30, జూన్ 2022, గురువారం

వేణీ దానం అను సతీ పూజ – భండారు శ్రీనివాసరావు

చాలా ఏళ్ల క్రితం మేము సకుటుంబంగా అంటే దాదాపు ముప్పైమందిమి కాశీయాత్ర చేసాము. మార్గమధ్యంలో ప్రయాగ త్రివేణీ సంగమం వద్ద తర్పణ కార్యక్రమాలకు ముందు మా బృందంలోని దంపతుల చేత ఈ వేణీ దానం (పూజ) చేయించారు.

త్రివేణీ సంగమం దగ్గర గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహినిగా) మూడు నదులు కలుస్తాయి. ఆడవారి పొడవైన తల వెంట్రుకలను మూడు పాయలుగా చేసి జడ అల్లడం తెలిసిందే. దానికీ దీనికీ ముడిపెట్టి ఈ పూజలు చేయిస్తారు. ఏడుజన్మల పాపాలు కొట్టుకుపోతాయని ఐతిహ్యం. సరే అదలా ఉంచుదాము.
నాకు ఈ పూజలో నచ్చినదేమిటంటే మొగుడి చేత భార్యకు సపర్యలు చేయించడం. అది చూసిన తర్వాత ఈ జన్మలో మొగుళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన జరగడం ఖాయం అనిపించింది.
ఈ ప్రక్రియలో భర్త తన ఇల్లాలిని తొడపై కూర్చుండబెట్టుకోవాలి. ఆమె మొహాన్ని కడిగి తుడవాలి. కుంకుమ బొట్టు పెట్టాలి. వధువుగా మరి కొన్ని అలంకరణలు చేయాలి. లాలనగా మాట్లాడుతూ, భార్య జుట్టును మూడు పాయలుగా చేసి జడ అల్లాలి. ఇలా కొన్ని పనులు చేయించి మగవాడి ఆధిపత్య, అహంకార ధోరణికి అడ్డుకట్ట వేసే విధానం నాకీ క్రతువులో కనిపించింది.

29, జూన్ 2022, బుధవారం

నేనూ నా పాస్ పోర్ట్ - భండారు శ్రీనివాసరావు

నేనూ నా పాస్ పోర్ట్ - భండారు శ్రీనివాసరావు
నా మొదటి విదేశీ ప్రయాణం కౌలాలంపూర్ కు 1981 లో. మద్రాసులో నేనెక్కిన మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం ఏప్రిల్ పద్నాలుగు ఉదయం ఆరున్నరకు శ్రీలంక (సిలోన్) మీదుగా కౌలాలంపూర్ బయలుదేరింది. ఈ ప్రయాణానికి అవసరమైన పాస్ పోర్ట్ సరిగ్గా నాలుగు రోజుల ముందు ఏప్రిల్ పదో తేదీన జారీ అయింది. అప్పుడు పాస్ పోర్ట్ ఆఫీసు బర్కత్ పురాలో వుండేది. నాటి ముఖ్యమంత్రి శ్రీ టి. అంజయ్య గారి జోక్యంతో అంత త్వరగా పాస్ పోర్ట్ లభించింది. సీ.ఎం. ప్రైవేట్ సెక్రటరి నయీముద్దీన్ స్వయంగా నన్ను వెంటబెట్టుకు వెళ్లి పాస్ పోర్ట్ ఇప్పించారు. అయితే అది ఆరు మాసాలకు మాత్రమే పనికి వచ్చే తాత్కాలిక పాస్ పోర్టు.
ముఖ్యమంత్రి భద్రాచలంలో రాములవారి కళ్యాణ తలంబ్రాలు ఇవ్వాల్సిన కారణంగా ఆయన, ఆయన పరివారం ఒకరోజు ఆలస్యంగా బొంబాయి నుంచి కౌలాలంపూర్ బయలుదేరారు. కౌలాలంపూర్ లో కూడా ఆయన దిగిన హోటల్లోనే నాకూ వసతి సౌకర్యం కల్పించారు. అయాచిత వాహనయోగం కూడా పట్టడంతో చాలా ప్రదేశాలు ఉన్న కాస్త వ్యవధిలో చూడడం జరిగింది.
రెండో పాస్ పోర్టు అవసరం మాస్కో ప్రయాణం అప్పుడు కలిగింది. మెహదీపట్నానికి మారిన ఆఫీసుకు నేనూ, మా ఆవిడా ఇద్దరు పిల్లలతో వెళ్ళాను. ఆ రోజుల్లో ఒక ముస్లిం పెద్ద మనిషి పాస్ పోర్ట్ అధికారి. సత్యసాయిబాబాకు వీర భక్తుడు. ఆయన నన్ను చూడగానే పాస్ పోర్ట్ ధరకాస్తులు తీసుకుని వాటిని ఎవరికో అప్పగించి నాతొ పిచ్చాపాటీ మొదలు పెట్టారు. మా పిల్లలు చాలా చిన్నపిల్లలు. బయటకి పోదాం అంటూ సణుగుడు మొదలు పెట్టారు. దాంతో నేను కల్పించుకుని మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు కలెక్ట్ చేసుకోవడానికి అని అడిగాను. ఆయన దానికి నవ్వి ఇలా అన్నాడు.
‘మీరు భలే వాళ్లండి. మీ ఫోటోలు అతికించిన జిగురు అయినా ఆరాలా లేదా! అలా తొందరపడితే ఎలా?’
అప్పుడు నాకు అర్ధం అయింది. నాతొ ముచ్చట్లు చెబుతూ మరోపక్క వాటిని నాకు అప్పటికప్పుడు ఇచ్చే ఏర్పాటు ఏదో చేస్తున్నారని. అలా 1987 అక్టోబర్ 5 న మా ఇంటిల్లిపాదికి గంటలో పాస్ పోర్టులు చేతికి వచ్చాయి.
మరో పాస్ పోర్ట్ అవసరం మాస్కోలో వచ్చింది. మా ఆవిడకి, పిల్లలకి వేలిడ్ పాస్ పోర్టులు వున్నాయి కానీ నాది ఎక్స్పైర్ అయింది. మాస్కోలో పనిచేసేవారికి ఓ సౌలభ్యం వుంది. అక్కడ ఎంబసీ నుంచి కొత్త పాస్ పోర్ట్ తీసుకోవచ్చు. ఆ విధంగా 1991 ఏప్రిల్ 23 న, మరో కొత్త పాస్ పోర్ట్ నాకు మాస్కోలో రెండోరోజే వచ్చింది.
అమెరికాలో పనిచేస్తున్న మా పెద్ద కుమారుడి ఆహ్వానంపై అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. 2002 ఆగస్టు 20 వ తేదీన నాకూ మా ఆవిడకి పాస్ పోర్టులు వచ్చాయి. పదేళ్ల అమెరికా వీసాలు కూడా చెన్నై ఎంబసీ వాళ్ళు ఎలాంటి పర్సనల్ ఇంటర్వ్యూ లేకుండా హైదరాబాదు చిరునామాకు పోస్టులో పంపారు. 2003 లో సతీసమేత అమెరికా ఆరు మాసాల యాత్ర పూర్తయింది. అదే పాస్ పోర్టు అదే వీసాపై 2009 లో మరోసారి అమెరికా వెళ్లి వచ్చాము.
ఆ పాస్ పోర్టుకు కూడా పదేళ్ల జీవిత కాలం ముగిసింది.
2012 సెప్టెంబరు 11 మళ్ళీ కొత్త పాస్ పోర్టులు. అప్పటికి టాటాలకు చెందిన టీ సీ ఎస్ వాళ్ళు పాస్ పోర్ట్ జారీ విషయంలో నూతన సాంకేతిక సదుపాయాలను ప్రవేశ పెట్టారు. భార్యాభర్తలం ఇద్దరం ఆన్ లైన్ లో అప్లయి చేసుకుని నిర్దేశించిన రోజున నిర్దేశిత సమయానికి వెళ్లి అలుపూ సొలుపూ లేకుండా పాస్ పోర్టులు సంపాదించు కున్నాం.
2019 మార్చిలో మా రెండోవాడి పెళ్లి అయిన తర్వాత మళ్ళీ ఓసారి అమెరికా వెళ్లి వద్దామని అనుకున్నాం. వేలిడ్ పాస్ పోర్టులు, వీసాలు వున్నాయి కానీ, 2019 ఆగస్టులో మా ఆవిడ అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఇక ఆ ప్రయత్నానికి గండి పడింది. ఆ తర్వాత పిల్లలు అమెరికాకు రమ్మనే అభ్యర్ధనలు ఎక్కువ కావడంతో మరోసారి పదేళ్ల వీసా స్టాంప్ నా పాస్ పోర్ట్ పై పడింది. మధ్యలో కరోన. ఒంటరిగా వెళ్లి అక్కడ ఏం చేయాలి, ఎక్కడ తిరగాలి అనే ఆలోచనతో ప్రస్తుతానికి అమెరికా ప్రయాణం వాయిదా వేసుకున్నాను. వీసా 2029 దాకా వుంది కానీ పాస్ పోర్ట్ వెలిడిటి 2022 సెప్టంబర్ తో ముగుస్తుంది కనుక కొత్త పాస్ పోర్ట్ తీసుకోవడం మంచిదని పిల్లల సలహా.
పాటించి ఆన్ లైన్ లో అప్లయి చేశాను. జూన్ ఇరవై ఎనిమిది మధ్యాన్నం రెండు గంటలకు టైం స్లాట్ ఇస్తూ మెసేజ్ వచ్చింది. పావుగంట ముందే లోపలకు పంపారు. చక్కటి ఏర్పాట్లు. టైం ప్రకారం వచ్చారు వెళ్ళిన పక్షంలో , అప్లికెంట్ల సమస్త వివరాలు వారి కంప్యూటర్ల తెరపై కానవస్తాయి కనుక చకచకా కౌంటర్ తర్వాత కౌంటర్ కు వెడుతూ పని మొత్తం అరగంట కంటే తక్కువ వ్యవధిలో పూర్తి అవుతుంది. ఒక కౌంటర్ లో ఫోటోతో పాటు వేలిముద్రలు తీసుకున్నారు. అక్కడ ఉండగానే File No. so and so Granted అని మెసేజ్ వచ్చింది. అంటే approved అని అర్ధం కాబోలు.
తిరిగి వస్తుంటే ఒక అద్దాల క్యాబిన్ లో పనిచేసుకుంటూ ఒక టీసీఎస్ అధికారి కనిపించారు. కలిసి పని బాగా జరుగుతోందని చెప్పాలని అనిపించి డోరు తోసుకుని వెళ్లి నా
అభినందనలు
తెలిపాను. ఆయన, కూడా మిమ్మల్ని ఎక్కడో ఛూసినట్టుంది అంటూనే గుర్తుపట్టి పలకరించారు. వారి పేరు సి.హెచ్. లక్ష్మీనారాయణ గారు. రీజినల్ హెడ్. ఆయన దినేశ్ అనే మరో తోటి ఉద్యోగిని పరిచయం చేశారు. వారు ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాలకు బాధ్యత వహించే అధికారి. గతంలో పాస్ పోర్టు ఆఫీసులో పనిచేసిన, జ్వాలా ద్వారా పరిచయం అయిన మిత్రుడు శిరీష్ తాను స్నేహితులమని లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఎవరినీ కలవాల్సిన అవసరం రాకుండా అక్కడ పనులు జరుగుతున్న తీరు పట్ల నా సంతృప్తిని వ్యక్తం చేసి, టీసీఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి వచ్చేశాను.
నా ఆరో పాస్ పోర్టు, బహుశా ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వస్తుంది.

కింది ఫోటో: నలభయ్ ఏళ్ళ క్రితం నా మొదటి పాస్ పోర్టు పై నా ఫోటో
(28-06-2022)



(28-06-2022)      

 

           

 

ఆడవారి అసలైన సంతోషం - భండారు శ్రీనివాసరావు

సరళ పతీ సమేతంగా పండక్కి పుట్టింటికి వచ్చింది. పెళ్ళయిన తరువాత మొదటి పండగ కావడం వల్ల ఇల్లంతా ఒకటే హడావిడిగా వుంది. సరళ అక్కలూ, బావలూ అంతా వచ్చారు. భోజనాలు అయ్యాక అందరూ ఆరుబయట మంచాలు వేసుకుని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. సరళ తల్లి, కూతుర్ని దగ్గరకు తీసుకుని మెల్లగా అడిగింది, ‘మీ ఆయన నిన్ను సంతోషంగా వుంచుతున్నాడా’ అని. చిన్న స్వరంతో అడిగినా అది వినాల్సిన వాళ్ళు విన్నారు. దూరంగా కూర్చుని బావమరదులతో ముచ్చట్లు చెబుతున్న సరళ పెనిమిటి చెవిలో కూడా దూరింది. సరళ ఏం జవాబు చెబుతుందని అతగాడికీ ఆసక్తి కలిగింది. కాపురం బాగా సాగుతోందని, భర్త తనని సంతోష పెడుతున్నాడని సరళ ఖచ్చితంగా చెబుతుందని అతడి నమ్మకం.

సరళ బదులు చెప్పింది.
‘లేదు, ఆయన నన్ను సంతోష పెట్టడం లేదు’
ఆ సమాధానం విని సరళ మొగుడితో పాటు అక్కడ వున్న వాళ్ళందరూ నివ్వెర పోయారు, ఏమిటి ఇలా అంటోందని.
సరళ చెప్పడం కొనసాగించింది.
“ఆయన సంతోషపెట్టని మాట నిజమే. కానీ నేను సంతోషంగా ఉంటున్నాను. ఎవరో సంతోషపెడితే సంతోషపడడం నిజమైన సంతోషం కాదు.
నిజానికి ఒకానొక కాలంలో ఆడవాళ్ళు ఇలాగే సంతోషపడేవాళ్ళు

28, జూన్ 2022, మంగళవారం

ఎదిగి ఒదిగిన కర్మయోగి పీవీ నరసింహారావు


(జూన్ ఇరవై ఎనిమిది పీవీ జయంతి)

మరణించడానికి కొన్ని నెలలముందు శ్రీ పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు, ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
ఒక్క పీవీ అనే కాదు ప్రధానమంత్రి ఎవరయినా సరే, రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు అంటే చాలు యావత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తం అయిపోయేవి. శాఖల వారీగానే కాదు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఉన్నతస్థాయి సమావేశాలు జరిపి ప్రధాని పర్యటన ఏర్పాట్లు సమీక్షించేవారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రధాని పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని రెండు టేపుల్లో రికార్డు చేయడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ముగియగానే ఆ వివరాలు రాసివున్న ఒక టేపును అక్కడికక్కడే ప్రధాని బృందంలోని అధికారులకు అందచేసేవారు. అవన్నీ ప్రధాని పాటు ఢిల్లీ చేరిపోయి ఆ తరువాత ప్రధాని కార్యాలయంలోని 'ఆర్చివ్స్' విభాగానికి చేరేవి. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి కనుక ఇబ్బంది లేదు. పూర్వం ప్రధాని ప్రసంగించే వేదిక దగ్గరగా టెలిఫోన్స్ డిపార్టుమెంటు వాళ్లు, దేశంలో ఎక్కడికయినా మాట్లాడగలిగే ఫోనును అమర్చేవారు. ఆ ఫోను ఎవరికి ఉపయోగపడిందో లేదో తెలవదు కాని ప్రధాని పర్యటన సమాచారం ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడలకు ఫోను చేసి చెప్పడానికి రేడియో విలేకరిగా నాకు పలుసందర్భాల్లో ఉపయోగపడిన మాట వాస్తవం. పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు బేగంపేటలోని ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు. ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత కూడా అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు ఆయన హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...' అనే పద్యపాదం జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.
పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో వుండిపోయింది.
మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు, నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గారు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాదికారిని అడిగాము. అతడు తాపీగా 'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరోసారి వారిని ఢిల్లీలో కలిసాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛ స్థానంలో వున్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి వీలుంటుందా' అని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. 'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.
'మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.

కింది ఫోటో చాలా పాతది, సతీసమేతంగా పీవీ నరసింహారావు గారు









Below Andhrajyothy  LINK:



 ఎదిగేకొద్దీ ఒదిగిన కర్మయోగి - Andhrajyothy

చాయ్ పే చర్చ

 నిరాడంబరత్వం వ్యక్తిత్వ శోభని పెంచుతుంది.

జర్మనీలో  జరిగిన  అగ్రదేశాధినేతల సదస్సులో ఇద్దరు దేశాధినేతలు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,  ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయేల్  మర్కాన్ కలిసి  కూర్చుని చాయ్ తాగుతూ మాట్లాడుకుంటున్న ఈ దృశ్యం ఎంత రమణీయంగా వుంది. మన దేశంలో ఇది సాధ్యమా!  ఎంత హడావిడి చేస్తారు. పెద్ద పెద్ద టర్బన్లు పెట్టుకున్న సెవెన్ స్టార్  స్టివార్డ్స్,  స్టెన్ గన్ లు ధరించిన సాయుధ  అంగరక్షకులు, కనుసన్నల్లో వుండి కనిపెట్టి చూసే వ్యక్తిగత సిబ్బంది, టీవీ కెమెరాల హడావిడి! ఎంత గోలగోలగా వుంటుంది? ఇలా ఏ బాదరబందీ లేని దృశ్యాలు చూడడం మన దేశంలో ఎందుకు సాధ్యం కాదు?

బ్రిటిష్ రాచరికపు  శృంఖలాలు  తెంచుకున్నాము కానీ రాచరికపు వైభోగాలు ఇంకా మనల్ని ఇంగువ కట్టిన గుడ్డలా వెంటాడుతూనే వున్నాయి.

భారత్ స్వాతంత్ర అమృతోత్సవ్ సందర్భంగా అయినా ఆ  రాచరికపు అవశేషాలను కొంత మేరకు వదుల్చుకుంటే బాగుండు.  



(28-06-2022)

27, జూన్ 2022, సోమవారం

1 1 1 1 1 1 1

 

1 1 1 1 1 1 1

ఇన్ని ఒకట్లలో ఓ పెద్ద సంఖ్య దాగివుంది.

ఇప్పటికి అంటే ఈ నిమిషానికి  నా బ్లాగు భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య  (https://bhandarusrinivasarao.blogspot.com/2022/06/blog-post_27.html)  వీక్షకుల సంఖ్య అన్నమాట.

అంటే అక్షరాలా పదకొండు లక్షల పదకొండు వేల నూటపదకొండు.







   

   

తప్పులపై కత్తి దూసిన పాత్రికేయుడు

 ఈ సంగతి చెప్పింది ఆంధ్రభూమి ఎడిటర్ గా పని చేసిన శ్రీ ఎం.వీ.ఆర్. శాస్త్రి.

సందర్భం : వయోధిక పాత్రికేయ సంఘానికి నిన్న మొన్నటివరకు అధ్యక్షులు, పాత్రికేయ కురువృద్ధులు (తొంభయ్ ఏళ్ళు) శ్రీ గోవర్ధనం సుందర వరదాచారి సన్మాన సత్కార సభ.

ఈ సభలో మాట్లాడుతూ శాస్త్రి గారు తాను ఆంధ్రభూమిలో పనిచేసేటప్పుడు  ఓ వింత ఆలోచన కలిగిందనీ, దాన్ని ఆచరణలో పెట్టడానికి వరదాచారి గారు ఒక్కరే సమర్ధులని నిర్ణయించుకుని ఆ బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంచామని చెప్పుకొచ్చారు. అదేమిటంటే వివిధ తెలుగు దినపత్రికల్లో వస్తున్న భాషా  దోషాలను, సంపాదకీయాల్లో దొర్లే  గుణదోషాలను ఎత్తి చూపే ఒక శీర్షిక నిర్వహణ అన్నమాట. దిద్దుబాటు అనుకుంటా ఆ కాలమ్ పేరు.   

ఈ రోజుల్లో శాస్త్రిగారు చెప్పిన సంగతి పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే పత్రికల నడుమ జరుగుతున్న కలం పోట్లని జనం అందరూ గమనిస్తున్నారు.  కానీ ఇది పాతకాలం  ముచ్చట. విలువలు, మశానము అంటూ దేవిరించే రోజులు అవి.

వరదాచారి గారి నాలుకకే పదును ఎక్కువ అనుకుంటే, ఇక ఆయన కలానికి ఉన్న పదును ఎలాంటిదో వేరే చెప్పాలా!

శాస్త్రి గారి మాటపై ఆయన కలాన్ని ఝలిపించారు. అన్ని పత్రికలు ముందేసుకుని చిత్రిక పట్టారు. ఎక్కడ ఏ దోషం వున్నా దాన్ని ఉతికి ఆరేసేవారు. పక్క పత్రికల మీద రాతలు కదా! భూమిలో పనిచేసేవాళ్ళు వరదాచారి గారి చెణుకులను  బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఆ వరద హస్తం మన వైపు చూపిస్తే, కొంపలు అంటుకుంటాయి అనే భయం కూడా మనసు మూలల్లో వుండేది.

అన్నంత పనీ జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా అనేక ఇతర ప్రముఖ పత్రికల భరతం పట్టిన తర్వాత వరదాచారి గారు ఆంధ్రభూమి వైపు దృష్టి సారించడమే కాదు, బాణం ఎక్కుపెట్టి గురిచూసి కొట్టారు. భూమిలో వచ్చే రాతలపై చీల్చి చెండాడారు. దొర్లుతున్న స్ఖాలిత్యాలను ఎత్తి చూపారు. ఈ విషయంలో ఆయనకు స్వపరబేధం లేదు.

ఆ దూకుడు రాతలు చూసి భూమి సిబ్బందే నివ్వెరపోయారు.  

ఇలాంటి రాతలు వరదాచారి గారు మాత్రమే రాయగలరు.

ఇలాంటి మాటలు ధైర్యంగా చెప్పగలిగేది శాస్త్రి గారే!

వయసులో తేడా వున్నా ఇద్దరిదీ కంచుగొంతే! గొంతులోనుంచి వచ్చే ప్రతి మాటా వారి గుండెల్లోనుంచి వస్తుంది కనుక దానికి అంత పవర్.



(27-06-2022)

మాట్లాడడం రాదంటూనే మాట్లాడడం ఎలా! అంటే ఇలా!

 నా గురించి సరిగా తెలిసో తెలియకో హైదరాబాదులోని ఓ  ప్రైవేటు కాలేజీ వాళ్ళు నన్ను  వాళ్ళ కాలేజీ  స్నాతకోత్సవానికి అతిధిగా పిలిచారు. నా డిగ్రీ తెచ్చుకోవడానికే  నానా యాతనలు పడ్డాను, అలాంటిది నా చేతుల మీదుగా పట్టాలు ఇవ్వడం ఏమిటనే భేషజాలు పెట్టుకోకుండా వెళ్లి, నేను సైతం అక్కడ ఓ ప్రసంగం చేశాను. అదే ఇది:

సభకి నమస్కారం -

ఈ ఒక్క వాక్యం కనిపెట్టి నా కాలేజీ స్నేహితుడు, సినిమా దర్శకుడు 'జంధ్యాల', సభల్లో వృధా అవుతున్న ఎంతో విలువయిన సమయాన్ని ఆదా చేసాడు. వేదికమీద వున్న పెద్దల పేర్లను, ప్రతివక్తా ప్రస్తావిస్తూ వచ్చే ఒక సంప్రదాయానికి జంధ్యాల ఆ విధంగా మంగళం పాడాడు.

సరే. విషయానికి వస్తాను. ఈ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించిన క్షణం నుంచి నన్నో ప్రశ్న అదేపనిగా తొలుస్తూ వచ్చింది. ఇందుకు, నాకున్న అర్హత ఏమిటన్నది ఆ ప్రశ్న. రేడియోలో పనిచేసాడు కనుక ఏదో కొంత మాట్లాడకపోతాడా అన్న నమ్మకం కావచ్చు. అయితే రేడియో వాళ్ళతో ఓ ఇబ్బంది వుంది. వాళ్లకు అన్నీ టైం ప్రకారం జరగాలి. పదినిమిషాలు వార్తలు అంటే పిడుగులు పడ్డా ఒక్క క్షణం ఆలస్యం కాకూడదు. అలాగే పది నిమిషాలు దాటకూడదు. విషయం యెంత పెద్దదయినా క్లుప్తంగా చెప్పాలి. బ్రివిటీ ఈజ్ సోల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రేడియోలో చెప్పే మొదటి పాఠం.

అంచేత క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఇలాటి సభల్లో మాట్లాడడానికి పనికి రారేమో అనేది నాకు కలిగిన మరో సందేహం.

మాట్లాడ్డం అంటే గుర్తుకు వచ్చింది.

పశుపక్ష్యాదులు కూడా భావాలను పంచుకుంటాయి. కానీ మాటలతో వాటిని వ్యక్తీకరించలేవు. అయితే ఒకటినొకటి అర్ధం చేసుకుంటాయి. మాటలు రాని పాపాయి పలికే మాటలు తల్లి అర్ధం చేసుకున్నట్టుగా.

గుర్రం సకిలిస్తుంది. ఆవు అంబా అంటుంది. సింహం గర్జిస్తుంది. పాము బుస కొడుతుంది. అయితే ఈ చరాచర సృష్టి మొత్తంలో మాట్లాడగలిగే శక్తి ఒక్క మనిషికే దక్కింది.

అంటే ఏమిటన్నమాట. మాట్లాడే ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఆదీ మంచి మాట అయివుండాలి. మంచికోసమే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం కోసం కాకుండా సాధ్యమైనంతవరకు వారిని మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం మాట్లాడాలి. మంచిని చూసి, మంచిని విని, మంచినే మాట్లాడ్డం వల్ల మనలో పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి. శరీరం మనస్సూ రెండూ తగిన శక్తిని సమకూర్చుకుంటాయి.

విద్యార్ధి దశలో ఇవన్నీ మీకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే విషయాలే. మంచి ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, మంచి వాతావరణం ఇంతకంటే మనిషీ, మనసూ ఎదగడానికి ఏం కావాలి చెప్పండి. ఉపాధ్యాయులు చెప్పే మంచి వినండి. స్నేహితులతో మంచి పంచుకోండి. మంచిగా మెలగండి. అలా మంచిగా ఉండడానికీ, లేకపోవడానికీ వుండే తేడా ఏమిటో మీ మనసుకే తెలుస్తుంది. అంతేకాదు, అలా రోజల్లా పంచుకుని, పెంచుకున్న మంచిని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి. ఇంట్లో కూడా అమ్మానాన్నతో, అక్కాచెల్లెళ్ళతో, అన్నాతమ్ములతో, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉన్నారనుకోండి. ఇక పండగే పండగ. చెడు అన్నది దరి చేరనీయకుండా మంచినే పెంచుతూ పొతే ఇక ఆ సమాజానికి అంతా మంచే జరుగుతుంది. ఇందులో ఇంత విషయం వుంది కాబట్టే నాకిచ్చిన ఈ సమయాన్ని ఇందుకోసం వాడుకుంటున్నాను.

షరామామూలుగా యేవో కొన్ని అనుభవాలు, యేవో కొన్నిఉద్బోధలు చెప్పి, చేసి నేను వెళ్లిపోవచ్చు. మాది గుంకే వయసు, మీది పొడిచే పొద్దు. మీరే సమాజానికి కావాల్సిన వాళ్ళు. మీ అవసరం సమాజానికి వుంది. నేను మాట్లాడుతోంది భావి పౌరులతోటి అన్న స్పృహతో మాట్లాడుతున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ చేతుల్లో మాత్రమే అది భద్రంగా వుంటుంది. సరయిన పౌర సమాజం మీవల్లనే రూపు దిద్దుకుంటుంది. అలా జరిగిన నాడు ఇక భవిష్యత్తు గురించి మాకెవ్వరికీ బెంగ అక్కరలేదు.

చదువుకునే మీరందరూ దీపాల్లాంటి వారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ పొతే, ఇన్ని కోట్ల దీపాలున్న మన దేశం వెదజల్లే వెలుగులు ఎల్లల్ని దాటి, సమస్త ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్ని ప్రసరింపచేస్తాయి. యావత్ లోకం ఓ విజ్ఞానఖనిగా తయారవుతుంది.

మరో మాట. నా పిల్లల చిన్నతనంలో, మా ఇంటికి దగ్గరలో వున్న అరోరా కాలేజీలో చదివించాలని అనుకున్నాను. కానీ ఆ ఆశ అప్పుడు తీరలేదు. అందుకే ఈనాడు మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నా కడుపు నిండినంత ఆనందంగా వుంది.

మంచి కాలేజీలో చేరారు. ఆరోరా విద్యార్ధిని అని గొప్పగా చెప్పుకునేలా మీ ప్రవర్తన వుండాలి. అంతే కాదు, పలానా విద్యార్ధి మా కాలేజీలో చదివాడు సుమా అని యాజమాన్యం కూడా చెప్పుకోగలిగితే ఇరువురూ ధన్యులే.

ఈ ధన్యత అరోరా కాలేజీ ఇప్పటికే సంపాదించుకుని ఉంటుందని నా నమ్మకం.

నా మాటలు ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.

సభకి మరోమారు నమస్కారం!”

తోకటపా! ఇలా మాట్లాడే వాళ్ళను వాళ్ళే కాదు, మరెవరూ మళ్ళీ పిలవరు. అదే జరిగింది.




 

24, జూన్ 2022, శుక్రవారం

వ్యతిరేకత ఆగ్రహంగా మారనంత కాలం ఏమీ కాదు

మాస్కోలో అబద్ధం తెచ్చిన తంటా

చదువు 'కొనా'ల్సిందేనా ?..

రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఎంపిక

22, జూన్ 2022, బుధవారం

అమ్మా నాన్న గుడి – భండారు శ్రీనివాసరావు

 

బతికి వున్నప్పుడు భారంగా నడిచేకాలం, అదేమిటో ఆ మనిషి చనిపోయిన తరువాత పరుగులే పరుగులు.
కింద ఫోటోలో వున్న గుడిలో వున్నది దేవుళ్ళూ దేవతలూ కాదు మా ఇలవేలుపులైన . మా తలితండ్రులు.
మా నాన్నగారు భండారు రాఘవ రావు నా చిన్నతనంలోనే చనిపోయారు. మా అమ్మగారు వెంకట్రావమ్మ చనిపోయి దాదాపు ముప్పయ్యేళ్లు అవుతోంది.
మా అమ్మ హైదరాబాదులో చనిపోయినప్పుడు మొత్తం కర్మకాండ యావత్తూ ఇంటిల్లిపాదిమీ కాశీ వెళ్లి అక్కడ జరిపించాము. మొదటి మాసికం మా స్వగ్రామం కంభంపాడులో పెట్టాము. అప్పటికల్లా, మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు ఎంతో శ్రద్ధ తీసుకుని, మా పొలంలో ‘అమ్మా నాన్న’గుడి కట్టించాడు.
కాశీలో కర్మకాండకు కర్త అయిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారూ, తలితండ్రులకు గుడి కట్టించిన మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు ఇద్దరూ ఇప్పుడు లేరు. వారి స్మారక చిహ్నాలు కూడా ఈ గుడి పక్కనే వున్నాయి.
మా మూడో అన్నయ్య పిల్లలు రఘు, రమేష్, సాయి భక్తి శ్రద్ధలతో మా అమ్మా నాన్న గుడి బాగోగులు చూస్తున్నారు






19, జూన్ 2022, ఆదివారం

మాటకు ఓటు – భండారు శ్రీనివాసరావు


అరవై ఏళ్ళ క్రితం కాబోలు కోటీశ్వరుడు అనే డబ్బింగ్ సినిమా వచ్చింది. శివాజీ గణేశన్ ఇందులో త్రిపాత్రాభినయం. కుష్టువాడు అయిన తండ్రి, కోటీశ్వరుడు అయిన కొడుకు, జల్సాగా ఇల్లు పట్టకుండా తిరిగే, గారాబాల కూచిగా పెరిగే కోటీశ్వరుడి కుమారుడిగా ఇలా మూడు పాత్రలు ఆయనే పోషించారు. నిజం చెప్పాలంటే నాలుగో పాత్ర కూడా ఆయనే. చిత్రం చివర్లో ఉయ్యాలలో పసిపిల్లవాడు కూడా ఆయన ముఖంతోనే కనిపిస్తాడు.
కోటీశ్వరుడు అయిన శివాజీ గణేశన్ పాత్రను, జల్సాగా తిరిగే కుమారుడి పాత్రలో నటిస్తున్న శివాజీ అర్జంటుగా సాదరు ఖర్చుకోసం పెద్ద మొత్తం అడుగుతాడు. ‘నువ్వు రెండు కాళ్ళు ఒకచోట పెట్టి నిమిషం పాటు నిలుచుంటే, నువ్వు అడిగినదానికన్నా ఎక్కువే ఇస్తాను’ అంటాడు తండ్రి శివాజీ.
రాజకీయ నాయకులు కూడా ఇలాగే చెప్పిన మాట మీద నాలుగు రోజులు నిలబడి, మాట మార్చకుండా వుంటే ఓటర్లు కూడా మారుమాట్లాడకుండా వారిని అధికార పీఠం ఎక్కిస్తారు.
కానీ ఓటర్లకి ఆ ఛాన్స్ ఇచ్చేలా లేరు.
(19-06-2022)

కేంద్ర దర్యాప్తు సంస్థలపై నీలినీడలు

హాస్యబ్రహ్మ – భండారు శ్రీనివాసరావు

 

ఏదో రాసుకుంటుంటే ఫోన్ మోగింది. కొత్త నెంబరు.
‘నేను శంకర నారాయణను’ అని పరిచయం చేసుకున్నారు అవతలి వ్యక్తి.
గొంతు సుపరిచితంగానే వుంది. కానీ ధ్యాస వేరేగా వుండడం చేత చప్పున గుర్తు పట్టలేకపోయాను.
ఆయనే నా ఇబ్బంది కనుక్కున్నట్టు వున్నారు.
‘నా పేరుకో తోక కూడా వుంది.హాస్య బ్రహ్మ అంటారు’
ఇంకేం! ఆయన ఎవరో తెలిసిపోయింది. జర్నలిజంలో సుదీర్ఘ కాలం అనుభవం ఉన్న సీనియర్ పాత్రికేయుడు. హాస్యాన్ని అవధానంగా మలచి, ఇంటాబయటా సుప్రసిద్ధుడైన రచయిత.
‘జంధ్యాల గురించి మీరు రాసిన వ్యాసం చదివాను, నిజంగా నాకు బాగా నచ్చింది. అంచేతే ఫోన్ చేసి మాట్లాడాలని అనిపించింది’ అన్నారాయన ఎంతో నమ్రతగా.
ఆంధ్రజ్యోతి నెట్ ఎడిషన్ లో వేయడం వల్ల రీచ్ పెరిగినట్టుంది. చాలా కాల్స్ వచ్చాయి.
అనేక విషయాలు ప్రస్తావించారు. జంధ్యాలతో తన అనుభవాలు, ఆయన తనకు ఇచ్చిన ప్రోత్సాహం అన్నీ చెప్పుకొచ్చారు. మనిషి చనిపోయి దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఆయన గురించి మంచిగా మాట్లాడడం ఈ రోజుల్లో విశేషమే.
అలాగే మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి గురించి, మా మేనకోడలు భర్త, రచయిత, రిటైర్డ్ ఐ.పి.ఎస్. అధికారి రావులపాటి సీతారామా రావు గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు. మా కుటుంబంతో అంత పరిచయం వుందని నాకు తెలియదు.
‘పర్వతాల రావు గారు సమాచార శాఖ డైరెక్టర్ గా రిటైర్ అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటిలో మాకు పాఠాలు చెప్పేవారు. ఆయన దగ్గర సునిశితమైన హాస్యం చిప్పరిల్లేది. క్లాసుకు ఎవరైనా ఆలస్యంగా వస్తే, ‘మీకంటే ముందు వచ్చినందుకు నన్ను క్షమించండి’ అనేవారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ క్లాసుకు లేటు కాలేదు’

మాటల్లో పద్మ పురస్కారాల మాట వచ్చింది.
‘రాకపోవడమే మంచిది. వస్తే, ఎవరినో పట్టుకుంటే వచ్చింది అంటారు. అదే రాలేదనుకోండి. మీకు ఎప్పుడో రావాల్సిన పురస్కారం, ఇంకా రాకపోవడమేమిటని ఎంతో కొంత సానుభూతిగా మాట్లాడతారు. ఇది బెటరు కదా!’ అన్నారాయన ఛలోక్తిగా.
ఎంతైనా హాస్య బ్రహ్మ కదా!
(19-06-2022)

ఈ దేశం ఏమైపోతోంది? – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha today Sunday, 19-06-2022)


కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించి ఒక రోజల్లా, రెండు దఫాలుగా గంటలు గంటల పాటు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసు చుట్టూ తిరిగిన రాజకీయం చివరికి ఆ యువ నాయకుడిని ఈడీ ఆఫీసుకు రప్పించింది. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతూ ఈడీ ఆఫీసు వరకు కాంగ్రెస్ కార్యకర్తలు సత్యాగ్రహ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. మర్నాడు రెండో రోజు, ఆ మర్నాడు మూడో రోజున కూడా ఈ విచారణ గంటల తరబడి సుదీర్ఘంగా కొనసాగింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈడీ చర్యను ఖండిస్తూ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమ పార్టీపై కక్ష కట్టి వ్యవహరిస్తోందని ఆరోపించడమే కాకుండా దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. అయితే, మూడో రోజు విచారణ జరుగుతున్న సమయంలో ఈడీ అధికార వర్గాలు కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఖండించాయి. రాహుల్ గాంధీపై అభియోగాలు మాత్రమే వున్నాయని, కేసు నమోదు చేయలేదని వెల్లడించాయి.
ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల వ్యవహార శైలి పట్ల దేశంలో చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా సీబీఐ విషయంలో అన్నిరాజకీయ పార్టీలు ఏదో ఒక సమయంలో విమర్శలు గుప్పిస్తూనే వున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికారంలో వున్న పార్టీ అంటుంది. చట్టం అమలు చేయాల్సిన సంస్థలు ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేసే పంజరంలోని చిలకలు అంటూ అధికారంలో లేని పార్టీలు వ్యాఖ్యలు చేయడం ఎన్నో ఏళ్ళుగా జనం వింటూనే వున్నారు.
ఈ నేపధ్యంలో దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల మరోమారు చర్చ మొదలయింది. వీటి పని తీరు, వాటిపై ప్రభుత్వ పెత్తనం గురించి దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వర్తమానాన్ని సమీక్షించుకునేందుకు గతాన్ని గుర్తుచేసుకోవడం కూడా అవసరం.
ఇందుకు ఉదాహరణలు కొల్లలు. ఇవన్నీ ఎప్పుడో క్రీస్తు పూర్వానికి ముందువి కాదు. కొంచెం గుర్తు చేసుకుంటే జ్ఞాపకం వచ్చే సంఘటనలే.
ఓ పుష్కర కాలం వెనక్కి వెడదాం.
నరేంద్రమోడీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి. గోద్రా మారణహోమంగా ప్రాచుర్యం పొందిన గుజరాత్ అల్లర్లను పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఎదుట హాజరు కావాలని మోడీని కోరింది. గుజరాత్ రాజధాని గాంధినగర్ లోని సిట్ కార్యాలయానికి ఆయన వెళ్ళారు. ఆ రోజు సిట్ అధికారులు రెండు తడవలుగా మొత్తం పదిగంటలపాటు విచారణ జరిపారు. మధ్యాన్నం పన్నెండు గంటలనుంచి సాయంత్రం అయిదువరకు, మళ్ళీ రాత్రి తొమ్మిది నుంచి అర్ధరాత్రి ఒంటిగంట దాటేవరకూ సిట్ అధికారులు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ, సమాధానాలు రాబడుతూ పోయారు. భోజన విరామ సమయాన్ని కూడా మోడీ వాడుకోలేదు. తాను వెంట తెచ్చుకున్న సీసాలోని మంచి నీరు తాగుతూ సిట్ అధికారులు అడిగిన దాదాపు వంద ప్రశ్నలకు ఓపికగా జవాబులు చెప్పారు.
‘నామీద దుష్ప్రచారం చేస్తూ, నా గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న వాళ్లకు ఈనాటితో అయినా కళ్ళు తెరిపిళ్ళు పడతాయని నేను ఆశిస్తున్నాను’ అన్నారాయన తర్వాత తనను కలుసుకున్న విలేకరులతో.
‘మిమ్మల్ని ఏమని ప్రశ్నించారు ?’
విలేకరుల ఆరా!
‘ఆ సంగతులు మీతో పంచుకోలేను. ఎందుకంటే సిట్ తన నివేదికను నేరుగా సుప్రీం కోర్టుకు సమర్పిస్తుంది’
మూడేళ్ల తర్వాత సిట్ ఆయనకు ఆ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది.
ఆ నరేంద్రమోడీ ఇప్పుడు ప్రధానమంత్రి. సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంటాయని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. నిజానికి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మోడీ మహాశయులకు కూడా సీబీఐ పట్ల అచ్చు అలాంటి అభిప్రాయమే వుండేది.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మదాబాదులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ ఏమన్నారో చూడండి.
‘సీబీఐ అంటే ఏమిటో తెలుసునా ! కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’
కొన్నేళ్ళ క్రితం జరిగిన మరో ఉదంతం.
అప్పుడు సీబీఐ గురించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.
2016 లో ఉత్తరప్రదేశ్ లక్నో పొలిమేరల్లోని బిధౌలిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధి ఇలా అన్నారు.
‘సమాజ్ వాది, బిఎస్పి లను అదుపు చేయడానికి, వాటిని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వద్ద ఒక తాళం చెవి వుంది. దానిపేరే సీబీఐ’.
2013. సుప్రీంకోర్టు. కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.
జస్టిస్ ఆర్. ఎం. లోధా గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.
‘సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’
కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.
సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో, అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మంచి ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
మళ్ళీ వెనక్కి వెడదాం
జోగీందర్ సింగ్. 1996 లో కేవలం పదకొండు మాసాల పాటు సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం ఒక సమావేశంలో మాట్లాడుతూ తన అనుభవాలు తెలియచేశారు.
“సీబీఐ అంటే ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ అనే అభిప్రాయం వుంది. కానీ అది నిజం కాదు. ప్రభుత్వం ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మ మాత్రమే’
“ఐకే గుజ్రాల్ ప్రభుత్వం నుంచి అనేక ఒత్తిళ్ళు ఉండేవి. చార్జ్ షీట్ వేయడంలో ఆలస్యం చేయాలనీ, అలాగే కొన్ని కేసుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలనీ పైనుంచి ఆదేశాలు వస్తుండేవి. పశువుల దాణా కుంభకోణం కేసులో ఇలాగే ఒత్తిళ్ళు వచ్చాయి. లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వండని స్పష్టంగా చెప్పాను. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా అనుకున్న విధంగానే చార్జ్ షీట్ దాఖలు చేశాను” అని చెప్పారు జోగీందర్.
ఈ క్రమంలో మరో ఉదంతం.
ఇది జరిగి ఎన్నో ఏళ్ళు కాలేదు. ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను ప్రధానమంత్రి మోడీ సీబీఐని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది నాయకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు. దర్యాప్తులో సహకరించేలా ఆ అధికారిని ఆదేశించాలని కోరుతూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోల్ కతా పోలీసు కమీషనర్ ని విచారించడానికి సుప్రీంకోర్టు సీబీఐని అనుమతించింది.
ఇవే అవస్థలు సామాన్యులకు ఎదురయితే, ఇన్ని వ్యవస్థలు అంత వడిగా స్పందించడం జరిగే విషయమేనా!
జనం నోళ్ళలో బాగా నలుగుతున్న సీబీఐకి ఈ విధమైన మరకలు పడిన చరిత్రే కాదు, గతంలో కూడగట్టుకున్న ఘనకీర్తి కూడా చాలా వుంది. దేశం మొత్తంలోనే ప్రముఖ దర్యాప్తు సంస్థగా పేరు గడించింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సీబీఐ అనేది పాలకపక్షం చేతిలో కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తుంటాయి. కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా సరే, తక్షణం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ముందుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఆ పార్టీలే. కాకపొతే, కాలక్రమంలో అన్ని వ్యవస్థల మాదిరిగానే నిప్పులాంటి ఈ సంస్థకు కూడా చెదలు పట్టాయి. అయినా కానీ, సామాన్య ప్రజల్లో మాత్రం ఈ వ్యవస్థ పట్ల ఇంకా ఎంతో కొంత గౌరవం, నమ్మకం మిగిలే వున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సంస్థను వాడుకుంటున్నారని పాలకపక్షంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. ఎన్నికల్లో ప్రజలు తమ చేతికి అధికారం అప్పగించగానే తిరిగి అదే పని అవి చేస్తుంటాయి. ప్రతిపక్షంగా మారిన ఒకనాటి పాలకపక్షం నోటివెంట ఇవే చిలుక పలుకులు మళ్ళీ వినీ వినీ జనాలకు విసుగు పుడుతోంది.
ఇది మనదేశంలో చాలాకాలంగా సాగిపోతున్న ఒక వికృత రాజకీయ క్రీడ.
చట్టబద్ధ వ్యవస్థల నడుమ, ప్రజాస్వామికంగా ఎన్నికయిన వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటుచేసే ప్రభుత్వాల నడుమ ఘర్షణలు సహజం కావచ్చు. కానీ అవి యుద్ధాల స్థాయికి పెరగడం వాంఛనీయం కాదు.
మనం నివసిస్తున్న ఈ భూగోళంకంటే అనేక వేల రెట్లు పెద్దవి అయిన వేలాది గ్రహాలు అనంత విశ్వంలో సెకనుకు కొన్నివేల మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్నాయి. ఈ అనంతవిశ్వపరిభ్రమణంలో లెక్కకు మిక్కిలిగా వున్నఆ గ్రహాలు, మిల్లిమీటరులో వెయ్యో వంతు తేడా వచ్చినా పరస్పరం డీకొనడం తధ్యం. అయినా కానీ, అనేక లక్షల కోట్ల సంవత్సరాల నుంచీ ఆ గ్రహరాశులు అన్నీ కూడా తమ పరిధులు అతిక్రమించకుండా తమ తమ కక్ష్యల్లోనే పరిభ్రమిస్తున్నాయి.
అలాంటిది ఒక్క కేంద్ర ప్రభుత్వం, ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధులకు, పరిమితులకు లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేని పరిస్తితులు తలెత్తితే ఆ తప్పెవరిది?
ఆ తప్పు ఖచ్చితంగా ప్రజలది మాత్రం కాదు.
ప్రజాస్వామ్యం పేరుతొ, ప్రజల పేరుతొ తమ భవిష్యత్తును పదిలపరచుకోవడానికి అనుక్షణం ఆరాటపడుతున్న రాజకీయ పార్టీలదంటారా! ఏమో కావచ్చు.




(19-06-2022)