారు ఇచ్చుకునేమాట. కొత్త ఏడాదిలో 'ఇది చేస్తాం అది మానేస్తాం' అంటూ మనకు మనమే ఇచ్చుకునే మాట అన్నమాట.
ఈ మాట్లాట మానేసి అసలు విషయానికి వద్దాం.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరుతో ఎన్నో చేయాలని అనుకుంటాం. అదేం పాపమో ఏడాది మొదట్లోనే వాటికి పురిటి సంధి కొడుతుంది.
చాలామంది మగ పురుషులు ప్రతిఏడాది కామన్ గా తమకుతాము ఇచ్చుకునే వాగ్దానం కామన్ గా ఒకటుంది. అదేమిటంటే మందు కొట్టడం మానేస్తాం, సిగరెట్లు తాగడం ఆపేస్తాం అని. కానీ, కామన్ గా జరిగేది ఏమిటంటే  మర్నాడు సీను షరా మామూలే. హాల్లో   పీఠం వేసుకుని, విలాసంగా  సిగరెట్టు వెలిగించి, మందహాసంతో  మందు గ్లాసు  పట్టుకున్న తరువాత కూడా ఎందుకో ఏమిటో ఈ మాట అస్సలు  గుర్తురాదు. ఆవిళ్ళు (ఆవిడలు అనగా భార్యలు) పనిగట్టుకుని గుర్తుచేయబోయినా 'ఆ మాట నిరుడు కదా చెప్పాను' అనేస్తారు అదేదో పూర్వ జన్మ వృత్తాంతం అన్నట్టు.  కావున,  కావుకావుమని చెప్పేదేమిటంటే, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదెందుకని  రాజకీయ నాయకులను  నిలదీసే హక్కు మనకు బొత్తిగా లేదని.
మనం మాట తప్పడానికి  కూడా ఓ కారణం వుంది. ఈ కొత్త ఏడాది పాతపడి గిర్రున ఏడాది తిరిగి మరో కొత్త ఏడాది మళ్ళీ వస్తుందని.      
వాళ్ళు మాట తప్పడానికి కూడా దాదాపు అదే కారణం.
అయిదేళ్ళ తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మరో మాట ఇస్తే పోలా అని.
కావున, అల్లా ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన పాత మాటలన్నీ (వోట్ల వొట్లు అన్నమాట) మూటగట్టి మన గట్టునే పెట్టి వెడుతున్నారు.


(Note: Courtesy Image Owner)

28, డిసెంబర్ 2015, సోమవారం

పేరులో’నేముంది’


“ఆకాశవాణి, జీవన స్రవంతి, ప్రత్యేక వార్తలు, చదువుతున్నది భభండారు శ్రీనివాసరావు.....”
“ఇంటి పేరు అంతగా ఒత్తి పలకాలా ! భండారు అంటే సరిపోతుందిగా!’
నలభయ్ ఏళ్ళ క్రితం రేడియో సహోద్యోగి వ్యాఖ్య.
ఇన్నేళ్ళుగా పరిస్తితి ఏం మారినట్టు లేదు.
అదేమిటో నేనే కాదు చాలామందికి పేరు మీదే కాదు, ఇంటి పేరు మీద కూడా వల్లమాలిన మమకారం. బహుశా వ్యక్తిగత గుర్తింపుకు అది దగ్గరి దారి కావచ్చు. శ్రీనివాసరావులు చాలామంది వుండవచ్చు. భండారు శ్రీనివాసరావులు పెక్కురు వుండకపోవచ్చు. వుంటే ఎడ్వర్డ్ చక్రవర్తుల మాదిరిగా ఎడ్వర్డ్ వన్, టు అని తగిలించుకోవచ్చు.
ఇంతకీ నా ఘోష ఏమిటంటే నేను ప్రతి రోజూ వెళ్ళే టీవీల్లో కానీ, కదాచిత్  గా నా పేరు పడే పేపర్లలో కానీ ఏనాడూ నా పేరును చిత్రవధ  చేయకుండా ఒదిలిన దాఖలా లేదు. బందరు శ్రీనివాస్ అనీ, బండారు శ్రీనివాసరావనీ, బండారి శ్రీనివాస్ అనీ ఇలా పలురూపాల్లో నా పేరు దర్శనమిస్తూ వుంటుంది. కొండొకచో ఇందువల్ల కొన్ని తలనొప్పులు కూడా తప్పడం లేదు. నిరుడు ఒక పెద్ద మనిషి ఫోను చేసి వాళ్లకు తెలిసిన వాళ్ళ పిల్లవాడికి మా ఇంజినీరింగు కాలేజీలో సీటు ఇప్పించమని అడిగాడు. ‘నా కాలేజీ ఏమిటి’ అని అడిగితే ‘భలేవారే ప్రతి రోడ్డు మీదా మీ కాలేజీ బస్సులు కనబడుతుంటే మీరు భలే  జోకులు వేస్తారే’ అన్నాడు.
అప్పటి నుంచి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ బస్సును కనిపెట్టి చూడడం మొదలు పెట్టాను. చివరికది దొరికింది. దానిమీద “బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కాలేజి’ అని రాసి వుంది.
అదట్లా  వుంచితే.....
నిన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమం గురించి ఈరోజు పత్రికల్లో వచ్చింది.



నాపేరు ‘షరా మామూలే’       

27, డిసెంబర్ 2015, ఆదివారం

శ్రీ పరకాల ప్రభాకర్ చెప్పిన జోకు


ఈరోజు హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో వయోధిక పాత్రికేయ సంఘం పదేండ్ల పండగ జరిగింది. రెండు తెలుగు  రాష్ట్రాల సమాచార సలహాదారులు శ్రీయుతులు కే.రమణాచారి, శ్రీ పరకాల ప్రభాకర్, రెండు రాష్ట్రాల ప్రెస్ అకాడమీ అధ్యక్షులు శ్రీ యుతులు వాసుదేవ దీక్షితులు, అల్లం నారాయణ హాజరయి ప్రసంగించారు.
ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సందర్భోచితంగా ఒక హాస్య గుళిక ఒదిలారు.

“వయస్సు పైబడిన తరువాత ప్రతి వ్యక్తి జీవితంలో  మూడు  బాగా పెరిగిపోతాయి. మొట్టమొదటిది, అందరికీ తెలిసిందే.  మతిమరపు. మిగిలిన రెండూ .....నా మతిమండా  మరచిపోయాను సుమీ!”

26, డిసెంబర్ 2015, శనివారం

విమానాన్ని దారి మళ్లించిన ప్రధాని మోడీ

(TO BE PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 27-12-2015, SUNDAY)

సూటిగా....సుతిమెత్తగా....  

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆ స్థాయిలో, ఆ హోదాలో  వున్న   వ్యక్తి ఏం చేసినా, ఏం మాట్లాడినా మీడియాకు అది ప్రధాన వార్తే అవుతుంది. ఆ వార్తను మరింత సంచలనాత్మకం చేసి దానికి అదనపు ఆకర్షణ కలగచేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటున్నారు.
మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత అనేక విదేశీ యాత్రలు చేసారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సయితం అంత విస్తృతంగా విదేశాల్లో పర్యటించిన దాఖలా లేదు. మోడీ విదేశీ యాత్రలు గురించి సాంఘిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చలు, వస్తున్న వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి.
‘స్వల్పకాలిక పర్యటనపై ప్రధాని  మోడీ భారత దేశానికి వస్తున్నారు’ వంటి అవహేళనలతో కూడిన వ్యాఖ్యలు సైతం  వినబడుతున్నాయి. ‘ అదేపనిగా విమానాల్లో విదేశీ ప్రయాణాలు చేస్తున్న ప్రధాని మోడీ, పార్లమెంటుకు వచ్చినప్పుడు కూడా సీటు బెల్టు కోసం వెతుక్కుంటున్నార’నే వరకు ఈ వ్యాఖ్యలు శృతిమించుతున్న మాట కూడా నిజం.
నిజానికి మోడీ విదేశీ పర్యటనలను గురించి ఇంత అతిశయోక్తిగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పూర్వకాలం మాదిరిగా అంటీ ముట్టనట్టు, ‘నా కోడీ, నా కుంపటి వుంటే చాలు, ఎవరెటుపోయినా పరవాలేదను’కుంటూ  వ్యవహరించగల కాలం కాదిది. ప్రపంచీకరణ ప్రభావం విస్తృతంగా విశ్వ వ్యాప్తంగా  పరివ్యాప్తి చెందుతున్నప్పుడు ‘ఉలిపికట్టె’ చందంగా ఒంటరిగా గిరిగీసుకుని కూర్చోవడం కూడా కుదరని పని. నలుగురితో సత్సంబంధాలు పెంచుకోవడం అభివృద్ధికి దోహదం చేస్తుంది. వర్ధమాన దేశం అయిన మన దేశానికి ప్రత్యేకించి ఇది తప్పనిసరి. మరీ ముఖ్యంగా  ఇరుగుపొరుగు దేశాలతో  సత్సంబంధాలు పెంచుకోవడం అనేది మన అవసరం.
మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన రోజే ఈ దిశగా మొదటి అడుగు వేసిన సంగతి మరచిపోకూడదు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తో సహా ఇరుగుపొరుగు దేశాల అధినేతలు మోడీ ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
నిరుడు మే   26 వ తేదీన జరిగిన మోడీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలందరూ రావడం ఒక విశేషం. పాకీస్తాన్ ప్రధాన మంత్రితో  పాటు, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షిరీన్ ష్రామీన్, భూటాన్ ప్రధాని  షెరింగ్ తోల్గే, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్, మారిషస్ ప్రధాని నవీన్ రాం గులాం, నేపాల్ ప్రధాని సుషీల్ కోయిరాలా, శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే, టిబెట్ ప్రవాస ప్రభుత్వ  ప్రధాని తోబ్ సాగ్ సంగే వంటి ప్రముఖులు హాజరు కావడం చూసిన వారికి అద్యతన భావిలో భారతదేశంతో ఆయాదేశాల సంబంధాలు మరింత మెరుగుపడతాయని అనిపించింది.
అయితే గత ఇరవై మాసాల మోడీ పాలనలో ఈ రకమైన సుహృద్భావ సంకేతాలు ఆయా  దేశాల నుంచి వెలువడిన దాఖలా లేదు. మన దేశంతో వాటి సంబంధాలు ‘ఒక్క రోజు’ ముచ్చటే అనే విమర్శలు వెల్లువెత్తడానికి మాత్రమే పనికివచ్చాయి. ముఖ్యంగా మనకు కంటిలో నలుసుగా వుంటున్న పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగు పడకపోగా ఇటీవలి కాలంలో మరింత క్షీణిస్తూ వచ్చాయి. కయ్యానికి కాలు దువ్వే పాక్ ప్రవర్తనలో పెద్ద మార్పు ఏమీ చోటు చేసుకోలేదనే చెప్పాలి.


ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి మోడీ ఒక వింత ప్రయోగం చేసి చూపించి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసారు. రష్యా పర్యటనకు వెళ్లి, ఆఫ్ఘనిస్థాన్లో అధికార పర్యటన పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి రావాల్సివున్న మోడీ, కాబూలు నుంచి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి ఫోను చేసారు. ఆ సమయంలోనే పాకీస్తాన్ వెళ్ళాలనే ఆలోచన మోడీ మదిలో మెదిలిందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.  హఠాత్తుగా ఆయన ఆ  నిర్ణయం తీసుకోవడం, దాన్ని వెంటనే అమలుచేయడం చకచకా జరిగిపోయింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూలు నుంచి ఢిల్లీ బయలుదేరిన  ప్రధాని మోడీ ప్రత్యేక విమానం దిశ మార్చుకుని  పాకీస్తాన్ వైపు బయలుదేరింది. బహుశా ఆ విమానంలో వున్న అనేకమందికి ఈ విషయం తెలియకపోవచ్చు కూడా.  భారతీయ వాయుసేనకు చెందిన ఆ విమానం పాకిస్తాన్ లోని లాహోరు చేరుకునే సరికే ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధానికి స్వయంగా స్వా గతం చెప్పడానికి అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నారు. మోడీ  బృందంలోని కొంతమందికి అక్కడికక్కడే  తాత్కాలిక వీసాలు మంజూరు చేసారు. మిగిలిన వారికి విమానాశ్రయంలోనే తగు వసతులు కల్పించి అక్కడే వుంచేసారు.
మోడీని వెంటబెట్టుకుని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్నతన నివాసానికి తీసుకువెళ్ళారు. ఇద్దరు దేశాధినేతలు ఈ విధంగా ఒకే హెలికాప్టర్ లో ప్రయాణించడం ఇదే తొలిసారి. షరీఫ్ నివాసంలో తన తల్లిని మోడీకి పరిచయం చేసారు. మోడీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు పాదాభివందనం చేసారు. అదే రోజు అక్కడ జరుగుతున్న  షరీఫ్ మనుమరాలి వివాహ వేడుకలకు కూడా మోడీ  హాజరయ్యారు. తేనీటి విందులో పాల్గొని, పాక్ ప్రధాని షరీఫ్ కు స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి నరేంద్ర మోడీ  ఢిల్లీ  తిరుగుప్రయాణమయ్యారు.
ముందస్తు సమాచారం లేకుండా పాకీస్తాన్ గడ్డపై మోడీ జరిపిన ఈ రెండున్నర గంటల పర్యటన  ఇరుదేశాల్లోని రాజకీయ  నాయకులను, ప్రత్యేకించి మీడియాను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
ఈ ఆకస్మిక పాక్ యాత్ర గురించి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎవరికీ తెలియదు.
‘నవాజ్ షరీఫ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేయడానికి ఈరోజు ఆయన్ని లాహోరులో కలుసుకోబోతున్నాను’ అని మోడీ  ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆ తరువాతనే  ఈ  పర్యటన   గురించి ప్రపంచానికి తెలిసింది.  
మోడీ ఆకస్మిక పర్యటన ఫై సహజంగానే సానుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. మోడీ పాక్ పర్యటనను తాము స్వాగతిస్తున్నామని అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, మోడీది ఆకస్మిక పర్యటన కాదనీ, ముందుగానే ఏర్పాటు చేసుకున్నదే అని ఆరోపిస్తూ, అసలీ పర్యటన వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే కాని, దేశ ప్రయోజనాలకోసం కాదని విమర్శించింది. ఈ ఆరోపణలకు తగ్గట్టే, మోడీ పాకీస్తాన్ ప్రధాని నివాసానికి వెళ్ళినప్పుడు, జిందాల్ గ్రూపుకు చెందిన సజ్జన్ జిందాల్ అక్కడే వుండడం గమనార్హం. ముందుగా అనుకున్న పర్యటన కాని పక్షంలో షరీఫ్ మనుమరాలి వివాహ కానుకగా ఆమెకు సరిపోయే దుస్తులను  మోడీ ఎలా తీసుకువెళ్లగలుగుతారని కాంగ్రెస్ సందేహాత్మకుల డౌటేహం.
మోడీకి ముందు పదేళ్ళ పాటు దేశాన్ని పాలించిన  మన్ మోహన్ సింగ్  కు ఒక కోరిక వుండేది.
‘అమృత సర్ లో బ్రేక్ ఫాస్ట్, లాహోరులో మధ్యాన్న భోజనం, రాత్రి భోజనం కాబూల్ లో....ఇది నా స్వప్నం. మా పూర్వీకులు అలా జీవించారు, నా మనుమళ్ళూ అలా చేయాలన్నది నా కోరిక’ అని మన్ మోహన్ తరచూ  చెబుతుండేవారు. మోడీ ఆయన కలను సాకారం చేసి చూపించారు.

మోడీకి ముందు ముగ్గురు భారత ప్రధానులు, జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్ పాయ్   పాకీస్తాన్ లో అధికార పర్యటన జరిపారు. వాజ్ పాయ్ ఏకంగా ఢిల్లీ నుంచి లాహోరు వరకు బస్సులో ప్రయాణించారు.
        
సొంత విమానాన్ని మోడీ మాదిరిగా ఇలా దారిమల్లించిన ఘనత మరో భారత ప్రధాన మంత్రికి కూడా వుంది. రాజీవ్ గాంధి ప్రధానిగా వున్న  రోజుల్లో, విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తూ విమానాన్ని మాస్కో వైపు మళ్ళించారు. 
భారత, పాకీస్తాన్ ల నడుమ ఘర్షణాత్మక వాతావరణం ఉందన్నది రహస్యమేమీ కాదు. పారిస్ లో భూగోళ వాతావరణంపై ఇటీవల జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ రెండు దేశాల ప్రధానమంత్రులు కలుసుకున్నారు.  మోడీ పర్యటన రెండు దేశాల నడుమ అలముకున్న అవాంఛిత వాతావరణాన్ని ఏమైనా మారుస్తుందేమో చూడాలి.
ఉపశృతి: సాంఘిక మాధ్యమాల్లో ఆయా సంఘటనలపై అప్పటికప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు వెలువడుతుంటాయి. కొంత అతిశయోక్తి అనిపించినా కొన్ని అతికినట్టు సరిపోతాయి. అలాంటిదే ఇది:
“విశ్వశాంతి కోసం కేసీఆర్ చేస్తున్న చండీయాగం సత్ఫలితాలను ఇవ్వడం మొదలయిందన్నమాట” 
(26-12-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com   మొబైల్: 98491 30595                         

      

25, డిసెంబర్ 2015, శుక్రవారం

మరవతగని మనిషి మరపున పడుతున్నాడా!


యాభయ్ ఐదేళ్ల  పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో గాంధీనగరం మునిసిపల్ స్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.



(డిసెంబరు 25, వాజ్ పాయ్ పుట్టినరోజు)

ఒకనాడు తన  పార్టీకి పెద్దదిక్కు అయిన వాజ్ పాయ్ ఇప్పుడు ఎక్కడ వున్నారు, యెలా వున్నారు అన్నది జనంలో చాలామందికి తెలియని విషయం.  తెలుసుకుంటే మరింత బాధ కలిగించే ఈ సంగతులను గత నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది. ఆ కధనాన్ని సంక్షిప్తం చేస్తే:
ఢిల్లీ లోని అశోకా రోడ్డులో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వుంది. ఎప్పుడూ నాయకులు, కార్యకర్తలతో సందడిగా వుండే ఆ ప్రదేశానికి అయిదే అయిదు నిమిషాల నడక దూరంలో కృష్ణ మీనన్ మార్గ్ లోని ఓ  బంగ్లా  ఎస్పీజీ కాపలాలో కానవస్తుంది. అందులోకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. బయటకు వచ్చేవాళ్ళు అంతే. నీరవ నిశ్శబ్ధం తాండవించే ఆ భవనంలో చక్రాల కుర్చీలో కూర్చుని ఒక వృద్ధుడు టీవీలో వార్తలు చూస్తూ, పత్రికల్లో ప్రధాన శీర్షికలు చదువుతూ కానవస్తారు. తన వాగ్దాటితో ప్రత్యర్ధులను ఆకట్టుకున్న ఒకనాటి నేత వాజ్ పాయ్ ఆయనే అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే.
ఆయన ఏదో కష్ట జీవితం గడుపుతున్నారని కాదు కానీ ఆయన  ప్రస్తుత జీవన శైలి గమనించినప్పుడు ఎవరికయినా మనసు కష్టపడుతుంది.
వాజ్ పాయ్ కవితలు రాస్తారు. వాటిని వినడానికి ఒకప్పుడు పార్టీ నాయకులు ఎగబడేవారు. ఇప్పుడు ఆ ఇంటి గడప తొక్కేవారే కరువయ్యారు. క్రమం తప్పకుండా వచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు వాజ్  పాయ్ కి అరవై ఏళ్ళుగా తెలిసిన ఎన్ ఎం గటాతే కాగా మరొకరు బీజేపీ మూలస్థంభాల్లో ఒకరయిన ఎల్ కే అద్వానీ.   పార్టీ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన బీ సీ ఖండూరీ కూడా అప్పుడప్పుడు వచ్చి వాజ్ పాయ్ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తెను అడిగి తెలుసుకుంటూ వుంటారు. పోతే, మాజీ ప్రధాని జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి వెళ్ళే వ్యక్తి మరొకరు వున్నారు. ఆయనే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.
వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళే ఆయన స్నేహితుడు గటాతే  చెప్పేదాని  ప్రకారం ప్రస్తుతం వాజ్ పాయ్ రోజువారీ దినచర్యలో  ఎక్కువ సమయం ఫిజియో తెరపిష్టులతో గడిచిపోతుంది. మాట సరిగా రాకపోవడం వల్ల సంభాషణల్లో పాలుపంచుకోలేరు. పత్రికలు చదవరు కానీ హెడ్ లైన్స్ తిరగేస్తారు.
భాష అర్ధం కాని  వారిని సయితం  తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే. (2014)

(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

23, డిసెంబర్ 2015, బుధవారం

అనుచరుల తప్పులు – నాయకుల తలనొప్పులు

సూటిగా.....సుతిమెత్తగా......

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 24-12-2015, THURSDAY)

నాయకుడు అనే వాడు తన అనుచర గణానికి అనునిత్యం సరయిన దిశానిర్దేశనం చేస్తుండడమే కాదు, తానూ ఒక నిత్య విద్యార్ధి మాదిరిగా కొత్త పాఠాలు నేర్చుకుంటూ వుండాలి. ఈ క్రమంలో తప్పులు దిద్దుకుంటూ వుండడమే కాకుండా అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఈ పనిలో పడ్డట్టు కానవస్తోంది.
గత  సోమవారం నాడు రాష్ట్ర శాసన మండలి సమావేశంలో ఆయన  చేసిన ప్రసంగం, టీడీఎల్పీ సమావేశంలో తెలుగు దేశం అధినేత  మాట్లాడిన తీరు ఇందుకు అద్దం పడుతోంది.  
‘అవసరమయితే ఒకరిద్దరిని వదులుకోవడానికైనా సిద్ధమే. కానీ చట్టబద్ధ పరిపాలనలో ఎక్కడా రాజీ పడను’ అంటూ, కాల్ మనీ  వ్యవహారంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు.
అదే రోజు జరిగిన తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం సమావేశంలో ప్రసంగించిన అధినాయకుడు చంద్రబాబు,  ‘స్నేహాల విషయంలో జాగ్రత్తగా మెలగమ’ని పార్టీ శాసన సభ్యులకు హితవు పలికారు. ’అధికారులు తప్పు చేస్తే అది అధికార వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఒకరిద్దరు తప్పు చేసినా అది తనకు చెడ్డ పేరు తెస్తుంద’ని చంద్రబాబు నిర్మొహమాటంగానే వున్నమాట చెప్పారు.
చాణక్యుడి  రాజధర్మం చెప్పేది ఏమిటంటే, రాజు దగ్గర పనిచేసేవాళ్ళే కాదు, ఆయన ప్రజల్లో ఎవరు నేరాలు చేసినా అందులో రాజుకు కూడా బాధ్యత వుంటుంది. అసలు నేరాలు జరక్కుండా చూడడం  పాలకుల ప్రధాన కర్తవ్యం.
ప్రజాస్వామ్య యుగంలో ప్రజలే పాలకులు. కానీ, కాలక్రమంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే వాళ్ళుగా  మిగిలిపోయి,  ప్రజాప్రతినిధులే పరిపాలకులుగా మారిపోయారు. వారు ప్రజాప్రతినిధులే కాదు, ప్రభుత్వానికి కూడా ప్రతినిధులే. ఆ రకంగా వారు చేసే మంచి చెడులన్నీ ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపుతాయి. మంచి పనులు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వారిది చెడు నడత అయితే వారి ప్రభుత్వానికే  చెడ్డ పేరు వస్తుంది. ఆ మంచిచెడులన్నీ ఆఖరికి ప్రభుత్వాధినేత ఖాతాలో పడతాయి. ఈ వాస్తవం తెలుసు కనుకే చంద్రబాబునాయుడు తన పార్టీవారికి ఈ రకమైన హితబోధ చేసివుంటారనుకోవాలి.
 కాల్ మనీ ఉదంతం బయటపడిన అనంతరం  రెచ్చిపోతున్న ప్రధాన  ప్రతిపక్షాన్ని  శాసనసభలో ఇరుకున పెట్టే విధంగా ఆయన ఒక  ప్రకటన చేసినప్పటికీ, ఎక్కడో మనసు మారుమూలల్లో తన సొంత పార్టీ వారి ప్రమేయం కూడా ఇందులో వుందన్న అపరాధ భావన వుండబట్టే, మనసులోని మాటను   ఈ విధంగా బయటపెట్టి వుండవచ్చు కూడా.  దానికి తోడు, ఈ  మొత్తం వ్యవహారంలో ఆయనకూ, ఆయన కుమారుడికీ ప్రమేయం ఉందంటూ సభాసాక్షిగా  ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి చేసిన ఆరోపణలు చంద్రబాబును మరింత కలతపెట్టివుంటాయి. ఎవరో, ఎక్కడో  చేసిన పనికి తనని ముడిపెట్టి మాట్లాడడం  ఆయన్ని కలచివేసి వుంటుంది. బహుశా ఈ కారణమే,  వైసీపీ సభ్యురాలు రోజాను  అసెంబ్లీ నుంచి ఏకంగా ఏడాదిపాటు సభనుంచి బహిష్కరించాలనే నిర్ణయం దిశగా అడుగు వేయించి వుంటుంది.
నవజాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి దాదాపు పద్దెనిమిది మాసాలు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, ఎన్నికల అనంతరం చేసిన తాజా వాగ్దానాలు వెరసి ముప్పందుమై సర్కారు మీద మోయలేని భారాన్ని మోపాయి. రాజధానిలేని నగరం కూడా లేని కొత్త రాష్ట్రంలో పాలన కుదురుకునేలా చేయడానికే తెలుగుదేశం అధినేత సర్వశక్తులూ వొడ్డి పనిచేయాల్సిన స్థితి. ఓ పక్క ఆర్ధిక లోటు. మరో పక్క అంతా  బాగుందని పైకి  చెబుతూ,  కొత్త రాష్ట్రానికి  సరికొత్త పెట్టుబడులని ఆకర్షించే క్రమంలో  అనవసరపు ఆడంబరాలు ప్రదర్శిస్తూ,  డాంబికపు ప్రకటనలు చేస్తూ రావాల్సిన పరిస్తితి,   నూతన రాజధాని నిర్మాణంలో  విమర్శలకు గురవుతున్న ‘గుప్పెడు మూసి వ్యవహరించే విధానం’. కేంద్రంలోని మిత్ర పక్షం బీజేపీ నుంచి ‘ఆశించని’ సాయం  ఏదోఒక రూపంలో అందుతున్నప్పటికీ, ‘ఆశించిన’ సాయం విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి. మరోవైపు ఏకైక ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.సీ.పీ.  నుంచి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు.  వీటికి తోడు నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరం  రూపుదిద్దుకోకోకముందే బయట పడుతున్న వికృత వ్యాపార, వాణిజ్య  ధోరణులు, నివ్వెరపరుస్తున్న  నెయ్యి కల్తీ,  ఉసుర్లు  తీస్తున్న  మద్యం కల్తీ సంఘటనలు. ఇసుక మాఫియా సంగతి చెప్పాల్సిన పనిలేదు.
సామాన్యంగా ఇటువంటి తలనొప్పులు ఏ రాజకీయ నాయకుడికయినా తప్పని నొప్పులే. ఎంతటి కుదురున్న నాయకుడినయినా కుదేలుచేసే అంశాలే. అయితే, చంద్రబాబు నాయుడుకి వున్న ఏకైక యోగ్యత ఆయన సమర్ధత. ఆ ఒక్క లక్షణమే,  ఇన్ని సమస్యలు చుట్టుముట్టినా  ఆయన్ని ఆయన అభిమానులు పెంచుకున్న అభిమానం  దూరం చేయలేకపోయాయి. ఇన్ని ఇబ్బందులు చూస్తూ, ఇన్ని సమస్యలు గమనిస్తూ ఆయన్ని గురించి  ‘అయ్యో పాపం’ అనుకునేవాళ్ళే కానీ, మొత్తం పాపం ఆయనదే అనేవాళ్ళు తక్కువ. ప్రత్యేకించి సాంఘిక మాధ్యమాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువ.
ఈ నేపధ్యంలో, ఈ కాల్ మనీ రాకెట్ బయట పడింది.  ఉత్త అప్పులు, వడ్డీల  వ్యవహారం అయితే ఇంత ప్రాచుర్యం వచ్చేది కాదు. ఇందులో దాగున్న ఒక అమానుష కోణం  వెలుగు చూడడంతో ప్రతి ఒక్కరూ ఆక్షేపించక తప్పని పరిస్తితి. బాకీల వసూళ్ళ పేరుతొ భయపెట్టి, ప్రలోభపెట్టి మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే వార్తలు రావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణ లో పడిపోయింది. బాధిత స్త్రీలే స్వయంగా బయటకు వచ్చి తమకు జరుగుతున్న అన్యాయాలను బయటపెడుతూ వుండడం చంద్రబాబు వంటి నాయకుడికి హరాయించుకోలేని విషయంగా తయారయింది. ఈ దందా నడుపుతున్న ముఠాలతో సంబంధం వున్నట్టు  మొదట బయటపడిన  పేర్లలో అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు బడా నాయకులవి వుండడం  పాలక పక్షం అధినేతను మరింత ఇరుకున పెట్టింది. దీనికి తోడు, కేసు దర్యాప్తు చేస్తున్న  సంబంధిత పోలీసు అధికారి సెలవుపై వెడుతున్నారనీ, ఆయన స్థానంలో మరో అధికారి బాధ్యతలు స్వీకరించి  దర్యాప్తు కొనసాగిస్తారనీ వెలువడ్డ వార్తలు కొంతవరకు పాలకపక్షం నైతికతను  దెబ్బతీసాయి.  ఆ తరువాత అదే అధికారిని కొనసాగిస్తూ ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం కూడా ఈ మొత్తం వ్యవహారంలో పాలకపక్ష నాయకులకు సంబంధం వుందన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోయింది. కాకపొతే, చంద్రబాబు తన అనుభవం మొత్తం రంగరించి శాసన సభలో విషయ ప్రస్తావన వచ్చే సమయానికల్లా,  ఈ కేసులో అరెస్టు అయిన వారిలో  ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.సి.పీ.తాలూకువాళ్ళే  అత్యధిక  సంఖ్యలో వున్నారని గణాంకాలతో సహా వివరించి  చెప్పి, చాకచక్యంగా  ‘బంతి’ ని అవతల కోర్టులోకి నెట్టేశారు.


రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ కీలక అంశంపై  శాసన సభలో సమగ్రమైన చర్చ జరిగేలోగానే ఇది మరో మలుపు తిరిగింది. కాల్ మనీ రాకెట్  లో అప్పులిచ్చిన పెద్దలు, అప్పులు  తీసుకున్న మహిళలను చట్ట విరుద్ధంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.  ఈ అంశం శాసన సభ గడప ఎక్కేసరికి,  ఒక మహిళా సభ్యురాలిని తోటి సభ్యురాలు అసభ్య పదజాలంతో దూషించిందని అధికార పక్షం తీసుకున్న నిర్ణయం కధను మరోమలుపు తిప్పింది. అలా ప్రవర్తించిన సభ్యురాలు రోజాను ఏడాది పాటు సభనుంచి సస్పెండ్ చేసేవరకు వెళ్ళింది. సభానాయకుడిని కూడా ఆ సభ్యురాలు వదిలిపెట్టలేదనీ, సభాగౌరవం కాపాడడం కోసం ఇంతటి కఠిన చర్య తీసుకోవాల్సి వచ్చిందనీ ప్రభుత్వం తరపున  వివరణ ఇచ్చారు. అయితే దాన్ని అంగీకరించకుండా  ఆగ్రహించిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ ఏకంగా  మిగిలిన సమావేశాలనే  బహిష్కరిస్తున్నట్టు  సంచలనాత్మక ప్రకటన చేసి కధను మరో మలుపు తిప్పారు. 
కధ ఇంతటితో కూడా ఆగలేదు సరికదా మరో మలుపు తిరిగింది. 
వైసీపీ సభ్యురాలు రోజాపై ఏడాది పాటు వేసిన బహిష్కరణ వేటు మంగళవారం నాటికల్లా అనర్హత వేటుగా మార్పుచేసే ప్రయత్నాలు జరిగాయి. దీనికి నాందిగా సభలో పలువురు టీడీపీ మహిళాసభ్యులు, మహిళా మంత్రులు, సీనియర్ సభ్యులు గత సమావేశాల్లో రోజా ప్రవర్తన గురించి ప్రస్తావించి, అప్పటికీ ఇప్పటికీ ఆమెతీరులో తేడా లేదనీ, అసభ్యకరంగా మాట్లాడడం ఆమెకు అలవాటని,  అంచేత ఆమెపై అనర్హత వేటు వేసి, తిరిగి సభలో ప్రవేశించకుండా చూడాలనీ, అప్పుడే సభలో హుందాగా మెలగాల్సిన అవసరం ఇతర సభ్యులకు  తెలిసివస్తుందనీ సూచన చేసారు. రోజా వ్యాఖ్యలు తనను మానసికంగా ఎంతో వేదనకు గురిచేశాయని  టీడీపీ సభ్యురాలు అనిత కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటి రికార్డులను, పాత రికార్డులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు హామీ ఇచ్చారు. ఇదే  జరిగితే, ఒక సభ్యుడు లేదా సభ్యురాలిపై అనర్హత వేటు పడడం అన్నది తెలుగు శాసనసభ చరిత్రలో మొట్టమొదటిసారి  అవుతుంది.  ఇంతవరకు ఇలాటి పరిణామం కనీవినీ ఎరుగని సంగతే.
రోజా సభలో ఎలాటి వ్యాఖ్యలు చేసారు అనేదానిపై ఇంతవరకు అధికారిక సమాచారం లేదు. కానీ పత్రికల్లో వచ్చిన దాన్నిబట్టి  చూస్తే  అవి చాలా  దారుణంగా వున్నాయని అనిపిస్తుంది. పత్రికల వారితో మాట్లాడినప్పుడు కూడా ఆమె తన వాదనను సమర్ధించుకుంటూ మాట్లాడారు కాని, పత్రికా వార్తల్ని ఖండించలేదు కనుక అవి నిజమే అయివుండాలి. అలాంటప్పుడు క్రమశిక్షణాచర్య ఎదుర్కోకతప్పదు. అయితే రోజా మరో ఆరోపణ చేసారు. తమ సభ్యులను, తమ నాయకుడిని ఉద్దేశించి కొందరు తెలుగు దేశం సభ్యులు, మంత్రులు  చేస్తున్న అవహేళనలు, హావభావాలు  మరింత  అసభ్యకరంగా వుంటున్నాయన్నది ఆమె  అభియోగం. అవి రికార్డులకి ఎక్కడం లేదని ఆరోపణ. ఇవన్నీ వింటుంటే అసెంబ్లీ కూడా ‘ర్యాగింగు’ వేదికగా మారిపోయిందేమో అనిపిస్తోంది. 
సభలో క్రమశిక్షణ నెలకొల్పడం గురించి ఎవరికీ విభిన్న  అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఒక మహిళా శాసన సభ్యురాలి కంటి తడికి కారణమైన మరో సభ్యురాలిపై తగు విచారణ జరిపి కఠిన చర్య తీసుకుంటే అభ్యంతర పెట్టేవాళ్ళు వుండరు. అయితే, ఇంత రగడకు కారణమైన కాల్ మనీ రాకెట్ వల్ల, దాన్ని ఆసరాగా తీసుకుని నిర్వాహకులు సాగించిన నీచ, నికృష్ట కామకలాపాల వల్ల పండంటి  సంసారాలు  ఛిద్రం చేసుకుని కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్న బాధిత మహిళల కన్నీటిని కూడా తుడవాల్సిన అవసరం ప్రభుత్వానికి వుంది. కంటి  తుడుపు చర్యలతో సరిపుచ్చితే మాత్రం తమ పార్టీ వారిని కాపాడుకోవడంలో చూపిన శ్రద్ధను,   బాధిత మహిళల పట్ల చూపడం లేదనే అపప్రధను తెలుగు దేశం పార్టీ మూటగట్టుకోక తప్పదు.
ఉపశ్రుతి: ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయిదు రోజులపాటు జరిగి మొన్న మంగళవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడ్డాయి.  వాదప్రతివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో  వున్నపుణ్యకాలం  ఆవిరి అయిపోయింది. వైసీపీ శాసనసభాపక్షం విడిగా సమావేశమై స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. దీన్ని బట్టి సభలో ఉభయ పక్షాలు తమ తమ వైఖరికి కట్టుబడే వున్నాయని, ఒక అంగుళం కూడా వెనక్కి తగ్గే సర్దుబాటు తత్వంతో లేవనీ అర్ధం అవుతోంది.
ఈ నేపధ్యంలో, అసెంబ్లీ  సమావేశాలు  ఎలా జరిగాయని ఓ మిత్రుడు అడిగినప్పుడు  చాలా పాత విషయం ఒకటి గుర్తుకు వచ్చింది.
నలభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు రేడియో కేంద్రంలో వార్తలు చదివేందుకు న్యూస్ రీడర్లను ఎంపిక చేసేనిమిత్తం  రాత పరీక్ష, ఇంటర్యూలు నిర్వహించారు.  పరీక్షలో నెగ్గిన అభ్యర్ధులను  స్టూడియోలో కూర్చోబెట్టి కొన్ని నమూనా వార్తలు ఇచ్చి రికార్డు చేయించారు. అభ్యర్ధులను  ఎంపిక చేయాల్సిన ఒక పెద్ద మనిషి, వచ్చిన వాళ్ళల్లో ఒక అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ టేపును భద్రపరచమని సూచించారు. ‘అంత బాగా  చదివిందా’ అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు.  ‘వార్తలు ఎలా చదవకూడదో  అన్నదాన్ని బోధపరచడానికి ముందు ముందు ఆ టేపు  పనికొస్తుంద’న్నది ఆయన టీకా  తాత్పర్యం. (23-12-2015)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Photo Courtesy Image Owner