17, జూన్ 2022, శుక్రవారం

ఇద్దరు ఒకటై చేయికలిపితే - భండారు శ్రీనివాసరావు

 

ఆయన కొంతకాలం క్రితం వరకు ఒక ప్రధాన దిన పత్రికకు సంపాదకుడు. ఆవిడ ఒక ప్రముఖ పత్రికలో కీలక విభాగం పర్యవేక్షించే  పాత్రికేయురాలు. చాలాకాలం జర్నలిస్టులుగా పనిచేసిన  ఈ దంపతులిరువురూ ఓ ముహూర్తం చూసుకుని కొలువులు మానేశారు. పిల్లలు బాగా చదువుకుని పైకి వచ్చారు. ఇక కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కాలక్షేపం చేసుకోండని చెప్పారు. కానీ వీళ్ళు లోగడ చేసిన ఉద్యోగాలు అలా ఇంటిపట్టున కూర్చోనిచ్చేవి కాదు కదా! తిరిగే కాలు, రాసే చేయి ఊరుకోవు కదా!

అంచేత మళ్ళీ ఓశుభ ముహూర్తం చూసుకుని కెమెరా చేత పట్టారు. వ్యూస్.ఇన్ (vyus.in) అనే వెబ్ ఛానల్ పెట్టేశారు. నిజానికి ఈ మీడియా ఇద్దరికీ కొత్తే! అయినా సరే! కొత్తగా మళ్ళీ  కధ మొదలు పెట్టారు.  

అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు సినిమా గుర్తు వుంది కదా!   

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపేమున్నది అంటూ అక్కినేని, సావిత్రి భార్యాభర్తలుగా ఏతం తోడుతూ సేద్యం చేస్తూ  పాడిన ఈ పాట వచ్చినప్పుడల్లా, నేను అన్ని పనులు మానేసి టీవీ తెరకు రెండు కళ్ళు అతికించేస్తాను. అంత నేత్రపర్వంగా, వీనులవిందుగా వుంటుంది ఆ చిత్రీకరణ, గాయనీ గాయకుల గాత్ర సౌరభం, ఆ నటీనటుల నటనా వైదుష్యం, మీదు మిక్కిలి  ఆ పాటలోని చక్కటి  భావం.

మొన్నీమధ్య నిజజీవితంలో చూసిన ఒక దృశ్యం ఆ పాటను  గుర్తు చేసింది. ఆ దృశ్యంలో ప్రధాన పాత్రధారులు మనం ముందు చెప్పుకున్న భార్యాభర్తలే! వాళ్ళు ఎవరో కాదు, మన ముఖపుస్తక మితృలు శ్రీమతి పురాణపండ వైజయంతి, శ్రీ కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం. ఇద్దరూ పండిత వంశాలకు చెందిన వారు. వారసత్వంగా అబ్బిన సంస్కృతి, సంస్కారం రెంటికీ కొదవ లేదు.

ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు ఇద్దరూ కలిసి వెడతారు. కెమెరా, లైటింగ్ అన్నీ ఇద్దరూ కలిసి చూసుకుంటారు. ఒకరు ఇంటర్వ్యూ చేస్తారు. మరొకరు కెమెరా హాండిల్ చేస్తూ రికార్డ్ చేస్తారు.

కాలక్షేపంతో కూడిన కొత్త వ్యాపకం. వృత్తికి, ప్రవృత్తికి సరిపడే సరికొత్త వ్యాసంగం. ఇష్టపడి చేసే పనిలో కష్టం కనబడదు కదా! అంచేత అలా కష్టపడుతున్నారు. ఒక్కోసారి అయ్యో అనిపిస్తుంది. చాలాసార్లు భలేగా చేస్తున్నారు అని కూడా అనిపిస్తుంది. ( ఈ భలే అనే మాట కలం కూలీగా ప్రసిద్ధులైన ప్రముఖ పాత్రికేయులు జీ. కృష్ణ గారి కాపీరైట్ అని  ప్రసిద్ధ సంపాదకులు పొత్తూరి వారు ఒకచోట రాసారు)

ఈ క్రమంలోఎంతో మందిని వాళ్ళ  ఇళ్లకు వెళ్లి ఇంటర్వ్యూలు చేశారు. కొందరిని తమ ఇంటికి రప్పించుకున్నారు.  ఈ ప్రముఖుల్లో శ్రీయుతులు గరికపాటి నరసింహారావు, సంజయ్ బారు, కె. రామచంద్ర మూర్తి, నాదెండ్ల భాస్కరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, శ్రీమతి లక్ష్మీ పార్వతి, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్,  రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ సినీ దర్శకులు రాం గోపాల్ వర్మ, వీ ఎన్ ఆదిత్య, గీతాకృష్ణ,  ప్రసిద్ధ నటులు నరేష్, ప్రముఖ సినీ దర్శకుడు ఫోటోగ్రాఫర్ ఏమ్వీ రఘు,   సినీ రచయిత తోటపల్లి సాయినాద్, సినీ నటి తులసి, సప్తపది సబిత, పాత దేవదాసు చిత్రంలో బాల సావిత్రిగా వేసిన అనూరాధ, ఆలిండియా రేడియో న్యూస్ రీడర్ కందుకూరి సూర్యనారాయణ, ఆకాశవాణి కళాకారులు అన్నవరపు రామస్వామి, మల్లాది సూరిబాబు, రేడియో మృదంగం ఆర్టిస్ట్ పద్మశ్రీ   దండమూడి సుమతి,  ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్  ఎస్సారార్ కాలేజీలో నా  సహాధ్యాయి, 1971 లో  బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన ఇండో పాక్  యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడిన బ్రిగేడియర్ శ్రీరాములు,  ఇలా ఈ జాబితా చాలా పొడుగు. ఆ ఇంటర్యూలలో  షరా మామూలుగా కాకుండా వారిలోని కొత్త కోణాలను ఆవిష్కరించడం ఓ ప్రత్యేకత!  ఇలా ఈ ఇద్దరు దంపతులు వయసును పక్కనబెట్టి ఆడుతూ పాడుతూ, హాయిగా నాలుగు చోట్లకు తిరుగుతూ, నలుగురు పెద్దవారిని కలుసుకుంటూ   తమకు నచ్చిన పనిని  నలుగురు మెచ్చేలా చేసుకుపోతున్నారు.

ఆ పాటలో రచయిత కొసరాజు గారు చెప్పినట్టు

“ఇద్దరు ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది?

నిజమే! ఎదురేముంటుంది? చెప్పండి.

అందుకే ఈ మీడియా మిధునానికి శుభం భూయాత్!

అన్నట్టు వాళ్ళ వెబ్ సైట్ పేరు vyus.in












(17-06-2022)      

కామెంట్‌లు లేవు: